సమావేశంలో మాట్లాడుతున్న బండి సంజయ్. చిత్రంలో విజయశాంతి, ఈటల, కిషన్‌రెడ్డి, తరుణ్‌చుగ్, డీకే అరుణ, లక్ష్మణ్ తదితరులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అధికార సాధనే లక్ష్యంగా బీజేపీ ఎన్నికల శంఖారావాన్ని పూరించింది. వచ్చే ఎన్నికల్లో 90 సీట్లలో విజయం సాధించేలా ‘మిషన్–90’ కార్యాచరణ ప్రణాళికకు ఆమోదముద్ర వేసింది. రాష్ట్రంలోని 80 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీకి బలమైన నాయకులు ఉన్నారనే అంచనాకు వచ్చిన జాతీయ నాయకత్వం.. మిగతా 40 చోట్ల గెలవగలిగే అభ్యర్థులను అన్వేషించాలని రాష్ట్ర పార్టీని ఆదేశించింది.
రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ స్థానానికి ఒక్కో ప్రభారీ, కన్వీనర్, పాలక్, విస్తారక్‌లను (మొత్తం నలుగురు) నియమించింది. గురువారం శామీర్‌పేటలోని ఓ రిసార్ట్స్‌లో బీజేపీ లోక్ సభ విస్తారక్‌ల శిక్షణ శిబిరానికి హాజరైన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) బీఎల్ సంతోష్.. రాష్ట్ర నేతలతో విడిగా భేటీ అయ్యారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రత్యే కంగా రూపొందించిన ‘ఎలక్షన్ కేలండర్’ అమలుపై దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా మిషన్–90 లోగోను సంతోష్ ఆవిష్కరించారు. రాష్ట్ర పార్టీ ముఖ్య నేతలతో సంతోష్‌తోపాటు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు తరుణ్ ఛుగ్, సునీల్ బన్సల్, వినోద్ తావ్డే, సహ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) శివప్రకాష్, ఇతర దూతలు విడతల వారీగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో పకడ్బందీగా అనుసరించాల్సిన ఎన్నికల వ్యూహాలపై సూచనలు చేశారు.
పాలక్‌లుగా కిషన్‌రెడ్డి, లక్ష్మణ్, డీకే అరుణ
ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జాతీయ, రాష్ట్ర స్థాయి ముఖ్యనేతలను 119 నియోజకవర్గాల్లో పాలక్‌లుగా నియమించారు. శేరిలింగంపల్లికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, మేడ్చల్‌కు పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె.లక్ష్మణ్, కుత్బుల్లాపూర్–డీకే అరుణ, సికింద్రాబాద్ కంటోన్మెంట్ –నల్లు ఇంద్రసేనారెడ్డి, పటాన్‌చెరు–మురళీధర్‌రావు, వరంగల్ తూర్పు– ఈటల రాజేందర్, మెదక్–ధర్మపురి అర్వింద్, చేవెళ్ల–ఏపీ జితేందర్‌రెడ్డి, జుక్కల్–జి.వివేక్ వెంకటస్వామి, నకిరేకల్–ఎ.చంద్రశేఖర్,
కొల్లాపూర్–పేరాల శేఖర్‌రావు, నల్లగొండ–గరికపాటి మోహన్‌రావు, పాలకుర్తి–బూరనర్సయ్యగౌడ్, ఎల్లారెడ్డి–రఘునందన్‌రావు, జూబ్లీహిల్స్–కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మహబూబ్‌నగర్–కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, పరిగి–విజయశాంతి, ములుగు–సోయం బాపురావు, వైరా–ఎం.రవీంద్రనాయక్, ఎల్లారెడ్డి–గూడూరు నారాయణరెడ్డి, మహేశ్వరం–పొంగులేటి సుధాకరరెడ్డి, మునుగోడు–చాడ సురేశ్‌రెడ్డి, రాజేంద్రనగర్–మర్రి శశిధర్‌రెడ్డి, కల్వకుర్తికి ఎన్.రామచంద్రరావులను పాలక్‌లుగా నియమించారు. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల్లోనూ పర్యవేక్షణ కోసం ప్రభారీ, కన్వీనర్లను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ నియమించారు.
కొత్త ఉత్సాహంతో ముందుకు: సంజయ్
పార్టీలో వివిధ కమిటీలను ఏర్పాటు చేసుకుని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ చెప్పారు. శామీర్‌పేటలోని ఓ రిసార్ట్స్ గురువారం రాత్రి వరకు హైకమాండ్ నేతలతో జరిగిన సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘అసెంబ్లీ స్థానాల వారీగా బీజేపీని సంస్థాగతంగా శక్తివంతం చేశాం.
కేంద్ర నాయకుల మార్గదర్శకత్వం, సూచనలతో పార్టీ నేతల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే. మా మిషన్–90 అంటే 90 స్థానాలు కచ్చితంగా గెలుస్తాం. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. నేను వచ్చే నెల 16వ తేదీ నుంచి రోజుకు 2, 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటిస్తా..’’ అని సంజయ్ తెలిపారు.
ఆ నలుగురి బాధ్యతలు ఇలా..
విస్తారక్: పూర్తి సమయాన్ని పార్టీ కోసం కేటాయించే నేత. కేటాయించిన నియోజకవర్గానికి చెందినవారు కాకుండా ఇతర ప్రాంతానికి చెందినవారు ఉంటారు. ఎన్నికలు పూర్తయ్యేదాకా అక్కడే ఉండాలి.
కన్వీనర్: నెలలో కనీసం 20 రోజులు పార్టీకి పూర్తి సమయమిచ్చి కేటాయించిన ప్రాంతంలో ఉండాలి. కన్వీనర్లుగా స్థానికులే ఉంటారు.
ప్రభారీ (ఇన్‌చార్జి): నెలకు కనీసం పది రోజులు ఆ నియోజకవర్గంలో పనిచేయాలి. పూర్తిసమయం కేటాయించి పార్టీ అప్పగించిన పనులు పూర్తిచేయాలి.
పాలక్: పార్టీ అభ్యర్థులను గెలిపించే బాధ్యతలను చూసుకోవాలి. రాజకీయ సలహాలు ఇవ్వడంతోపాటు ఆయా నియోజకవర్గాల్లోని అన్నిరకాల వనరుల సమీకరణ, కార్యక్రమాల నిర్వహణ అన్నింటినీ పర్యవేక్షించాలి. తమకు కేటాయించిన సీట్లలో ఎన్నికలు ముగిసేదాకా ప్రతీనెలా 3 రోజుల పాటు పూర్తిసమయం పనిచేయాలి. పార్టీ విస్తరణ కోసం కృషిచేయాలి. మొత్తంగా కేటాయించిన నియోజకవర్గాల్లో పార్టీ తీరును పూర్తిస్థాయిలో పర్యవేక్షించాలి.
ఫిబ్రవరిలో రాష్ట్రానికి ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరిలో రాష్ట్రంలో పర్యటించనున్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల పరిధిలోని పోలింగ్ బూత్ కమిటీలు, సభ్యులను ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి దిశానిర్దేశం చేయనున్నారు. దీనికి సంబంధించి ఫిబ్రవరి 14న లేదా 15న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లోగానీ, మరోచోటగానీ కార్యక్రమం జరిగే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి.
8 నెలల్లోనే ఎన్నికలు రావొచ్చు...
‘‘రాష్ట్రంలో రాబోయే 8 నెలల్లో ఎన్నికలు రావచ్చు. బూత్ కమిటీల ఏర్పాటుపై ఫోకస్ పెట్టండి. పార్టీ సంస్థాగత నిర్మాణం చేపట్టండి. ముఖ్యనేతలంతా నియోజకవర్గాల్లో పర్యటించి కార్నర్ మీటింగులు పెట్టాలి. ప్రతి నియోజకవర్గంలో పార్టీ కార్యాలయాలు ప్రారంభించాలి. వచ్చే మూడు నెలలకు ఉద్యమ కార్యాచరణ సిద్ధం చేసుకోవాలి. వారానికోసారి మండలం, 15 రోజులకోసారి జిల్లా, నెలకోసారి రాష్ట్రస్థాయిలో సమావేశమై కార్యక్రమాలకు రూపకల్పన చేయాలి. ప్రజా సమస్యలపై పోరాటాలు చేపట్టాలి’’ అని పార్టీ నేతలకు బీఎల్ సంతోష్ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment