అర్ధాకలి! | mid-day meals problems | Sakshi
Sakshi News home page

అర్ధాకలి!

Published Tue, Sep 20 2016 8:39 PM | Last Updated on Fri, Nov 9 2018 4:45 PM

హాస్టల్‌ విద్యార్థుల మెనూ చార్ట్‌ - Sakshi

హాస్టల్‌ విద్యార్థుల మెనూ చార్ట్‌

  • కేజీబీవీ విద్యార్థినుల ‘భోజన’ ఇబ్బందులు
  • పెరిగిన ధరలకు సరిపడని మెస్‌ చార్జీలు
  • ఉన్నవాటితోనే సర్దుకుపోతున్న ఎస్‌ఓలు
  • సంగారెడ్డి మున్సిపాలిటీ: నెలకు ఇచ్చేది వెయ్యి రూపాయలు.. కానీ, పౌష్టికాహారం మాత్రం క్రమంతప్పకుండా అందించాలి. ఇదీ కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాలకు ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు. పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్‌ చార్జీలు ఉండటకపోవడంతో పేద విద్యార్థినులు అర్ధాకలితో అలమటిస్తున్నారు. పాత రేట్లకు కొన్నిచోట్ల కాంట్రాక్టర్లు సరుకులు సరఫరా చేయకపోవంతో నిర్వాహకులే సొంతంగా ఖర్చులు భరిస్తున్నారు.

    పాత ధరలతో ఇబ్బందులు
    సోషల్‌ వెల్ఫేర్‌ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్‌ సూచనల మేరకు వసతి గృహాల విద్యార్థులతో పాటు కస్తూర్భా గాంధీ బాలికల విద్యాయాల్లోని విద్యార్థినులకు ఒకే మెనూ అందించాలని ఆదేశాలు జారీ చేశారు. కానీ, గతంలో ఉన్న ధరలకు అనుగుణంగానే కేజీబీవీల్లో సరుకుల రేట్లు నిర్ణయించారు. దీంతో విద్యార్థినులకు ఇచ్చే మెనూ ఏమాత్రం సరిపోవడం లేదు. అంతేకాకుండా కొన్ని ప్రాంతాల్లో కూరగాయలు, పండ్లు, గుడ్లు సరఫర చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో ఎస్‌ఓలే సరఫరా చేసి బిల్లులు చేయించుకుంటున్నట్టు తెలిసింది.

    నెలకు రూ.1000 మాత్రమే
    జిల్లావ్యాప్తంగా 43 కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాల్లో 8,504 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రధానంగా చదువు మానేసిన 6 నుంచి 10వ తరగతి వి«ద్యార్థినిలను కేజీబీవీల్లో చేర్పించి.. వారికి పౌష్టికాహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే ప్రతిరోజు ఉదయం పాలు, టిఫిన్‌(ఉప్మా, చట్నీ, అరటిపండు) మధ్యాహ్నం అన్నం, పప్పు.. రాత్రికి కూరగాయలతో భోజనం అందించాల్సి ఉంటుంది.

    అంతేకాకుండా ఆదివారం ఎగ్‌రైస్‌ తప్పనిసరిగా వడ్డించాలి. ఇందుకోసం ఒక్కో విద్యార్థినిపై నెలకు కేవలం రూ.1000 మాత్రమే ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. ఇది 2011 లెక్కల ఆధారంగా ప్రభుత్వం ఇస్తున్న మెస్‌ చార్జీలు. గతంలో ఉన్న ధరలతో పోల్చితే ప్రస్తుతం ధరలు అధికమయ్యాయి. దీంతో కేజీబీవీలకు కూరగాయలు, పాలు, పండ్లు సరఫరా చేసే కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. ఫలితంగా హాస్టల్‌ ఇన్‌చార్జిలే సొంతంగా డబ్బులు ఖర్చుచేసి మెనూ పాటిస్తున్నారు.

    పెరిగిన ధరలు
    గతంలో రెండు రూపాయలు ఉన్న గుడ్డు.. నేడు ఐదు రూపాయలకు చేరింది. గతంలో డజన్‌ అరటిపండ్లు రూ.20 ఉండగా.. ప్రస్తుతం రూ.40 నుంచి రూ.50 ఉన్నాయి. గతంలో పామాయిల్‌ ధర రూ.55 ఉండగా.. నేడు రూ.85 నుంచి రూ.105 వరకు ఉంది. కూరగాయలు రూ.40కి తక్కువగా అందుబాటులో లేవు. దీంతో ప్రస్తుతం ఉన్న ధరలకు అనుగుణంగా వచ్చిన దాంట్లోనే భోజనం వండుతున్నారు.

    పండ్లు, గుడ్లు ఇస్తున్నారు: శ్రావణి, విద్యార్థిని
    మా హాస్టల్‌లో మెనూ ప్రకారమే భోజనం అందిస్తున్నారు. పాలు, పండ్లు, కూరగాయ భోజనం ఇస్తున్నారు. అయితే, మాకు ఇస్తున్న మెస్‌ చార్జీలు ఏ మాత్రం సరిపోవడం లేదు.

    ఇబ్బందులు ఉన్నాయి: ఇందిరా, ఎస్‌ఓల సంఘం జిల్లా అధ్యక్షురాలు
    ప్రభుత్వ ఆదేశాల మేరకు మెనూ అందించాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నాం. ప్రతి విద్యార్థినికి నెలకు ఇస్తున్న మెస్‌ చార్జీలు సరిపోవడం లేదు. గతంతో పోల్చితే ఇప్పుడున్న ధరలు 30 శాతం పెరిగాయి. దీంతో సర్దుకోలేకపోవతున్నాం. ప్రభుత్వం మెస్‌ చార్జీలు పెంచాల్సిన అవసరం ఉంది.

    కొత్త మెస్‌ చార్జీలు అమలుచేస్తాం: యాస్మిన్‌ భాషా, పీఓ
    పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్‌ చార్జీలు పెంపు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ, బీసీ వెల్ఫేర్‌ శాఖలు ఆమోదించిన ధరలకు సరుకులు సరఫరా చేయడం కోసం టెండర్లు సిద్ధం చేశాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement