కావలి: వివక్షకు గురైన, ఒంటరులైన, వివిధ కారణాలతో బడి మానేసిన ఆడ పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాలనే లక్ష్యంతో జిల్లాలో 10చోట్ల కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ) ఏర్పాటయ్యాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన సుమారు 2 వేలమంది బాలికలు వీటిలో చదువుతున్నారు. 6నుంచి 10వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియంలో ఇక్కడ బోధన చేస్తారు. పాఠశాల, హాస్టల్ ఒకే ప్రాంగణంలో ఏర్పాటు చేసి రెసిడెన్షియల్ తరహాలో వీటిని నడుపుతున్నారు. అయితే, ఇక్కడి విద్యార్థినులు 10వ తరగతి పూర్తికాగానే పైచదువులకు వెళ్లే అవకాశం లేకుండా పోయింది. జూనియర్ కళా శాలలు ఏర్పాటు కాకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. దీంతో పేదరికంలో మగ్గిపోతున్న వారు పదో తరగతి తరువాత చదువు మానేసి కూలి పనులకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది.
ఈ విద్యాలయాల్లో ఇంటర్మీడియట్‌కు అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించినా.. 10 విద్యాలయాల్లో రెండుచోట్ల మాత్రమే జూనియర్ కళాశాలల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చింది. దీంతో మిగిలిన 8 విద్యాలయాల్లోని బాలికలు టెన్త్ తరువాత చదువుకు దూరమవుతున్నారు. కావలి, కలిగిరి, కొండాపురం, నంది పాడు, సీతారామపురం, మర్రిపాడు, ఏఎస్‌పేట, దొరవారిసత్రం, తడ, వెంకటగిరి గ్రామాల్లో కస్తూర్బా విద్యాలయాలు ఏర్పాటు కాగా.. ఒక్కొక్క పాఠశాలలో 200 మంది విద్యార్థినులకు ప్రవేశం కల్పిస్తున్నారు. కావలి, వెంకటగిరి విద్యాలయాల్లో జూనియర్ కళాశాలలున్నాయి. వీటిలోనూ కేవలం బైపీసీ, ఎంపీసీ కోర్సులు మాత్రమే ఉన్నాయి. ఒక్కొక్క గ్రూప్‌లో 60 మంది చొప్పున 120 మందికి ప్రవేశం కల్పిస్తారు. మిగిలిన 8 విద్యాలయాల్లో జూనియర్ కళా శాలలు ఏర్పాటుకాక బాలికలు పై చదువులకు దూరమవుతున్నారు.
ఉన్నతాధికారుల దృష్టిలో ఉంది
8 కస్తూర్బా విద్యాలయాల్లో జూనియర్ కళాశాలల ఏర్పాటు అంశం ఉన్నతాధికారుల దృష్టిలో ఉంది. బాలికా విద్యను ప్రోత్సహించడానికి ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నాం.
– ఇ.విశ్వనాథ్, ప్రాజెక్ట్ ఆఫీసర్, రాజీవ్ విద్యామిషన్
Comments
Please login to add a commentAdd a comment