సాక్షి, హైదరాబాద్: వచ్చే విద్యా సంవత్సరం నుంచే ప్రభుత్వ బడుల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని సర్కారు నిర్ణయించడంతో.. విద్యాశాఖ కసరత్తును వేగవంతం చేసింది. ద్విభాషా (ఇంగ్లిష్, తెలుగు) బోధనకు అనుగుణంగా పుస్తకాలను ముద్రించే ప్రక్రియ వేగం పుంజుకుంది. ఈ మేరకు రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ (ఎస్‌సీఈఆర్టీ) ఏర్పాట్లు పూర్తి చేసింది.
ఆంగ్ల మాధ్యమంలో బోధనపై టీచర్లకు శిక్షణ ఇచ్చేందుకు సుమారు 20వేల మంది రిసోర్స్ పర్సన్స్‌ను విద్యా శాఖ ఎంపిక చేసింది. ప్రస్తుతానికి ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం కోసం పెద్దగా మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరమేమీ లేదని.. బోధనకు ఉపాధ్యాయులను సమాయత్తం చేయడమే ప్రధాన అంశమని అధికారులు చెప్తున్నారు. దశలవారీగా టీచర్లు ఆంగ్లంపై పట్టుసాధించేలా చేయడంపైనే దృష్టిపెట్టినట్టు పేర్కొంటున్నారు.
పెరిగిన పోటీ
చాలా వరకు విద్యార్థుల తల్లిదండ్రులు ఆంగ్ల మాధ్యమాన్ని కోరుకుంటున్నారు. ఈ కారణంగానే పిల్లలను ప్రైవేటు స్కూళ్లకు పంపుతున్నామని చెప్తున్నారు. రాష్ట్రంలోని ప్రైవేటు స్కూళ్లల్లో 30 లక్షల మంది విద్యార్థులుంటే.. అందులో 95 శాతం ఆంగ్ల మాధ్యమంలోనే చదువుతుండటం గమనార్హం. రాష్ట్రంలో 26,072 ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తంగా 22.93 లక్షల మంది చదువుతున్నారు. ఇందులో ఇంగ్లిష్ మీడియం వారి సంఖ్య 10.21 లక్షలే. వీరికి కూడా ఇంగ్లిష్ మీడియం బోధన అరకొరగా సాగుతోంది.\\
తెలుగులోనే పాఠాలు చెప్తున్న పరిస్థితి. విద్యార్థులకు సరిగా అర్థంకాకపోవడమే దీనికి కారణమంటూ టీచర్లు సాకులు చెప్తున్నారన్న విమర్శలున్నాయి. నిజానికి చాలామంది ఉపాధ్యాయులు ఇంగ్లిష్‌లో బోధన అంటే భయపడుతున్నారని ఇటీవల విద్యాశాఖ సర్వేలో వెల్లడైంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే.. ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి, వారిలో భయం పోగొట్టాలని.. ప్రైవేటు స్కూళ్లకు దీటుగా బోధించేలా చేయాలని విద్యాశాఖ భావిస్తోంది.
ఎక్కువ రోజులు శిక్షణ..
గత అనుభవాల దృష్ట్యా ఈసారి ఉపాధ్యాయులకు ఎక్కువ రోజులు ఇంగ్లిష్‌పై శిక్షణ ఇచ్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. 2009లో సక్సెస్ స్కూళ్లు పెట్టినప్పుడు 13 రోజులే శిక్షణ ఇచ్చారు. తమకు కనీసం 3 నెలలైనా శిక్షణ అవసరమని టీచర్లు చెప్తున్నారు. దీంతో వీలైనంత త్వరగా శిక్షణ మొదలుపెట్టాలని అధికారులు
భావిస్తున్నారు.
సగానికిపైగా టీచర్లకు శిక్షణ
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో 1.03 లక్షల మంది ఉపాధ్యాయులున్నారు. అందులో 60 వేల మంది వరకు ఇంగ్లిష్, తెలుగు మాధ్యమాల్లో బోధిస్తున్న స్కూళ్లలో పనిచేస్తున్నారు. వీరిలో చాలామంది తగిన శిక్షణ లేకున్నా ఆంగ్ల మాధ్యమంలో బోధిస్తున్న సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులే(ఎస్జీటీలే) అని విద్యాశాఖ పరిశీలనలో గుర్తించింది. హైస్కూళ్లలో స్కూల్ అసిస్టెంట్లు (ఎస్‌ఏ) ఆంగ్ల మాధ్యమంలో బోధిస్తున్నారు. విద్యాశాఖ ప్రాథమిక అంచనాల ప్రకారం.. 23 వేల మంది ఎస్జీటీలు, 27 వేల మంది స్కూల్ అసిస్టెంట్లు, మరో 5 వేల మంది భాషా పండితులు ఇంగ్లిష్‌లో పాఠాలు చెప్తున్నారు. ఆంగ్ల మాధ్యమంలో బోధించని వారితోపాటు ఇప్పటికే బోధిస్తున్నవారిలోనూ కొందరికి శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందని అధికారవర్గాలు గుర్తించాయి.
Comments
Please login to add a commentAdd a comment