సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు 2022–23లో అదనంగా 20 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలను (కేజీబీవీ) కేటాయించినందుకు ప్రధాని నరేంద్రమోదీకి కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖల మంత్రి జి.కిషన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న 4,982 కేజీబీవీల్లో 696 అంటే దాదాపు 15 శాతం విద్యాలయాలు రాష్ట్రంలోనే ఉన్నాయని ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు కలిపి మొత్తం 31 కేజీబీవీలను కేటాయిస్తే అందులో రాష్ట్రానికి 20 కేటాయించారన్నారు.
నాలుగేళ్లలోనే కేంద్రం తెలంగాణకు 104 నూతన కేజీబీవీలను కేటాయించిందని చెప్పారు. దేశంలోని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ సామాజిక వర్గాలకు, మైనారిటీలకు, దారిద్య్రరేఖకు దిగువనున్న, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలకు సంబంధించిన ఆడ పిల్లలకు మంచి విద్యను అందించాలన్న ఉద్దేశంతో దేశవ్యాప్తంగా ఈ విద్యాలయాలను ఏర్పాటు చేశారని కిషన్‌రెడ్డి వివరించారు. బడుగు బలహీన, అణగారిన వర్గాల పిల్లలను ఒకేచోట చేర్చి వారి మధ్య సమానత్వ భావనను పెంపొందించడం వీటి ఉద్దేశమని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment