IP Notices
-
ఉద్యోగాల పేరిట ఘరానా మోసం
సాక్షి, మంచిర్యాల: ఆమె ఓ సాధారణ గృహణి. కానీ.. అసాధారణ మోసానికి పాల్పడింది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 132 మందికి ఉద్యోగాలిప్పిస్తానని మోసం చేసి రూ.కోటికి పైగా వసూలు చేసింది. ఉద్యోగాలు రాకపోగా.. ఇచ్చిన డబ్బులైనా వాపసు ఇవ్వాలని బాధితులు ఒత్తిడి తేవడంతో ఐపీ అడ్డం పెట్టుకుని తప్పించుకునేందుకు ఎత్తులు వేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. మోసపోయినట్లు గ్రహించిన బాధితులు సోమవారం డీసీపీని ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగు చూసింది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన ఠాకుర్ సుమలత సాధారణ గృహిణి. బెల్లంపల్లి మండలం తాండూర్‌లో ఉన్న కేజీబీవీ పాఠశాలలో ఏఎస్ఓగా పనిచేస్తున్నానని, అధికార పార్టీ నేతలు తనకు తెలుసని నమ్మబలుకుతూ ఉద్యోగాలిప్పిస్తానంటూ రెండున్నరేళ్లుగా నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసింది. గురుకులాల్లోని బోధన, బోధనేతర ఉద్యోగాలేవైనా ఇప్పిస్తానంటూ ఎర వేసింది. ఉమ్మడి జిల్లాలోని బెల్లంపల్లి, కాగజ్‌నగర్, మంచిర్యాల, కాసిపేట మండలాలకు చెందిన 132 మంది నుంచి వారి ఉద్యోగ ‘అర్హత’లను బట్టి రూ.లక్ష నుంచి రూ.4 లక్షల చొప్పున సుమారు రూ.1.50 కోట్లు వసూలు చేసింది. ఒకవేళ ఉద్యోగాలు రాకపోతే డబ్బులు వాపసు ఇస్తానంటూ ప్రామిసరీ నోట్లు, ఖాళీ చెక్‌లు, బాండ్లపై ఒప్పందాలూ చేసుకుంది. చివరకు ఈ నెల 14న 132 మందికి తాను ఐపీ పెట్టినట్లు నోటీసులు పంపించింది. ఐపీ పెట్టే ఉద్దేశంతోనే పథకం ప్రకారం అప్పుపత్రాలు రాయించుకుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఐపీ నోటీసులతో ఆందోళనలో బాధితులు అయితే ఉద్యోగం.. లేదంటే డబ్బులు వాపసు వస్తాయనుకున్న బాధితులకు సదరు మహిళ ఇచ్చిన ఐపీ షాక్‌తో లబోదిబోమంటున్నారు. ఊహించని విధంగా ఐపీ నోటీసులు రావడం, అనంతరం సదరు మహిళ సెల్‌ఫోన్ స్విచ్ఛాఫ్ ఉండటంతో బాధితులు ఆందోళనకు గురవుతున్నారు. దీంతో తమకు న్యాయం చేయాలంటూ సోమ వారం డీసీపీ రక్షిత కే.మూర్తిని కలసి వేడుకున్నారు. డబ్బులు వసూళ్లలో సుమలతతోపాటు ఆమె కారు డ్రైవర్ సాయి అలియాస్ శ్రీనివాస్ కీలక పాత్ర పోషించినట్లు బాధితులు చెబుతున్నారు. డబ్బులు శ్రీనివాస్ తీసుకుని సుమలతకు ఇచ్చేవాడని గుర్తు చేస్తున్నారు. పుస్తెలమ్మిచ్చింది: రత్నం భారతి, బెల్లంపల్లి గురుకులంలో ఏఎన్ఎం పోస్టుకు దరఖాస్తు చేసుకున్నా. తెలిసిన వ్యక్తి సుమలత వద్దకు వెళితే పనవుతుందంటే ఆమెను కలిసినం. ఉద్యోగం కావాలంటే రూ.లక్ష అవుతుందని చెప్పింది. ఉద్యోగం వచ్చిన తరువాతే డబ్బులు ఇస్తామంటే అలా కుదరదని, ముందే ఇవ్వాలని, లేదంటే పని కాదంది. డబ్బులు ఇప్పుడు లేవంటే నీ మెడలో పుస్తెల తాడు, రింగులు ఉన్నాయి కదా అవి అమ్మియ్యుమని.. దగ్గరుండి మార్కెట్లో అమ్మించి అక్కడికక్కడే తీసుకొని వెళ్లిపోయింది. ఒంటి మీద బంగారం పోయింది. ఉద్యోగం రాలే.. పైగా మాకే నోటీసులు పంపించింది. ఎట్లైన మాకు న్యాయం చేయాలే. పూర్తిస్థాయి విచారణ.. బెల్లంపల్లికి చెందిన సుమలత ఉద్యోగాల పేరిట తమను మోసం చేశారని బాధితులు వచ్చి కలిశారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ నిర్వహిస్తాం. విచారణ చేపట్టాలని బెల్లంపల్లి సీఐని ఇప్పటికే ఆదేశించాను. బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకొంటాం. –రక్షిత కే మూర్తి, డీసీపీ, మంచిర్యాల -
ఉద్యోగాలిప్పిస్తానని మోసం
ఎల్కతుర్తి : మోడల్ స్కూల్(ఆదర్శ పాఠశాల)లో కంప్యూటర్ ఆటరేటర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికిన ఓ వ్యక్తి 16 మంది నుంచి రూ. లక్షల్లో దండుకున్నారు. తమ ఉద్యోగాల మాటేమిటని అడిగితే ఇదిగో.. అదుగో అంటూ పది నెలల పాటు తిప్పుకున్నాడు. చివరకు కోర్టు నుంచి ఐపీ నోటీలు పంపాడు. దీంతో బాధితులు హతాశులయ్యూరు. చివరకు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మోసానికి తెర లేచింది ఇలా బాధితుల కథనం ప్రకారం.. హుస్నాబాద్, ముల్కనూర్, ఎల్కతుర్తి, కమలాపూర్ మండలాల్లో ఉన్న ప్రభుత్వ మోడల్ పాఠశాలల్లో కంప్యూటర్ ఆపరేటర్, అటెండర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఆయూ పోస్టులు ఇప్పిస్తానంటూ జూలపల్లి మండల కేంద్రానికి చెందిన పాటుకుల మహేశ్, ఎల్కతుర్తి మండలం కోతులనడుమ గ్రామానికి చెందిన ఎర్రోల్ల చైతన్యకుమార్ సాయంతో 16 మంది వద్ద (రూ. 20వేల నుంచి రూ. 2లక్షల వరకు)డబ్బులు తీసుకున్నాడు. తాను డబ్బు తీసుకున్నట్లు ప్రామిసరీ నోట్లు రాసిచ్చాడు. తమ ఉద్యోగాల సంగతేంటని బాధితులు ప్రశ్నిస్తే ఇదిగో అదిగో అంటూ కల్లబొల్లి మాటలు చెబుతూ పది నెలలుగా తప్పించుకు తిరుగుతున్నాడు. చివరకు ఇటీవల కోర్టు నుంచి ఐపీ నోటీసులు పంపించాడు. నోటీసులు అందుకున్న వారిలో కొంతమందికి సాక్షిగా వ్యవహరించిన వ్యక్తిసైతం ఉండడం గమనార్హం. తేరుకున్న బాధితులు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బయటపడ్డ బాధితులు మోసపోయిన వారిలో ఎల్కతుర్తి మండల కేంద్రానికి చెందిన గొడిశాల పరమేశ్ రూ. 40వేలు, దామెర గ్రామానికి చెందిన సోలెంకి రాజేశ్వర్‌రావు తన ఇద్దరు కుమారుల కోసం రూ. 1.85లక్షలు, హుజూరాబాద్‌కు చెందిన పి. కవిత రూ.1.50 లక్షలు, కొమ్ముల రమేశ్ రూ. 60వేలు, మంతుర్తి రాజయ్య, మంద అశోక్, ఐత సంపత్, గబ్బెటి శ్రీలత, చిట్యాల సుమలత వద్ద నుంచి తలా రూ.20 వేలు తీసుకోగా వరంగల్ జిల్లా హసన్‌పర్తి మండలం జయగిరికి చెందిన ఓ వ్యక్తి ఉన్నారు. నోటీసులు అందుకుంది వీరే నోటీసులు అందిన వారిలో జూలపల్లికి చెందిన జువ్వాజి చంద్రమౌళి, మహ్మద్ అబ్దుల్ నబీ, ఎర్రోల్ల చైతన్య (మధ్యవర్తి), సోలెంకి రాజేశ్వర్‌రావు, గబ్బెటి శ్రీలత, మంతుర్తి రాజయ్య, మంద అశోక్, రేణుకుంట్ల సాంబరాజ్, మాడ్గుల మానస, మహ్మద్ మోహిన్, ఐత సంపత్, కొమ్ముల రమేశ్, గొడిశాల పరమేశ్, ఇల్లందుల సంపత్‌కుమార్, చిట్యాల సుమలత ఉన్నారు.