operator jobs
-
ఆపరేటర్ ఉద్యోగాలు లేనట్టే
నల్లగొండ : విద్యుత్ సబ్‌స్టేషన్‌లో ఆపరేటర్ ఉద్యోగాలకు మంగళం పాడినట్లే..! సబ్‌స్టేషన్‌లో అవుట్ సోర్సింగ్ కింద ఆపరేటర్ ఉద్యోగాలు వస్తాయని ఎదురుచూస్తోన్న నిరుద్యోగుల ఆశలు ఆవిరయ్యాయి. ఎన్నో ఏళ్లుగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు పనిచేస్తున్న ఆపరేటర్ల సర్వీసును ప్రభుత్వం గతేడాది క్రమబద్ధీకరించింది. డిసెంబర్ 4, 2016 కంటే ముందు సబ్‌స్టేషన్‌ల్లో ఆపరేటర్లుగా పనిచేస్తున్న ఉద్యోగుల సేవలను క్రమబద్ధీకరించారు. ఈ విధంగా ఉమ్మడి జిల్లాలో సుమారు రెండు వేల మంది ఉద్యోగులు లబ్ధిపొందారు. విద్యుత్‌శాఖతో ఒప్పందం చేసుకుని, అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా పనిచేస్తూ ప్రతినెలా జీతం పొందుతున్న వారిని మాత్రమే శాశ్వత ఉద్యోగులుగా పరిగణించారు. ప్రభుత్వం ఎప్పుడైతే కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని ప్రకటించిందో అంతకు ఐదారు మాసాల ముందు ఉమ్మడి జిల్లాలో వివిధ సబ్స్టేషన్లలో ఖాళీగా ఉన్న ఆపరేటర్ పోస్టుల్లో అప్రెంటిస్ కింద కొంతమందిని తీసుకున్నారు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు వారితో చేతులు కలిపి అనధికార నియామకాలు చేపట్టారు. విద్యుత్‌శాఖతో ఎలాంటి ఒప్పందమూ లేకుండానే అవుట్ సోర్సింగ్ పేరుతో అక్రమ నియామకాలకు తెరతీశారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 350 మందిని ఈ విధంగా నియమించినట్లు తెలిసింది. అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు నిరుద్యోగులకు మాయమాటలు చెప్పి ఒక్కొక్కరినుంచి రూ.5 లక్షల వరకు వసూలు చేశారనే ప్రచారం ఉంది.అయితే 2016 డిసెంబర్ కంటే ముందు చేరిన నిరుద్యోగులను క్రమబద్ధీకరిస్తూ, ఆ తర్వాత చేరిన నిరుద్యోగుల ప్రస్తావన ఎక్కడా లేకపోవడంతో వారినుంచి తిరుగుబాటు వ్యక్తమైంది. ఈ వివాదంతో సంబంధం ఉందని తేలిన అధికారులపైన విద్యుత్‌శాఖ చర్యలు కూడా తీసుకుంది. భువనగిరి డివిజన్లో నిరుద్యోగులు నిలదీయడంతో అక్కడ పనిచేస్తున్న డీఈని మరొక చోటకు బదిలీ చేశారు. ఇదేరకమైన ఘటనలు జిల్లా వ్యాప్తంగా చోటు చేసుకున్నాయి. కానీ అధికార పార్టీ నాయకుల ప్రమేయం బలంగా ఉండటంతో మిగిలిన అధికారుల జోలికి వెళ్లలేదు. సబ్స్టేషన్లలో అప్రెంటిస్ కింద చేరిన ఉద్యోగులను అకారణంగా తొలగించారు. కానీ మాయమాటలు చెప్పి వారినుంచి వసూలు చేసిన డబ్బులు మాత్రం తిరిగి ఇవ్వకపోవడంతో తాజాగా వివాదం ముదిరిపాకాన పడింది. నియామకాలు లేవని చెప్పినా... కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తున్నారని పసిగట్టిన అధికార పార్టీ నాయకులు అక్రమ నియామకాలకు తెరలేపారు. ఈ తరహా నియామకాలు చేపడుతున్నారని తెలిసిన విద్యుత్‌శాఖ తక్షణమే స్పందించి గతేడాది ఉత్తర్వులు జారీ చేసింది. 2016 డిసెంబర్ తర్వాత సబ్స్టేషన్లలో అవుట్ సోర్సింగ్ కింద ఆపరేటర్లను నియామించడానికి వీల్లేదని, ఎక్కడైనా ఖాళీలు ఉన్నట్లయితే ఆ స్థానాల్లో రిటైర్మంట్ ఉద్యోగుల సేవలను వినియోగించుకోవాలని విద్యుత్‌శాఖ స్పష్టం చేసింది. ఒకవేళ అర్హత కలిగిన నిరుద్యోగులను నియమించాలి అనుకుంటే జీఓ విడుదలయ్యే నాటికి సబ్స్టేషన్లలో ఎవరైనా అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తేంటే వారికి కట్ఆఫ్డేట్ నాటికి పీఎఫ్, ఈఎస్ఐ శాఖాపరంగా కట్‌చేస్తూ ఉండాలని జీఓలో పేర్కొన్నారు. విద్యుత్ శాఖ ఉత్తర్వులను ఏమాత్రం పట్టించుకోకుండా నిరుద్యోగులకు మాయమాటలు చెప్పి దొడ్డిదారి నియాకాలు చేపట్టారు. ఇదిలా ఉండగానే ఆపరేటర్ల నియమానికి ఏపీ ట్రిబ్యునల్ కూడా స్పష్టమైన మార్గదర్శకాలు ఖరారు చేస్తూ ప్రభుత్వానికి సూచించింది. ఆపరేటర్లను నియమించాల్సి వస్తే పత్రికా ముఖంగా నోటిఫికేçషన్ ఇవ్వాలని, ఉపాధి కల్పన కార్యాలయాంలో నమోదైన వారికి అవకాశం ఇవ్వాలని, విద్యుత్ స్తంభం ఎక్కే పరీక్ష (పోల్ పరీక్ష) వీడియో తీయాలని పేర్కొంది. మరి ఇలాంటి నిబంధనలను పెడచెవిన పెట్టిన అధికారులు, రాజకీయ నాయకులు కుమ్మకై నిరుద్యోగులను నట్టేట ముంచారు. ఇటీవల సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆపరేటర్ల నియామకాల్లో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించాలని విద్యుత్ శాఖ సీఎండీ, విజిలెన్స్ అధికారులకు లేఖరాసినట్లు ప్రకటించడంతో తాజాగా ఈ వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. నియామకాలు లేవు సబ్స్టేషన్లలో అవుట్ సోర్సింగ్ నియామకాలు చేపట్టక ఏడాది దాటింది. డిసెంబర్ 4, 201 6 నుంచి నియామకాలు చేపట్టడం లేదు. ఎక్కడైనా ఖాళీలు ఉన్నట్లయితే ఆ స్థానాల్లో రిటైర్మంట్ ఉద్యోగులను తీసుకుంటున్నాం. అర్హత కలిగిన వారిని ఎంపిక చేసి డీఈల ఆమోదంతో నే వారిని నియమిస్తున్నాం. అంతకుముందు ఏం జరిగిందన్నది నాకు కూడా తెలియదు. – కృష్ణయ్య, విద్యుత్ శాఖ ఎస్ఈ -
ఉద్యోగాలిప్పిస్తానని మోసం
ఎల్కతుర్తి : మోడల్ స్కూల్(ఆదర్శ పాఠశాల)లో కంప్యూటర్ ఆటరేటర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికిన ఓ వ్యక్తి 16 మంది నుంచి రూ. లక్షల్లో దండుకున్నారు. తమ ఉద్యోగాల మాటేమిటని అడిగితే ఇదిగో.. అదుగో అంటూ పది నెలల పాటు తిప్పుకున్నాడు. చివరకు కోర్టు నుంచి ఐపీ నోటీలు పంపాడు. దీంతో బాధితులు హతాశులయ్యూరు. చివరకు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మోసానికి తెర లేచింది ఇలా బాధితుల కథనం ప్రకారం.. హుస్నాబాద్, ముల్కనూర్, ఎల్కతుర్తి, కమలాపూర్ మండలాల్లో ఉన్న ప్రభుత్వ మోడల్ పాఠశాలల్లో కంప్యూటర్ ఆపరేటర్, అటెండర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఆయూ పోస్టులు ఇప్పిస్తానంటూ జూలపల్లి మండల కేంద్రానికి చెందిన పాటుకుల మహేశ్, ఎల్కతుర్తి మండలం కోతులనడుమ గ్రామానికి చెందిన ఎర్రోల్ల చైతన్యకుమార్ సాయంతో 16 మంది వద్ద (రూ. 20వేల నుంచి రూ. 2లక్షల వరకు)డబ్బులు తీసుకున్నాడు. తాను డబ్బు తీసుకున్నట్లు ప్రామిసరీ నోట్లు రాసిచ్చాడు. తమ ఉద్యోగాల సంగతేంటని బాధితులు ప్రశ్నిస్తే ఇదిగో అదిగో అంటూ కల్లబొల్లి మాటలు చెబుతూ పది నెలలుగా తప్పించుకు తిరుగుతున్నాడు. చివరకు ఇటీవల కోర్టు నుంచి ఐపీ నోటీసులు పంపించాడు. నోటీసులు అందుకున్న వారిలో కొంతమందికి సాక్షిగా వ్యవహరించిన వ్యక్తిసైతం ఉండడం గమనార్హం. తేరుకున్న బాధితులు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బయటపడ్డ బాధితులు మోసపోయిన వారిలో ఎల్కతుర్తి మండల కేంద్రానికి చెందిన గొడిశాల పరమేశ్ రూ. 40వేలు, దామెర గ్రామానికి చెందిన సోలెంకి రాజేశ్వర్‌రావు తన ఇద్దరు కుమారుల కోసం రూ. 1.85లక్షలు, హుజూరాబాద్‌కు చెందిన పి. కవిత రూ.1.50 లక్షలు, కొమ్ముల రమేశ్ రూ. 60వేలు, మంతుర్తి రాజయ్య, మంద అశోక్, ఐత సంపత్, గబ్బెటి శ్రీలత, చిట్యాల సుమలత వద్ద నుంచి తలా రూ.20 వేలు తీసుకోగా వరంగల్ జిల్లా హసన్‌పర్తి మండలం జయగిరికి చెందిన ఓ వ్యక్తి ఉన్నారు. నోటీసులు అందుకుంది వీరే నోటీసులు అందిన వారిలో జూలపల్లికి చెందిన జువ్వాజి చంద్రమౌళి, మహ్మద్ అబ్దుల్ నబీ, ఎర్రోల్ల చైతన్య (మధ్యవర్తి), సోలెంకి రాజేశ్వర్‌రావు, గబ్బెటి శ్రీలత, మంతుర్తి రాజయ్య, మంద అశోక్, రేణుకుంట్ల సాంబరాజ్, మాడ్గుల మానస, మహ్మద్ మోహిన్, ఐత సంపత్, కొమ్ముల రమేశ్, గొడిశాల పరమేశ్, ఇల్లందుల సంపత్‌కుమార్, చిట్యాల సుమలత ఉన్నారు.