
సాక్షి, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా ఉన్న కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) ఇకపై 12వ తరగతి వరకు విద్యా బోధన కొనసాగనుంది. ఇప్పటివరకు 6, 7, 8 తరగతుల్లోనే నివాస వసతితో కూడిన విద్యను అందిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఇకపై 12వ తరగతి వరకు విద్యను అందించాలని నిర్ణయించింది. దీంతో సామాజిక, ఆర్థిక పరిస్థితులతో డ్రాపవుట్స్‌గా మిగిలిపోతున్న నిరుపేద కుటుంబాలకు చెందిన బాలికలకు 12వ తరగతి వరకు చదువుకునే వీలు కలగనుంది.
సొంతంగా 9, 10 తరగతులు కొనసాగిస్తున్న రాష్ట్రం...
కేజీబీవీల్లో ఇప్పటివరకు 8వ తరగతి వరకే బోధన అందించేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులిస్తుండగా తెలంగాణలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా 9, 10 తరగతులను కూడా కొనసాగిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలోని 391 కేజీబీవీల్లో 73 వేల మంది బాలికలు చదువుతుండగా వారి చదువు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ. 212 కోట్లు వెచ్చిస్తోంది. మరోవైపు రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన మండలాల్లో 110 మండలాలు విద్యాపరంగా చాలా వెనుకబడి ఉన్నట్లు కేంద్రం 2017లో గుర్తించి మరో 84 కేజీబీవీలను మంజూరు చేసింది. దీంతో రాష్ట్రంలో కేజీబీవీల సంఖ్య 475కు చేరింది. కేంద్రం తాజా నిర్ణయంతో వాటన్నింటిలో బాలికలకు నివాస వసతితో కూడిన ఇంగ్లిష్ మీడియం విద్య 12వ తరగతి వరకు అందనుంది.
అమల్లోకి వచ్చిన కేబ్ సబ్‌కమిటీ సిఫార్సులు...
దేశవ్యాప్తంగా బాలికా విద్యకు ప్రోత్సాహం అందించేందుకు చేపట్టాల్సిన చర్యలపై అధ్యయనం చేసి నివేదిక అందించేందుకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చైర్మన్‌గా సెంట్రల్ అడ్వయిజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ (కేబ్) సబ్ కమిటీని కేంద్ర మానవవనరుల అభివృద్ధిశాఖ గతేడాది ఏర్పాటు చేసింది. అస్సాం మంత్రి హేమంత బిస్వాశర్మ, జార్ఖండ్ మంత్రి నీరా యాదవ్ సభ్యులుగా, కేంద్ర మానవ వనరులశాఖ అదనపు కార్యదర్శి రీనారాయ్ సభ్య కార్యదర్శిగా ఏర్పాటైన ఈ కమిటీ పలు దఫాలుగా వివిధ రాష్ట్రాల్లో అధ్యయనం చేసి ఇటీవలే నివేదిక సమర్పించింది. కేజీబీవీలను 12వ తరగతి వరకు కొనసాగించాలని నివేదికలో సిఫారసు చేసింది. దీనిపై కేంద్ర కేబినెట్ సానుకూలంగా స్పందించింది. కేంద్రం నిర్ణయంతో నిరుపేద బాలికలకు విద్యావకాశాలు మెరుగుపడతాయని కడియం శ్రీహరి పేర్కొన్నారు.