నాసాకు ఎంపికైన విద్యార్థినులు
మట్టిలో మాణిక్యాలను గుర్తించి వాటికి మెరుగుపెడితే మరింత ప్రకాశిస్తాయి. రాష్ట్ర సర్వశిక్షా అభియాన్ అధికారులు ఇదే చేశారు. జిల్లాలోని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) 8, 9 తరగతులు చదివే నిరుపేద బాలికల్లో ఉన్న ప్రతిభా పాటవాలను గుర్తించా రు. వీరిలోని శాస్త్ర సాంకేతిక రంగాల పటిమకు పదును పెట్టారు. కేవీపల్లి, పుంగనూరు, బైరెడ్డిపల్లి, రొంపిచెర్ల కేజీబీవీలకు చెందిన తొమ్మిది మంది బాలికలు నాసా నిర్వహించే ఐఎస్‌డీసీకి ఎంపికయ్యారు.
సాక్షి ప్రతినిధి, తిరుపతి: రాష్ట్రంలోని కస్తూర్భాగాంధీ బాలికా విద్యాలయాలకు ఒక్కసారిగా ప్రత్యేక గుర్తింపు లభించింది. గతంలో ఎన్నడూ రానంత పేరు ప్రఖ్యాతులు ఈ విద్యాలయాలు సొంతం చేసుకున్నాయి. ఇందుకు కారణం మన జిల్లా బాలికలే. జిల్లాలోని కేవీపల్లి, పుంగనూరు, బైరెడ్డిపల్లి, రొంపిచర్ల కస్తూర్భాగాంధీ విద్యాలయాల్లో 8, 9 తరగతులు చదివే 9 మంది బాలికలు నాసా సభలకు ఎంపికై జిల్లా పేరును అంతర్జాతీయ స్థాయిలో ఎగురవేశారు. మే 24 నుంచి జూన్ 2 వరకూ అమెరికాలోని లాస్ ఏంజిల్స్ నగరంలో జరిగే ఇంటర్నేషనల్ స్పేస్ డెవలప్‌మెంట్ కాన్ఫరెన్స్ (ఐఎస్‌డీసీ)లో ‘అంతరిక్షంలో ఆవాసాలు’ అనే అంశంపై పోస్టర్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.
ఎంపికైంది వీరే..
వెలగా ప్రత్యూష(కేవీపల్లి), కె.రెడ్డిరాణి (కలకడ), సీహెచ్ స్నేహ (గంగవరం), గుజ్జల దివ్య (కేవీపల్లి), ఎస్‌కే రోషిణి (పుంగనూరు), కే. ప్రీతి( బైరెడ్డిపల్లి), టీ సాయిశ్రీ (రొంపిచెర్ల), ఎం.పూజ (కేవీపల్లి), వీ.సైదాభాను (పుంగనూరు) ఎంపికైన వారిలో ఉన్నారు. వీరంతా టెన్త్ లోపు విద్యార్థులే. అంతరిక్షంలో నివాస ప్రాంతాలు, వ్యవసాయం, రవాణా, పరిశ్రమలు, ఆవాసాలు, మొక్కల పెంపకం, ఆహారం, గాలి, ఉష్ణోగ్రతలు, గురుత్వాకర్షణ శక్తి వంటి అంశాలపై ప్రతిభ చాటారు. అంతరిక్షంలో మానవ మనుగడ ఎలా అన్నదే అందరి సంయుక్త పరిశోధన కానుంది. హైదరాబాద్‌లోని ప్లానిటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఎన్. రఘునందన్‌కుమార్ విద్యార్థులకు ఎంతగానో సహకారం అందించారు. శాటిలైట్ ల్యాంచింగ్ లేబొరేటరీ, ఆస్ట్రోనాట్స్‌తో ముఖాముఖి వంటి అంశాలను చిన్నారులకు నేర్పారు. నెల రోజుల కిందట తిరపతిలోని నెహ్రూ మున్సిపల్ స్కూల్‌లో చిన్నారులకు అవగాహన తరగతులు నిర్వహించారు. ఇక్కడే వీరికి తగిన శిక్షణ కూడా ఇచ్చారు.
అందరిదీ గ్రామీణ నేపథ్యమే..
ఎంపికైన విద్యార్థినులంతా గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారే. పేద, వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన వారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో దూసుకెళ్లేందుకు ఆరాట పడుతున్న భావి మేధావులు. తొలిసారి విమానంలో అమెరికా వెళ్లబోతున్నామన్న ఆనందం, నాసా వర్క్‌షాప్ ఎలా ఉండబోతుందోనన్న ఉత్కంఠ వీరిలో కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment