ఉద్యోగాలిప్పిస్తానని మోసం
ఎల్కతుర్తి : మోడల్ స్కూల్(ఆదర్శ పాఠశాల)లో కంప్యూటర్ ఆటరేటర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికిన ఓ వ్యక్తి 16 మంది నుంచి రూ. లక్షల్లో దండుకున్నారు. తమ ఉద్యోగాల మాటేమిటని అడిగితే ఇదిగో.. అదుగో అంటూ పది నెలల పాటు తిప్పుకున్నాడు. చివరకు కోర్టు నుంచి ఐపీ నోటీలు పంపాడు. దీంతో బాధితులు హతాశులయ్యూరు. చివరకు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మోసానికి తెర లేచింది ఇలా
బాధితుల కథనం ప్రకారం.. హుస్నాబాద్, ముల్కనూర్, ఎల్కతుర్తి, కమలాపూర్ మండలాల్లో ఉన్న ప్రభుత్వ మోడల్ పాఠశాలల్లో కంప్యూటర్ ఆపరేటర్, అటెండర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఆయూ పోస్టులు ఇప్పిస్తానంటూ జూలపల్లి మండల కేంద్రానికి చెందిన పాటుకుల మహేశ్, ఎల్కతుర్తి మండలం కోతులనడుమ గ్రామానికి చెందిన ఎర్రోల్ల చైతన్యకుమార్ సాయంతో 16 మంది వద్ద (రూ. 20వేల నుంచి రూ. 2లక్షల వరకు)డబ్బులు తీసుకున్నాడు.
తాను డబ్బు తీసుకున్నట్లు ప్రామిసరీ నోట్లు రాసిచ్చాడు. తమ ఉద్యోగాల సంగతేంటని బాధితులు ప్రశ్నిస్తే ఇదిగో అదిగో అంటూ కల్లబొల్లి మాటలు చెబుతూ పది నెలలుగా తప్పించుకు తిరుగుతున్నాడు. చివరకు ఇటీవల కోర్టు నుంచి ఐపీ నోటీసులు పంపించాడు. నోటీసులు అందుకున్న వారిలో కొంతమందికి సాక్షిగా వ్యవహరించిన వ్యక్తిసైతం ఉండడం గమనార్హం. తేరుకున్న బాధితులు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బయటపడ్డ బాధితులు
మోసపోయిన వారిలో ఎల్కతుర్తి మండల కేంద్రానికి చెందిన గొడిశాల పరమేశ్ రూ. 40వేలు, దామెర గ్రామానికి చెందిన సోలెంకి రాజేశ్వర్‌రావు తన ఇద్దరు కుమారుల కోసం రూ. 1.85లక్షలు, హుజూరాబాద్‌కు చెందిన పి. కవిత రూ.1.50 లక్షలు, కొమ్ముల రమేశ్ రూ. 60వేలు, మంతుర్తి రాజయ్య, మంద అశోక్, ఐత సంపత్, గబ్బెటి శ్రీలత, చిట్యాల సుమలత వద్ద నుంచి తలా రూ.20 వేలు తీసుకోగా వరంగల్ జిల్లా హసన్‌పర్తి మండలం జయగిరికి చెందిన ఓ వ్యక్తి ఉన్నారు.
నోటీసులు అందుకుంది వీరే
నోటీసులు అందిన వారిలో జూలపల్లికి చెందిన జువ్వాజి చంద్రమౌళి, మహ్మద్ అబ్దుల్ నబీ, ఎర్రోల్ల చైతన్య (మధ్యవర్తి), సోలెంకి రాజేశ్వర్‌రావు, గబ్బెటి శ్రీలత, మంతుర్తి రాజయ్య, మంద అశోక్, రేణుకుంట్ల సాంబరాజ్, మాడ్గుల మానస, మహ్మద్ మోహిన్, ఐత సంపత్, కొమ్ముల రమేశ్, గొడిశాల పరమేశ్, ఇల్లందుల సంపత్‌కుమార్, చిట్యాల సుమలత ఉన్నారు.