kgbv schools
-
ఇక్కడ ఆడుతూ.. పాడుతూ..పాఠాలు నేర్పుతారు
విజయనగరం అర్బన్: అనాథ, నిరుపేద బాలికల విద్యాభివృద్ధికి విశేష కృషి చేస్తున్న కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయా(కేజీబీవీ)ల్లో వినూత్న బోధన పద్ధతులు అనుసరిస్తున్నారు. ఒత్తిడిలేని విద్యను అందించేందుకు వీలుగా ఆటపాటలతో, విజ్ఞానదాయక అంశాలపై దృష్టిసారించారు. ఆరోగ్యంతో పాటు, ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యాభ్యాసం సాగేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. విద్యార్థినులకు రుచికరమైన పౌష్టికాహారం అందించేందుకు ఇటీవలే వారి డైట్ చార్జీలను కూడా పెంచింది. చదువుల ఒత్తిడి లేకుండా విద్యార్థినులకు యోగాతో పాటు ఆటపాటలతో అభ్యసనం సాగించేలా ప్రణాళికలు రూపొందించింది. ఈ చర్యలు మంచి ఫలితాలిస్తున్నాయి. పదోతరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాల్లో విద్యార్థినులకు ఉత్తీర్ణత శాతం ఏటేటా పెరుగుతోంది. శతశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా... జిల్లాలో 33 కేజీబీవీలున్నాయి. టెన్త్, ఇంటర్ వార్షిక పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించడంపై విద్యా శాఖ దృష్టి పెట్టింది. అర్హులైన బోధనా సిబ్బందిని నియమించి ఆయా సబ్జెక్టుల్లో బోధన అందిస్తోంది. విద్యార్థినులకు యోగాతోపాటు వారికి ఆసక్తి ఉన్న వివిధ క్రీడల్లో, ఇతర కళాంశాల్లో రాణించేలా సరికొత్త ప్రణాళికలను అమలు చేస్తోంది. దీనివల్ల ఒకప్పుడు 80 శాతం దాటని ఉత్తీర్ణత మూడేళ్లుగా పెరుగుతూ రావడం విశేషం. పదోతరగతిలో 2017–18 లో 96.7 శాతం, 2018–19లో 97.56 శాతం, గత ఏడాది శతశాతం ఫలితాలు సాధించడం గమనార్హం. దశలవారీగా విస్తరణ జిల్లాలో 33 కేజీబీవీలున్నాయి. అన్ని వర్గాలకు చెందిన నిరుపేద, అనాథ బాలికలు 8,206 మంది అందులో విద్యాబోధన పొందుతున్నారు. 6 నుంచి 10 వరకు తరగతుల నిర్వహణతోపాటు గతేడాది నుంచి ఇంటర్ తరగతులు కూడా ప్రారంభించారు. దీనికి అనుగుణంగా అదనపు భవనాల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టించింది. జిల్లాలోని 16 మోడల్ స్కూళ్లలో హాస్టళ్లు లేకపోవడంతో అక్కడి బాలికల కోసం కేజీబీవీల్లో వసతి గృహాలను ప్రారంభించారు. మోడల్ స్కూళ్లు, ఇతర స్కూళ్లలో చదివే విద్యార్థినులకు అక్కడే అవాసం కల్పిస్తున్నారు. నాణ్యమైన పదార్థాలతో రోజుకో మెనూ కేజీబీవీ విద్యార్థినులకు పౌష్టికాహారం అందించడానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద చూపుతోంది. కరోనా అనంతరం పునఃప్రారంభమైనా ఎప్పటికప్పుడు కరోనా పరీక్షలు చేయిస్తూ వాటి వ్యాప్తిని నిరోధించింది. వసతి గృహాల్లోని భోజన సౌకర్యం మెరుగుపర్చి, డైట్ చార్జీలను రూ.1,400కు పెంచింది. మోనూలో కూడా పలు మార్పులు చేసింది. రోజుకో రకమైన పదార్థాలతో సరికొత్త మెనూ రూపొందించి ఆ మేరకు అన్ని కేజీబీవీల్లో విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తున్నారు. ఉదయం లేచినవెంటనే ప్రీ బ్రేక్ ఫాస్ట్, బ్రేక్ ఫాస్ట్, లంచ్, ఈవెనింగ్ స్నాక్స్, డిన్నర్ తరువాత పండ్లు అందిస్తున్నారు. మాంసాహారులకు చికెన్, శాకాహారులకు కాయగూరలు అందిస్తున్నారు. పాలు, రాగిజావ, రాగి సంగటి, బూస్ట్, చిక్కీలు, ఊతప్పం, ఇడ్లీలు, పూరీలు, ఆలూ బఠానీ కుర్మా, చపాతీ, కోడుగుడ్లు, అన్నం, రోజకోరకమైన కూరలు ఇలా వివిధ రకాల వంటకాలతో విద్యార్థినులకు పౌష్టికరమైన ఆహారాన్ని అందిస్తున్నారు. మెరుగైన ఫలితాల కోసం ప్రణాళికలు నిరుపేద, అనాథ బాలికల విద్యాబోధన కోసం నిర్వహిస్తున్న కేజీబీవీల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాం. ఒత్తిడి లేని బోధన, అభ్యసనాలను అమలు చేస్తున్నాం. ఈ నేపధ్యంలోనే టెన్త్ ఫలితాలు ఏటా పెరుగుతున్నాయి. జిల్లాలోని 33 కేజీబీవీల్లో 8,206 మంది బాలికలకు పౌష్టికాహారంతో కూడిన భోజనం అందిస్తున్నాం. – జె.విజయలక్ష్మి, ఏపీసీ, ఎస్ఎస్ఏ ( చదవండి: క్రీడాకారులకు ‘సాక్షి’ ప్రోత్సాహం భేష్ ) -
కేజీబీవీల్లో వొకేషనల్ కోర్సులు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) వొకేషనల్ కోర్సులను ప్రవేశపెట్టేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. వాటిల్లో చదివే వారంతా బాలికలే అయినందునా పదో తరగతి పూర్తయిన వారి కోసం వాటిని ప్రవేశపెట్టాలని, తద్వారా ఉపాధి అవకాశాలను కల్పించవచ్చని భావిస్తోంది. మల్టీపర్పస్ హెల్త్ వర్కర్, మెడికల్ ల్యాబ్ టెక్నిషి యన్ వంటి కోర్సులను వచ్చే విద్యా సంవత్సరంలో ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలోని మరో 50 కేజీబీవీల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియెట్‌ను ప్రారంభించేందుకు పాఠశాల విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రంలో మొత్తం 475 కేజీబీవీలు ఉండగా, అందులో గతేడాది 84 కేజీబీవీల్లో ఇంటర్‌ను ప్రారంభించింది. అంతకుముందు సంవత్సరంలో 88 స్కూళ్లలో ఇంటర్మీడియెట్‌ను ప్రవేశపెట్టింది. ఈసారి జిల్లాకు ఒకటి లేదా రెండు చొప్పున కేజీబీవీల్లో ఇంటర్‌ను ప్రారంభించేందుకు సిద్ధం అవుతోంది. -
డాల్ఫినో డాల్..
సాక్షి, ఆసిఫాబాద్ : విద్యార్థుల్లో ఉత్తేజం.. సులభంగా అర్థం చేసుకునేందుకు కస్తూరిబా విద్యాలయాల్లో సరికొత్త పరిజ్ఞానాన్ని వాడుతున్నారు. యూనిసెఫ్ సహకారంతో స్వస్త్ ఫ్లస్ పథకం కింద మాట్లాడే పుస్తకాలను తీసుకొ చ్చారు. జిల్లాలోని 8 కేజీబీవీల్లో వీటిని విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ పుస్తకాల పేజీపై డాల్ఫినో అనే పరికరాన్ని పెట్టగానే పుస్తకంలోని బొమ్మల గురించి చెప్పడంతో పాటు కథనాంశాలను విద్యార్థులకు వివరిస్తోంది. కుమురం భీం జిల్లాలో మొత్తం 15 కేజీబీ వీలు ఉన్నాయి. నిరుపేద బాలికలకు విద్యన ందించాలనే సంకల్పంతో ప్రతి మండలానికి ఒక కేజీబీవీని ఏర్పాటు చేశారు. ఆ మండలంలోని బాలికలకు 6వ తరగతి నుంచి ఇం టర్ వరకూ విద్యతో పాటు వసతిగృహ సదుపాయాన్ని కూడా కల్పించారు. విద్యార్థినులకు సరికొత్త పరిజ్ఞానంతో సులభంగా ఇంగ్లీష్ అర్థమయ్యేలా డాల్ఫిన్ పుస్తకంలోని బొమ్మల గురించి చెప్పడంతో పాటు మాటల రూపంలో వస్తున్న అక్షరాలు ఉత్తేజపరుస్తున్నాయి. ఈ మాట్లాడే పుస్తకాలతో విద్యార్థులు చదువుపై ఆసక్తి చూపుతున్నారు. యూనిసెఫ్ సహకారంతో.. యూనిసెçఫ్ సహకారంతో స్వస్త్ ప్లస్ పథకం కింద ప్రతి పాఠశాలకు వంద వరకూ కథల పుస్తకాలను ప్రవేశపెట్టిన అధికారులు దానికి మరింత సాంకేతికతను జోడించి మాట్లాడే పుస్తకాలను తయారు చేశారు. 2018– 19 విద్యా సంవత్సరానికి గానూ దాదాపు 200 వరకూ పుస్తకాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇవి సత్ఫలితాలు ఇవ్వడంతో ఈసారి మరిన్ని పుస్తకాలను పంపిణీ చేశారు. జిల్లాలోని 8 కేజీబీవీలకు వీటిని అందించారు. ఒక్కో కేజీబీవీకి 100 ఇంగ్లీష్, 100 తెలుగు భాషల్లో పుస్తకాలను అందజేశారు. వీటి ద్వారా ప్రయోగాత్మకంగా విద్యబోధన చేపడుతున్నారు. ద్యార్థుల్లో సృజనాత్మకత పెంపు.. మాట్లాడే పుస్తకాలను విద్యార్థులకునుగుణంగా తయారు చేశారు. ఇంగ్లిష్ పదాలు పలకడం కష్టతరంగా ఉన్న పదాలను పుస్తకం మాట్లాడడంతో సులభంగా అర్థమవుతుంది. దీంతో పాటు విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించడానికి ఇవి దోహదపడుతున్నాయి. ఈ పుస్తకాల్లో నీతి కథలైన లెట్స్ మీ హిచర్ ది మ్యూజిక్, ఏ లెస్సన్ ఫర్ ది సర్పంచ్, బాలల హక్కులు, ఆరోగ్యం, పరిశుభ్రత వంటి నీతి కథలు ఉన్నాయి. వీటి ద్వారా విద్యార్థుల్లో చదివేం దుకు కుతుహలం ఏర్పడుతోంది. వీటి పై ఉన్న బొమ్మల మీద డాల్ఫినో పరికరాన్ని ఉంచితేబొమ్మ గురించి పూర్తిగా చెప్పడంతో పాటుగా చదవుతుంది. ఈ పరిరాన్ని కర్ణాటకకు చెందిన ఐస్ పార్కు సంస్థ రూపొందించింది. విద్యుత్ చార్జింగ్ చేయడం ద్వారా ఇది పనిచేస్తుంది. 6 నుంచి 7వ తరగతి విద్యార్థినులకు ఈబొమ్మల పాఠాలు ఉపయోగపడుతున్నాయి. -
చెల్లీ.. నేనున్నా!
నల్లగొండ : కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలల్లో కొత్తగా చేరే విద్యార్థినుల్లో మనోధైర్యాన్ని నింపేందుకు అధికారులు కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ‘ఆత్మీయ బంధం’ పేరుతో కస్తూరిబా పాఠశాల ప్రాజెక్టు డైరెక్టర్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. తద్వారా కొత్తగా పాఠశాలలు, కళాశాలల్లో చేరే బాలికలను సీనియర్లు చెల్లీ.. నేనున్నా.. అంటూ అక్కున చేర్చుకోవడడంతో.. నూతన విద్యార్థినుల్లో భయం తొలగి.. ధైరంగా ఉండనున్నారు. భయాందోళన పోగొట్టేలా.. జిల్లా వ్యాప్తంగా 27 కస్తూరిబా పాఠశాలలు ఉన్నాయి. వాటితోపాటు కళాశాలలు కూడా ఉన్నాయి. పాఠశాలల్లో దాదాపు 7 వేల నుంచి 8వేల వరకు విద్యార్థినులు ఉండగా, కళాశాలల్లో 600 నుంచి 700 మంది వరకు విద్యార్థినులు విద్యనభ్యసిస్తున్నారు. ఏటా 6, 7, 8 తరగతులతో పాటు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో కూడా విద్యార్థినులు చేరుతారు. అప్పటి వరకు తల్లిదండ్రులు, బంధువుల వద్ద ఉంటూ ఒకేసారి హాస్టల్‌కు వచ్చేసరికి కొత్త వాతావరణం అనిపిస్తుంది. అక్కడి పరిస్థితులకు అనుగుణంగా వారు మారకపోవడం, సీనియర్ల నుంచి సహకారం లభించకపోవడంతో చాలామంది పిల్లలు మధ్యలోనే పాఠశాలలు వదిలి వెళ్తుంటారు. అయితే కొందరిని తిరిగి పాఠశాలలకు రప్పించినా కొందరిని రప్పించలేని పరిస్థితి. దీనికి చెక్ పెట్టేందుకు ఈ కార్యక్రమానికి అధికారులు శ్రీకారం చుట్టారు. ప్రతి కేజీబీవీలో ‘ఆత్మీయ బంధం’ ప్రతి కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో ఆత్మీయ బంధం అనే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఉపాధ్యాయినులతో పాటు కస్తూరిబా అధికారులు, కొత్త, పాత విద్యార్థినులచేత ఈ ఆత్మీయ బంధం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కొత్తగా చేరిన విద్యార్థినులను సీనియర్లకు దత్తత ఇస్తున్నారు. సీనియర్లు వారితో ఎప్పుడూ కలిసి ఉంటారు. చదువుకునేటప్పుడు, భోజనం చేసే సందర్భంలో, ఆటలు ఆడుకునే సమయంలో వారితో నిత్యం మాట్లాడడం, వారిలో ఉన్నటువంటి భయాందోళనలు తొలగిస్తూ చెల్లీ నేను ఉన్నానంటూ భరోసానివ్వనున్నారు. ప్రస్తుతం జిల్లాలోని పాఠశాలల్లో ఈ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఆత్మీయ బంధం ఎంతో మేలు ఆత్మీయ బంధం కార్యక్రమం వల్ల ఎంతో మేలు కలుగుతుంది. కొత్తగా పాఠశాలలు, కళాశాలల్లో చేరిన విద్యార్థినుల్లో భయాందోళనలు పోగొట్టేందుకు ఉపయోగపడుతుంది. ఇద్దరు సీనియర్లు, జూనియర్లు కలిసి ఉండడం వల్ల కొత్తదనం అనేది పోయి అక్కా చెల్లెళ్ల మాదిరిగా ఉండనున్నారు. – అరుణ శ్రీ, సెక్టోరియల్‌అధికారి -
ఉద్యోగాల పేరిట ఘరానా మోసం
సాక్షి, మంచిర్యాల: ఆమె ఓ సాధారణ గృహణి. కానీ.. అసాధారణ మోసానికి పాల్పడింది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 132 మందికి ఉద్యోగాలిప్పిస్తానని మోసం చేసి రూ.కోటికి పైగా వసూలు చేసింది. ఉద్యోగాలు రాకపోగా.. ఇచ్చిన డబ్బులైనా వాపసు ఇవ్వాలని బాధితులు ఒత్తిడి తేవడంతో ఐపీ అడ్డం పెట్టుకుని తప్పించుకునేందుకు ఎత్తులు వేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. మోసపోయినట్లు గ్రహించిన బాధితులు సోమవారం డీసీపీని ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగు చూసింది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన ఠాకుర్ సుమలత సాధారణ గృహిణి. బెల్లంపల్లి మండలం తాండూర్‌లో ఉన్న కేజీబీవీ పాఠశాలలో ఏఎస్ఓగా పనిచేస్తున్నానని, అధికార పార్టీ నేతలు తనకు తెలుసని నమ్మబలుకుతూ ఉద్యోగాలిప్పిస్తానంటూ రెండున్నరేళ్లుగా నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసింది. గురుకులాల్లోని బోధన, బోధనేతర ఉద్యోగాలేవైనా ఇప్పిస్తానంటూ ఎర వేసింది. ఉమ్మడి జిల్లాలోని బెల్లంపల్లి, కాగజ్‌నగర్, మంచిర్యాల, కాసిపేట మండలాలకు చెందిన 132 మంది నుంచి వారి ఉద్యోగ ‘అర్హత’లను బట్టి రూ.లక్ష నుంచి రూ.4 లక్షల చొప్పున సుమారు రూ.1.50 కోట్లు వసూలు చేసింది. ఒకవేళ ఉద్యోగాలు రాకపోతే డబ్బులు వాపసు ఇస్తానంటూ ప్రామిసరీ నోట్లు, ఖాళీ చెక్‌లు, బాండ్లపై ఒప్పందాలూ చేసుకుంది. చివరకు ఈ నెల 14న 132 మందికి తాను ఐపీ పెట్టినట్లు నోటీసులు పంపించింది. ఐపీ పెట్టే ఉద్దేశంతోనే పథకం ప్రకారం అప్పుపత్రాలు రాయించుకుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఐపీ నోటీసులతో ఆందోళనలో బాధితులు అయితే ఉద్యోగం.. లేదంటే డబ్బులు వాపసు వస్తాయనుకున్న బాధితులకు సదరు మహిళ ఇచ్చిన ఐపీ షాక్‌తో లబోదిబోమంటున్నారు. ఊహించని విధంగా ఐపీ నోటీసులు రావడం, అనంతరం సదరు మహిళ సెల్‌ఫోన్ స్విచ్ఛాఫ్ ఉండటంతో బాధితులు ఆందోళనకు గురవుతున్నారు. దీంతో తమకు న్యాయం చేయాలంటూ సోమ వారం డీసీపీ రక్షిత కే.మూర్తిని కలసి వేడుకున్నారు. డబ్బులు వసూళ్లలో సుమలతతోపాటు ఆమె కారు డ్రైవర్ సాయి అలియాస్ శ్రీనివాస్ కీలక పాత్ర పోషించినట్లు బాధితులు చెబుతున్నారు. డబ్బులు శ్రీనివాస్ తీసుకుని సుమలతకు ఇచ్చేవాడని గుర్తు చేస్తున్నారు. పుస్తెలమ్మిచ్చింది: రత్నం భారతి, బెల్లంపల్లి గురుకులంలో ఏఎన్ఎం పోస్టుకు దరఖాస్తు చేసుకున్నా. తెలిసిన వ్యక్తి సుమలత వద్దకు వెళితే పనవుతుందంటే ఆమెను కలిసినం. ఉద్యోగం కావాలంటే రూ.లక్ష అవుతుందని చెప్పింది. ఉద్యోగం వచ్చిన తరువాతే డబ్బులు ఇస్తామంటే అలా కుదరదని, ముందే ఇవ్వాలని, లేదంటే పని కాదంది. డబ్బులు ఇప్పుడు లేవంటే నీ మెడలో పుస్తెల తాడు, రింగులు ఉన్నాయి కదా అవి అమ్మియ్యుమని.. దగ్గరుండి మార్కెట్లో అమ్మించి అక్కడికక్కడే తీసుకొని వెళ్లిపోయింది. ఒంటి మీద బంగారం పోయింది. ఉద్యోగం రాలే.. పైగా మాకే నోటీసులు పంపించింది. ఎట్లైన మాకు న్యాయం చేయాలే. పూర్తిస్థాయి విచారణ.. బెల్లంపల్లికి చెందిన సుమలత ఉద్యోగాల పేరిట తమను మోసం చేశారని బాధితులు వచ్చి కలిశారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ నిర్వహిస్తాం. విచారణ చేపట్టాలని బెల్లంపల్లి సీఐని ఇప్పటికే ఆదేశించాను. బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకొంటాం. –రక్షిత కే మూర్తి, డీసీపీ, మంచిర్యాల -
కేజీబీవీల్లో ఇంటర్..
నల్లగొండ : జిల్లాలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల్లో కళాశాలలను ప్రారంభించేందుకు ప్రభుత్వం పూనుకుంది. జిల్లాలో 14 కసూరిబా గాంధీ పాఠశాలలు ఉండగా ఇప్పటికే ఆరు పాఠశాలల్లో కళాశాలలు కొనసాగుతున్నాయి. అయితే ఈ సంవత్సరం మరో మూడు పాఠశాలల్లో కళాశాలలు ప్రారంభించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా జిల్లాలోని చండూరు, దామరచర్ల, పెద్దవూర మండలాల్లోని కస్తూరిబా పాఠశాలకు కళాశాలలను మంజూరు చేసింది. ఈ విద్యాసంవత్సరం నుంచే ఇంటర్ తరగతులు ప్రారంభించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో 14 కేజీబీవీలు.. పేద, తల్లిదండ్రులు లేని నిరుపేద బాలికల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కేజీబీవీలను ప్రారంభించారు. జిల్లాలో 14 కస్తూరిబా గాంధీ బాలి కల విద్యాలయాలు ఉన్నాయి. అవన్నీ తెలుగు మీడియంలోనే ప్రారంభమయ్యాయి. అయితే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేజీ టూ పీజీ ఇంగ్లిష్ మీడి యం పాఠశాలల నిర్మాణానికి పూనుకుంది. దాంతో కేజీబీవీల్లో ఇంగ్లిష్ బోధన చేసేందుకు ఉపాధ్యాయులు ముందుకొచ్చిన పాఠశాలలను ఇప్పటికే ఇంగ్లిష్ మీడియం పాఠశాలలుగా మార్చారు. ఈ సంవత్సరం కూడా ప్రభుత్వం ఇంగ్లిష్ మీడియం బోధించే పాఠశాలలు ఉంటే ప్రతిపాదనలు పంపాలని జిల్లా విద్యాశాఖను కోరింది. జిల్లాలో ఏ పాఠశాలల నుంచి కూడా ఉపాధ్యాయులు ఇంగ్లిష్‌లో బోధన చేసేందుకు ముందుకు రాకపోవడంతో ప్రతిపాదనలు పంపని విషయం తెలిసిందే. మూడు పాఠశాలకు కళాశాలలు మంజూరు.. జిల్లాలోని చండూరు, పెద్దవూర, దామరచర్ల మండలాల్లోని కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలల్లో కళాశాలలు ప్రారంభించుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సీట్ల భర్తీ ప్రక్రియ కూడా ప్రారంబించారు. ఒక్కో కళాశాలలో 2 గ్రూపులు ఏర్పాటు చేయనున్నారు. చండూరులోని కళాశాలలో ఎంపీసీ, బైపీసీ గ్రూపులను మంజూరు చేయగా, పెద్దవూర, దామరచర్ల మండలాల్లోని కళాశాలలకు ఎంపీహెచ్‌డబ్ల్యూ, సీఈసీ గ్రూపులను మంజూరు చేసింది. ఒక్కో గ్రూపుకు 40 సీట్లు ఉంటాయి. అంటే 2 గ్రూపులకు కలిపి ఒక్కో కళాశాలకు 80 సీట్లు మంజూరయ్యాయి. ఈ కళాశాలల్లో అధ్యాపకులను భర్తీ చేసేంత వరకు ఉన్నవారితోనే బోధన చేపట్టనున్నారు. అయితే ఈ మూడు మండలాల్లోని కేజీబీవీల్లో చదివే విద్యార్థినులతో పాటు జిల్లాలోని ఏ విద్యార్థులైనా ఈ కళాశాలల్లో చదివేందుకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఈనెల 17 నుంచి కళాశాలలు ప్రారంభం కానున్నాయి. వాటితో పాటే కేజీబీవీల్లోని కొత్త కళాశాలలు కూడా ప్రారంభిస్తారు. అప్పటిలోగా ఈ 3 కళాశాలల్లో సీట్లను భర్తీ చేసేందుకు అధికారులు దరఖాస్తు ప్రక్రియను చేపట్టారు. తల్లిదండ్రులు లేని విద్యార్థులకు అధిక ప్రాధాన్యం ఈ కళాశాలల్లో చేరేందుకు తల్లిదండ్రులు లేని, పేద విద్యార్థినులకు మొదటి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. మిగిలిన సీట్లను జిల్లాలోని విద్యార్థినులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆయా కేజీవీబీల్లో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థినులు కూడా చేరవచ్చు. ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చి చేరేందుకు అవకాశం కల్పించారు. ఆసక్తి చూపని విద్యార్థినులు ఆయా కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలల్లో కొత్తగా కళాశాలలు ఈ విద్యాసంవత్సరం ప్రారంభిస్తున్నా అదే పాఠశాలల్లో పదో తరగతి పాసైన విద్యార్థినులు మాత్రం చేరేందుకు పెద్దగా శ్రద్ధ చూపడంలేదు. అందుకు ప్రధాన కారణం తెలుగు మీడియంలోనే ఇంటర్ విద్య ప్రారంభించడం. కస్తూరిబాలో పదో తరగతి పాసైన వారు ఇంగ్లిష్ మీడియం కళాశాలలకు వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారు. మొత్తానికి ఈ సంవత్సరం మరో మూడు కస్తూరిబా కళాశాలలు మంజూరు కావడం వల్ల పేద విద్యార్థినులకైతే మేలు జరగనుంది. -
4,374 పాఠశాలల్లో 100 % ఉత్తీర్ణత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పదో తరగతి ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాలల సంఖ్య ఈసారి రెట్టింపైంది. గతేడాది 2,125 పాఠశాలల్లోనే 100 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా, ఈసారి అలాంటి పాఠశాలల సంఖ్య 4,374కు పెరిగింది. మరోవైపు సున్నా ఫలితాల పాఠశాలల సంఖ్య కూడా తగ్గిపోయింది. గతేడాది సున్నా ఫలితాలు వచ్చిన పాఠశాలలు 21 ఉంటే ఈసారి వాటి సంఖ్య 9కి తగ్గింది. రాష్ట్రవ్యాప్తంగా 11,026 ఉన్నత పాఠశాలలుంటే అందులో 4,374 పాఠశాలలు వంద శాతం ఉత్తీర్ణతను సాధించాయి. ఇక 100 శాతం ఫలితాలను సాధించిన పాఠశాలల్లో ప్రైవేటు పాఠశాలలు ఎక్కువగా ఉన్నాయి. 2,279 ప్రైవేటు స్కూళ్లలో వంద శాతం.. ఇక పదో తరగతి ఫలితాల్లో 2,279 ప్రైవేటు పాఠశాలల్లో వంద శాతం ఫలితాలు వచ్చాయి. గతేడాది 1,225 ప్రైవేటు పాఠశాలల్లో వంద శాతం మంది ఉత్తీర్ణులు కాగా ఈసారి వాటి సంఖ్య పెరిగింది. గతేడాది 76 కస్తూర్భాగాంధీ బాలిక విద్యాలయాల్లో (కేజీబీవీ) వంద శాతం ఫలి తాలు రాగా, ఈసారి 185 కేజీబీవీల్లో 100% ఫలితాలు వచ్చాయి. అలాగే గతేడాది 35 మోడల్ స్కూళ్లలోనే వంద శాతం ఫలితాలు రాగా, ఈసారి వాటి సంఖ్య 97కు చేరింది. గతేడాది వంద శాతం ఉత్తీర్ణత సాధించిన జిల్లా పరిషత్ పాఠశాలలు 686 ఉంటే ఈసారి వాటికి సంఖ్య రెట్టింపు కంటే ఎక్కువగా పెరిగింది. 1,580 జిల్లా పరిషత్తు పాఠశాలల్లో 100% ఉత్తీర్ణత నమోదైంది. ప్రభుత్వ పాఠశాలల్లోనూ 100 శాతం ఉత్తీర్ణత సాధించిన స్కూళ్ల సంఖ్య ఈ సారి పెరిగింది. సున్నా ఫలితాలు 9 స్కూళ్ల లో వస్తే అందులో 5 ప్రైవేటు స్కూళ్లే ఉన్నాయి. -
ఏ రోజు పాఠం.. ఆ రోజే పఠనం
నల్లగొండ : బాలికలను చదువుల్లో మేటిగా తయారుచేసి.. చదువుల తల్లులుగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో రాష్ట్ర సమగ్రశిక్షా అభియాన్ కొత్త పథకాలకు శ్రీకారం చుట్టింది. విద్యార్థినుల్లోని సృజనాత్మకత, సామర్థ్యాలను వెలికి తీసేందుకు సంకల్పించింది. ఇందులో భాగంగా కేజీబీవీల్లో విద్యార్థినులతో తరగతుల వారీగా క్లబ్‌లు ఏర్పాటు చేస్తోంది. పాఠశాలలో ఉపాధ్యాయుడు పాఠం చెప్పిన రోజునే ఈ క్లబ్లో చర్చించి.. చదువుతారు. ఇలా వారం రోజులపాటు చదివిన అంశాలపై వారాంతంలో పరీక్షలు నిర్వహించి విద్యార్థినుల్లో సామర్థ్యాన్ని పెంపొందిస్తారు. జిల్లాలో 27 కేజీబీవీలు ఉన్నాయి. వీటిలో చదివే బాలికల్లో సామర్థ్యం పెంపునకు క్లబ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. తరగతి గదిలో ఉపాధ్యాయుడు చెప్పిన పాఠాన్ని అదే రోజు చదివి సామర్థ్యాన్ని పెంచుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అందులో భాగంగానే పాఠ్యాంశాలవారీగా ఆ క్లబ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. 6 నుంచి 10వ తరగతి వరకు ప్రతి తరగతికి ఆయా పాఠ్యాంశాల వారీగా ఈ క్లబ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. క్లబ్‌ల ఏర్పాటు ఇలా.. జిల్లాలోని 27 కేజీబీవీల్లో ఆరు నుంచి పది తరగతులకు ఒక్కో క్లబ్ ఏర్పాటు చేస్తారు. ఈ క్లబ్లో బాగా చదివే, మధ్యస్థంగా చదివే, బాగా తెలివైన, చెబితే అర్థం చేసుకోగలిగే విద్యార్థినులను సభ్యులుగా ఉంచుతారు. వీరిలో ప్రతిభావంతురాలయిన విద్యార్థిని ఈ క్లబ్‌కు లీడర్‌గా వ్యవహరిస్తారు. అవసరమైతే సంబంధిత క్లాస్ టీచర్ లేదా గైడ్ టీచర్ సలహాలు తీసుకుంటారు. రోజూ పాఠశాల ముగిసిన అనంతరం 3.45 నుంచి 4.30 గంటల వరకు ఆ రోజు తరగతి గదుల్లో ఉపాధ్యాయుడు బోధించిన పాఠ్యాంశాలను ఈ సమయంలో క్లబ్‌ల్లో పఠనం చేస్తారు. క్లాస్ టీచర్‌తోపాటు గైడ్ టీచర్ కూడా ఇందులో సభ్యురాలిగా ఉంటారు. తరగతిలోని ప్రతి విద్యార్థిని ఇందులో సభ్యులుగా ఉంటారు. ఏరోజు పాఠం ఆ రోజే చదవడం, పాఠం ఎంతవరకు అర్థమైంది.. ఒక వేళ అర్థంకాకపోతే.. మొదట తరగతి గదిలో లీడర్‌తో చెప్పించుకుంటారు. అయినా అర్థం కాకపోతే ఉపాధ్యాయులను కూడా అడిగి దానిపై అవగాహన తెచ్చుకునే విధంగా క్లబ్‌లు దోహదం చేస్తాయి. దీని ద్వారా విద్యార్థుల మధ్య పాఠ్యాంశం చర్చకు వచ్చి సులభంగా అర్థమవుతుంది. ఇలా క్లబ్‌ల్లో పాఠ్యాంశాలను చర్చించడం ద్వారా విద్యార్థుల మెదళ్లలో ఆ అంశాలు అలాగే ఉండిపోతాయి. వారాంతంలో పోటీ పరీక్షలు వారాంతంలో ఆయా పాఠ్యాంశాలపై ప్రతి తరగతిలో విద్యార్థినులకు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విధంగా పరీక్షలు నిర్వహిస్తారు. అంతేగాక క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. తద్వారా విద్యార్థుల్లో దాగిఉన్న సృజనాత్మకత బయటకు రావడంతో పాటు వారి కళలను కూడా బయటికి తీసుకొచ్చేందుకు ఈ కార్యక్రమాలు ఎంతగానో దోహదపడనున్నాయి. క్లబ్‌లు బాలికల చదువుకు ఎంతోమేలు కస్తూరిబా గాంధీ పాఠశాలల్లో తరగతుల వారీగా విద్యార్థినులు క్ల బ్లుగా ఏర్పడి ఏరో జు పాఠం ఆరోజే చదవడం వల్ల వారు జ్ఞానం సంపాదించుకుంటున్నారు. అంతేకాక ఏరోజు కారోజు చదవడం వల్ల పరీక్షల సందర్భంలో ఒకేసారి చదవాల్సిన భారం ఉండదు. దాని ద్వారా విద్యార్థులు మంచి విద్యను పొందడంతో పాటు సులువుగా పరీక్షలు రాయగలుగుతారు. – అరుణశ్రీ, సెక్టోరియల్ అధికారి -
భయం.. భయంగా..
బాలికలు.. ముఖ్యంగా అనాథలు.. మధ్యలోనే చదువు మానేసిన వారికి బంగారు భవిష్యత్ అందించే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన కేజీబీవీల్లో భద్రత గాలిలో దీపంలా మారింది. పర్యవేక్షణ కొరవడడం, సీసీ కెమెరాలు ఉన్నా సరిగా పని చేయకపోవ డం, చాలా చోట్ల ప్రహరీలు నిర్మించకపోవడం వంటి కారణాల వల్ల బాలికలకు రక్షణ లేకుండా పోతోంది. స్కూళ్లలోకి ఆగంతకులు చొరబడుతున్నారు. స్పెషలాఫీసర్లు నైట్‌డ్యూటీలకు డుమ్మా కొడుతున్నారు. చిత్తూరు, సాక్షి: జిల్లా వ్యాప్తంగా 20 కేజీబీవీలున్నాయి. వీటిలో 3840 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. విద్యార్థినులకు తగినట్టు సిబ్బంది లేరు. 20 స్కూళ్లకు 20 మం ది స్పెషలాఫీసర్లు ఉన్నా.. వారిలో చాలా మంది నైట్‌డ్యూటీలకు డుమ్మా కొడుతున్నారు. సబ్జెక్టు సీఆర్డీలు 20 మంది, పీఈటీలు 2, వొకేషనల్ ఇన్స్ట్రక్టర్లు, అకౌంటెంట్ల కొరత వేధిస్తోం ది. కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్లు, స్వీపర్, డే అండ్ నైట్ వాచ్మెన్, కుక్‌లు ఒక్కరు చొప్పున ఖాళీలున్నాయి. మరో ఐదుగురు పీఈటీలు కావాలి. జిల్లా వ్యాప్తంగా 27 ఖాళీలున్నాయి. దీనికి తోడు సిబ్బంది నిర్లక్ష్యం కూడా విద్యార్థుల పాలిట శాపంగా మారుతోంది. ఒక్కో కేజీబీవీలో 23 మంది స్టాఫ్ ఉండాలి. వీరిలో 10 మంది టీచింగ్, 13 మంది నాన్ టీచింగ్ స్టాఫ్ ఉండాలి. టీచింగ్ స్టాఫ్‌లో ఒకరు, నాన్ టీచింగ్ స్టాఫ్ ఒకరురాత్రి పూట విధులు నిర్వర్తించాలి. 23 మందిలో ప్రతి ఒక్కరూ నైట్ డ్యూటీ చేయాల్సి ఉంది. ఈ క్రమంలో స్పెషలాఫీసర్ కూడా నెలలో ఒక రోజు నైట్ డ్యూటీ చేయాలి. ఇవి అమలు కావడం లేదు. తూతూ మంత్రంగా నైట్ డ్యూటీలు చేస్తున్నారు. ఎస్ఓలు కూడా చుట్టపుచూపుగా వచ్చి వెళుతున్నారనే విమర్శలున్నాయి. భద్రత గాలికి.. జిల్లాలో శాంతిపురం, రామకుప్పం, గంగవరం, బైరెడ్డిపల్లి, నిమ్మనపల్లి, కురుబలకోట, రామసముద్రం, కేవీబీపురం, గుడుపల్లి, కేవీపల్లి, యర్రావారిపాళ్యంలోని కేజీబీవీలకు ప్రహరీలు లేవు. చాలా స్కూళ్లకు రహదారి సమస్య కూడా ఉంది. వీటి గురించి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదు. ప్రహరీలు లేకపోవడంతో అపరిచిత వ్యక్తులు విద్యాలయాల్లోకి ప్రవేవిశిస్తున్నారని తెలుస్తోంది. ఇది బయటికి పొక్కకుండా స్కూల్ యాజమాన్యం జాగ్రత్తలు తీసుకుంటోంది. కొన్నిచోట్ల ఎస్ఎస్ఏ ఆధ్వర్యంలోనూ, మరికొన్ని చోట్ల పోలీసు శాఖ ఆధ్వర్యంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇవి చాలాచోట్ల పని చేయడం లేదు. ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని కేజీబీవీ సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. కేవీబీపురం లాంటి చోట్ల సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. నిమ్మనపల్లి స్కూలు గుట్టపైన ఉంది. దీనికి ప్రహరీ లేకపోవడంతో విద్యార్థినులు ఇబ్బంది పడుతున్నారు. తనిఖీలు నిర్వర్తించని ఎస్ఎస్ఏ అధికారులు.. ఎస్ఎస్ఏలోని జీసీడీఓ విభాగం అధికారులు నిత్యం కేజీబీవీలను సందర్శించాల్సి ఉంటుంది. అక్కడి పరిస్థితులను పరిశీలించి, సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సి ఉంటుంది. అయితే వారు చుట్టపు చూపుగా వెళుతున్నందునే కేజీబీవీల్లో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తత్ఫలితంగా బాలికల భద్రత గాలిలో దీపంలా మారిందని విమర్శలున్నాయి. ఇప్పటికైనా ప్రహరీలు, సీసీ కెమెరాలపై శ్రద్ధ పెట్టాలని పలువురు కోరతున్నారు. 10 కేజీబీవీలకు ప్రహరీ గోడలు లేవు జిల్లాలోని 10 కేజీబీవీలకు ప్రహరీ గోడలు లేవు. వాటికి కూడా మంజూరు అయ్యా యి. కొన్ని ప్రాంతాల్లో నిర్మాణాలు సైతం జరుగుతున్నాయి. కేవీపల్లె కేజీబీవీలో అపరిచిత వ్యక్తులు వెళ్లారని చెప్పడం అబద్ధం. దీన్ని స్పెషల్ ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లాం. స్పెషల్ ఆఫీసర్లందరూ తప్పనిసరిగా కేజీబీవీలను సందర్శించాలి. – శ్యామాలదేవి, జీసీడీఓ -
కేజీబీవీల్లో ఇంటర్‌కు గ్రీన్‌సిగ్నల్
సాక్షి, కరీంనగర్ ఎడ్యుకేషన్ : బాలికల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయాల్లో(కేజీబీవీ) ఇంటర్ బోధనకు ఈవిద్యా సంవత్సరం నుంచే గ్రీన్‌సిగ్నల్ లభించింది. అనాథలు, పేద కుటుంబాల బాలికలకు పాఠశాలస్థాయి విద్యను అందిస్తున్న వీటిలో ఉన్నత విద్యను అందించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. డిప్యూటి సీఎం కడియం శ్రీహరి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి కస్తూరిభా పాఠశాలల్లో ఇంటర్మీడియట్ విద్యను ప్రారంభించేందుకు చొరవ చూపారు. ఈ మేరకు ఈ విద్యా సంవత్సరం నుంచే ఇంటర్ తరగతులు ప్రారంభించేలా విద్యాశాఖ ఇప్పటికే ఏర్పాట్లల్లో మునిగింది. నాలుగు కేజీబీవీల్లో ఇంటర్మీడియట్ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో మొదటిగా నాలుగు కేజీబీవీల్లో ఇంటర్మీడియట్ విద్యను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరీంనగర్ నియోజకవర్గంలోని సప్తగిరికాలనీ లో కేజీబీవీ పాఠశాల, చొప్పదండిలోని గంగాధర, మానకొండూర్‌లోని శంకరపట్నం, హుజూరాబాద్‌లోని జమ్మికుంట కేజీబీవీల్లో ఇంటర్ తరగతులు ప్రారంభం కానున్నాయి. కరీంనగర్, శంకరపట్నం, జమ్మికుంట కేజీబీవీల్లో ఎంపీసీ, బైపీసీ, గంగాధర కేజీబీవీలో సీఈసీ, ఎంపీహెచ్‌డబ్ల్యూ కోర్సులు ఏర్పాటు కానున్నాయి. వీటిల్లోను రెండింట్లో ఎంపీసీ, బైపీసీ కోర్సులు, రెండింట్లో సీఈసీ, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్(ఎంపీహెచ్‌డబ్ల్యూ) కోర్సులను ఏర్పాటు చేశారు. ఒక్క కోర్సులో 40 మందికి ప్రవేశాలు కల్పించనున్నారు. జిల్లావ్యాప్తంగా నాలుగు పాఠశాలల్లో 160 సీట్లను భర్తీ చేయనున్నారు. పదో∙తరగతి పూర్తి చేసినవారితోపాటు, ఇతర పాఠశాలల్లో చదివిన వారు కూడా ప్రవేశాలు పొందవచ్చు. బోధనతో పాటు ఉచిత వసతి, భోజనం, ఇతర సదుపాయాలను ప్రభుత్వమే కల్పించనుంది. 13 వరకు దరఖాస్తుల గడువు కేజీబీవీల్లో ఇంటర్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈనెల 13లోగా దరఖాస్తులు సమర్పించాలని డీఈవో వెంకటేశ్వర్లు సూచించా రు. అనాథలు, నిరుపేదలు పదో తరగతి పూర్తి చేసుకున్నవారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. హాస్టల్ వసతి కల్పిస్తామని, ఎలాంటి ఫీజూ చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. ఈనెల 25నుంచి తరగతులు తెలుగు మీడియంలో ప్రారంభమవుతాయని వెల్లడించారు. సిబ్బంది నియామకం ప్రస్తుతం కేజీబీవీల్లో సిబ్బంది కొరతతో సతమ తం అవుతున్నారు. కొత్తగా నాలుగుచోట్ల ఇంటర్ ప్రవేశపెడుతుండడంతో బోధకుల కొరత సమస్యగా మారింది. పోస్టుగ్రాడ్యుయేట్ కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్(పీజీసీఆర్టీ)లను నియామకం చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఒప్పంద పద్ధతిలో నియామకాలు ఉంటాయని, గౌరవ వేతనం రూ.23 వేల వరకు ఉంటుందని అధికారులు వెల్లడించారు. గణితం, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, తెలుగు, ఆంగ్లం, బోటనీ, జువా లజీ, కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్, జనరల్ ఫౌం డేషన్ నర్సింగ్ కోర్సులతోపాటు 28 పోస్టులు ఉ న్నాయని, అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు 13 లోగా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. -
కానుక ఏదీ?
కస్తూర్బా విద్యాలయాలను పటిష్టం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించింది. విద్యార్థినులకు పౌష్టికాహారం అందించేందుకు జనవరి 1నుంచి ప్రభుత్వం కొత్త మెనూ ప్రవేశపెట్టింది. అయితే ఇప్పటివరకు ఏం వడ్డించాలనేదానిపై స్పష్టత లేకపోవడంతో పాఠశాలలో కొత్త మెనూ అమలు కావడంలేదు. దన్వాడ (నారాయణ్ పేట్) : కస్తూర్బా పాఠశాలో విద్యార్థినులకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నూతన మెనూ ప్రవేశపెట్టింది. గురుకుల విద్యాలయాలను పటిష్టం చేయాలనే ఉద్దేశంతో వారంలో నాలుగు రోజులు మాంసాహారం అందిస్తామన్న ప్రభుత్వ ప్రకటన నీటి మూటలుగానే మిగిలింది. అధికారులు గుడ్డుతోనే సరిపుచ్చుతున్నారు. జనవరి మొదటి వారం నుంచి కొత్త మెనూ అమలు చేస్తామని ప్రభుత్వం ముందస్తుగానే ప్రకటించింది. ఎలా అమలు చేయాలనే అంశంపై స్పష్టత లేకపోవడంతో అధికారులు, పాఠశాల ప్రత్యేక అధికారులు జాప్యం చేస్తున్నారు. పౌష్టికంగా ఉండేందుకే.. ప్రభుత్వ వసతిగృహంలో ఎక్కువశాతం, పేద మధ్యతరగతి వారే అధికంగా ఉంటారు. వీరికి సరైన ఆహారం అందించడంతోపాటు పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ప్రభుత్వం పూనుకుంది. ఇప్పటికే ప్రతి ఆదివారం కోడి కూర, వారంలో ఐదు రోజులు కోడి గుడ్లు వండి వడ్డిస్తున్నారు. అదనంగా రోజూ నెయ్యి, నెలలో రెండు రోజులు మాంసాహారం పెట్టేందుకు నిర్ణయించారు. పాలు, చపాతి, పల్లిపట్టి, ఇడ్లీ, పూరి వంటి అల్పాహారం అందిస్తున్నారు. కొత్త మెనూతో బాలికల్లో రక్తహీనత, ఆరోగ్య సమస్యలు తగ్గుతాయని విద్యార్థులు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా చదువుపై దృష్టి సారిస్తారని తల్లితండ్రులు విద్యార్థులను పాఠశాలలో చేర్పించేందుకు ఆసక్తి చుపిస్తారని ప్రభుత్వం కొత్త మెనుకు శ్రీకారం చుట్టింది. ఈనెల 2నుంచే అమలు చేయాల్సి ఉన్నా.. తల్లిదండ్రులకు దూరంగా ఉన్న విద్యార్థినులకు పౌష్టికాహారం అందించేందుకు ఈనెల 2 నుంచి కొత్త ఆహార పట్టిక అమలు చేయాల్సి ఉంది. కాని అధికారులు టెండర్ ప్రక్రియ పూర్తి చేయకపోవడం లేక అమలులో లోపంతో మెనూ ప్రకటనకే సరిపోయింది. విద్యార్థుల తల్లిదండ్రులు కొత్త మెనూను ప్రవేశ పెట్టలని కోరుతున్నారు. కొత్తమెనూపై స్పష్టతలేదు కొత్త మెనూకు సంబంధించిన బోర్డును పాఠశాలలో ఏర్పాటు చేశారు. కాని ఇప్పటికీ ఎంత వడ్డించాలి, కొత్త టెండర్ వేయాలా వద్దా అనే స్పష్టతలేదు. పాత టెండర్దారులకే అప్పగిస్తారా అనే అంశం కూడా తెలియడంలేదు. రెండురోజుల్లో పూర్తి సమాచారం రాగానే ప్రారంభిస్తాం. – సంగీత, మండల విద్యాశాఖ అధికారి -
మెనూ.. అదిరెను
ప్రత్యేక వసతి.. సకల సౌకర్యాలు.. మెరుగైన బోధన.. మంచి ఫలితాలు.. కోట్లాది రూపాయల వ్యయంతో భవన నిర్మాణాలు. విద్యార్థినులకు పౌష్టికాహారం అందించేందుకు ‘నూతన’ మెనూ. రాష్ట్రంలోని కస్తూర్బా బాలికల విద్యాలయాలకు మరిన్ని నిధులు కేటాయిస్తూ.. నెలలో మూడుసార్లు చికెన్(కోడి మాంసం), రెండుసార్లు మటన్(మేక మాంసం), మిగతా రోజుల్లో గుడ్లు అందించనున్నారు. జిల్లావ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో ఈ ప్రక్రియను వేగవంతం చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఖమ్మంజెడ్పీసెంటర్ : జిల్లాలోని 14 మండలాల్లో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు ఉన్నాయి. వీటిలో 2,533 మంది బాలికలు విద్యనభ్యసిస్తున్నారు. 6 నుంచి 10వ తరగతి వరకు ఉచిత విద్యాబోధన సాగుతోంది. 6వ తరగతిలో 440 మంది, 7లో 480 మంది, 8లో 571 మంది, 9లో 526 మంది, 10వ తరగతిలో 516 మంది విద్యార్థులున్నారు. బోనకల్, చింతకాని, కామేపల్లి, ఖమ్మం అర్బన్, కొణిజర్ల, ముదిగొండ, పెనుబల్లి, తిరుమలాయపాలెం, ఎర్రుపాలెం, ఖమ్మం రూరల్, ఏన్కూరు, కూసుమంచి, సింగరేణి, రఘునాథపాలెం మండలాల్లో కస్తూర్బా పాఠశాలలున్నాయి. సౌకర్యాల్లో మేటి.. అనాథలు.. బడి బయట ఉండి.. చదువు మానేసిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కస్తూర్బా గాంధీ విద్యాలయాలను ఏర్పాటు చేసింది. చదువుతోపాటు ఉచిత వసతి సౌకర్యం కల్పిస్తోంది. భవన నిర్మాణాలను కోట్లాది రూపాయల వ్యయంతో చేపడుతోంది. నిరుపేదలకు చదువులు అందించేందుకు ఏర్పా టు చేసిన పాఠశాలలను కార్పొరేట్‌కు దీటుగా తీర్చిదిద్దుతున్నారు. విద్యార్థినులకు ప్రత్యేకంగా వసతి సౌకర్యాలు, కాస్మొటిక్స్, దుస్తులు అందిస్తున్నారు. చదువులు, ఆటలు, జ్ఞాపకశక్తి పెంపొందించేందుకు పౌష్టికాహారం అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. దీనికి తోడు కేజీబీవీల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి.. ఆన్లైన్ చేశారు. జిల్లా కేంద్రం నుంచి కేజీబీవీల్లో నిర్వహిస్తున్న తరగతులు, వారికి అందుతున్న ఆహారం, విద్యార్థినుల పట్ల ఉపాధ్యాయులు తీసుకుంటున్న శ్రద్ధ తదితరాలను వీక్షించే వీలుంటుంది. ఆరోప్లాంట్లతోపాటు బయోమెట్రిక్ విధానాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నారు. మెనూ ఇలా.. ఎదిగే పిల్లలు అనారోగ్యం బారినపడకుండా.. దారుఢ్యంగా ఉండేందుకు వసతులతోపాటు మంచి భోజనం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సరైన ఆహారం అందిస్తే విద్యార్థినులు అలసట లేకుండా ఉల్లాసంగా ఉండడంతోపాటు చదువుపై మరింత శ్రద్ధ కనబరిచేలా ఈ ప్రణాళికకు రూపకల్పన చేసింది. దీంతో నూతన మెనూ అమలు చేసేందుకు చర్యలు చేపట్టింది. రోజూ ఉదయం బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రి డిన్నర్ ఉంటుంది. వారంలో ఉదయం చపాతి, ఇడ్లి, ఉప్మా, పూరీ, ఇడ్లి, అటుకుల ఉప్మా ఉంటుంది. భోజనం బగారా, మొదటి, మూడవ, ఐదవ ఆదివారాల్లో చికెన్ మాంసం, రెండు, నాలుగో ఆదివారం మటన్ కర్రీ, వెజిటేబుల్ కుర్మా, మిగతా రోజుల్లో ఉడికించిన గుడ్డు, నెయ్యి, వీటితోపాటు పప్పు, రసం, బెండకాయ, ఆలుగడ్డ, పెరుగు, చిక్కుడు కూరలు ఉంటాయి. ఈవెనింగ్ స్నాక్స్, రాత్రి డిన్నర్లో రైస్, చట్ని, సాంబార్, బటర్‌మిల్క్, బీన్స్, అరటి(పండ్లు) అందించనున్నారు. టెండర్ ప్రక్రియలో ఉంది.. ప్రభుత్వం కేజీబీవీ విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని నిర్ణయించింది. దీనిలో మటన్, చికెన్, గుడ్డు విధిగా అందించేలా చర్యలు చేపట్టాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఆదేశాలు జారీ చేశారు. విద్యార్ధునులకు మెరుగైన సౌకర్యాల కల్పన దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మటన్, చికెన్ అందించేందుకు టెండర్ల ప్రక్రియ జరగనుంది. జేసీ, డీఈఓలు ఈ ప్రక్రియ చేపడుతున్నారు. మటన్, చికెన్‌తో భోజనం అందించేలా చర్యలు చేపడుతున్నాం – సూర్యదేవర అజిత, సెక్టోరియల్ అధికారి -
అర్ధాకలి!
కేజీబీవీ విద్యార్థినుల ‘భోజన’ ఇబ్బందులు పెరిగిన ధరలకు సరిపడని మెస్ చార్జీలు ఉన్నవాటితోనే సర్దుకుపోతున్న ఎస్ఓలు సంగారెడ్డి మున్సిపాలిటీ: నెలకు ఇచ్చేది వెయ్యి రూపాయలు.. కానీ, పౌష్టికాహారం మాత్రం క్రమంతప్పకుండా అందించాలి. ఇదీ కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాలకు ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు. పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలు ఉండటకపోవడంతో పేద విద్యార్థినులు అర్ధాకలితో అలమటిస్తున్నారు. పాత రేట్లకు కొన్నిచోట్ల కాంట్రాక్టర్లు సరుకులు సరఫరా చేయకపోవంతో నిర్వాహకులే సొంతంగా ఖర్చులు భరిస్తున్నారు. పాత ధరలతో ఇబ్బందులు సోషల్ వెల్ఫేర్ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ సూచనల మేరకు వసతి గృహాల విద్యార్థులతో పాటు కస్తూర్భా గాంధీ బాలికల విద్యాయాల్లోని విద్యార్థినులకు ఒకే మెనూ అందించాలని ఆదేశాలు జారీ చేశారు. కానీ, గతంలో ఉన్న ధరలకు అనుగుణంగానే కేజీబీవీల్లో సరుకుల రేట్లు నిర్ణయించారు. దీంతో విద్యార్థినులకు ఇచ్చే మెనూ ఏమాత్రం సరిపోవడం లేదు. అంతేకాకుండా కొన్ని ప్రాంతాల్లో కూరగాయలు, పండ్లు, గుడ్లు సరఫర చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో ఎస్‌ఓలే సరఫరా చేసి బిల్లులు చేయించుకుంటున్నట్టు తెలిసింది. నెలకు రూ.1000 మాత్రమే జిల్లావ్యాప్తంగా 43 కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాల్లో 8,504 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రధానంగా చదువు మానేసిన 6 నుంచి 10వ తరగతి వి«ద్యార్థినిలను కేజీబీవీల్లో చేర్పించి.. వారికి పౌష్టికాహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే ప్రతిరోజు ఉదయం పాలు, టిఫిన్(ఉప్మా, చట్నీ, అరటిపండు) మధ్యాహ్నం అన్నం, పప్పు.. రాత్రికి కూరగాయలతో భోజనం అందించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆదివారం ఎగ్‌రైస్ తప్పనిసరిగా వడ్డించాలి. ఇందుకోసం ఒక్కో విద్యార్థినిపై నెలకు కేవలం రూ.1000 మాత్రమే ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. ఇది 2011 లెక్కల ఆధారంగా ప్రభుత్వం ఇస్తున్న మెస్ చార్జీలు. గతంలో ఉన్న ధరలతో పోల్చితే ప్రస్తుతం ధరలు అధికమయ్యాయి. దీంతో కేజీబీవీలకు కూరగాయలు, పాలు, పండ్లు సరఫరా చేసే కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. ఫలితంగా హాస్టల్ ఇన్‌చార్జిలే సొంతంగా డబ్బులు ఖర్చుచేసి మెనూ పాటిస్తున్నారు. పెరిగిన ధరలు గతంలో రెండు రూపాయలు ఉన్న గుడ్డు.. నేడు ఐదు రూపాయలకు చేరింది. గతంలో డజన్ అరటిపండ్లు రూ.20 ఉండగా.. ప్రస్తుతం రూ.40 నుంచి రూ.50 ఉన్నాయి. గతంలో పామాయిల్ ధర రూ.55 ఉండగా.. నేడు రూ.85 నుంచి రూ.105 వరకు ఉంది. కూరగాయలు రూ.40కి తక్కువగా అందుబాటులో లేవు. దీంతో ప్రస్తుతం ఉన్న ధరలకు అనుగుణంగా వచ్చిన దాంట్లోనే భోజనం వండుతున్నారు. పండ్లు, గుడ్లు ఇస్తున్నారు: శ్రావణి, విద్యార్థిని మా హాస్టల్లో మెనూ ప్రకారమే భోజనం అందిస్తున్నారు. పాలు, పండ్లు, కూరగాయ భోజనం ఇస్తున్నారు. అయితే, మాకు ఇస్తున్న మెస్ చార్జీలు ఏ మాత్రం సరిపోవడం లేదు. ఇబ్బందులు ఉన్నాయి: ఇందిరా, ఎస్ఓల సంఘం జిల్లా అధ్యక్షురాలు ప్రభుత్వ ఆదేశాల మేరకు మెనూ అందించాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నాం. ప్రతి విద్యార్థినికి నెలకు ఇస్తున్న మెస్ చార్జీలు సరిపోవడం లేదు. గతంతో పోల్చితే ఇప్పుడున్న ధరలు 30 శాతం పెరిగాయి. దీంతో సర్దుకోలేకపోవతున్నాం. ప్రభుత్వం మెస్ చార్జీలు పెంచాల్సిన అవసరం ఉంది. కొత్త మెస్ చార్జీలు అమలుచేస్తాం: యాస్మిన్ భాషా, పీఓ పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలు పెంపు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ, బీసీ వెల్ఫేర్ శాఖలు ఆమోదించిన ధరలకు సరుకులు సరఫరా చేయడం కోసం టెండర్లు సిద్ధం చేశాం.