బాధితులు
సాక్షి, మంచిర్యాల: ఆమె ఓ సాధారణ గృహణి. కానీ.. అసాధారణ మోసానికి పాల్పడింది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 132 మందికి ఉద్యోగాలిప్పిస్తానని మోసం చేసి రూ.కోటికి పైగా వసూలు చేసింది. ఉద్యోగాలు రాకపోగా.. ఇచ్చిన డబ్బులైనా వాపసు ఇవ్వాలని బాధితులు ఒత్తిడి తేవడంతో ఐపీ అడ్డం పెట్టుకుని తప్పించుకునేందుకు ఎత్తులు వేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. మోసపోయినట్లు గ్రహించిన బాధితులు సోమవారం డీసీపీని ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగు చూసింది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన ఠాకుర్ సుమలత సాధారణ గృహిణి. బెల్లంపల్లి మండలం తాండూర్‌లో ఉన్న కేజీబీవీ పాఠశాలలో ఏఎస్‌ఓగా పనిచేస్తున్నానని, అధికార పార్టీ నేతలు తనకు తెలుసని నమ్మబలుకుతూ ఉద్యోగాలిప్పిస్తానంటూ రెండున్నరేళ్లుగా నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసింది.
గురుకులాల్లోని బోధన, బోధనేతర ఉద్యోగాలేవైనా ఇప్పిస్తానంటూ ఎర వేసింది. ఉమ్మడి జిల్లాలోని బెల్లంపల్లి, కాగజ్‌నగర్, మంచిర్యాల, కాసిపేట మండలాలకు చెందిన 132 మంది నుంచి వారి ఉద్యోగ ‘అర్హత’లను బట్టి రూ.లక్ష నుంచి రూ.4 లక్షల చొప్పున సుమారు రూ.1.50 కోట్లు వసూలు చేసింది. ఒకవేళ ఉద్యోగాలు రాకపోతే డబ్బులు వాపసు ఇస్తానంటూ ప్రామిసరీ నోట్లు, ఖాళీ చెక్‌లు, బాండ్‌లపై ఒప్పందాలూ చేసుకుంది. చివరకు ఈ నెల 14న 132 మందికి తాను ఐపీ పెట్టినట్లు నోటీసులు పంపించింది. ఐపీ పెట్టే ఉద్దేశంతోనే పథకం ప్రకారం అప్పుపత్రాలు రాయించుకుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఐపీ నోటీసులతో ఆందోళనలో బాధితులు
అయితే ఉద్యోగం.. లేదంటే డబ్బులు వాపసు వస్తాయనుకున్న బాధితులకు సదరు మహిళ ఇచ్చిన ఐపీ షాక్‌తో లబోదిబోమంటున్నారు. ఊహించని విధంగా ఐపీ నోటీసులు రావడం, అనంతరం సదరు మహిళ సెల్‌ఫోన్ స్విచ్ఛాఫ్ ఉండటంతో బాధితులు ఆందోళనకు గురవుతున్నారు. దీంతో తమకు న్యాయం చేయాలంటూ సోమ వారం డీసీపీ రక్షిత కే.మూర్తిని కలసి వేడుకున్నారు. డబ్బులు వసూళ్లలో సుమలతతోపాటు ఆమె కారు డ్రైవర్ సాయి అలియాస్ శ్రీనివాస్ కీలక పాత్ర పోషించినట్లు బాధితులు చెబుతున్నారు. డబ్బులు శ్రీనివాస్ తీసుకుని సుమలతకు ఇచ్చేవాడని గుర్తు చేస్తున్నారు.
పుస్తెలమ్మిచ్చింది: రత్నం భారతి, బెల్లంపల్లి
గురుకులంలో ఏఎన్‌ఎం పోస్టుకు దరఖాస్తు చేసుకున్నా. తెలిసిన వ్యక్తి సుమలత వద్దకు వెళితే పనవుతుందంటే ఆమెను కలిసినం. ఉద్యోగం కావాలంటే రూ.లక్ష అవుతుందని చెప్పింది. ఉద్యోగం వచ్చిన తరువాతే డబ్బులు ఇస్తామంటే అలా కుదరదని, ముందే ఇవ్వాలని, లేదంటే పని కాదంది. డబ్బులు ఇప్పుడు లేవంటే నీ మెడలో పుస్తెల తాడు, రింగులు ఉన్నాయి కదా అవి అమ్మియ్యుమని.. దగ్గరుండి మార్కెట్లో అమ్మించి అక్కడికక్కడే తీసుకొని వెళ్లిపోయింది. ఒంటి మీద బంగారం పోయింది. ఉద్యోగం రాలే.. పైగా మాకే నోటీసులు పంపించింది. ఎట్‌లైన మాకు న్యాయం చేయాలే.
పూర్తిస్థాయి విచారణ..
బెల్లంపల్లికి చెందిన సుమలత ఉద్యోగాల పేరిట తమను మోసం చేశారని బాధితులు వచ్చి కలిశారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ నిర్వహిస్తాం. విచారణ చేపట్టాలని బెల్లంపల్లి సీఐని ఇప్పటికే ఆదేశించాను. బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకొంటాం.
–రక్షిత కే మూర్తి, డీసీపీ, మంచిర్యాల
Comments
Please login to add a commentAdd a comment