15న కొత్త కేజీబీవీలు, యూఆర్‌ఎస్‌ల ప్రారంభం
డిప్యూటీ సీఎం కడియం వెల్లడి
ప్రభుత్వ స్కూళ్లలో ఈసారి 50 వేల మంది విద్యార్థులు పెరిగారు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 15న 84 కొత్త కేజీబీవీలు, 29 అర్బన్ రెసిడెన్షియల్ స్కూళ్లను (యూఆర్‌ఎస్) ఇంగ్లిష్ మీడియంలో ప్రారంభి స్తామని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలి పారు. ఈలోగా నియామకాలు పూర్తి చేస్తామన్నారు. పాఠశాల విద్యా కార్యక్రమాలపై గురువారం డీఈవోలతో సమీక్ష తర్వాత కడియం మీడియాతో మాట్లాడారు. జిల్లాల్లో కలెక్టర్లు, డీఈవోలు అమలు చేస్తున్న ఉత్తమ పద్ధతులను అన్ని జిల్లాల్లో అమలు చేసేలా వచ్చే నెలలో 3 రోజులపాటు డీఈవోలకు వర్క్‌షాప్ నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలలను పటిష్టం చేసి సర్కారు ప్రతిష్టను పెంచేలా డీఈవోలు పని చేయాలన్నారు.
ఒకటో తరగతిలో ఈసారి విద్యార్థుల సంఖ్య గతేడాదికన్నా 50 వేలు తగ్గిం దని, మొత్తంగా చూస్తే గతేడాదికన్నా ఈసారి ప్రభుత్వ పాఠశాలల్లో 50 వేల మంది విద్యార్థులు పెరిగారన్నారు. కొత్తగా 525 ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్లు ఇంగ్లిష్ మీడియంలో రావడం వల్ల పాఠశాలల నుంచి గురుకులాలకు వెళ్తున్నారన్నారు. తరగతి గదిలో సెల్ ఫోన్లను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేదిలేదన్నారు. పదో తరగతి ఫలితాలను పెంచేందుకు వచ్చే నెల 10వ తేదీ తరువాత ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లలో అదనంగా 2 గంటలపాటు ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు.
ఈ సారి జూన్ కంటే ముందే 95% పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు అందించామన్నారు. యూనిఫా రాల బట్ట అన్ని స్కూళ్లకు సరఫరా అయిందని, వాటిని కుట్టించే పని కూడా 80% పూర్తయిందన్నారు. ఈ నెలాఖరుకల్లా మొత్తం పూర్తవుతుందన్నారు. ఒక్క విద్యార్థి కూడా చేరని స్కూళ్లు ఉన్నప్పటికీ, ఈసారి ఒక్క పాఠశాలనూ మూసివేయలేదన్నారు. సమావేశంలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, ఇన్‌చార్జి కమిషనర్ విజయ్ కుమార్ పాల్గొన్నారు.