సాక్షి, హైదరాబాద్, కూకట్‌పల్లి: ప్రధాని మోదీ హైదరాబాద్ నగరానికి చేసిందేమీ లేదని.. కులమతాల పేరిట దేశాన్ని రావణకాష్టంగా మార్చారని మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. నగరాన్ని తాము అభివృద్ధి చేస్తామన్నా కేంద్ర ప్రభుత్వం అడుగడుగునా అడ్డు పడుతోందని విమర్శించారు. జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో రూ. 86 కోట్లతో నిర్మించిన కైతలాపూర్ ఆర్‌ఓబీకి మంగళవారం ఆయన ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రధానిపై, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. త్వరలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నగరంలో జరగనున్న సందర్భంగా ప్రధాని మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు వస్తుండటాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రశ్నలు సంధించారు.
గుజరాత్‌లో వరదలొస్తే ఆగమేఘాల మీద వెయ్యికోట్లు ఇచ్చిన ప్రధాని.. గత ఏడాది హైదరాబాద్‌లో భారీ వర్షాలతో తీవ్ర నష్టం వాటిల్లినా వెయ్యి పైసలు కూడా సహాయం చేయలేదని విమర్శించారు. మిషన్ భగీరథ కార్యక్రమానికి రూ. 19వేల కోట్లివ్వాల్సిందిగా నీతిఆయోగ్ చెప్పినా ఇవ్వలేదని, అరపైసా సాయం చేయలేదన్నారు. 2022 కల్లా దేశంలో ప్రతిఒక్కరికీ ఇల్లు, ఇంటింటికీ నల్లా, ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు, తదితర హామీలన్నీ డొల్లమాటలేనని ఎద్దేవా చేశారు. జన్‌ధన్ ఖాతాలో అందరికీ రూ.15 లక్షలు వేస్తానని హామీ ఇస్తే నమ్మి.. బిహార్‌లో బ్యాంకు తప్పిదం వల్ల తన అకౌంట్‌లో రూ. 6 లక్షలు పడితే అవి మోదీ ఇచ్చినవేనని దాస్ అనే అమాయకుడు నమ్ముతున్నారని ప్రస్తావించారు. ఇంధనంపై ప్రత్యేక సెస్సుల వల్ల రాష్ట్రానికి రూ.26 లక్షల భారం వేశారన్నారు.
మంత్రి కేటీఆర్ ప్రసంగం సాగిందిలా..
జుమ్లాలు.. ఉత్తమాటలు..
‘ప్రధానమంత్రి గారూ.. మీరు గుజరాత్‌లో రూ. 20వేల కోట్ల పనులకు శంకుస్థాపన అంటారు. ఇంకోచోటుకు వెళ్లి వేల కోట్లతో కార్యక్రమాలు ప్రకటిస్తారు. అది నిజమో, అబద్ధమో నాకు తెలియదు. ఎందుకంటే మీరిప్పటిదాకా చెప్పిన చాలా మాటలు జుమ్లాలు, ఉత్త మాటలు తప్ప అందులో నిజం ఉండదు. దేశాన్ని రామరాజ్యం చేస్తామని చెప్పి కులాలమధ్య, మతాల మధ్య పంచాయితీ పెట్టి రావణకాష్టం చేస్తున్నారు. ఏ ఒక్క వర్గమూ సంతోషంగా లేదు.
ఓవైపు అగ్నిపథ్ తెచ్చి యువత పొట్ట కొడుతున్నారు. ఈ పథకంవల్ల భవిష్యత్ బ్రహ్మాండంగా ఉంటుందని కిషన్‌రెడ్డి చెబుతున్నారు. బట్టలుతకడం, హేర్‌కటింగ్, ఎలక్ట్రిషియన్, డ్రైవర్ పనులు చేసేందుకు మిలిటరీలో చేరాలా అని ఆందోళన చేస్తున్న యువకులను దేశద్రోహులని అవమానిస్తున్నారు. గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను నోటికొచ్చినట్లు తిట్టారు. అసమర్థ ప్రభుత్వమంటూ తూర్పారబట్టారు.. అప్పుడు రూ.400 ఉన్న సిలిండర్ ఇప్పుడు రూ.1050 అయింది. ఎవరు అసమర్థులు.. ఎవరు దద్దమ్మ.. ఎవరు చేతకాని వారు.. ఎవరు దిగిపోవాలి? చెబుతారా మోదీగారూ.. హైదరాబాద్‌లో చెప్పే దమ్ముందా’ అని కేటీఆర్ ప్రశ్నించారు.
మనలో మనకు తాకట్లు పెడుతూ..
- అప్పట్లో యాభై రోజుల్లో దేశాన్ని ప్రజలు కోరుకున్న విధంగా చేయకపోతే ఏ శిక్షవేసినా సిద్ధమన్నారు. 500 రోజులు దాటినా జరిగిందేమిటి? బయట పడుతుందన్న నల్లధనం ఏదంటే తెల్లముఖం వేస్తున్నారు. ఒక్క సమస్యను పరిష్కరించే తెలివి లేదు. వివిధ పథకాల పేరిట వివిధ వర్గాలతో ఆడుకున్నారు.
- హామీల గురించి గట్టిగా అడిగితే హిందుస్తాన్, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్. హిందూ, ముస్లిం, వంటి మాటలు. ఎంతసేపూ బంగ్లాదేశ్, పాకిస్తాన్‌లతో పోలికే. మనలో మనకు తాకట్లు పెట్టే ఆలోచన తప్ప దేశాన్ని సవ్యమైన దారిలో నడుపుదామని ఉండదు. రక్షణరంగ భూములడిగితే స్పందన ఉండదు.
- ప్రజలందరినీ కడుపులో పెట్టుకొని చూసుకునే నాయకుడు కేసీఆర్ రూపంలో మాకున్నాడు. హైదరాబాద్‌ను ఎలా అభివృద్ధి చేసుకున్నామో, దేశాన్ని కూడా అలాగే చేసుకుంటూ పోతాం. టూరిస్టులు వస్తారు. మాట్లాడతారు. పోతారు. కానీ వచ్చినవారు బరాబర్ సమాధానం చెప్పాల్సిందేనన్నారు.
- ప్రధానినుద్దేశించి మాట్లాడుతూ, ఎనిమిదేళ్లలో తెలంగాణకు ఏమిచ్చినవ్.. ఏ ముఖం పెట్టుకొని వస్తున్నావ్ తెలంగాణకు. సొల్లు పురాణం చెప్పి కేసీఆర్ మీద బట్ట కాల్చి మీదవేసి ఏవో నాలుగు డైలాగులు కొడతాననుకుంటే ఇక్కడి ప్రజలు పిచ్చివాళ్లు కాదు. తప్పకుండా నిలదీసి అడిగే రోజులు కూడా వస్తాయ’న్నారు. కార్యక్రమంలో కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు వివేక్, మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీలు సురభి వాణీదేవి, నవీన్‌కుమార్, శంభీపూర్ రాజు, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతారెడ్డి, ఐటీ కార్పొరేషన్ చైర్మన్ జగన్, గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్, కూకట్‌పల్లి నియోజకవర్గ కోఆర్డినేటర్ సతీష్ అరోరా, మేడ్చల్ కలెక్టర్ హరీష్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేష్‌కుమార్, జోనల్ కమిషనర్ మమత పాల్గొన్నారు.
దమ్ముంటే నాపై కేసు పెట్టు.. కిషన్‌రెడ్డికి సవాల్
ప్రజల సదుపాయార్థం ఐడీపీఎల్ భూముల్లో రోడ్డు వేస్తే కేసు పెట్టాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చెప్పారని ప్రస్తావిస్తూ.. ‘నగరానికి పైసా పనిచేయని వారు మేం పనిచేస్తుంటే కేసులు పెట్టాల్సిందిగా ఆదేశాలిస్తున్నారట.. నీకు దమ్ముంటే, చేతనైతే , కేసు పెట్టాల్సి వస్తే మున్సిపల్ మంత్రిగా నామీద పెట్టు. ప్రభుత్వం మీద పెట్టు. అంతేగాని ఇంజినీర్లు, పొట్టకూటి కోసం పనిచేసే కార్మికులపై కాదన్నారు. కేంద్రప్రభుత్వంలో మీకు పలుకుబడి ఉంటే కంటోన్మెంట్‌లో లేదా కరీంనగర్, రామగుండం, ఆదిలాబాద్ మార్గాల్లో రక్షణ భూములు మాకు అప్పగిస్తే నగరంలో మాదిరే అద్భుతంగాస్కైవేలు, ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, ఆర్‌ఓబీలు, ఆర్‌యూబీలు నిర్మిస్తాం. దేశంలోనే హైదరాబాద్ అంటే మంచి మౌలిక వసతులున్న నగరంగా తీర్చిదిద్దే బాధ్యత మాది. వీటికి చేతనైతే సహాయం చేయండి లేదా కనీసం అడ్డం రాకండి. కేంద్రం సహకరించకపోయినా సుచిత్ర , కొంపల్లి, దూలపల్లి ప్రాంతాలను కూడా అభివృద్ధి చేస్తాం’ అని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
(చదవండి: చూసి నేర్చుకుంటున్నారు! పిల్లల మత్తుకు పెద్దలే కారణం)
Comments
Please login to add a commentAdd a comment