సాక్షి, పెద్దఅడిశర్లపల్లి: తెలంగాణలో పలు ప్రభుత్వ పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినా అధికారుల్లో మార్పు కనిపించడం లేదు. తాజాగా నల్లగొండ జిల్లాలో ఫుడ్ పాయిజన్ కారణంగా మోడల్ స్కూల్ హాస్టల్‌లో బాలికలు అస్వస్థతకు గురయ్యారు. దీంతో, వెంటనే వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. నిన్న రాత్రి ఐదుగురు బాలికలు ఆసుపత్రిలో చేరగా.. ఈరోజు మరో ఇద్దరు కడుపు నొప్పితో చికిత్స తీసుకుంటున్నారు. దీంతో, బాలికల సంఖ్య ఏడుకు చేరుకుంది.
వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లాలోని దుగ్యాల మోడల్ స్కూల్ బాలికల వసతి గృహంలో విద్యార్థినిలు అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజన్ కారణంగా వాంతులు, తీవ్రమైన కడపు నొప్పి రావడంతో వారికి వెంటనే దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో చికిత్స పొందుతున్న విద్యార్థినులను కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం రాత్రి పరామర్శిచారు. ఈ ఘటనకు సంబంధించిన విషయాలపై ఆరా తీశారు. విద్యార్థినలకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడతూ హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్ జరగలేదని.. రెండు మూడు రోజులుగా విద్యార్థులు సరిగా ఆహారం తీసుకోకపోడంతో నీరసంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించారు. అయితే, బాలికలు మాత్రం.. తాము తిన్న ఆహారం కారణంగానే అస్వస్థతకు గురైనట్టు చెబుతున్నారు.
దేవరకొండ ప్రభుత్వాసుపత్రిలో అస్వస్థతకు గురైన విద్యార్థినులు తాజాగా సాక్షి టీవీతో మాట్లాడుతూ..‘మూడు రోజుల నుంచి భోజనం సరిగా ఉండటం లేదు. ఎస్వోకి చెప్పినా పట్టించుకోవడం లేదు. అన్నం సరిగా ఉడకడం లేదు. సగం ఉడికించిన అన్నం పెట్టడంతో అదే తినాల్సి వస్తోంది. మూడు రోజుల నుంచి కడుపునొప్పి వస్తోంది. మాకు పెట్టే భోజనంలో నాణ్యత ఉండటం లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు.. విద్యార్థినిలు అస్వస్థతకు గురికావడంతో దేవరకొండ ప్రభుత్వాసుపత్రి ఎదుట పలు విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థులకు సరైన ఆహారం అందించాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment