ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పదో తరగతి ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాలల సంఖ్య ఈసారి రెట్టింపైంది. గతేడాది 2,125 పాఠశాలల్లోనే 100 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా, ఈసారి అలాంటి పాఠశాలల సంఖ్య 4,374కు పెరిగింది. మరోవైపు సున్నా ఫలితాల పాఠశాలల సంఖ్య కూడా తగ్గిపోయింది. గతేడాది సున్నా ఫలితాలు వచ్చిన పాఠశాలలు 21 ఉంటే ఈసారి వాటి సంఖ్య 9కి తగ్గింది. రాష్ట్రవ్యాప్తంగా 11,026 ఉన్నత పాఠశాలలుంటే అందులో 4,374 పాఠశాలలు వంద శాతం ఉత్తీర్ణతను సాధించాయి. ఇక 100 శాతం ఫలితాలను సాధించిన పాఠశాలల్లో ప్రైవేటు పాఠశాలలు ఎక్కువగా ఉన్నాయి.
2,279 ప్రైవేటు స్కూళ్లలో వంద శాతం..
ఇక పదో తరగతి ఫలితాల్లో 2,279 ప్రైవేటు పాఠశాలల్లో వంద శాతం ఫలితాలు వచ్చాయి. గతేడాది 1,225 ప్రైవేటు పాఠశాలల్లో వంద శాతం మంది ఉత్తీర్ణులు కాగా ఈసారి వాటి సంఖ్య పెరిగింది. గతేడాది 76 కస్తూర్భాగాంధీ బాలిక విద్యాలయాల్లో (కేజీబీవీ) వంద శాతం ఫలి తాలు రాగా, ఈసారి 185 కేజీబీవీల్లో 100% ఫలితాలు వచ్చాయి. అలాగే గతేడాది 35 మోడల్ స్కూళ్లలోనే వంద శాతం ఫలితాలు రాగా, ఈసారి వాటి సంఖ్య 97కు చేరింది. గతేడాది వంద శాతం ఉత్తీర్ణత సాధించిన జిల్లా పరిషత్ పాఠశాలలు 686 ఉంటే ఈసారి వాటికి సంఖ్య రెట్టింపు కంటే ఎక్కువగా పెరిగింది. 1,580 జిల్లా పరిషత్తు పాఠశాలల్లో 100% ఉత్తీర్ణత నమోదైంది. ప్రభుత్వ పాఠశాలల్లోనూ 100 శాతం ఉత్తీర్ణత సాధించిన స్కూళ్ల సంఖ్య ఈ సారి పెరిగింది. సున్నా ఫలితాలు 9 స్కూళ్ల లో వస్తే అందులో 5 ప్రైవేటు స్కూళ్లే ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment