కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం ఇదే...
కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో విద్యార్థినులకు కంప్యూటర్ విద్య సంగతి దేవుడెరుగు.. దీనికోసం పీసీ, మోనిటర్, మౌస్, కీబోర్డు వినియోగిస్తారన్న స్పృహ లేకపోవడం విచిత్రం. వీరికి బోధించేందుకు కంప్యూటర్ ఇన్‌స్ట్రక్చర్లు లేకపోగా, కంప్యూటర్లు మాత్రం మూలకు చేరాయి. అయితే ప్రైవేటు ఏజెన్సీకి, అధికార పార్టీ నేతలకు మధ్య మామూళ్ల పంపకాల్లో వివాదం తలెత్తడంతో వారి నియామకాలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది.
రాజాం: జిల్లాలోని 32 మండలాల్లో రెండు విడతలుగా కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు ప్రారంభించారు. ఈ పాఠశాలలు తొలుత 6 నుంచి 8 తరగతి వరకూ ప్రారంభించి ప్రతీ ఏడాది ఒక్కో తరగతిని పెంచుతూ 10వ తరగతి వరకూ అప్‌గ్రేడేషన్ చేశారు. ఈ ఏడాది జి.సిగడాం, కోటబొమ్మాళి మండలాల్లో పది నుంచి ఇంటర్ వరకూ అదనంగా పెంచారు. బోధకుల రిక్రూట్‌మెంట్ మాత్రం చేపట్టలేదు.
కానరాని కంప్యూటర్ విద్య..
2012 నుంచి అన్ని పాఠశాలలకు విడతల వారీగా కంప్యూటర్లు అందించారు. ఒక్కో పాఠశాలలో 10 నుంచి 12 కంప్యూటర్లు కేటాయించి ల్యాబ్‌రూమ్‌లు ఏర్పాటు చేశారు. ఇంతవరకూ బోధకులను నియమించ లేదు. ఫలితంగా కంప్యూటర్లు మూలకు చేరుతున్నాయి. చాలా పాఠశాలల్లో ఇవి తుప్పుపట్టాయి. నిరుపయోగంగా ఉన్న కంప్యూటర్లు రూమ్‌ల్లో విద్యార్థినులకు ఇతర సబ్జెక్టులకు సంబంధించి తరగతులు నిర్వహిస్తున్నారు. ఆయా గదుల్లో డిజిటల్ తరగతులు నిమిత్తం ఇటీవల కొనుగోలు చేసిన ప్రాజెక్టర్లు పెట్టుకుంటున్నారు. అవి కూడా నిరుపయోగంగా మారుతున్నాయి. ఇలా కోట్లాది రూపాయల నిధులు దుర్వినియోగమవుతున్నాయి.
నోటిఫికేషన్ వేసి కూడా..
కేజీబీవీలో కంప్యూటర్ బోధకుల నియామకానికి 2018 సెప్టెంబర్‌లో నోటిఫికేషన్ వేశారు. ఔట్ సోర్సింగ్ పద్ధతిలో నియమించేందుకు ఓ ప్రైవేట్ ఏజెన్సీకి ఈ బాధ్యత అప్పగించారు. అప్పట్లో చాలా మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. ఒక్కో పోస్టుకు తెరవెనుక బేరసారాలు కూడా జరిగాయి. ఈ విషయమై విమర్శలు వెల్లువెత్తడంతో నోటిఫికేషన్ అర్ధాంతరంగా నిలుపుదల చేసేశారు. దీంతో పోస్టులు భర్తీ నిలిచిపోయింది. అయితే ఏజెన్సీకి, అధికార పార్టీ నేతలకు మధ్య మామూళ్ల పంపకాల్లో వివాదం రావడంతో వీటిని నిలుపుదల చేసినట్లు విశ్వసనీయ సమాచారం. జిల్లాలో 32 కేజీబీవీలకు సంబంధించి మొత్తం 32 మంది కంప్యూటర్ ఇన్‌స్ట్రక్చర్లను నియమించాల్సి ఉంది. ఇంతవరకూ ఈ ప్రక్రియ కొనసాగలేదు. దీంతో కంప్యూటర్ విద్య కేజీబీవీల్లో కలగానే మిగిలిపోయింది.
అంతా అస్తవ్యస్తమే..
బడికి దూరంగా ఉన్న విద్యార్థినుల నిమిత్తం, తల్లి, తండ్రిలేని ఆడపిల్లలకు ఉత్తమ విద్య అందించి ఆసరాగా ఉంచేందుకు కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంతాల, గిరిజన ప్రాంతాల విద్యార్థినులకు ప్రాధాన్యమివ్వాల్సి ఉంది. అటువంటి వారు ఇంగ్లిషు మీడియంలో చదవాలంటే కష్టమే. కానీ నాలుగేళ్ళుగా ఆరు నుంచి పది తరగతుల వరకూ ఆంగ్ల మాధ్యమ బోధన చేపడుతున్నారు. బోధకులు కూడా తెలుగుభాషలో బీఈడీలు చేసి వచ్చినవారే. వీరితో ఓ వైపు బోధన సాగిస్తూ మరోవైపు కంప్యూటర్ ల్యాబ్, డిజిటల్ తరగతులు లేకుండా నెట్టుకొస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సాధారణ విద్యార్థినులకు, డ్రాపౌట్స్‌కు ఈ విద్య ఎంతమేరకు అందుతుందో అధికారులకే ఎరుక.
ప్రక్రియ కొనసాగుతోంది..
కేజీబీవీ పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్‌లు ఉన్నాయి. బోధకులు లేని విషయం వాస్తవమే. వీటి భర్తీకి నోటిఫికేషన్ కూడా గతంలో ఇచ్చాం. ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ విద్యా సంవత్సరం చివరి కల్లా కంప్యూటర్ బోధకులు నియామకం చేపట్టే అవకాశం ఉంది.– ఎం త్రినాథరావు, పీవో, సర్వశిక్షా అభియాన్
Comments
Please login to add a commentAdd a comment