కస్తూర్బా విద్యాలయాలను పటిష్టం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించింది. విద్యార్థినులకు పౌష్టికాహారం అందించేందుకు జనవరి 1నుంచి ప్రభుత్వం కొత్త మెనూ ప్రవేశపెట్టింది. అయితే ఇప్పటివరకు ఏం వడ్డించాలనేదానిపై స్పష్టత లేకపోవడంతో పాఠశాలలో కొత్త మెనూ అమలు కావడంలేదు.
దన్వాడ (నారాయణ్ పేట్) : కస్తూర్బా పాఠశాలో విద్యార్థినులకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నూతన మెనూ ప్రవేశపెట్టింది. గురుకుల విద్యాలయాలను పటిష్టం చేయాలనే ఉద్దేశంతో వారంలో నాలుగు రోజులు మాంసాహారం అందిస్తామన్న ప్రభుత్వ ప్రకటన నీటి మూటలుగానే మిగిలింది. అధికారులు గుడ్డుతోనే సరిపుచ్చుతున్నారు. జనవరి మొదటి వారం నుంచి కొత్త మెనూ అమలు చేస్తామని ప్రభుత్వం ముందస్తుగానే ప్రకటించింది. ఎలా అమలు చేయాలనే అంశంపై స్పష్టత లేకపోవడంతో అధికారులు, పాఠశాల ప్రత్యేక అధికారులు జాప్యం చేస్తున్నారు.
పౌష్టికంగా ఉండేందుకే..
ప్రభుత్వ వసతిగృహంలో ఎక్కువశాతం, పేద మధ్యతరగతి వారే అధికంగా ఉంటారు. వీరికి సరైన ఆహారం అందించడంతోపాటు పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ప్రభుత్వం పూనుకుంది. ఇప్పటికే ప్రతి ఆదివారం కోడి కూర, వారంలో ఐదు రోజులు కోడి గుడ్లు వండి వడ్డిస్తున్నారు. అదనంగా రోజూ నెయ్యి, నెలలో రెండు రోజులు మాంసాహారం పెట్టేందుకు నిర్ణయించారు. పాలు, చపాతి, పల్లిపట్టి, ఇడ్లీ, పూరి వంటి అల్పాహారం అందిస్తున్నారు. కొత్త మెనూతో బాలికల్లో రక్తహీనత, ఆరోగ్య సమస్యలు తగ్గుతాయని విద్యార్థులు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా చదువుపై దృష్టి సారిస్తారని తల్లితండ్రులు విద్యార్థులను పాఠశాలలో చేర్పించేందుకు ఆసక్తి చుపిస్తారని ప్రభుత్వం కొత్త మెనుకు శ్రీకారం చుట్టింది.
ఈనెల 2నుంచే అమలు చేయాల్సి ఉన్నా..
తల్లిదండ్రులకు దూరంగా ఉన్న విద్యార్థినులకు పౌష్టికాహారం అందించేందుకు ఈనెల 2 నుంచి కొత్త ఆహార పట్టిక అమలు చేయాల్సి ఉంది. కాని అధికారులు టెండర్ ప్రక్రియ పూర్తి చేయకపోవడం లేక అమలులో లోపంతో మెనూ ప్రకటనకే సరిపోయింది. విద్యార్థుల తల్లిదండ్రులు కొత్త మెనూను ప్రవేశ పెట్టలని కోరుతున్నారు.
కొత్తమెనూపై స్పష్టతలేదు
కొత్త మెనూకు సంబంధించిన బోర్డును పాఠశాలలో ఏర్పాటు చేశారు. కాని ఇప్పటికీ ఎంత వడ్డించాలి, కొత్త టెండర్ వేయాలా వద్దా అనే స్పష్టతలేదు. పాత టెండర్‌దారులకే అప్పగిస్తారా అనే అంశం కూడా తెలియడంలేదు. రెండురోజుల్లో పూర్తి సమాచారం రాగానే ప్రారంభిస్తాం.
– సంగీత, మండల విద్యాశాఖ అధికారి
Comments
Please login to add a commentAdd a comment