పుట్లూరు కేజీబీవీ
♦ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయా (కేజీబీవీ)ల విద్యార్థినులకు భద్రత కరువవుతోంది. తరచూ చోటు చేసుకుంటున్న ఘటనలు వారిని ఉలికిపాటుకు గురి చేస్తున్నాయి. భద్రత కల్పించడంలో ప్రభుత్వం వైఫల్యం...అమ్మాయిల పాలిట శాపంగా మారుతోంది. రెండు రోజుల కిందట యాడికి కేజీబీవీలో జరిగిన ఘటన అక్కడి ఉద్యోగులు, విద్యార్థినులు, వారి తల్లిదండ్రులను కలవరపెడుతోంది. రాత్రి 10 గంటల సమయంలో అగంతకుడు డు ఏకంగా ప్రహరీలోకి ప్రవేశించి భవనంపైకి ఎక్కాడు. అదృవశాత్తూ స్టడీలో ఉన్న విద్యార్థినులు గుర్తించి సిబ్బందికి సమాచారం ఇవ్వడం, వారు 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సమయానికి వచ్చిన పోలీసులు అగంతకుడిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో విద్యార్థినులు ఊపిరి పీల్చుకున్నారు.
♦ బత్తలపల్లి కేజీబీవీలో గతేడాది అర్ధరాత్రి ఓ అగంతకుడు చొరబడి ఓ విద్యార్థిని గొంతు నులిమే ప్రయత్నం చేశాడు. కేకలు పెట్టడంతో పారిపోయాడని బాధిత విద్యార్థిని వాపోయింది.
అనంతపురం ఎడ్యుకేషన్: అనాథలు, మధ్యలో బడిమానేసిన ఆడ పిల్లల కోసం కేజీబీవీలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. జిల్లాలోని 62 కేజీబీవీల్లో 12,150 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. ఈ విద్యాలయాలన్నీ శివారు ప్రాంతాల్లోనే ఉన్నాయి. చాలా చోట్ల ›ప్రహరీలు లేవు. అధికారుల పర్యవేక్షణ లోపం, సిబ్బంది అలసత్వం విద్యార్థినుల పాలిట శాపంగా మారుతోంది. శింగనమల నియోజకవర్గంలోని ఓ కేజీబీవీలో తొమ్మిదో తరగతి విద్యార్థిని ప్రసవించింది.
ఈ ఘటన అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. తాడిపత్రి ప్రాంతంలోని ఓ కేజీబీవీలో ఇద్దరు విద్యార్థినులను అర్ధరాత్రి 11 గంటల సమయంలో కొందరు యువకులు బయటకు తీసుకెళ్లి తెల్లవారుజామున 3 గంటల సమయంలో తిరిగి వదిలి వెళ్లారు. లోపలికి వచ్చే సమయంలో గోడ దూకుతున్న విద్యార్థినులను గుర్తించిన సిబ్బంది మరుసటిరోజు బంధువులను పిలిపించి ఇంటికి పంపించేశారు. కళ్యాణదుర్గం ప్రాంతంలో ఓ విద్యార్థిని పట్ల కానిస్టేబుల్ లైంగిక వేధింపులకు గురి చేశాడు. గార్లదిన్నె కేజీబీవీలో ఓ విద్యార్థిని గోడదూకి ఆత్మహత్యాయత్నం చేసింది. మరో కేజీబీవీలో విద్యార్థిని చెప్పాపెట్టకుండా వెళ్లిపోయింది. అదృష్టవశాత్తూ ఈ అమ్మాయి ఆచూకీ రెండు రోజుల తర్వాత లభించడంతో బంధువులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. సిబ్బంది సహకారంతో రాప్తాడు నియోజకవర్గంలోని ఓ కేజీబీవీలోకి తరచూ పురుషులు వస్తున్నారు. ఏదైనా జరగరాని ఘటన జరిగితే బాధ్యులెవరని విద్యార్థినుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.
పని చేయని సీసీ కెమెరాలు
తరచూ చోటు చేసుకుంటున్న ఘటనల నేపథ్యంలో కేజీబీవీల్లో సీసీ కెమరాలు ఏర్పాటు చేసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ క్రమంలో 231 సీసీ కెమరాలు ఏర్పాటు చేశారు. ఒక్కో కేజీబీవీలో 2 నుంచి 5 దాకా కెమరాలు అమర్చారు. అయితే ఇవి చాలా చోట్ల పని చేయడం లేదు. అవి పని చేయకపోవడమే బాగుంటుందనే ధోరణిలో సిబ్బంది ఉన్నారు. రిపేరీ సాకుతో వీటిని మూలనపడేశారు. ఏదో ఘటన జరిగినప్పుడు హడావుడి చేయడం తప్ప ముందుగా చర్యలు తీసుకోవడం లేదు.
చర్యలు తీసుకుంటున్నాం
కేజీబీవీల్లో విద్యార్థినుల భద్రతపై గట్టి చర్యలు తీసుకుంటున్నాం. సీసీ కెమరాలు పని చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. డే, నైట్ వాచ్ ఉమెన్లు ఉన్నారు. వారితో పాటు సిబ్బంది కూడా నైట్ డ్యూటీలో ఉంటారు. కేజీబీవీల వద్ద రాత్రిపూట ఎవరైనా అపరిచిత వ్యక్తులు సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం చేరవేయాలి. సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి. నిర్లక్ష్యంతో ఏ చిన్న ఘటన చోటు చేసుకున్నా సంబంధిత ఎస్‌ఓ, సిబ్బందిపై చర్యలుంటాయి. – ఉషారాణి, జీసీడీఓ
Comments
Please login to add a commentAdd a comment