సాక్షి, హైదరాబాద్: బీజేపీపై సామాజిక మాధ్యమా ల్లో కుట్రపూరితంగా విష ప్రచారం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కలసి ఒక పథ కం ప్రకారం చేస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రజలె వరూ నమ్మవద్దని కోరారు. కాంగ్రెస్ ఓటేస్తే బీఆర్‌ఎస్‌కు, బీఆర్‌ఎస్‌కు వేస్తే కాంగ్రెస్‌కు వేసినట్టే అనే విషయాన్ని ప్రజలు గ్రహించాలన్నారు.
కుటుంబ పాలన పోవాలని ప్రధాని మోదీ అనేక సభల్లో స్ప ష్టం చేశారని, కల్వకుంట్ల కుటుంబానికి వ్యతిరేకంగా పోరాడాలని అమిత్‌షా పిలుపునిచ్చారని, బండి సంజయ్ సహా బీజేపీ నాయకులంతా ఈ దిశలో పోరాటం సాగిస్తున్నారని వివరించారు. కల్వకుంట్ల కుటుంబ, అవినీతి పాలనకు చరమగీతం పాడి బీజేపీ ప్రభుత్వాన్ని తీసుకురావడమే లక్ష్యంగా తామంతా కలసి పనిచేస్తామని చెప్పారు.
గురువారం హైదరాబాద్‌లో ఎంపీ బండి సంజయ్, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, ఇతర నేతలతో కలసి కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. గతంలో కాంగ్రెస్–టీఆర్‌ఎస్ పొత్తు తో పోటీ చేశాయని, కేంద్ర, రాష్ట్ర మంత్రివర్గా ల్లోనూ భాగస్వామ్యం అయ్యాయని గుర్తుచేశారు.
గత ఎన్నికల్లో కాంగ్రెస్ గుర్తుపై గెలిచిన మెజారిటీ ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌లో చేరి మంత్రి పదవుల్లోనూ ఉన్నారని చెప్పారు. బీజేపీ గతంలో ఎప్పుడూ బీఆర్‌ఎస్‌తోగానీ, కాంగ్రెస్‌తోగానీ పొత్తు పెట్టుకోలేదని.. భవిష్యత్‌లోనూ ఆ పార్టీలతో కలిసి సాగే అవకాశం లేదని స్పష్టం చేశారు.
దోపిడీయే తెలంగాణ మోడలా?
‘‘తెలంగాణ మోడల్ అంటే కుటుంబ పాలనా? కొడుకు, అల్లుడు, బిడ్డకు మరికొన్ని రాష్ట్రాలు ఇవ్వాలని అనుకుంటున్నారు. ఇది తెలంగాణ మోడలా? తొమ్మిదేళ్లు సచివాలయానికి రాకపోవడం, తొలి కేబినెట్లో మహిళలకు అవకాశం ఇవ్వకపోవడం, వేల కోట్లు దోచుకోవడం.. ఇదా తెలంగాణ మోడల్? కీలక మంత్రిత్వ శాఖలన్నీ కల్వకుంట్ల కుటుంబం చేతిలో ఉండటం తెలంగాణ మోడలా?’’ అని ప్రశ్నించారు.
కేసీఆర్ దేశంలోని కుటుంబ పార్టీలన్నింటికీ డబ్బులు ఇస్తానన్నారని.. అంటే రాష్ట్రంలో అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఏ వ్యాపారం చేయాలన్నా బీఆర్‌ఎస్ నేతలు వాటాలు అడుగుతున్నారని, భూముల నుంచి దందాల దాకా అన్ని రకాల మాఫియాలు వారివేనని ఆరోపించారు. బండి సంజయ్ నేతృత్వంలో ఇటీవల బీజేపీ మంచి ఫలితాలు సాధించిందని చెప్పారు. ఈ నెల 8న మోదీ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
పార్టీకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టొద్దు
కిషన్‌రెడ్డితో నాకు ఎంతో సాన్నిహిత్యం ఉంది: బండి సంజయ్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డికి హృదయ పూర్వకంగా అభినందనలు తెలుపుతున్నానని ఎంపీ బండి సంజయ్ చెప్పారు. మొదటి నుంచీ పార్టీ కోసం కమిట్మెంట్‌తో కష్టపడి పనిచేసిన నాయకుడు కిషన్‌రెడ్డి అని, కింది స్థాయి నుండి పైస్థాయి వరకు అనేక బాధ్యతలు నిర్వహించారని.. ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణ ఏర్పడ్డాక కూడా పార్టీని శక్తివంతంగా తయారు చేశారని పేర్కొన్నారు.
పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లుకు బీజేపీ మద్దతు తెలపడంతో కిషన్‌రెడ్డి క్రియాశీల పాత్ర పోషించారని.. తమ మధ్య ఎంతో సాన్నిహిత్యం ఉందని తెలిపారు. ఆయన నాయకత్వంలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తామన్నారు.
తనకు, కిషన్‌రెడ్డికి వ్యతిరేకంగా, బీజేపీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తన మీద అభిమానంతోనో, కోపంతోనో పార్టీకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం ముమ్మాటికీ ద్రోహం అవుతుందని.. దయచేసి అలాంటి వాటికి అడ్డుకట్ట వేయాలని కోరుతున్నానని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment