కేజీబీవీ తరగతిగదిలో బాలికలు
విజయనగరం అర్బన్: పేదరికం, ఆదరించేవారు లేక బడి మధ్యలో మానేసిన బాలికల్లో విద్యావెలుగులు నింపాల్సిన కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు (కేజీబీవీ) లక్ష్యానికి దూరంగా నడుస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయాలతో బాలికలను ఆర్థిక కష్టాలు చుట్టుముడుతున్నాయి. చదువుకు మళ్లీ దూరం చేస్తున్నారు. విద్యా సంవత్సరం ఆరంభంలోనే కేజేబీవీ బాలికలకు వసతి కల్పనతోపాటు నోట్ పుస్తకాలు, స్టేషనరీ, యూనిఫారాలు, పాదరక్షల ను ప్రభుత్వం అందించాలి. పాఠశాలలు పునఃప్రారంభమై నెలరోజులు గడిచినా ఇవేవీ వారికి ఇవ్వలేదు. దీంతో బాలికలు అప్పులు చేసి బయట మార్కెట్‌లో కొనుగోలు చేసుకుంటున్నారు.
ఇదీ పరిస్థితి...
జిల్లాలో మొత్తం 33 కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు ఉన్నాయి. అందులో ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు 6,500 మంది విద్యార్థినులు విద్యనభ్యసిస్తున్నారు. ఆ విద్యాలయాల్లో ప్రవేశం పొందాలంటే బడి మధ్యలో మానేసిన విద్యార్ధినులు ఎలాంటి ద్రువ పత్రాలు లేకున్నప్పటికీ చేరవచ్చు. ప్రవేశం పొందిన విద్యార్థినికి రెండు జతల యూనిఫారాలు, పాదరక్షలు, పాఠ్య పుస్తకాలు, నోట్‌బుక్స్ తదితర అభ్యసనా సామగ్రి, ప్లేట్లు, పెట్టెలు, కాస్మోటిక్ చార్జీలు నెలకు రూ.100 చొప్పున అందజేయాలి. విద్యాలయాలు ప్రారంభమై నెలరోజులు గడిచినా నోట్ బుక్స్ జాడలేదు. గత ప్రభుత్వం జిల్లా స్థాయిలోని పర్చేజింగ్ కమిటీల ఆధ్వర్యంలో కొనుగోలు చేసి జూన్ నెలలోనే పంపణీ చేసేది. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక నాలుగేళ్లుగా రాష్ట్రస్థాయిలో టెండర్లు వేసి అన్ని జిల్లాలకు పంపిణీ చేస్తున్నారు. జాప్యం అవుతుండడంతో అత్యవసర నిధులను కేటాయించి ఒక్కో విద్యార్థినికీ 4 నోట్లు పుస్తకాల వంతున జిల్లా స్థాయి పర్చేజింగ్ కమిటీ ద్వారా పంపిణీ చేశారు. ఈ ఏడాది ఆ పరిస్థితీ లేదు. బాలికలు సొంత డబ్బులతో నోట్ బుక్సు కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. తల్లిదండ్రులు లేనిబాలికలు ఆవేదన చెందుతున్నారు.
ఖర్చ బారెడు...
పదో తరగతికి నోట్ పుస్తకాలు ఒక్కో విద్యార్థినికి 20కి పైగా అవసరం. సబ్జెక్టుకు రెండు చొప్పున, వివిధ పరీక్షల నిర్వహణకు ఒక్కో పుస్తకం కొనుగోలు చేయాలి. అంటే మొత్తం ఈ పుస్తకాలకే రూ.వేయికుపైగా అవుతుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. వీటిని కొనుగోలు చేయడానికి కొంత మంది విద్యార్థినులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఉన్న విద్యార్థినులకు రూ.600 నుంచి 700 ఖర్చు అవుతున్నట్లు చెబుతున్నారు. అంటే ఒక కస్తూర్బా విద్యాలయంలో 200 మంది విద్యార్థినులు ఉండగా, వారికి రాత పుస్తకాల ఖర్చు సుమారు రూ.1.4 లక్షల మేరకు అవుతుందని అంచనా. ఈ లెక్కన జిల్లాలలోని 33 విద్యాలయాలలో రూ.46.2 లక్షల మేర విద్యార్థినులు వెచ్చించాల్సి వస్తోంది.
యూనిఫారాలూ అందని వైనం
2017–18 విద్యా సంవత్సరానికి సంబంధించిన యూనిఫారాలు 2018 మార్చిలో వచ్చాయి. ఇక 2018–19 విద్యాసంవత్సరానికి సంబంధించి ఎప్పుడు వస్తాయోనని బాలికలు ఎదురుచూస్తున్నారు. కొత్తగా ప్రవేశాలు చేసిన ఆరోతరగతి విద్యార్థినులకు యూనిఫారాలు లేవు. జిల్లాలోని 33 కెజీబీవీల్లో 6,500 మంది బాలికలంటే ఒక్కొక్కరికి రెండు జతలు చొప్పున 13 వేల దుస్తులు పంపిణీ చేయాల్సి ఉంది.
బయట దుకాణాల్లోకొని తెచ్చుకుంటున్నాం
పాఠ్యాంశాల బోధన మొదలైంది. రాత పుస్తకాల అవసరం ప్రతిరోజు ఉంటుంది. స్కూల్‌లో పుస్తకాలిస్తారని చేరాం. ఇంతవరకు ఇవ్వలేదు. ఇంటిదగ్గర నుంచి డబ్బులు తెచ్చుకొని బయట కొనుగోలు చేశాం. విద్యాలయంలో పుస్తకాలను త్వరగా ఇస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. మాతోటి స్నేహితురాలు కొనుగోలు చేయలేక ఆర్థికంగా అవస్థలు పడుతోంది. త్వరగా ఇస్తే బాగుంటుంది.
– దార వెంకటలక్ష్మి, 10వ తరగతి విద్యార్థిని, విజయనగరం కేజీబీవీ
పాత స్టాక్ నుంచి ఇస్తున్నాం..
నోట్ పుస్తకాలు రాష్ట్రస్థాయి నుంచి ఇంకా రాలేదు. ప్రస్తుతానికి పాత స్టాక్ నుంచి ఇస్తున్నాం. అత్యవసరంగా పదోతరగతి విద్యార్థినులకు నోట్ పుస్తకాల కొరత లేకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నాం. మిగిలిన తరగతులకు పుస్తకాలు వచ్చాక పంపిణీ చేస్తాం.– జె.సీతారామారావు, జేసీ–2, పీఓ(అదనపు బాధ్యతలు), ఎస్‌ఎస్‌ఏ
Comments
Please login to add a commentAdd a comment