టీచర్లకు శిక్షణ.. విద్యార్థులకు బ్రిడ్జి కోర్సులు | AP Government Take All Necessary Steps For English Medium | Sakshi
Sakshi News home page

టీచర్లకు శిక్షణ.. విద్యార్థులకు బ్రిడ్జి కోర్సులు

Published Fri, Dec 13 2019 8:33 AM | Last Updated on Fri, Dec 13 2019 8:33 AM

AP Government Take All Necessary Steps For English Medium - Sakshi

సాక్షి, అమరావతి :  వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 6వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో సన్నద్ధమవుతోంది. ఇంగ్లిష్‌ మీడియంలో బోధనకు వీలుగా టీచర్లకు సమగ్ర శిక్షణ ఇవ్వనుంది. విద్యార్థులకు బ్రిడ్జి కోర్సులను నిర్వహించనుంది. ప్రస్తుత విద్యాసంవత్సరంతో పాటు వేసవి సెలవుల్లోనూ ఈ కార్యక్రమాలను చేపట్టనున్నారు. ‘డైట్‌’ కేంద్రాల్లో ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ టీచింగ్‌ సెంటర్లు, జిల్లా ఇంగ్లిష్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తారు. ఆంగ్ల మాధ్యమంలో సమర్థంగా పాఠాలు బోధించేలా ఉపాధ్యాయులకు వివిధ దశల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు.

30 మంది కీ రిసోర్సు పర్సన్లు  
ఆంగ్ల మాధ్యమ బోధనలో టీచర్లకు శిక్షణ ఇవ్వడానికి నిపుణులతో మాడ్యూల్స్‌ తయారు చేయించారు. ఇంగ్లిష్‌ అండ్‌ ఫారిన్‌ లాంగ్వేజెస్‌ యూనివర్సిటీ, అన్నా యూనివర్సిటీ, ఆచార్య నాగార్జున వర్సిటీ, కేంద్రీయ విద్యాలయ సంఘటన్, అంబేద్కర్‌ యూనివర్సిటీ, జవహర్‌ నవోదయ విద్యాలయ్‌కు చెందిన బోధనా నిపుణులతో పక్షం రోజులపాటు దీనిపై కసరత్తు చేశారు. ఆంగ్ల మాధ్యమంలో విద్యాభ్యాసం చేసి, బోధనా వృత్తిలో ఉన్న 30 మందిని కీ రిసోర్సు పర్సన్లుగా ఎంపిక చేశారు. వారికి ఈ మాడ్యూల్స్‌ ఆధారంగా ఇప్పటికే శిక్షణ ఇచ్చారు.

260 మందితో స్టేట్‌ రిసోర్సు గ్రూపు 
రాష్ట్రంలో ప్రతి జిల్లా నుంచి 20 మంది చొప్పున 260 మంది టీచర్లను స్టేట్‌ రిసోర్సు గ్రూపుగా ఎంపిక చేసి, శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. వీరంతా కంప్యూటర్‌ ఆధారిత ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ ప్రొఫిషియన్సీ టెస్టులో ఉత్తమ ప్రతిభ కనబర్చినవారే. కీ రిసోర్సు పర్సన్లు, వివిధ వర్సిటీల నిపుణుల ఆధ్వర్యంలో వీరికి రెండు దశల్లో పది రోజుల పాటు శిక్షణ ఇస్తున్నారు. ఇలా శిక్షణ పొందిన వారు జిల్లా స్థాయిలోని రిసోర్సు గ్రూపులకు శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. మండలానికి నలుగురు చొప్పున దాదాపు 3,000 మందితో జిల్లా రిసోర్సు గ్రూపును ఎంపిక చేస్తున్నారు. కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీ సహకారంతో రూపొందించిన ప్రత్యేక టెస్టు ద్వారా వీరి ఎంపిక జరగనుంది. జిల్లాల వారీగా వీరికి జనవరి 21 నుంచి 25వ తేదీ వరకు స్టేట్‌ రిసోర్సు పర్సన్లు శిక్షణ ఇస్తారు. శిక్షణ అనంతరం వారి ప్రతిభాపాటవాలను ఆన్‌లైన్‌ అసెస్‌మెంట్‌ టెస్టు ద్వారా అంచనా వేస్తారు. సరైన ప్రమాణాలు లేని వారి స్థానంలో సమర్థులను తిరిగి ఎంపిక చేస్తారు.

నైపుణ్యాలు మెరుగుపడకపోతే మళ్లీ శిక్షణ  
ఆంగ్ల మాధ్యమంలో పాఠాలు బోధించడానికి వీలుగా టీచర్లలో ఆంగ్లంలో మాట్లాడే నైపుణ్యాలను, బోధనా నైపుణ్యాలను పెంపొందించనున్నారు. మండల స్థాయిలో 50 మంది చొప్పున టీచర్లకు ఫిబ్రవరి 20వ తేదీలోపు మూడు దశల్లో శిక్షణ ఇస్తారు. వరŠుచ్యవల్‌ తరగతులు కూడా ఉంటాయి. శిక్షణకు ముందు ఇంగ్లిష్‌ ప్రొఫిషియన్సీ టెస్టు నిర్వహిస్తారు. శిక్షణ అనంతరం కూడా ఇదే తరహా టెస్టు ఉంటుంది. బోధనా నైపుణ్యాలు పెరగని టీచర్లు మళ్లీ రెండో విడత శిక్షణ పొందాల్సి ఉంటుంది. శిక్షణలో నేర్చుకున్న నైపుణ్యాలను మరింత మెరుగుపర్చుకోవడానికి మొబైల్‌ యాప్‌లు, ఆన్‌లైన్‌ లింకులు, బోధనా మెటీరియల్‌ సైతం అందజేస్తారు. 

మాతృభాష తరహాలోనే... 
విద్యార్థులకు మాతృభాషలో సబ్జెక్టులను ఎలా బోధిస్తారో ఆంగ్ల మాధ్యమంలోనూ అలాగే బోధించేలా టీచర్లకు ఏప్రిల్‌లో రెండు దశల్లో శిక్షణ ఇస్తారు. ఆంగ్ల మాధ్యమ బోధనా విధానాలపై ప్రతినెలా స్కూల్‌ కాంప్లెక్సు సెంటర్లలో పునశ్చరణ తరగతులుంటాయి. ఈ సెంటర్లలో ఇంగ్లిష్‌ ల్యాబ్‌లు, కంప్యూటర్లు, ఎల్సీడీ ప్రొజెక్టర్లు, టీవీలు, గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement