నల్లగొండ : బాలికలను చదువుల్లో మేటిగా తయారుచేసి.. చదువుల తల్లులుగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో రాష్ట్ర సమగ్రశిక్షా అభియాన్ కొత్త పథకాలకు శ్రీకారం చుట్టింది. విద్యార్థినుల్లోని సృజనాత్మకత, సామర్థ్యాలను వెలికి తీసేందుకు సంకల్పించింది. ఇందులో భాగంగా కేజీబీవీల్లో విద్యార్థినులతో తరగతుల వారీగా క్లబ్‌లు ఏర్పాటు చేస్తోంది. పాఠశాలలో ఉపాధ్యాయుడు పాఠం చెప్పిన రోజునే ఈ క్లబ్‌లో చర్చించి.. చదువుతారు. ఇలా వారం రోజులపాటు చదివిన అంశాలపై వారాంతంలో పరీక్షలు నిర్వహించి విద్యార్థినుల్లో సామర్థ్యాన్ని పెంపొందిస్తారు.
జిల్లాలో 27 కేజీబీవీలు ఉన్నాయి. వీటిలో చదివే బాలికల్లో సామర్థ్యం పెంపునకు క్లబ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. తరగతి గదిలో ఉపాధ్యాయుడు చెప్పిన పాఠాన్ని అదే రోజు చదివి సామర్థ్యాన్ని పెంచుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అందులో భాగంగానే పాఠ్యాంశాలవారీగా ఆ క్లబ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. 6 నుంచి 10వ తరగతి వరకు ప్రతి తరగతికి ఆయా పాఠ్యాంశాల వారీగా ఈ క్లబ్‌లను ఏర్పాటు చేస్తున్నారు.
క్లబ్‌ల ఏర్పాటు ఇలా..
జిల్లాలోని 27 కేజీబీవీల్లో ఆరు నుంచి పది తరగతులకు ఒక్కో క్లబ్ ఏర్పాటు చేస్తారు. ఈ క్లబ్‌లో బాగా చదివే, మధ్యస్థంగా చదివే, బాగా తెలివైన, చెబితే అర్థం చేసుకోగలిగే విద్యార్థినులను సభ్యులుగా ఉంచుతారు. వీరిలో ప్రతిభావంతురాలయిన విద్యార్థిని ఈ క్లబ్‌కు లీడర్‌గా వ్యవహరిస్తారు. అవసరమైతే సంబంధిత క్లాస్ టీచర్ లేదా గైడ్ టీచర్ సలహాలు తీసుకుంటారు. రోజూ పాఠశాల ముగిసిన అనంతరం 3.45 నుంచి 4.30 గంటల వరకు ఆ రోజు తరగతి గదుల్లో ఉపాధ్యాయుడు బోధించిన పాఠ్యాంశాలను ఈ సమయంలో క్లబ్‌ల్లో పఠనం చేస్తారు.
క్లాస్ టీచర్‌తోపాటు గైడ్ టీచర్ కూడా ఇందులో సభ్యురాలిగా ఉంటారు. తరగతిలోని ప్రతి విద్యార్థిని ఇందులో సభ్యులుగా ఉంటారు. ఏరోజు పాఠం ఆ రోజే చదవడం, పాఠం ఎంతవరకు అర్థమైంది.. ఒక వేళ అర్థంకాకపోతే.. మొదట తరగతి గదిలో లీడర్‌తో చెప్పించుకుంటారు. అయినా అర్థం కాకపోతే ఉపాధ్యాయులను కూడా అడిగి దానిపై అవగాహన తెచ్చుకునే విధంగా క్లబ్‌లు దోహదం చేస్తాయి. దీని ద్వారా విద్యార్థుల మధ్య పాఠ్యాంశం చర్చకు వచ్చి సులభంగా అర్థమవుతుంది. ఇలా క్లబ్‌ల్లో పాఠ్యాంశాలను చర్చించడం ద్వారా విద్యార్థుల మెదళ్లలో ఆ అంశాలు అలాగే ఉండిపోతాయి.
వారాంతంలో పోటీ పరీక్షలు
వారాంతంలో ఆయా పాఠ్యాంశాలపై ప్రతి తరగతిలో విద్యార్థినులకు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విధంగా పరీక్షలు నిర్వహిస్తారు. అంతేగాక క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. తద్వారా విద్యార్థుల్లో దాగిఉన్న సృజనాత్మకత బయటకు రావడంతో పాటు వారి కళలను కూడా బయటికి తీసుకొచ్చేందుకు ఈ కార్యక్రమాలు ఎంతగానో దోహదపడనున్నాయి.
క్లబ్‌లు బాలికల చదువుకు ఎంతోమేలు
కస్తూరిబా గాంధీ పాఠశాలల్లో తరగతుల వారీగా విద్యార్థినులు క్ల బ్‌లుగా ఏర్పడి ఏరో జు పాఠం ఆరోజే చదవడం వల్ల వారు జ్ఞానం సంపాదించుకుంటున్నారు. అంతేకాక ఏరోజు కారోజు చదవడం వల్ల పరీక్షల సందర్భంలో ఒకేసారి చదవాల్సిన భారం ఉండదు. దాని ద్వారా విద్యార్థులు మంచి విద్యను పొందడంతో పాటు సులువుగా పరీక్షలు రాయగలుగుతారు. – అరుణశ్రీ, సెక్టోరియల్ అధికారి
Comments
Please login to add a commentAdd a comment