మోదీ కేబినెట్‌లో రాష్ట్రం నుంచి కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లకు చాన్స్
వరుసగా రెండోసారి కేబినెట్ మంత్రిగా కిషన్‌రెడ్డి
నాలుగుసార్లు రాష్ట్ర అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా కలసివచ్చిన అనుభవం
దూకుడుతో పార్టీని బలోపేతం చేసిన బండి సంజయ్‌కు సహాయ మంత్రి పదవి
సాక్షి, హైదరాబాద్/సాక్షి, న్యూఢిల్లీ: పార్టీ పట్ల విశ్వాసం, విధేయతే గీటురాయిగా తెలంగాణ నుంచి ఇద్దరు బీజేపీ ఎంపీలకు కేంద్ర మంత్రులుగా చాన్స్ దక్కింది. జి.కిషన్‌రెడ్డి కేబినెట్ మంత్రిగా, బండి సంజయ్ సహాయ మంత్రిగా నియమితుల య్యారు. ఇందులో కిషన్‌రెడ్డి రాష్ట్ర రాజధానిలోని సికింద్రాబాద్ నుంచి గెలవగా.. సంజయ్ ఉత్తర తెలంగాణలోని కరీంనగర్ నుంచి విజయం సాధించారు. ఇద్దరూ కూడా తమ నియోజకవర్గాల్లో వరుసగా రెండోసారి ఎంపీగా గెలిచినవారే. మోదీ మూడో కేబినెట్‌లో రాష్ట్రం నుంచి ఇద్దరికి అవకాశం లభించడం పట్ల బీజేపీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలో పట్టుసాధించడంతో..
2019లో బీజేపీ తెలంగాణలో 4 ఎంపీ సీట్లను గెలుచుకున్న విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రం నుంచి కిషన్‌రెడ్డికి తొలుత కేంద్ర సహాయ మంత్రిగా పదవి వరించింది. తర్వాత కేంద్ర కేబినెట్ మంత్రిగా ప్రమోషన్ అందింది. తాజా లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు గెలిచారు. వీరిలో కిషన్‌రెడ్డి, సంజయ్, ధర్మపురి అర్వింద్, కొండా విశ్వేశ్వ ర్‌రెడ్డి, గోడెం నగేశ్ రెండోసారి ఎంపీలుగా గెలవగా.. డీకే అరుణ, ఈటల రాజేందర్, ఎం.రఘునందన్‌రావు తొలిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు.\
కేంద్ర కేబినెట్‌లో చోటు కోసం కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్. డీకే అరుణ మధ్య పోటీ నెలకొంది. మిగతా వారు కూడా పదవిపై ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో బీజేపీ జాతీయ నాయకత్వం గట్టి కసరత్తే చేసింది. పార్టీకి ముందు నుంచీ విధేయులుగా ఉండటం, రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడంలో కిషన్‌రెడ్డి, సంజయ్‌ల కృషి దోహదపడటాన్ని పరిగణనలోకి తీసుకుంది.
అనుభవం, సీనియారిటీతో..
కిషన్‌రెడ్డి నాలుగు సార్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా సేవలు అందించారు. గత కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. కరోనా టైంలో కేంద్రమంత్రిగా ఢిల్లీ కేంద్రంగా కంట్రోల్ రూంలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. అధిష్టానానికి నమ్మిన బంటుగా ఉ న్నారు. కేంద్రమంత్రిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ.. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో, లోక్‌సభ ఎన్నికల్లో పార్టీకి సీట్లు పెరగడానికి కృషి చేశారు. ఈ అంశాలన్నీ కలసివచ్చి కిషన్‌రెడ్డిని మరోసారి కేంద్ర కేబినెట్ మంత్రి పదవి వరించింది.
దూకుడుగా పార్టీ బలోపేతంతో..
2019లో కరీంనగర్ ఎంపీగా సంచలన విజయం సాధించిన బండి సంజయ్.. పార్టీ రాష్ట్ర అధ్యక్షు డిగా నియామకమైన తర్వాత దూకుడుగా వ్యవహ రించారు. అప్పట్లో అధికార బీఆర్‌ఎస్‌ను, కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పెట్టేలా పోరాటాలు చేశారు. పార్టీపై తనదైన ముద్ర వేశారు. పలుమార్లు మోదీ, అమిత్ షాలతో శభాష్ అనిపించుకున్నారు. రాష్ట్రంలో బీజేపీ ఇంత బలోపేతం కావడానికి బండి సంజయ్ కూడా కారణమని ఆ పార్టీ శ్రేణులు చెప్తుంటాయి. దీనికితోడు తొలి నుంచీ ఆర్‌ఎస్‌ఎస్‌లో కొనసాగడం, పార్టీ పట్ల విధేయత వంటివి కూడా బండి సంజయ్‌కు కలసివచ్చాయి. కేంద్ర మంత్రిగా అవకాశం దక్కింది.
ఏపీ నుంచి ముగ్గురికి..
ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు ఎంపీలకు కేంద్ర మంత్రి పదవులు దక్కాయి. ఎన్డీయే కూటమిలోని పొత్తు మేరకు ఇద్దరు టీడీపీ ఎంపీలకు అవకాశం వచ్చింది. ఇందులో మూడు సార్లు ఎంపీగా గెలిచిన రామ్మోహన్‌నాయుడు, తొలిసారి గెలిచిన పెమ్మ సాని ఉన్నారు. ఇక బీజేపీ ఎంపీ శ్రీనివాసవర్మకు కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కింది. 1991 నుంచీ పార్టీలో పనిచేస్తున్న ఆయన సీనియారిటీ, విధేయతను దృష్టిలో పెట్టుకొని అవకాశం ఇచ్చారు. మొత్తంగా ఈసారి తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురికి కేంద్ర మంత్రి పదవులు లభించడం గమనార్హం.
ఉదయం ఫోన్‌లు.. మధ్యాహ్నం తేనీటి విందు..
ఆదివారం ఉదయం పది గంటల నుంచే మంత్రులుగా ఎంపికైన ఎంపీలకు ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి ఫోన్లు వెళ్లాయి. మధ్యాహ్నం నుంచే అందుబాటులో ఉండాలని ఆ ఎంపీలకు సమాచారం ఇచ్చారు. లోక్ కల్యాణ్ మార్గ్‌లోని ప్రధాని నివాసంలో భేటీకి రావాలని సూచించారు. దీంతో కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ఇతర ఎంపీలు అక్కడికి చేరుకున్నారు. కేంద్ర మంత్రులుగా ఎంపికైన అందరినీ ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా అభినందించారు.
మధ్యాహ్నం పన్నెండున్నర గంటల సమయంలో ప్రధాని తేనీటి విందు ఇచ్చారు. తర్వాత పలు అంశాలపై మార్గనిర్దేశం చేశారు. ‘వికసిత్ భారత్’ లక్ష్యంగా పనిచేయాలని, 100 రోజుల ఎజెండాను అమలు చేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని సూచించారు. తర్వాత అంతా రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్లారు.
హిందీలో ప్రమాణ స్వీకారం
కేంద్ర మంత్రులుగా కిషన్‌రెడ్డి, బండి సంజయ్ ఇద్దరూ హిందీలో ఈశ్వరుని సాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరు ప్రమాణం చేస్తున్న సమయంలో కార్యక్రమానికి హాజ రైన కార్యకర్తలు ‘జై శ్రీరామ్’ అంటూ పెద్దపె ట్టున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రం నుంచి ఎంపీలు డీకే అరుణ, గోడెం నగేశ్, ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, రఘునందన్‌రావుతో పాటు బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment