సాక్షి, హైదరాబాద్: అసంతృప్త నేతలపై బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మండిపడ్డారు. కిషన్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ వేదికపైనే సంజయ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఢిల్లీ వెళ్లి ఫిర్యాదులు చేయడం ఆపాలన్న సంజయ్.. కనీసం కిషన్‌రెడ్డినైనా స్వేచ్ఛగా పనిచేసుకోనివ్వండి అంటూ హితవు పలికారు.
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వేదికపై బండి సంజయ్ మాట్లాడుతూ, మూర్ఖత్వ, కుటుంబ, నియంత పాలనకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కిషన్ రెడ్డి నిన్ననే యుద్ధం ప్రారంభించారు. కేసీఆర్.. గత ఎన్నికల సందర్భంగా డబుల్ ఇండ్లు ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశాడు. దీనిపై ప్రశ్నించేందుకు కిషన్ రెడ్డి బాట సింగారం వెళ్తుంటే అడ్డుకుని అరెస్టు చేశారు. కేసీఆర్ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు’’ అని సంజయ్ వ్యాఖ్యానించారు.
గత ఎన్నికల హామీలను కేసీఆర్ నిలబెట్టుకునే వరకు బీజేపీ కార్యకర్తలు విడిచిపెట్టరు. ముఖ్యమంత్రి ఫాంహౌజ్, ప్రగతిభవన్‌లో పడుకున్నాడు. సచివాలయం నీళ్లలో మునిగిపోతున్నా పట్టించుకోవడం లేదు. కిషన్ రెడ్డి అధ్యక్షత బాధ్యతలు తీసుకుంటున్నాడని ఫస్ట్ పేజీలో వస్తుందని భావించి దాన్ని డైవర్ట్ చేసేందుకు పీఆర్సీ అంటూ చెబుతున్నాడు. ఎన్నికలు సమీపిస్తున్నాయ్ కదా.. అందుకే.. కేసీఆర్ నటించడం కాదు.. జీవిస్తున్నాడు. ఇవ్వాళ కేసీఆర్.. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని కాంగ్రెస్‌తో ప్రచారం చేయిస్తున్నాడు’’ అంటూ బండి సంజయ్ దుయ్యబట్టారు.
చదవండి: బీఆర్‌ఎస్‌కు షాక్.. కాంగ్రెస్‌లో చేరిన కీలక నేతలు
‘‘కాంగ్రెస్ పార్టీకి సిగ్గుండాలి. ఢిల్లీకి వెళ్లి హైకమాండ్‌కు ఫిర్యాదులు చేయడం ఇకనైనా ఆపేయాలి. నేను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ప్రతి నాయకుడు, కార్యకర్త నాకు సహకరించారు. చాలా కష్టపడి పనిచేశాననే తృప్తి నాకుంది.. అది చాలు. నయా నిజాం పాలనను అంతమొందించాలి. కార్యకర్తలను కాపాడుకోవాలి. నేను అధ్యక్షుడిని అయ్యాక చాలా మంది కార్యకర్తలు లాఠీ దెబ్బలు తిన్నారు. నాన్ బెయిలబుల్ కేసులు వారిపై ఉన్నాయి. జైలుకు పంపించారు. వారు నిజమైన హీరోలు’’ అని బండి సంజయ్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment