సాక్షి, వరంగల్: బూట్లు ఎందుకు వేసుకురాలేదు అంటూ విద్యార్థులపై ప్రిన్సిపాల్ తన ప్రతాపాన్ని చూపాడు. ఏకంగా కంక కట్టెతో విచక్షణ రహితంగా కొట్టడంతో విద్యార్థులు గాయపడ్డారు. ఈ ఘటన హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్క నూర్ మోడల్ స్కూల్లో బుధవారం చోటు చేసుకుంది. విద్యార్థుల కథనం ప్రకారం...మోడల్ స్కూల్‌లో పదవ తరగతి వరకు మొత్తం 490 మంది విద్యార్థులున్నారు. బుధవారం పాఠశాలలో ప్రార్థన అనంతరం విద్యార్థులు తమ క్లాస్‌లోకి వెళ్తన్న క్రమంలో 10వ తరగతికి చెందిన హర్షిత్, చరణ్, శ్రావణ్, రాంచరణ్, అక్షయ్‌కుమార్, హనీఫ్, ఫరూక్ అబ్దుల్‌తోపాటు 12మంది విద్యార్థులు బూట్లు వేసుకురాలేదు.
గమనించిన ప్రిన్సిపాల్ ప్రణయ్‌కుమార్ వారందరిని పక్కకు నిలబెట్టి బూట్లు ఎందుకు వేసుకురాలేదని అడుగుతూ కొట్టడం ప్రారంభించాడు. ‘రేపు వేసుకువస్తాం కొట్టకండి సార్’అంటూ కన్నీరు పెట్టుకున్నప్పటికి వినకుండా విచక్షణా రహితంగా చితకబాదాబడు. దీంతో విద్యార్థుల పిరుదల కిందబాగంలో కమిలిపోయి కొంతమంది విద్యార్థులు నడవలేని పరిస్థితికి చేరుకోవడంతో కొందరు ఉపాధ్యాయులు వారిని సమీపంలోని పీహెచ్‌సీకి తరలించి చికిత్స నిర్వహించారు.
విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రుల పాఠశాలకు చేరుకొని తమ పిల్లల్ని ఈ విధంగా కొట్టడం తగదు అంటూ ప్రిన్సిపాల్‌ని నిలదీశారు. షూస్ వేసుకురాకుంటే క్రమశిక్షణలో భాగంగా కొట్టానని, కొట్టకుంటే వారు వినరు అని ప్రిన్సిపాల్ ప్రణయ్ కుమార్ వివరణ ఇచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment