Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Chandrababu Govt handed over AP state treasury to private individuals1
రూ.9 వేల కోట్ల అప్పు కోసం 'సర్వం తాకట్టు'

అప్పుల కోసం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం బరితెగించింది. రూ.9 వేల కోట్ల అప్పు కోసం 436 గనుల్లోని అత్యంత విలువైన ఖనిజ సంపదను ప్రైవేట్‌ వారికి సర్వ హక్కులతో తాకట్టు పెడుతోంది. ఇదివరకెన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వ కన్సాలిడేటెడ్‌ ఫండ్‌ను ప్రైవేట్‌ వారికి అప్పగిస్తోంది. అంటే ప్రభుత్వంతో సంబంధం లేకుండానే ఈ కన్సాలిడేటెడ్‌ ఫండ్‌ నుంచి నిధులను వారే డ్రా చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ఇలా దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేసి ఉండదు.తద్వారా ఆ గనులపై పెత్తనం అంతా అప్పు ఇచ్చిన వారిదే ఉంటుంది. పైగా ఆ గనుల్లో ఏం జరిగినా.. ఎన్ని అక్రమాలు, అవినీతి చోటు చేసుకున్నా కూడా ప్రశ్నించ కూడదట! కొత్తగా వచ్చే ప్రభుత్వం కూడా ఈ ఒప్పందాన్ని రద్దు చేయకూడదట! ఈ గనులను తమ ఇష్టం వచ్చిన వాళ్లకు అప్పగించేలా ఘనత వహించిన విజనరీ చంద్రబాబు ప్రభుత్వం సదరు అప్పు ఇచ్చిన వారికి హక్కులు కట్టబెట్టింది. ఏమిటీ పరిణామం.. ఎందుకీ బరితెగింపు.. ఇందులో లోగుట్టేంటి.. అంటూ వివిధ రంగాల నిపుణులు విస్తుపోతున్నారు. ఒక ప్రభుత్వం ఎలా వ్యవహరించకూడదో చెప్పేందుకు ఇంతకు మించిన కేస్‌ స్టడీ మరొకటి అక్కర్లేదంటున్నారు. 436 గనులపై కల్పించిన హక్కులను ఎట్టి పరిస్థితుల్లోనూ సవరించడం, రద్దు చేయడం కుదరదని స్పష్టం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందంలోని భాగంసాక్షి, అమరావతి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అప్పుల కోసం ప్రైవేటు కంపెనీకి రూ.1.91 లక్షల కోట్ల ఖనిజ సంపదపై సర్వ హక్కులు ధారపోయడం విస్తుగొలుపుతోంది. ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ద్వారా బాండ్లు జారీ చేసి, రూ.9 వేల కోట్ల రుణాన్ని సమీకరించడం కోసం 436 చిన్న తరహా గనులపై ప్రైవేట్‌కు పెత్తనం ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ప్రక్రియలో ఎవరూ ప్రశ్నించలేని లీజు, మైనింగ్‌ హక్కులను ప్రభుత్వం.. ప్రైవేట్‌ వారికి ఇవ్వడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఆ గనుల్లో అక్రమ మైనింగ్‌ జరిగినా, పర్యావరణ ఉల్లంఘనలు చోటుచేసుకున్నా ప్రశ్నించడానికి వీల్లేని విధంగా రక్షణ కల్పించడం కలకలం రేపుతోంది. ఇంకా ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే భవిష్యత్తులో ఏవైనా తేడాలు వచ్చినా కూడా లీజు హక్కులను రద్దు చేసే అవకాశం ఉండదు. కనీసం అందులో మార్పులు చేయడానికి, సవరించడానికి సైతం ఆస్కారం ఉండదు. ఒకవేళ ప్రభుత్వం మారినా, తర్వాత వచ్చే ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని మార్చకూడదని ఒప్పందంలో స్పష్టం చేశారు. ఏదైనా కారణాలతో బాండ్లకు సంబంధించిన మొత్తాన్ని చెల్లించలేకపోతే డిబెంచర్‌ ట్రస్టీ (పైవేటు కంపెనీ) ఆ ఖనిజాలపై మైనింగ్‌ హక్కులను వేరే వారికి బదిలీ చేసే హక్కు సైతం కట్టబెట్టారు. కేవలం రూ.9 వేల కోట్ల అప్పు కోసం ఇన్ని వెసులుబాట్లు, రాయితీలు ఇచ్చిన ప్రభుత్వం దేశంలో మరెక్కడా లేదని నిపుణులు చెబుతున్నారు. వివాదాలు వచ్చినా నిస్సహాయతే! ప్రజల ఆస్తిని తాకట్టు పెట్టినప్పుడు దానికి ప్రభుత్వమే జవాబుదారీగా ఉండాలి. భవిష్యత్తులో ఈ ఒప్పందంలో ఏమైనా ఇబ్బందులు, వివాదాలు వస్తే తర్వాత ప్రభుత్వం దానిపై ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితిని కల్పించడం చట్ట విరుద్ధమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేటాయించిన లీజులపై గనుల శాఖకు పూర్తి అధికారాలు ఉంటాయి. మైనింగ్‌ నిబంధనలు ఉల్లంఘించినా, నిబంధనలు పాటించకపోయినా.. ఏ సమయంలోనైనా లీజు రద్దు చేసే అధికారం గనుల శాఖకు ఉంటుంది. కానీ ఈ ఒప్పందంలో అటువంటి ఆస్కారం లేకుండా చేశారు. ఆ గనుల తవ్వకాల్లో నష్టాలు వచ్చినా ప్రభుత్వమే భరించక తప్పదు. ఏ గనుల్లో అయినా అనుకున్నంత ఆదాయం రాకపోతే అంతే విలువైన వేరే గనుల్ని మళ్లీ ఏపీఎండీసీకి ఇవ్వాల్సి ఉంటుంది. నిజానికి పారదర్శకమైన బిడ్డింగ్‌ ప్రక్రియ లేకుండా మైనింగ్‌ లీజులు, మైనింగ్‌ హక్కులను ఎవరికీ కేటాయించకూడదు. ప్రభుత్వ రంగ సంస్థ ఏపీఎండీసీకి గనుల కేటాయింపునకు సంబంధించి ఒక ప్రక్రియ ఉంటుంది. దాని ప్రకారమే ఆ లీజులు కేటాయించాలి. కానీ ఇక్కడ అవేమీ పాటించకుండా ప్రజలకు సంబంధించిన లక్షల కోట్ల రూపాయల విలువైన ఖనిజ సంపదను కేవలం రూ.9 వేల కోట్ల అప్పు కోసం చంద్రబాబు తనఖా పెడుతున్నారంటే ఆయన ఎంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. సహజ వనరులను ప్రజల మేలు కోసం కేటాయించాలని సుప్రీంకోర్టు చాలాసార్లు చెప్పింది. పోటీ బిడ్డింగ్‌ లేకుండా, ప్రభుత్వ ఆస్తులను రుణం కోసం తాకట్టు పెట్టడం చట్టపరమైన నిబంధనలను సైతం ఉల్లంఘించడమేనని నిపుణులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల కారణంగా రాష్ట్రానికి ఖనిజ ఆదాయం ఏమీ మిగిలే అవకాశం ఉండదు. కానీ బాండ్‌ హోల్డర్లు మాత్రం లాభాలు గడిస్తారు. డీఎస్‌ఆర్‌ఏ ద్వారా రాష్ట్ర ఖజానాపై ప్రైవేటు వారికి హక్కులా? మరోవైపు ఇదే ఒప్పందంలో బాండ్లు కొనుగోలు చేసిన వారికి నేరుగా రాష్ట్ర ఖజానాను అప్పగించేందుకు సైతం రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించడం ద్వారా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోంది. అప్పులు చెల్లించేందుకు డీఎస్‌ఆర్‌ఏ (డెబిట్‌ సర్వీస్‌ రిజర్వ్‌ ఎకౌంట్‌) తెరుస్తోంది. ఏపీఎండీసీకి వచ్చే ఆదాయాన్ని డీఎస్‌ఆర్‌ఏ ఖాతాలో జమ చేసి.. బాండ్లు కొనుగోలు చేసిన వారికి చెల్లింపులు చేస్తామని చెబుతోంది. ఒకవేళ డీఆర్‌ఎస్‌ఏ ఖాతాలో నిధుల లభ్యత లేకపోతే.. ఆర్‌బీఐ కన్సాలిడేటెడ్‌ ఫండ్‌ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే నిధుల నుంచి తీసుకునే అధికారాన్ని బాండ్లు కొనుగోలు చేసిన ప్రైవేటు వ్యక్తులకు ఇస్తోంది. దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ఖజానాపై ప్రైవేటు వ్యక్తులకు ఇలా హక్కులు ఇవ్వలేదని ఆర్ధిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏపీఎండీసీ భవిష్యత్‌ ఆదాయంపై అప్పులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంగళవారాన్ని అప్పుల వారంగా మార్చుకుంది. కేవలం 11 నెలల్లోనే బడ్జెట్‌ లోపల.. బడ్జెట్‌ బయట రూ.1,54,865 కోట్ల అప్పు చేసి రికార్డు సృష్టించింది. తాజాగా గురువారం ఏపీఎండీసీ ద్వారా ఎన్‌సీడీ (నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్స్‌) బాండ్లు జారీ చేసి రూ.9 వేల కోట్ల నిధుల సమీకరణకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బాండ్లకు ఆర్ధిక భద్రత కల్పిస్తూ 436 గనులను కేటాయించి ఆ గనులను తాకట్టు పెట్టింది. తద్వారా ఆ గనుల నుంచి భవిష్యత్‌లో వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టిందని అర్థం. ఆ గనుల ద్వారా వచ్చే ఆదాయంతో బాండ్లు కొనుగోలు చేసిన వారికి అప్పును చెల్లిస్తామని చెప్పింది. ఒకవేళ గనుల ద్వారా వచ్చే ఆదాయం తగ్గితే.. ఆ నష్టాన్ని భర్తీ చేసేందుకు కొత్త గనులు కేటాయిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అంటే.. ఏపీఎండీసీకి భవిష్యత్‌లో వచ్చే ఆదాయంపైనా అప్పులు చేస్తోందన్నది స్పష్టమవుతోంది. సంపద సృష్టితో అద్భుతాలు చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఆ పని చేయలేకపోగా ఉన్న సంపదను కూడా అడ్డగోలుగా తాకట్టు పెడుతున్నారని అధికార వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. బాండ్ల జారీకి సంబంధించి నియమించబడిన డిబెంచర్‌ ట్రస్టీ లేదా ట్రస్టీ తరఫున వ్యవహరించే ఏ ఇతర వ్యక్తికైనా 436 గనులపై సర్వ హక్కులు కల్పిస్తున్నట్లు పేర్కొన్న రాష్ట్ర ప్రభుత్వం అప్పులు పుట్టకే ఎన్‌సీడీ బాండ్లు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అప్పులు చేయడంలో రికార్డు సృష్టించింది. ఇక రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు çసుముఖత వ్యక్తం చేయక పోవడంతో బడ్జెట్‌ బయట ఏపీఎండీసీ ద్వారా ఎన్‌సీడీ బాండ్లు జారీ చేసి, రూ.9 వేల కోట్లను సమీకరించడానికి పూనుకుంది. ఇంత పెద్ద ఎత్తున నిధులు సమీకరించాలంటే ఏపీఎండీసీకి మంచి రేటింగ్‌ అవసరం అవుతుంది. ఇందుకోసం ముంబయికి చెందిన ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌ సంస్థను ప్రభుత్వం సంప్రదించింది. ఏపీఎండీసీ ఆస్తులు, ఆదాయం, అప్పులపై అధ్యయనం చేసిన ఆ సంస్థ ‘సీఈ’ రేటింగ్‌ ఇచ్చింది. అంటే.. డీఎస్‌ఆర్‌ఏ ఖాతాలో నిధులు లేకపోతే ఆర్బీఐ కన్సాలిడేటెడ్‌ ఫండ్‌ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే నిధులను నేరుగా బాండ్లు కొనుగోలు చేసిన వారి ఖాతాలో జమ చేసేందుకు అంగీరించడం. అందువల్లే ఏపీఎండీసీకి ‘సీఈ’ రేటింగ్‌ ఇచ్చిందని ఆర్ధిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు.రాజ్యాంగ ఉల్లంఘనే ఏపీఎండీసీ జారీ చేసే బాండ్లు కొనుగోలు చేసిన వారికి తిరిగి (అప్పు) చెల్లించేందుకు డీఎస్‌ఆర్‌ఏ ఖాతాను రాష్ట్ర ప్రభుత్వం తెరుస్తుంది. ఆ సంస్థకు వచ్చే ఆదాయాన్ని ఆ ఖాతాలో జమ చేసి.. బాండ్లు కొనుగోలు చేసిన వారికి చెల్లింపులు చేస్తామని స్పష్టం చేస్తోంది. ఆరు నెలలకు సంబంధించిన అప్పు, వడ్డీ చెల్లింపులకు సంబంధించిన మొత్తం డీఎస్‌ఆర్‌ఏ ఖాతాలో ముందుగానే నిల్వ ఉంచాలి. ఒకవేళ ఈ ఖాతాలో నిల్వ తక్కువగా ఉంటే, రాష్ట్ర ప్రభుత్వాన్ని కనీసం సంప్రదించకుండానే ఆర్బీఐ కన్సాలిడేటెడ్‌ ఫండ్‌ నుంచి నేరుగా డీఎస్‌ఆర్‌ఏ ఖాతాలో నిధులు జమ చేస్తారు. అంటే.. కన్సాలిడేటెడ్‌ ఫండ్‌పై ప్రైవేటు వ్యక్తులకు అధికారం ఇవ్వడమేనని ఆర్ధిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇది రాజ్యాంగాన్ని నిలువునా ఉల్లంఘించడమేనని తేల్చి చెబుతున్నారు. సాధారణంగా ఆర్బీఐ నుంచి ఓవర్‌ డ్రాఫ్ట్‌ (ఓడీ), వేజ్‌ అండ్‌ మీన్స్‌ (చేబదులు) ద్వారా తీసుకునే అప్పును రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా చెల్లించడంలో విఫలమైతే.. వాటిని వడ్డీతో సహా కన్సాలిడేటెడ్‌ ఫండ్‌ నుంచి ఆర్బీఐ మినహాయించుకుటుంది. కానీ ఇలా ప్రైవేటు వారికి పెత్తనం ఇవ్వడం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రథమం అని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇది ప్రమాదకర ప్రయోగమని నొక్కి చెబుతున్నారు. ఇలాగైతే భవిష్యత్తులో ఇబ్బందులే⇒ గనుల తాకట్టుపై అధికార వర్గాల్లో తీవ్ర ఆందోళన ⇒ ప్రిన్సిపల్‌ ఫైనాన్స్‌ సెక్రటరీ ఒత్తిడి వల్లే ఇలా.. ⇒ ఏమాత్రం అడ్డుచెప్పని గనుల శాఖ కార్యదర్శి ⇒ ఇది ఏమాత్రం చిన్న విషయం కాదు ⇒ అన్ని శాఖల్లోనూ ఇలా చేయాలనే ఒత్తిడి రావచ్చుబాండ్ల జారీ ద్వారా రూ.9 వేల కోట్లను సమీకరించేందుకు ఏపీఎండీసీకి అనుమతిచ్చే విషయంలో ఐఏఎస్‌ అధికారి అయిన ప్రిన్సిపల్‌ ఫైనాన్స్‌ సెక్రటరీ (ఆర్ధిక శాఖ) పీయూష్‌ కుమార్, మరో ఐఏఎస్‌ అధికారి అయిన గనుల శాఖ కార్యదర్శి కమ్‌ కమిషనర్‌ ప్రవీణ్‌కుమార్‌ తీరు అధికార వర్గాల్లో చర్చనీయాంశమైంది. పీయూష్‌ కుమార్‌ తీవ్రంగా ఒత్తిడి తేవడం వల్లే ఈ వ్యవహారం ముందుకు కదిలినట్లు చర్చ జరుగుతోంది. తమకు మంచి పోస్టింగ్‌లు ఇచ్చింది కాబట్టి ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టల్లా తలాడిస్తూ రాజ్యాంగాన్ని ఉల్లంఘించేలా ఉత్తర్వులు ఇవ్వడం ఏమిటని ఐఏఎస్‌ అధికారులు చర్చించుకుంటున్నారు. దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా బాండ్‌ హోల్డర్లకు సర్వ హక్కులు కల్పించడం, ఈ క్రమంలో ఏపీఎండీసీ, గనుల శాఖ ప్రయోజనాలు, స్ఫూర్తికే విఘాతం కలిగేలా వ్యవహరించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ బాండ్ల కోసం ఏకంగా కన్సాలిడేటెడ్‌ ఫండ్‌ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే నిధులు నేరుగా ప్రైవేటు వ్యక్తులు తీసుకునేందుకు ఉత్తర్వులివ్వడం చిన్న విషయం కాదని అధికారులు చెబుతున్నారు. ఇందుకోసం ఇచ్చిన ఉత్తర్వులు, ఒప్పందాలను ఎట్టి పరిస్థితుల్లో రద్దు చేయకూడదని, భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వం కూడా వీటిని మార్చకూడదనే రీతిలో ఉత్తర్వులివ్వడం సరికాదని సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. దీన్ని చూపి.. మిగతా అధికారులు సైతం ఇలాగే చేయాలని ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి చేస్తారని, అప్పుడు అందరూ ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఒక ఐఏఎస్‌ అధికారి అన్నారు. ఏ ప్రభుత్వం ఉన్నా నిబంధనలు, రాజ్యాంగ నియమాలను మరచిపోకూడదని.. వాటి విషయంలో రాజీ పడితే తర్వాత భారీ మూల్యం చెల్లించుకోవాల్సివుంటుందని తెలిపారు. సర్వీస్‌ రూల్స్‌ను ఉల్లంఘించి మరీ పొలిటికల్‌ బాస్‌ చెప్పారని పనిచేస్తే, మునుముందు ఆందోళన తప్పదని చెబుతున్నారు. తాము ఇచ్చిన ఉత్తర్వులు న్యాయస్థానాల్లోనూ నిలబడే విధంగా ఉండాలని, రాజ్యాంగ ఉల్లంఘన అని తెలిసినా ఉత్తర్వులు ఇవ్వడం న్యాయస్థానాల్లో నిలబడవని చెబుతున్నారు. అదే జరిగితే సర్వీసులో మాయని మచ్చగా మిగిలి పోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Former IPS Officer PSR Anjaneyulu Facing Health Issues2
మాజీ ఐపీఎస్‌ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులకు అస్వస్థత

గుంటూరు,సాక్షి: మాజీ ఐపీఎస్‌ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వైద్యం కోసం పీఎస్‌ఆర్‌ ఆంజనేయులును హుటాహుటీన జీజీహెచ్‌కి తరలించారు. ప్రస్తుతం పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు రిమాండ్‌లో ఉన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో పని చేసిన ఉన్నతాధికారులపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపునకు దిగుతోంది. ఈ క్రమంలో.. ఏపీ సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పీఎస్‌ఆర్‌ ఆంజనేయుల్ని(PSR Anjaneyulu) అరెస్ట్‌ చేసింది. ముంబై నటి కాదంబరీ జెత్వానీ కేసుకుగానూ ఏపీ సీఐడీ ఆయన్ని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.

Forces Identified Massive Cave In Operation Karre Gutta3
కర్రెగుట్టలో మావోయిస్టుల గుహ.. 1000 మంది ఉండేలా నీటి సౌకర్యం..

సాక్షి, చర్ల: తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ మధ్య ఆపరేషన్ కర్రె గుట్టల్లో భాగంగా భద్రతా బలగాలు కీలక ముందడుగు వేశాయి. ఐదు రోజుల సెర్చ్ ఆపరేషన్‌లో తాజాగా మావోయిస్టుల కీలక స్థావరమైన బంకర్‌ను బలగాలు గుర్తించాయి. ఈ గుహ గురించి కీలక విషయాలను వెల్లడించాయి.వివరాల ప్రకారం.. కర్రెగుట్టలో మావోయిస్టుల బంకర్‌(గుహ)ను భద్రతా బలగాలు గుర్తించాయి. ఇక, ఆ గుహలో దాదాపు 1000 మంది సురక్షితంగా ఉండేలా ప్రదేశం ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. గుహలో నీటి సౌకర్యం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, భద్రతా బలగాల రాకను పసిగట్టిన మావోయిస్టులు.. అక్కడి నుంచి మకాం మార్చినట్టు సమాచారం. మరోవైపు.. కర్రె గుట్టలో అనేక గుహలు ఉండటంతో భద్రతా బలగాలకు సవాళ్లు ఎదరవుతున్నాయి. తాజాగా బంకర్‌(గుహ)కు సంబంధించి వీడియోలను భద్రతా బలగాలు విడుదల చేశాయి.ఇదిలా ఉండగా.. కర్రెగుట్టల్లో భద్రతా బలగాలు ఐదో రోజు కూంబింగ్‌ కొనసాగించాయి. సాయంత్రం 4 గంటలు కాగానే చీకటి పడటం.. 5 అడుగుల దూరంలో మనిషి కూడా కనిపించనంత దట్టమైన అడవి ఉండటంతో ఈ ప్రాంతాన్ని మావోయిస్టులు తమకు అత్యంత సురక్షితంగా భావిస్తారు. ఇలాంటి చోట ఆపరేషన్‌ బలగాలకు కత్తిమీద సాముగా మారింది. గల్గం అడవుల్లో మావోయిస్టులు అమర్చిన ఐఈడీ పేలి ఒక డీఆర్‌జీ జవాన్‌కు గాయాలు కాగా బీజాపుర్‌ జిల్లా ఆసుపత్రికి తరలించారు.ములుగు జిల్లా వెంకటాపురం సరిహద్దును కేంద్రంగా చేసుకొని ఛత్తీస్‌గఢ్‌లోని కొత్తపల్లి మొదలుకొని భీమారంపాడు, కస్తూరిపాడు, చినఉట్లపల్లి, పెదఉట్లపల్లి, పూజారికాంకేర్, గుంజపర్తి, నంబి, ఎలిమిడి, నడిపల్లి, గల్గంలో ప్రధానంగా ఆపరేషన్‌ కొనసాగుతోంది. రుద్రారం వరకు 90 కి.మీ. పొడవున ఉన్న కర్రెగుట్టలను తమ అధీనంలోకి తెచ్చుకునేందుకు వేల సంఖ్యలో బలగాలు జల్లెడ పడుతూ కొండలపైకి చేరుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అతి కష్టం మీద శనివారం సాయంత్రం కొంతమేరకు ఎక్కగలిగిన బలగాలు మావోయిస్టులు తలదాచుకున్నట్లు భావిస్తున్న సొరంగాన్ని గుర్తించాయి. ఇప్పటి వరకు ముగ్గురు మహిళా మావోయిస్టుల మృతదేహాలను, ఆయుధాలను, పెద్దఎత్తున పేలుడు సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.

IPL 2025, MI VS LSG: Rohit Sharma Needs 5 More Sixes To Become First Indian To Complete 300 Sixes In IPL4
IPL 2025: చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్న రోహిత్‌ శర్మ

ముంబై ఇండియన్స్‌ స్టార్‌ ఆటగాడు రోహిత్‌ శర్మ ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించే​ందుకు అడుగు దూరంలో ఉన్నాడు. ఐపీఎల్‌ 2025లో భాగంగా ఇవాళ (ఏప్రిల్‌ 27) మధ్యాహ్నం లక్నోతో జరుగబోయే మ్యాచ్‌లో హిట్‌మ్యాన్‌ మరో 5 సిక్సర్లు బాదితే ఐపీఎల్‌లో 300 సిక్సర్లు పూర్తి చేసుకున్న తొలి భారతీయ బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పుతాడు. ప్రస్తుతం రోహిత్‌ ఖాతాలో 295 సిక్సర్లు (265 మ్యాచ్‌ల్లో) ఉన్నాయి. ఐపీఎల్‌ చరిత్రలో ఇప్పటివరకు క్రిస్‌ గేల్‌ ఒక్కడే 300 సిక్సర్లు మార్కును తాకాడు. గేల్‌ 142 మ్యాచ్‌ల్లో 357 సిక్సర్లు బాదాడు. గేల్‌, రోహిత్‌ తర్వాత ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డు విరాట్‌ కోహ్లి పేరిట ఉంది. విరాట్‌ 261 మ్యాచ్‌ల్లో 285 సిక్సర్లు కొట్టాడు.ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన టాప్‌-5 బ్యాటర్లుక్రిస్‌ గేల్‌- 357రోహిత్‌ శర్మ- 295విరాట్‌ కోహ్లి- 285ఎంఎస్‌ ధోని- 260ఏబీ డివిలియర్స్‌- 251ఓవరాల్‌గా టీ20 క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డు కూడా క్రిస్‌ గేల్‌ పేరిటే ఉంది. గేల్‌ ఈ ఫార్మాట్‌లో 1056 సిక్సర్లు బాదాడు. ప్రపంచంలో గేల్‌ మినహా ఏ క్రికెటర్‌ 1000 సిక్సర్ల మార్కును తాకలేదు. గేల్‌ తర్వాత కీరన్‌ పోలార్డ్‌ రెండో స్థానంలో ఉన్నాడు. పోలీ తన టీ20 కెరీర్‌లో 908 సిక్సర్లు బాదాడు. గేల్‌, పోలీ తర్వాత రసెల్‌ (737), పూరన్‌ (630) అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో ఉన్నారు. పొట్టి క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన టాప్‌-4 బ్యాటర్లు విండీస్‌ ఆటగాళ్లే కావడం విశేషం. ఈ జాబితాలో టీమిండియా స్టార్‌ రోహిత్‌ శర్మ ఏడో స్థానంలో, విరాట్‌ కోహ్లి 20వ స్థానంలో ఉన్నారు. రోహిత్‌ తన టీ20 కెరీర్‌లో 540 సిక్సర్లు బాదగా.. విరాట్‌ 429 సిక్సర్లు కొట్టాడు.టీ20ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన టాప్‌-10 ఆటగాళ్లుక్రిస్‌ గేల్‌- 1056కీరన్‌ పోలార్డ్‌- 908ఆండ్రీ రసెల్‌- 737నికోలస్‌ పూరన్‌- 630కొలిన్‌ మున్రో- 557అలెక్స్‌ హేల్స్‌- 552రోహిత్‌ శర్మ- 540గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌- 530జోస్‌ బట్లర్‌- 528డేవిడ్‌ మిల్లర్‌- 505ఇదిలా ఉంటే, ముంబైలోని వాంఖడే మైదానం వేదికగా ఇవాళ మధ్యాహ్నం ముంబై ఇండియన్స్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌ తలపడుతున్నాయి. ప్లే ఆఫ్స్‌కు చేరే క్రమంలో నేటి మ్యాచ్‌ ఇరు జట్లకు చాలా కీలకంగా మారింది. ప్రస్తుతం ముంబై, లక్నో తలో 10 పాయింట్లు (9 మ్యాచ్‌లు) సాధించి పాయింట్ల పట్టికలో ఐదు, ఆరు స్థానాల్లో ఉన్నాయి. గుజరాత్‌ (12), ఢిల్లీ (12), ఆర్సీబీ (12), పంజాబ్‌ (11) టాప్‌-4లో ఉన్నాయి.

Jhelum water release POK flood alert By Pakistan5
భారత్‌ దెబ్బ అదుర్స్‌.. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఎమర్జెన్సీ!

దాయాది దేశం పాకిస్తాన్‌కు భారత్ ‘జీలం ఝలక్’ ఇచ్చింది. మున్ముందు సినిమా ఎలా ఉంటుందో తెలిపేలా ఓ ట్రైలర్ చూపించింది. పాకిస్థాన్ అధికార వర్గాలకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా భారత్ శనివారం హఠాత్తుగా జీలం నదిలోకి నీటిని విడుదల చేసింది. దీంతో పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) రాజధాని ముజఫరాబాద్ వద్ద ఒక్కసారిగా నదిలో నీటి మట్టం పెరిగి వరద పోటెత్తింది.Flood alert in PoK's Muzaffarabad as Jhelum River water levels surge. Locals allege India released water w/o informing Pak. auth. Sharp rise in water from Chakothi to Muzaffarabad sparks flood fears. Pak. claims India's move aims to suspend IWT post-Pahalgam attack. #Pakistan pic.twitter.com/Y9v4HwJQUD— Epic Pravin (@EpicPravin) April 27, 2025నది పొంగి పొర్లుతుండటంతో హతియన్ బాలా వద్ద నీటి అత్యయిక పరిస్థితి ప్రకటించారు. స్థానిక మసీదుల్లోని మైకుల ద్వారా ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. నీటిమట్టం పెరగడంతో జీలం నది ఒడ్డు ప్రాంతాల్లో నివసించేవారు భయాందోళనకు గురయ్యారు. ఉత్తర కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా నుంచి పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోకి చకోతీ ప్రాంతం గుండా ప్రవహిస్తూ నీటిమట్టం ఒక్కసారిగా పెరిగింది. ఈ ఘటనపై భారత్ వైపు నుంచి ఎలాంటి స్పందనా లేదు.Major Flooding in Jhelum: #Pakistan Declares EmergencyAfter stopping the water, now India releases excess water in the Jhelum River, allegedly without warning.Muzafrabad in Pok flooded.This is just a glimpse!#PakistanBehindPahalgam pic.twitter.com/QdIjf1v2oj— India Strikes YT 🇮🇳 (@IndiaStrikes_) April 26, 2025అయితే, నీరు.. భారత్‌లోని అనంతనాగ్ నుంచి చకోఠీ ప్రాంతం మీదుగా నీరు పీఓకేలోకి ప్రవేశిస్తున్నట్టు సమాచారం. 20 నుంచి 30 అడుగుల ఎత్తున నీళ్లు ప్రవహిస్తున్నాయని,1990 దశకం తర్వాత ఈ స్థాయిలో వరద రావడం ఇదే మొదటిసారని స్థానికులు చెబుతున్నారు. సింధూ ఒప్పందాన్ని నిలిపివేస్తామని భారత్ నిర్ణయిం తీసుకున్న తర్వాత ఈ పరిణామం జరగడం గమనార్హం. దీనివల్ల రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు.Floods in Muzaffarabad, POK today after India released waterpic.twitter.com/vF4ClKxVgW— Ghar Ke Kalesh (@gharkekalesh) April 26, 2025ఇ​క, సింధు నది జలాల ఒప్పందాన్ని భారత్ ఇప్పటికే రద్దు చేసింది. దీనిపై పాక్ ప్రభుత్వం తీవ్రంగా స్పందిస్తోంది. నదీ జలాలను మళ్లించినా, అడ్డుకున్నా దీనిని ‘యుద్ధ చర్య’గా భావిస్తామని చెప్పింది. ఈ నేపథ్యంలోనే జీలం నదిలో వరదలు రావడం గమనార్హం. ఈ నేపథ్యంలో ముజఫరాబాద్‌లోని రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (SDMA) ఆపరేషన్స్ డైరెక్టర్ ముజఫర్ రాజా స్పందిస్తూ.. భారత ఆక్రమిత కాశ్మీర్‌లోని ఒక ఆనకట్ట నుండి నీటిని విడుదల చేసినట్లు ధృవీకరించారు. విద్యుత్ ప్రాజెక్టు ఆనకట్ట యొక్క స్పిల్‌వేలు తెరవబడ్డాయి, ఫలితంగా ఒక మోస్తరు వరద పరిస్థితి ఏర్పడింది అని ఆయన అన్నారు, స్థానిక నివాసితులు తమ భద్రత కోసం నదికి దూరంగా ఉండాలని కోరారు.BREAKING🇮🇳🇵🇰 Local sources report that flooding in the Jhelum River, located in northern India and eastern Pakistan, occurred after India released water without prior notification. pic.twitter.com/vD4VPlsyr5— The Global Beacon (@globalbeaconn) April 26, 2025

Among 19 Arrested For Remarks On pahalgam incident6
పహల్గాం ఉగ్రదాడికి మద్దతుగా సోషల్‌ మీడియాలో పోస్టులు.. 19 మంది అరెస్ట్‌

ఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి సానుభూతి పరుల్ని పోలీసులు అరెస్ట్‌ చేస్తున్నారు. తాజాగా,పహల్గాం ఉగ్రదాడిపై నోరుపారేసుకున్న సుమారు 19 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ 19మంది అస్సాం,మేఘాలయా,త్రిపురకు చెందిన వారేనని పోలీసులు వెల్లడించారు.పహల్గాం ఉగ్రదాడి తర్వాత కేంద్రం సోషల్‌ మీడియాపై దృష్టిసారించింది. పహల్గాం ఉగ్రదాడికి మద్దుతు పలికేలా మాట్లాడినా, సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటుంది.ఈ తరుణంలో పహల్గాం దాడికి మద్దతు పలికేలా సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టడంతో పాటు, పాకిస్తాన్‌ జిందాబాద్‌ అంటూ స్లోగన్‌ను వినిపించిన అస్సాం, మేఘాలయా, త్రిపురకు చెందిన మొత్తం 19మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ 19 మందిలో 14 మంది అస్సాంకు చెందిన వారేనని పోలీసులు గుర్తించారు. Assam | A woman named Dadhichi Dimple alias Dimple Baruah from Golaghat district of Assam was detained by the Crime Branch from Guwahati for making controversial and anti-national comments on the #PahalgamTerrorAttack.At least 19 people have been arrested in Assam, Meghalaya,… pic.twitter.com/MgJp6TehmC— OTV (@otvnews) April 27, 2025వారిపై కఠిన చర్యలు తప్పవ్‌అయితే, ఈ అరెస్టులు,సోషల్‌ మీడియా పోస్టులపై అస్సాం సీఎం హేమంత్‌ బిశ్వశర్మ బహిరంగంగా హెచ్చరికలు జారీ చేశారు. పహల్గాం ఉగ్రదాడి లేదంటే దేశానికి వ్యతిరేకంగా సోషల్‌ మీడియా పోస్టులు పెట్టినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అవసరమైతే, వారిపై జాతీయ భద్రతా చట్టంలోని నిబంధనలను విధిస్తామన్నారు. భారత్,పాకిస్తాన్ మధ్య ఎటువంటి సారూప్యతలు లేవు. రెండు దేశాలు శత్రు దేశాలు. మనం అలాగే ఉండాలి’ అని సీఎం హిమంత బిస్వా శర్మ వ్యాఖ్యానించారు.

Interesting facts about Elon Musk7
ఈ ‘ప్రపంచ కుబేరుడు’ ఒకప్పుడు క్లీనర్‌.. అంతేనా.. ఎన్నో ట్విస్ట్‌లు!

ఎలాన్‌ మస్క్‌ జీవితం మూడు దేశాలతో ముడివడి ఉంది. దక్షిణాఫ్రికా–కెనడా–అమెరికా. ఈ మూడు దేశాల పౌరసత్వాలు అతడికి ఉన్నాయి. ఎలాన్‌ దక్షిణాఫ్రికాలో జన్మించారు. తండ్రిది దక్షిణాఫ్రికా, తల్లిది కెనడా. ఆమె మోడల్‌. ఆయన కెమికల్‌ ఇంజినీర్‌. ఎలాన్‌కు 8 ఏళ్ల వయసప్పుడే తల్లీ తండ్రి విడిపోయారు. అంతటి కుటుంబ కల్లోలంలోనూ తన జీవిత నావను జాగ్రత్తగా నడుపుకుంటూ వచ్చి.. నేడు అమెరికాను పాలిస్తున్న ఆ దేశ అధ్యక్షుడికే చేదోడు అయ్యేంతగా ఎదిగారు ఎలాన్‌. ఆయన జీవితంలోని ప్రతి దశా కీర్తి కిరీటాన్ని ధరించినదే.పన్నెండేళ్లకే తొలి బిజినెస్‌ ఎలాన్‌కి చిన్నప్పట్నుంచీ సైన్స్‌ ఫిక్షన్‌ అంటే ఇష్టం. 12 ఏళ్ల వయసులోనే ‘బ్లాస్టర్‌’ అనే వీడియో గేమ్‌ను సొంతంగా కనిపెట్టి, ఆ గేమ్‌ సాఫ్ట్‌వేర్‌ను ఒక పత్రికకు 500 డాలర్లకు అమ్మేశాడు. అదే అతడి మొదటి బిజినెస్‌. ప్రాణాంతక హైడ్రోజన్‌ బాంబులను మోసుకెళ్లే గ్రహాంతర రవాణా నౌకను అంతరిక్ష పైలట్‌ ధ్వంసం చేసే ఆట ‘బ్లాస్టర్‌’.ఫీజు కోసం క్లీనింగ్‌ పనికాలేజ్‌లో ఎలాన్‌ సబ్జెక్టులు ఫిజిక్స్, ఎకనామిక్స్‌. స్టాన్‌ఫోర్డ్, పెన్సిల్వేనియా యూనివర్సిటీల్లో చదివారు. కష్టపడి పని చేసి తన కాలేజ్‌ ఫీజు తనే కట్టుకున్నారు. ఎన్ని పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు చేసి ఫీజులు కట్టినా కాలేజ్‌ చదువు పూర్తయ్యే నాటికి లక్ష డాలర్లు అప్పు మిగిలే ఉంది. అది తీర్చటానికి గంటకు 18 డాలర్ల వేతనంతో కలపకోసే మిల్లులో క్లీనర్‌ పనితో సహా అనేక పనులు చేశారు ఎలాన్‌.ఒక కంపెనీతో ఆగిపోలేదు!ఎలాన్‌ 24 ఏళ్ల వయసులో తన తొలి కంపెనీ ‘జిప్‌2’ని ప్రారంభించారు. వార్తాపత్రికలకు ఆన్‌లైన్‌ సిటీ గైడ్‌ సాఫ్ట్‌వేర్‌ను సమకూరుస్తుంది జిప్‌2. తర్వాత నాలుగేళ్లకు 1999లో కంపాక్‌ కంపెనీ జిప్‌2ను 307 మిలియన్‌ డాలర్‌లకు కొనేసింది. ఎలాన్‌ తన ఇంకో కంపెనీ ఎక్స్‌.కామ్‌ను 2000లో కాన్‌ఫినిటీ అనే సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో విలీనం చేశారు. తర్వాతి ఏడాదికే అది ‘పేపాల్‌’ అనే ఆన్‌లైన్‌ పేమెంట్‌ ప్లాట్‌ఫామ్‌గా అవతరించింది.పేపాల్‌ను 2002లో ఈబే 1.5 బిలియన్‌ డాలర్లకు కొనుక్కుంది. అదే ఏడాది ఎలాన్‌ వ్యోమనౌకల తయారీ సంస్థ ‘స్పేస్‌ ఎక్స్‌’ను స్థాపించారు. అంతరిక్ష రవాణా సేవల్ని కూడా ఆ కంపెనీ అందిస్తోంది. అంతరిక్షయాన వ్యయాన్ని తగ్గించటం, ఏదో ఒక నాటికి అంగారక గ్రహంపై భూగోళ వాసుల కాలనీని ఏర్పాటు చేయటం స్పేస్‌ఎక్స్‌ లక్ష్యం. ప్రఖ్యాతి గాంచిన టెస్లా, ఓపెన్‌ ఏఐ, ‘ది బోరింగ్‌ కంపెనీ’, ఎక్స్‌ కార్పొరేషన్, ‘థడ్‌’ (వ్యంగ్య వార్తల మీడియా కంపెనీ)లు కూడా ఒంటి చేత్తో ఎలాన్‌ నెలకొల్పినవే.ఐరన్‌ మ్యాన్‌ 2లో చిన్న పాత్రఎలాన్‌ దగ్గర ఇంత డబ్బుంది, అంత డబ్బుంది అని చెప్పడం కంటే తేలికైన మార్గం అతడిని ఒక్క మాటలో ‘ప్రపంచ కుబేరుడు’ అనేయటం! 2025 ఏప్రిల్‌ మొదటి వారం నాటికి అతడి గరిష్ఠ సంపద సుమారు 433 బిలియన్‌ డాలర్లు. ఇంకో 567 బిలియన్‌ డాలర్లను పోగేయగలిగితే ప్రపంచంలోనే మొదటి ట్రిలియనీర్‌ అవుతారు ఎలాన్‌. డబ్బు, ధనం, సంపద.. ఇవన్నీ అలా ఉంచండి. అంతకంటే ఆసక్తికరమైన విషయాలు అతడి జీవితంలో ఉన్నాయి. 2008 నాటి ‘ఐరన్‌ మ్యాన్‌’ సినిమాలో ‘టోనీ స్టార్క్‌’ పాత్రకు ఎలాన్‌ మస్క్‌ ఇన్‌స్పిరేషన్‌! ఆ తర్వాత 2010లో వచ్చిన ‘ఐరన్‌ మ్యాన్‌ 2’ లో మస్క్‌ చిన్న పాత్ర వేశారు కూడా.తిట్లనూ తేలిగ్గా తీసుకుంటారు!ఎలాన్‌ దగ్గర ఎంత సంపద ఉందో అంత సెన్సాఫ్‌ హ్యూమర్‌ కూడా ఉంది. విమర్శల్ని చాలా తేలిగ్గా తీసుకుంటారు. తను అనుకుంటే ఏదైనా జరిగి తీరాల్సిందే అనే నైజం కూడా ఆయనలో ఉంది. ఇందుకు చిన్న ఉదాహరణ... కాలిఫోర్నియాలోని అలమీడా కౌంటీలో ఆయనకు ఒక ఫ్యాక్టరీ ఉంది. కరోనా లాక్‌డౌన్‌ వల్ల అది ఆగిపోయింది. ‘‘ఇంకెంత కాలం ఈ లాక్‌డౌన్‌’’ అని లాక్‌ డౌన్‌ పూర్తి కాకుండానే ఫ్యాక్టరీని తెరవబోయారు ఎలాన్‌.కౌంటీ అధికారులు ‘నో’ అన్నారు. మీరిలా అడ్డుకుంటే ఫ్యాక్టరీని కాలిఫోర్నియా నుంచి వేరే చోటికి మార్చేస్తా అని ఎలాన్‌ బెదిరించారు. కేసు కూడా వేస్తానన్నారు. ఆయన అలా బెదిరించడం కాలిఫోర్నియా అసెంబ్లీ సభ్యురాలు లోరేనా గాన్జెలజ్‌ కు కోపం తెప్పించింది. ‘‘చెత్త మొహం ఎలాన్‌ మస్క్‌. వెళ్లిపో’’ అని ట్వీట్‌ చేశారు. అందుకు మస్క్‌ కోపం తెచ్చుకోలేదు. ‘మెసేజ్‌ రిసీవ్డ్‌’ అని రిప్లయ్‌ ట్వీట్‌ ఇచ్చారు. కోపాలు వస్తుంటాయి. తగ్గడం తెలిస్తే నవ్వులూ పూస్తాయి. -సాక్షి, స్పెషల్‌ డెస్క్‌

Tollywood Hero Vijay Devarakonda strong Comments On Pahalgam Incident8
పాక్‌పై మనం దాడి చేయాల్సిన పనే లేదు.. వాళ్లే తిరగబడతారు: విజయ్ దేవరకొండ

కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిపై టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ మాట్లాడారు. ఆ ఘటనను తలచుకుంటేనే చాలా బాధగా ఉందన్నారు. ఎవరైతే వారి ఆప్తులను కోల్పోయారో వారి బాధ తీవ్రత ఎంత అనేది అర్థం చేసుకోలగను అన్నారు. హైదరాబాద్‌లో జరిగిన రెట్రో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరై దేవరకొండ పహల్గామ్ దాడి బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు.విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ..'కశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడిలో తమ కుటుంబ సభ్యుల్ని పోగొట్టుకున్న వారందరికీ ఒక మాట చెబుతున్నా. మేమంతా మీకు అండగా ఉంటాం. మీ బాధను దగ్గరుండి పంచుకోలేకపోయినా.. మేమూ దాన్ని అనుభవిస్తున్నాం. కశ్మీర్‌లో జరుగుతున్న ఇలాంటి దారుణాలకు కారణం కేవలం చదువు లేకపోవడమే. వాళ్లందరికీ చదువు చెప్పించి బ్రెయిన్‌వాష్‌ కాకుండా చూడాలి . ఇలాంటి చర్యల వల్ల ఏం సాధిస్తారో నాకైతే తెలియదు. కశ్మీర్‌ ఎప్పటికీ ఇండియాదే.. కశ్మీరీలు కూడా మనవాళ్లే. రెండేళ్ల క్రితమే అక్కడ ఖుషీ సినిమా షూటింగ్‌కు కూడా వెళ్లా. పాకిస్థాన్‌లో నీళ్లు, కరెంట్‌ లేక ఇబ్బందులు పడుతుంటే.. ఇక్కడకు వచ్చి ఏం చేయాలనుకుంటున్నారో అర్థం కావటం లేదు. పాకిస్థాన్‌పై మనం దాడి చేయాల్సిన అవసరం లేదు. వాళ్లకే విరక్తి వచ్చి ఆ దేశ ప్రజలే అక్కడి ప్రభుత్వంపై దాడి చేస్తారు. వాళ్లు బుద్ధి లేకుండా చేసే పనులే ఇవన్నీ. ఇలాంటి సమయంలో మనమంతా ఒక్కటిగా కలిసి ఉండాలి. మనం జీవితంలో ముందుకెళ్లాలంటే చదువు ఒక్కటే మార్గం. మనం, మన తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నప్పుడే దేశం కూడా ముందుకు వెళ్తుంది' అని అన్నారు.అనంతరం సూర్య గురించి మాట్లాడుతూ..' నాకు పెళ్లి చూపులు, అర్జున్‌ రెడ్డి సినిమాలతో కొంచెం డబ్బు చూసినప్పటి నుంచి చదువుకునేవారి కోసం ఏదైనా చేయాలనే కోరిక ఉండి.. చిన్నగా ట్రై చేశాను. కానీ, పదిహేనేళ్లుగా సూర్య అన్న అగరం ఫౌండేషన్‌ ద్వారా వేలమంది చదువుకి ఆర్థిక చేయూతనిస్తూ, ఉద్యోగాలు ఇప్పిస్తుండటం చాలా గొప్ప. ఆయన స్ఫూర్తితో ఈ ఏడాది నేను కూడా విద్యార్థులతో ఓ కమ్యూనిటీ ఏర్పరచి వారికి చేయూతనిస్తాం. ఇక ‘రెట్రో’ సినిమాని నేను థియేటర్లో చూస్తాను. మీరు కూడా చూసి ఎంజాయ్‌ చేస్తారనుకుంటున్నాను' అని అన్నారు.కాగా.. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, పూజా హెగ్డే జంటగా నటించిన తాజా చిత్రం రెట్రో. కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వం వహించారు. జ్యోతిక, సూర్య నిర్మించిన ఈ సినిమా మే 1న విడుదలవుతోంది. ఈ చిత్రాన్ని తెలుగులో సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ రిలీజ్‌ చేస్తోంది.

Started Mike Set Tightening Nukaraju Today Grown No Dates Please9
మైక్‌ మహారాజా! యాడ్‌ ఏజెన్సీలను తలదన్నే డిమాండ్‌..

విషయమేదైనా ఆకట్టుకనే ప్రచారం ఆతని సొంతం హాస్యం, చతురోక్తులతో ఆకట్టుకునే స్వరం యాడ్‌ ఏజెన్సీలను తలదన్నే డిమాండ్‌ మైక్‌సెట్‌ బిగించడంతో ప్రారంభమై నో డేట్స్‌ ప్లీజ్‌ అనే స్థాయికి ఎదిగిన నూకరాజుపుట్టిన ప్రతి ఒక్కరిలో ఒక్కొక్క నైపుణ్యం ఉంటుంది. దానిని గుర్తించి వ్యక్తపరచినపుడే ఆ కళకు సార్థకత. ఇదిగో ఈ పిఠాపురానికి చెందిన నూకరాజు ప్రావీణ్యం అలాంటిదే. శుభకార్యాలకు, ఇతర కార్యక్రమాలకు మైక్‌సెట్లు బిగించడంతో ప్రారంభమైన అతని ప్రస్థానం నేడు నో డేట్స్‌ ప్లీజ్‌ అనే వరకు వెళ్లిందంటే అతనిలోని ప్రతిభను ఏ మేరకు సానబట్టారో. అతని గొంతు వినపడిందంటే చాలు ఏదో ముఖ్యమైన సమాచారమేనని ఇళ్లలో ఏ మూలనున్నా ఓ చెవు అతడు చెప్పే మాటపై వేస్తున్నారంటే ఆ మాటకున్న విలువ అంతటిదని చెప్పడం అతిశయోక్తి కాదు. మహాశయులకు విజ్ఞప్తి అంటూ ప్రారంభించే నూకరాజు ధాన్యం కొనుగోళ్లు.. జాతరల కార్యక్రమ వివరాలు.. రాజకీయ సభల వివరాలు, ప్రభుత్వ ప్రకటనలకు సంబంధించి పాంప్లేట్లలోని సమాచారం.. ఇలా ఒకటేమిటి అన్నీ ప్రతి మనిషికి చెవినిల్లు కట్టుకుని మరీ చెప్తుంటాడు. కరోనా కష్టకాలంలో అయితే అతని సేవలు అంతా ఇంతా కాదు.. ఆరోగ్య భద్రతపై అతను చేసిన ప్రచారం స్థానికంగా ఎంతో మేలు చేసింది. చిన్న సైకిల్‌పై మైక్‌ సరంజామా అంతా కట్టుకుని అతను చేసే ప్రచారం పేరున్న యాడ్‌ ఏజెన్సీలు సైతం చేయలేవంటారు స్థానికులు. కారణం లేకపోలేదు. అతని స్టైలే అతని ప్రచారానికి ప్రధాన ఆకర్షణ. కేవలం పాంప్లేట్‌ లేదా పోస్టర్‌లో ఉన్న అంశాన్ని చెప్తూ వెళ్లిపోతుంటే ఇంతలా చెప్పుకోవడం ఎందుకూ.. అక్కడే ఉంషమ్మత్తు అంతా.. అతని మాటలో మహత్తు అది. హాస్యం, చతురత, విషయానుకూలంగా హాస్యోక్తులు జోడించి చెప్పడం అతని ప్రత్యేకత. మరి 50 ఏళ్ల ప్రస్థానమది. ఊరికే వస్తుందా ఆ పరిణితి. మైక్‌ అతని ఇంటి పేరుగా స్థిరపడిపోయేంతగా. మైక్‌తో అనుబంధం నిరుపేద కుటుంబంలో పుట్టిన మొల్లేటి నూకరాజు మండలంలోని విరవ గ్రామానికి చెందినవాడు. చిన్నప్పటి నుంచి మైక్‌ సెట్లు అంటే ఇష్టం. ఐదో తరగతి వరకు మాత్రమే చదువుకున్న అతడు 20 ఏళ్ల వయసులో మైక్‌సెట్లు బిగించే పనిలో చేరాడు. అన్ని రకాల శుభకార్యాలకు, సభలు, సమావేశాలకు వెళ్లి మైక్‌ సెట్లు వేసే వాడు. ఆ క్రమంలోనే సరదాగా మైక్‌లో చతురోక్తులు వేస్తూ అందరిని అలరించేవాడు. ఇది చూసిన ప్రతి ఒక్కరు సభలు, సమావేశాల్లో ఆయనతో ముందుగా మాట్లాడించేవారు. ఇలా మైక్‌ ఎనౌన్సర్‌గా మంచి పేరు సంపాదించాడు. ఏదైనా విషయాన్ని ప్రజలందరికీ తెలియజేయడానికి ఉపయోగించే దండోరాలకు బదులు మైక్‌ సెట్లు వినియోగం వచ్చాక రిక్షాలో మైక్‌ ప్రచారాలు ప్రారంభమయ్యాయి. ఎన్ని వచ్చినా నూకరాజుకు మాత్రం ఆ సైకిలే ప్రచార వాహనం.నా జీవితం మైక్‌కే అంకితం మైక్‌ అనేది నా జీవితంలో భాగమైపోయింది. అది లేని రోజంటూ లేదు. రోజంతా ఊరంతా తిరిగి ప్రచారం చేసి ఇంటికి వచ్చాక కూడా దానిని మరుసటి రోజుకు సిద్ధం చేయడం తప్ప వేరే పని తెలీదు నాకు. మైక్‌లో ప్రచారం చేసే వాయిస్‌ కూడా నేనే చెబుతాను. ఐదో తరగతి మాత్రమే చదివినా చదవడం రాయడం బాగానే వచ్చు. విషయం చెబితే దానికి తగ్గట్టుగా వాయిస్‌ రికార్డు చేసి ప్రచారం చేస్తుంటాను. గతంలో మైక్‌లో మాట్లాడుతూ ప్రచారం చేసే వాడిని. ఇప్పటికీ సైకిల్‌ తొక్కగలుగుతున్నానంటే ప్రజల నుంచి వస్తున్న ప్రోత్సాహం అభిమానం మాత్రమే. ఇదే పనితో కుటుంబాన్ని పోషించుకుంటు పిల్లలకు పెళ్లిళ్లు చేశాను. ఇప్పుడు నాజీవితాన్ని ఎంతో సంతోషంగా గడుపుతున్నాను. – మైక్‌ నూకరాజు, విరవ, పిఠాపురం మండలం గిరాకీ అంతా ఇంతా కాదు మైక్‌ ప్రచారాల కోసం ప్రయత్నించే వారు ఆయన కోసం వారాల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి. ఏదైనా కార్యక్రమానికి అతని ప్రచారం కావాలంటే నెల రోజులు ముందుగానే బుక్‌ చేసుకోవలసిన స్థాయి అతనిది. 74 ఏళ్ల వయసులో ఇప్పటికీ సైకిల్‌ పైనే తిరుగుతు మైక్‌తో ప్రచారం చేస్తున్న అతనిని అందరూ ఇంట్లో వ్యక్తిగా ఆప్యాయంగా పలకరిస్తుంటారు.(చదవండి: చల్లచల్లగా వేడితాక'కుండ'..!)

Sakshi Editorial On Pahalgam Terror Attack10
ఇండియా, దట్‌ ఈజ్‌ భారత్‌!

ఎట్టకేలకు పాకిస్తాన్‌ తన ముసుగును తొలగించింది. ఉగ్రవాద ముఠాలను పాలుపోసి పెంచి పెద్దచేసింది తామేనని అధికారికంగా అంగీకరించినట్లయింది. పాకిస్తాన్‌ రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్‌ రెండు రోజుల క్రితం ‘స్కైన్యూస్‌’ ప్రతినిధితో మాట్లాడుతూ అమెరికా కోసం, పశ్చిమ రాజ్యాల కోసం తామీ ‘చెత్తపని’ని చేయవలసి వచ్చిందని అంగీకరించారు. అయితే పహల్‌గామ్‌ ఉగ్రదాడి వెనుక తమ హస్తం లేదని పాత పద్ధతిలోనే బుకాయించే ప్రయత్నం చేశారు. ఈ బుకాయింపునకు పెద్దగా విలువుండదు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించింది తామేనని అంగీకరించిన తర్వాత వారి కార్యకలాపాలతో తమకు సంబంధం లేదని వాదిస్తే అంగీకరించడానికి ఎవరూ సిద్ధంగా ఉండరు.భారత్‌పైకి ఉగ్ర ముఠాలను ఉసిగొలిపే అవసరం కూడా పాకిస్తాన్‌కే ఉన్నది. ఇప్పుడదొక విఫల రాజ్యంగా ప్రపంచం ముందు నిలబడి ఉన్నది. ఎన్నడూ రాజకీయ సుస్థిరత లేదు. చెప్పుకోదగిన ఆర్థికాభివృద్ధీ లేదు. తరచుగా మిలిటరీ పాలకుల పెత్తనానికి తలొగ్గే దుఃస్థితి. ప్రజాస్వామ్యం ఒక మేడిపండు చందం. ‘ద్విజాతి’ సిద్ధాంతం అనే విద్వేషపు విత్తనంతో మొలకెత్తిన పాకిస్తాన్‌ వటవృక్షంగా మారి పిశాచ గణాలకు ఆశ్రయమిస్తున్నది. ముస్లిములు ఒక జాతి, హిందువులు మరొక జాతి అన్నదే ఈ ద్విజాతి సిద్ధాంతం.ఇదొక అసహజమైన భావన. ఒకే ప్రాంతం, ఒకే చరిత్ర, ఉమ్మడి అనుభవాలు, ఆచార వ్యవహారాలు మొదలైన వాటి ప్రాతిపదికపై ఒక జాతిని గుర్తిస్తారు. వీటికి పాలనాపరమైన, చట్టపరమైన అంశాలు కూడా తోడు కావచ్చు. కానీ మతాన్నే జాతిగా భావించే ఆలోచనాధోరణి నుంచి ఇంకా పాకిస్తాన్‌ బయటపడలేదు. పది రోజుల కిందటి పాకిస్తాన్‌ ఆర్మీ ఛీఫ్, డిఫ్యాక్టో పాలకుడైన అసీమ్‌ మునీర్‌ ఉపన్యాసాన్ని గమనిస్తే సమీప భవిషత్తులో ఆ దేశం ఈ ఆలోచన నుంచి బయటపడే అవకాశం లేదని అర్థమవుతుంది. ప్రవాసీ పాక్‌ వ్యాపారవేత్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘పాకిస్తాన్‌ పుట్టుక గురించి మీ పిల్లలకు చెప్పండి, ఆ తర్వాతి తరాలకు కూడా చెప్పండి. ముస్లింలు వేరనీ, హిందువులు వేరనీ చెప్పండి. మన ద్విజాతి సిద్ధాంతం గురించి చెప్పండ’ని సభికులకు ఆయన నూరిపోశారు.కశ్మీర్‌ సమస్యను ఎప్పటికీ విడిచిపెట్టబోమనీ, అది తమ జీవనాడని కూడా ఆయన రెచ్చగొట్టారు. ఇది జరిగిన వారం రోజులకే పహల్‌గామ్‌ దాడి జరగడం గమనార్హం. రెండు ప్రయోజనాల్ని ఆశించి పాకిస్తాన్‌ పాలకులు ఈ ద్విజాతి విద్వేష భావజాలాన్నీ, కశ్మీర్‌ అంశాన్నీ జ్వలింపజేస్తున్నారనుకోవాలి. స్వదేశీ పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించి వారి భావోద్వేగాలను భారత్‌కు వ్యతిరేకంగా రెచ్చగొట్టడం మొదటిది. ఇక రెండవది – భారతదేశ ప్రజలను కూడా మత ప్రాతిపదికన విడదీసి, ఈ దేశాన్ని అస్థిరత పాలు చేయాలని భావించడం. భారత ప్రజలు కూడా మత ప్రాతిపదికపై విడిపోయి విద్వేషాలు వెదజల్లుకుంటే పాకిస్తాన్‌ పన్నిన ఉచ్చులో చిక్కుకున్నట్టే!పాకిస్తాన్‌ ప్రస్థానానికి భిన్నంగా భారత్‌ తన ప్రయాణాన్ని ప్రారంభించింది. లౌకిక, ప్రజాస్వామిక రాజ్యంగా అది తనను తాను ఆవిష్కరించుకున్నది. ‘భారతీయులమైన మేము’ అంటూ తన రాజ్యాంగ రచనను ప్రారంభించిందే తప్ప విభజన నామవాచకాలను వాడలేదు. దేశం పేరును ‘హిందూస్థాన్‌’ అని ప్రకటించాలని కొన్ని వర్గాలు డిమాండ్‌ చేసినప్పటికీ రాజ్యాంగ సభలోని సభ్యులెవరూ దాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. ఇండియా లేదా భారత్‌ అనే పేర్లపైనే సభ్యులు రెండుగా విడిపోయారు. చివరకు ‘ఇండియా, దటీజ్‌ భారత్‌’ అనే అంబేడ్కర్‌ సూచించిన పదబంధాన్ని అందరూ ఆమోదించారు. హెచ్‌.వి. కామత్‌ ఒక్కరే తొలుత ‘హింద్‌’ అనే పేరును ప్రతిపాదించి, ఆయనే ఉపసంహరించుకున్నారు. ఆ రకంగా భారత రాజ్యాంగంలో ‘ఇండియా, దటీజ్‌ భారత్‌ షల్‌ బీ ఏ యూనియన్‌ ఆఫ్‌ స్టేట్స్‌’ అనే వాక్యం ఒకటవ అధికరణంగా చేరింది. బహువిధమైన సువిశాల భారతదేశ భిన్నత్వంలో ఏకత్వానికి ఈ మొదటి అధికరణం అద్దంపట్టింది. హిందూయిజం కూడా దాని అంతస్సారంలో భిన్నత్వంలో ఏకత్వమేనని ప్రముఖ తత్వవేత్త డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ అభిప్రాయపడ్డారు. దాన్నాయన ఒక మతంగా కాకుండా హిందూ జీవన విధానంగా పరిగణించిన విషయం తెలిసిందే. ఈ జీవన విధానంలో భిన్న ఆచార వ్యవహారాలు కలిగిన స్రవంతులు కలిసి ప్రయాణిస్తాయి. సహజీవనం చేస్తాయి. భారతీయత కూడా అంతే! కశ్మీరియత్‌ కూడా అంతే! కశ్మీరీ హిందూ, ముస్లింల మధ్య ఒకప్పటి మత సౌభ్రాతృత్వం, పరస్పర గౌరవం, ఉమ్మడి పండుగలు, ఉత్సవాలు, సూఫీ – భక్తి ఉద్యమాల ప్రభావం, లౌకిక భావాలు కలగలిసిన జీవన విధానమే ‘కశ్మీరియత్‌’గా భావిస్తారు.కశ్మీరీ యువత స్వతంత్ర భావాలను పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదం హైజాక్‌ చేసిన తర్వాత కూడా, కశ్మీరీ పండితులను ఈ ఉగ్రవాదం లోయ నుంచి తరిమేసిన తర్వాత కూడా, భారత్‌ సైన్యాలు కశ్మీర్‌ లోయను ఒక బందీఖానాగా మార్చి పౌరహక్కుల్ని ఉక్కు పాదాలతో తొక్కేసిన తర్వాత కూడా, ఆర్టికల్‌ 370 రద్దు ద్వారా ఆ రాష్ట్రానికి ఉన్న ప్రత్యేక ప్రతిపత్తిని ఊడబెరికిన తర్వాత కూడా, ఆ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసి, కనీస రాష్ట్ర హోదాను లాగేసుకున్న తర్వాత కూడా ‘కశ్మీరియత్‌’ సజీవంగా నిలిచే ఉందని మొన్నటి దాడి సందర్భంగా జరిగిన పరిణామాలు నిరూపించాయి.ఉగ్రవాద మూకలు అమాయక పర్యాటకుల మీద తుపాకులతో తూటాలు కురిపిస్తుంటే వాళ్లను కాపాడేందుకు చావుకు తెగించి ముష్కర మూకను ప్రతిఘటించి ప్రాణాలు బలిపెట్టిన సయ్యద్‌ హుస్సేన్‌ సజీవ కశ్మీరియత్‌కు ప్రతీక. ఆ దాడి నుంచి తప్పించుకున్నవారు తమకు అండగా నిలబడి కాపాడిన కశ్మీరీ ముస్లిం యువత మానవత గురించి కథలు కథలుగా చెబుతున్నారు. ఆ రాష్ట్రానికి పర్యాటకులుగా వెళ్లినవారు ఘటన తర్వాత బిక్కుబిక్కుమంటున్న వేళ వందలాది ముస్లిం గృహస్థులు వారికి తోడుగా నిలబడి ఆశ్రయం కల్పించారనీ, సాదరంగా సాగనంపారనీ కూడా వార్తలొస్తున్నాయి. అయితే, ఆ వార్తలకు ప్రధాన స్రవంతి మీడియాలో రావాల్సిన ప్రాధాన్యం రావడం లేదు. సౌభ్రాతృత్వంతో కూడిన ‘కశ్మీరియత్‌’కూ, ‘ద్విజాతి’ సిద్ధాంతపు విద్వేషానికీ ఎప్పటికీ సాపత్యం కుదరదు. కాకపోతే భారతీయత ఆ సౌభ్రాతృత్వాన్ని సమాదరించి గౌరవించాలి. భారత ప్రభుత్వం కశ్మీరీల కిచ్చిన హామీలను అమలు చేయాలి. వారి విశ్వాసాన్ని చూరగొనాలి. ఇది జరిగిన నాడు కశ్మీర్‌ కోసం వెయ్యేళ్ల యుద్ధానికైనా సిద్ధపడతామన్న నాటి పాక్‌ ప్రధాని జుల్ఫికర్‌ అలీ భుట్టో మాటలకు ఇంకో వెయ్యేళ్లు జోడించినా ఫలితముండదు.ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ గళం విప్పుతున్నాయి. భారత్‌కు బాసటగా ఉంటామని ప్రకటిస్తున్నాయి. తాము ఒంటరవుతున్నామని గమనించిన పాకిస్తాన్‌ ప్రధాని దాడి ఘటనపై విచారణకు సిద్ధమని ప్రకటించారు. ముష్కర మూకను రెచ్చగొట్టింది పాక్‌ ఆర్మీ చీఫ్‌. సిసలైన పాక్‌ పాలకుడు ఆయనే! ఉగ్రవాదులకు మూడు దశాబ్దాలుగా ఆశ్రయమిస్తున్నామని పాక్‌ రక్షణమంత్రి స్వయంగా ప్రకటించిన తర్వాత పాక్‌ ప్రధాని అమాయకత్వం నటిస్తే ఎవరు నమ్ముతారు? ఈ అనుకూల వాతావరణంలోనే ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న పాక్‌పై కఠిన చర్యలను తీసుకోవడానికి కేంద్రం ఉపక్రమించాలి. అయితే ముందుగా దాడికి దిగిన ముష్కరులకు పాక్‌తో ఉన్న సంబంధాలను ధ్రువీకరించవలసిన అవసరం ఉన్నది.దాడి ఘటనలో ప్రభుత్వపరంగా భద్రతా ఏర్పాట్లలో లోపాలు, నిఘా వైఫల్యాలు స్పష్టంగా వెల్లడయ్యాయి. అవి దాచేస్తే దాగని నిజాలు. కనీసం ఇప్పుడా హంతకులను పట్టుకొని వారితో పాక్‌ సంబంధాలను రుజువు చేసైనా చేసిన తప్పును దిద్దుకోవలసిన అవసరమున్నది. ఘటన తర్వాత ప్రధాని మోదీ తీవ్రంగానే స్పందించారు. ఇది దేశంపై జరిగిన దాడిగా ప్రకటించారు. వెంటనే కొన్ని చర్యలను ప్రకటించారు. అందులో ముఖ్యమైనది సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలుపుదల చేయడం. నిజానికి ఈ పని ఎప్పుడో చేయాల్సింది. బహుశా అంతర్జాతీయ ఒత్తిడి పర్యవసానంగా నెహ్రూ ఈ ఒప్పందానికి తలూపి ఉంటారు. అంతర్జాతీయ వేదికలపై భారత్‌కు ఇప్పుడున్నంత పలుకుబడి అప్పుడు లేదు. నెహ్రూకు వ్యక్తిగత పలుకుబడి మాత్రం ఉండేది. ఉగ్రవాదాన్ని అప్పుడింకా ఈ స్థాయిలో ఊహించలేదు. కనుక పాకిస్తాన్‌కూ పశ్చిమ రాజ్యాల మద్దతు ఉండేది.సింధు నదీ జలాల ప్రవాహంలో సగానికి పైగా భారత్‌లో ఉన్న పరివాహక ప్రాంతమే మోసుకెళ్తున్నది. సింధు నది టిబెట్‌లోని కైలాస పర్వతం పాదాల దగ్గర పుట్టి, భారత్‌లోని లద్దాఖ్, పాక్‌ ఆక్రమిత గిల్గిట్‌లలో 1100 కిలోమీటర్లు ప్రవహించి పాకిస్తాన్‌లో ప్రవేశిస్తుంది. నదికి కుడివైపు నుంచి పాక్‌ భూభాగం, పాక్‌ ఆక్రమిత భూభాగాల ద్వారా అరడజనుకు పైగా ఉపనదులు కలుస్తాయి. అందులో కాబూల్‌ నది, గిల్గిట్‌ నది, హూంజా నది, స్వాట్‌ నది ముఖ్యమైనవి. కానీ భారత్‌ నుంచి సింధులో ఎడమ వైపుగా కలిసే పంచ నదులే ఆ నదికి ప్రాణం. ఈ ఐదు నదుల్లో జీలం, చీనాబ్‌ నదులతోపాటు సింధు నది జలాలపై పూర్తి హక్కుల్ని ఈ ఒప్పందం పాక్‌కు కట్టబెట్టింది. సట్లెజ్, రావి, బియాస్‌ నదీ జలాలపై మాత్రమే భారత్‌కు వినియోగించుకునే హక్కులు దక్కాయి.సింధు నది బేసిన్‌లో ఈ పంచ నదులకున్న కీలక పాత్రకు రుగ్వేదకాలం నుంచే అంటే మూడున్నర వేల యేళ్ల క్రితం నుంచే గుర్తింపు ఉన్నది. రుగ్వేద ఆర్యులు ఈ బేసిన్‌ను ‘సప్తసింధు’గా పిలిచారు. రుగ్వేద కాలానికి ఇంచుమించు సమాన కాలంలో పర్షియన్‌ నాగరికతలో ప్రభవించిన ‘అవెస్థా’ గ్రంథం కూడా ఈ లోయను ‘హప్తహెందూ’గా ప్రస్తావించింది. అంటే ఆ ఏడు నదులకు సింధుతో సమాన ప్రాధాన్యతనిచ్చారు. వాటిని 1. సింధు నది, 2. వితస్థా (జీలం), 3. అసిక్ని లేదా చంద్రభాగా (చీనాబ్‌), 4. పురుష్ణి (రావి), 5. విపాస (బియాస్‌), 6 శతుద్రి (సట్లెజ్‌), 7. సరస్వతీ నదులుగా రుగ్వేదం ప్రస్తావించిందని చెబుతారు. ఈ ఏడో నది వేలయేళ్ల క్రితమే ప్రస్తుత రాజస్థాన్‌ ప్రాంతంలో అంతరించి ఉంటుందని భావిస్తున్నారు.ఈ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుంటే సింధు బేసిన్‌లో భారత భూభాగానికి ఉన్న ప్రాధాన్యత అర్థమవుతుంది. న్యాయబద్ధంగా ఈ బేసిన్‌లో సగటున లభ్యమయ్యే ఎనిమిది వేల టీఎమ్‌సీల్లో (బ్రిటానికా లెక్క) సగం మనకు దక్కాలి. కానీ ఒప్పందం కారణంగా ఇరవై శాతం జలాలపైనే హక్కులున్నాయి. ఆయా ప్రాంతాల నైసర్గిక స్వరూపాలు, అవసరాలను దృష్టిలో పెట్టుకొని ‘బేసిన్లూ లేవు, భేషజాలూ లేవు’ అని గతంలో కేసీఆర్‌ వ్యాఖ్యానించడం నిజమే. కానీ అది ఒకే దేశంగా ఉన్నప్పటి మాట. రెండు దేశాలుగా విడిపోయిన తర్వాత, ఒక దేశం మీద మరొక దేశం ఉగ్రదాడులు చేస్తున్న నేపథ్యంలో బేసిన్లూ ఉంటాయి. భేషజాలూ ఉంటాయి.కీలకమైన పంచ నదుల ప్రవాహాన్ని భారత్‌ అడ్డుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ శక్తీ అడ్డుకోకపోవచ్చు. కానీ ఈ చర్య వలన పాక్‌ పౌరుల ఆహార భద్రతకు కలిగే ముప్పును, పర్యావరణ మార్పుల సంభావ్యతను కూడా దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. పాక్‌ పాలకుల స్పందనను బట్టి ఈ జలాయుధ ప్రయోగ తీవ్రత ఉండవచ్చు. భారతీయులుగా ఈ దేశ ప్రయోజనాల పరిరక్షణ కోసం, దేశ భద్రత కోసం ప్రభుత్వం తీసుకునే చర్యలకు మద్దతునీయడం ప్రజల బాధ్యత. అదే సందర్భంలో ప్రజలను విడగొట్టకుండా భిన్నత్వంలో ఏకత్వాన్ని నిలబెట్టుకోవడం ద్వారా మాత్రమే భారతీయత నిలబడుతుంది. ద్విజాతి సిద్ధాంతం ప్రభావం మన దేశంలో కూడా కొంతమందిపై ఇప్పుడు కనిపిస్తున్నది. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే పాకిస్తాన్‌ బాటలోనే భారత భవిష్యత్తును దర్శించవలసి వస్తుంది. భిన్నత్వంలో ఏకత్వమనే భారతీయ జీవన విధానమే కాలపరీక్షకు తట్టుకొని అభివృద్ధికి ఆలంబనగా నిలిచింది. ఇకముందు కూడా అదే మనకు శ్రీరామరక్ష.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement