ఆరోగ్య ప్రయోజనాలెన్నో..
చింత చిగురుకు యమ డిమాండ్
పుష్కలంగా పోషకాలు
కిలో ధర రూ.1,000
చిగురు లభ్యతకు అనువైన కాలం
ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో చిగురు సేకరణ
కైకలూరు: పచ్చబంగారంలా చిటారు కొమ్మన మిలమిల మెరిసే చింత చిగురును తింటే ఆరోగ్యంపై చింత అవసరం లేదంటారు పెద్దలు. నోటికి పుల్లడి రు చి ఇస్తూనే.. తినేకొ ద్దీ తినాలపిస్తుంది. చింత చిగురుకు కొ ల్లేరు రొయ్యలు, చేపలకు దట్టిస్తే.. ఇక భోజన ప్రియులకు పండగే. పులుపులో చింత చిగురుకు మరీ డిమాండ్. ఉమ్మడి పశి్చమగోదావరి జిల్లాల్లో చిగురుతో వండిన చేప, రొయ్య, కోడి, వేట వంటి మాంసాహార కూరలను అందరూ లొట్టలేసుకోవాల్సిందే. ఈ సీజన్‌లో లేలేత చింత చిగురు అందుబాటులోకి వచ్చింది. పల్లెటూర్ల నుంచి మహిళలు చింత చిగురును తీసుకువచ్చి పట్టణాల్లో విక్రయిస్తున్నారు. చింత చిగురులో పలు పోషకాహారాలు మెండుగా ఉండటంతో అధిక ధర పలుకుతున్నా దీనికి డిమాండ్ బాగుంది.
ఇదే సీజన్‌లో..
చైత్రమాసం దాటిన వెంటనే చింత చెట్లకు చిగురు అందుబాటులోకి వస్తోంది. ఉమ్మడి పశి్చమగోదావరి జిల్లాలో బుట్టయగూడెం, నూజివీడు, పాలకొల్లు, నరసాపురం, కైకలూరు, నూజివీడు, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం, దెందులూరు, చింతలపూడి నియోజకవర్గాల్లో చింత చిగురు అందుబాటులో ఉంది. కైకలూరు నియోజకవర్గంలో గోపాలపురం, వెంకటాపురం, పరసావానిపాలెం, చిగురుకోట, వడాలి గ్రామాల నుంచి చింత చిగురును తీసుకొచ్చి కైకలూరు పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. ధర విషయానికి వస్తే 100 గ్రాములు రూ.100కి విక్రయిస్తున్నారు. ఇతర ప్రాంతాలకు ఆర్డర్‌లను బట్టి సరఫరా చేస్తున్నారు. చెట్లు తగ్గిపోవడంతో గతంలో కంటే చిగురు ఎక్కువగా లభించడం లేదని గోపాలపురం గ్రామానికి చెందిన విక్రయ మహిళ వాకాని శకుంతల ‘సాక్షి’కి తెలిపారు.
ఆహా ఏమి రుచి..
శాకాహార, మాంసాహార కూరలకు చింత చిగురును దట్టిస్తే ఆ రుచే వేరుగా ఉంటుంది. కొల్లేరు పరిసర ప్రాంతాల్లో చింత చిగురుతో చేసిన వంటకాలు ప్రత్యేక డిష్‌గా గుర్తింపు పొందుతున్నాయి. శాకాహార, మాంసాహారాల్లో పలురకాలుగా చింత చిగురుతో వంటకాలు చేస్తారు.
పోషకాల గని
చింత చిగురులో ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు ఉన్నాయి. 100 గ్రాముల చిగురులో 5.8 గ్రాముల ప్రొటీన్లు, 10.06 గ్రాముల పీచు పదార్థం, 100 మిల్లీగ్రాముల కాల్షియం, 140 మిల్లీగ్రాముల పాస్ఫరస్, 26 మిల్లీగ్రాముల మెగ్నీíÙయం, విటమిన్ ‘సి’ 3 మిల్లీ గ్రాములు ఉంటాయి. ఇండియన్ జర్నల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా చింత చిగురుతో అనేక ప్రయోజనాలు ఉన్నా యని ప్రకటించింది.
ఉపయోగాలివీ..
👉 చింత చిగురులో ఉన్న ఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు చెడు కొలెస్టరాల్‌ను తగ్గించి, మంచి కొలెస్టరాల్‌ను పెంచుతాయి.
👉 శరీరంలో ఎర్రరక్త కణాల ఉత్పత్తికి అవసరమైన పోషకాలను అందించి, రక్తాన్ని శుద్ధి చేస్తుంది.
👉యాంటీ ఇన్ఫల్మేటరీ గుణాలు ఉన్నాయి. చిగురును ఉడికించి నీటిని పుక్కిలిస్తే గొంతు నొప్పి, మంట, వాపు, నోటి పూత తగ్గుతాయి.
👉 చింత చిగురులో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.
👉మలబద్ధకం సమస్య తొలగిపోతుంది.
👉పైల్స్ నివారణకు ఉపయోగపడుతుంది.
👉 వైరల్ ఇన్ఫెక్షన్లతో వచ్చే జ్వరాన్ని తగ్గిస్తుంది.
👉గుండె జబ్బులు రాకుండా చూస్తుంది.
👉నులి పురుగుల సమస్యతో బాధపడుతున్న చిన్నారులకు చింత చిగురు ఔషధంగా పనిచేస్తుంది.
👉జీర్ణాశయ సంబంధ సమస్యలను తగ్గిస్తుంది.
👉విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండటంతో రోగ నిరోధక శక్తిగా పనిచేస్తుంది.
👉ఎముకుల దృఢత్వం, థైరాయిడ్ నివారణకు దోహదపడుతుంది.
👉షుగర్ వ్యాధిగ్రస్తుల్లో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది.
👉కీళ్ల వాపుల నివారణ, మలేరియా నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది.
👉 తల్లిపాలను మెరుగుపరుస్తుంది.
100 గ్రాములు రూ.100
చింత చెట్లు పూర్వం రహదారుల వెంబడి కనిపించేవి. ఏటా జూన్, జూలై నెలల్లో ఎక్కువగా చింత చిగురును విక్రయించేవాళ్లం. ఇప్పుడు రోడ్లు వెడల్పు చేయడంతో చాలా చెట్లను తొలగించారు. కొన్నిచోట్ల మాత్రమే చింత చెట్లు కనిపిస్తున్నాయి. పలువురు వైద్యం కోసం అని చెప్పి మా వద్ద చింత చిగురు కొంటున్నారు. ప్రస్తుతం 100 గ్రాముల చిగురును రూ.100 ధరకు విక్రయిస్తున్నాం.
–వి.మంగమ్మ, ఆకుకూరల విక్రయదారు, గోపాలపురం
చింత చెట్లను పెంచాలి
చింత చెట్లను తొలగించిన ప్రాంతాల్లో మరో చెట్టును నాటాలి. పట్టణీకరణతో చాలా చెట్లు తొలగిస్తున్నారు. ఆకుకూరలకు కలిదిండి మండలం గోపాలపురం గ్రామం పేరు. మా కుటుంబం చింత చిగురును విక్రయిస్తోంది. చిగురును సేకరించడం అంతు సులువైన పనికాదు. చింత చెట్లను పెంచే విధంగా అందరికి అవగాహన కలిగించాలి.
చింత చిగురుతో లాభాలెన్నో ఉన్నాయి.
– వాకాని నాగ సుబ్రహ్మణ్యం, ఉప సర్పంచ్, గోపాలపురం
Comments
Please login to add a commentAdd a comment