బైరెడ్డిపల్లిలోని కస్తూర్బాగాంధీ విద్యాలయం
గ్రామీణ నేపథ్యం, పేదరికం, అనాథలుగా మారడం, తదితర కారణాలతో పాఠశాలలను మధ్యలో మానేసిన బాలికలను అక్కున చేర్చుకుని విద్యాబుద్ధులు నేర్పిస్తున్నాయి కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు. విద్యతో పాటు క్రీడలు, యోగా, కంప్యూటర్ తదితర అంశాలలోనూ శిక్షణ నిస్తున్నాయి. విద్యార్థినులు 6వ తరగతిలో ఈ పాఠశాలల్లో చేరితే పైసా ఖర్చు లేకుండా ఇంటర్ విద్యను పూర్తి చేసుకోవచ్చు.
మదనపల్లె సిటీ: పేద విద్యార్థినుల జీవితాల్లో కేజీబీవీలు వెలుగునింపుతున్నాయి. జిల్లాలో 20 కేజీబీవీలు ఉన్నాయి. ప్రతి పాఠశాలలో 200 మంది విద్యార్థినులకు అవకాశం ఉంది. ఈ విద్యా సంవత్సరం నుంచి జిల్లాలో గంగవరం, రామకుప్పం మండలాల్లో ఉన్న కస్తూర్బా విద్యాలయాల్లో ఇంటర్ విద్యను కూడా ప్రవేశపెట్టారు.
అద్భుతం..దినచర్య
ఈ విద్యాలయాల్లో దినచర్య అద్భుతంగా ఉంటుంది. నిత్యం వేకువజాము 4 గంటలకు బాలికలను నిద్రలేపి సుమారు గంటపాటు చదివిస్తారు. ఒక గంట పాటు యోగాసనాలు చేయిస్తారు. స్నానం, అల్పాహారం, ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు తరగతులు నిర్వహిస్తారు. మధ్యాహ్నం రుచికరమైన పౌష్టికాహారాన్ని అందజేస్తారు. సాయంత్రం 5 వరకు తరగతులు జరుగుతాయి. అనంతరం గంట పాటు ఆట, పాటలు, మొక్కలు సంరక్షణ వంటి పనులు చేస్తారు. రాత్రి 7 తరువాత భోజనం, అనంతరం 9 గంటల వరకు ప్రత్యేక తరగతులు, స్టడీ అవర్స్ వుంటాయి. నిత్యం అధ్యాపకులు ఒక పద్ధతి ప్రకారం విద్యార్థినులకు దినచర్య అమలు చేస్తారు. ఏడో తరగతి విద్యార్థినుల కోసం ఇంకో అడుగు ముందుకేసి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తారు. దీంతో పదో తరగతి పబ్లిక్ పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తున్నారు. విద్యతో పాటు విద్యార్థినులకు మానసిక ఉల్లాసం కోసం ఆటలు కూడా ఆడిస్తున్నారు. కుట్టుపని, కంప్యూటర్ విద్య, చేతి పనులపై కూడా శిక్షణ ఇస్తున్నారు.
మెరుగైన మెనూ
విద్యార్థినులకు పౌష్టికాహారంతో కూడిన మెనూను కేజీబీవీల్లో అమలు చేస్తున్నారు. ప్రతి రోజు మూడు పూటల భోజనంతో పాటు ఉద యం, సాయంత్రం ప్రత్యేకంగా స్నాక్స్‌ను అందజేస్తున్నారు. వారానికి ఐదు రోజుల పాటు కోడిగుడ్లు, ఆదివారం చికెన్‌తో కూడిన భోజనాన్ని అందిస్తున్నారు. విద్యార్థినులకు పాఠ్యపుస్తకాలు, రాతపుస్తకాలు, పెన్నులు, ఏడాదికి నాలుగు జతల యూనిఫాం, బూట్లు, దుప్పట్లు, ట్రంకు పెట్టెలు అందిస్తున్నారు. వాటితో పాటు ప్రతి నెలా సబ్బులు, తలనూనె, టూత్‌పేస్టు, కాస్మోటిక్స్ కూడా అందజేస్తున్నారు.
స్వచ్ఛ విద్యాలయాలుగా...
విద్యార్థినులకు శారీరక సమస్యలపై అవగాహన కల్పించేందుకు 24 గంటలు ఒక ఎఎన్‌ఎం అందుబాటులో ఉంటుంది. దీనికి తోడు విద్యాలయ ఆవరణలో వివిధ రకాల పూలు, పండ్ల మొక్కలు,కూరగాయల తోటలను పెంచే బాధ్యతలను చిన్నారులకు అప్పగిస్తున్నారు. వాటిని విద్యార్థినులు కంటికి రెప్పలా కాపాడుతున్నారు. ఈ క్రమంలో జిల్లాలోని అన్ని కేజీబీవీలు స్వచ్ఛ విద్యాలయాలుగా మారుతున్నాయి. కురబలకోట మండలంలోని కస్తూర్బాగాందీ బాలికా విద్యాలయం జాతీయ స్థాయిలో స్వచ్ఛ పురస్కార్ అవార్డుకు ఎంపికై రూ.50 వేల నగదు బహుమతిని కూడా అందుకుంది.
Comments
Please login to add a commentAdd a comment