టెన్త్‌లో 86.60% పాస్‌.. రీకౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌ ప్రక్రియ వివరాలివే.. | Above 86 percent students have passed Telangana 10th class exams | Sakshi
Sakshi News home page

టెన్త్‌లో 86.60% పాస్‌.. రీకౌంటింగ్‌ ఫీజు రూ.500, రీ వెరిఫికేషన్‌ ఫీజు రూ.1000

Published Thu, May 11 2023 3:59 AM | Last Updated on Thu, May 11 2023 8:09 AM

Above 86 percent students have passed Telangana 10th class exams - Sakshi

బుధవారం హైదరాబాద్‌లో టెన్త్‌ ఫలితాలను విడుదల చేస్తున్న విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. చిత్రంలో పాఠశాల విద్య డైరెక్టర్‌ దేవసేన, పరీక్షల విభాగం డైరెక్టర్‌ కృష్ణారావు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల్లో 86.60 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్మీడియట్‌ తరహాలోనే టెన్త్‌ ఫలితాల్లోనూ బాలికలే పైచేయి సాధించారు. విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి బుధవారం హైదరాబాద్‌లో పాఠశాల విద్య డైరెక్టర్‌ దేవసేన, పరీక్షల విభాగం డైరెక్టర్‌ కృష్ణారావులతో కలసి టెన్త్‌ ఫలితాలను విడుదల చేశారు. మొత్తంగా 4,94,504 మంది దరఖాస్తు చేసుకోగా.. 4,91,862 మంది పరీక్షలు రాశారని, ఇందులో 4,22,795 మంది (86.60 శాతం) ఉత్తీర్ణులయ్యారని తెలిపారు.

ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 2,793 పాఠశాలల్లో వందశాతం ఉత్తీర్ణత నమోదైందని... 25 స్కూళ్లలో సున్నా ఫలితాలు వచ్చాయని వెల్లడించారు. రాష్ట్రంలో నిర్మల్‌ జిల్లా 99శాతం ఉత్తీర్ణతతో ముందు వరుసలో ఉండగా.. వికారాబాద్‌ జిల్లా 59.46 శాతంతో చివరన నిలిచినట్టు తెలిపారు. ప్రభుత్వ గురుకులాలు 98.25 శాతంతో టాప్‌లో నిలిచాయని.. రెసిడెన్షియల్, సోషల్, బీసీ, మైనార్టీ, ట్రైబల్‌ వెల్ఫేర్, మోడల్‌ స్కూళ్లు కూడా సగటుకుపైగా ఉత్తీర్ణత శాతాన్ని సాధించాయని వివరించారు.

ఫెయిలైన వారు ఆందోళనకు గురికావొద్దని.. ఆత్మస్థైర్యంతో మళ్లీ పరీక్షలు రాసి విజయం సాధించాలని సూచించారు. ఇంటర్‌ విద్యార్థులు క్షణికావేశంతో బలవన్మరణాలకు పాల్పడిన ఘటనలపై ఆమె విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో తల్లిదండ్రుల ఆవేదనను గుర్తు చేసుకోవాలన్నారు. 

15 రోజుల పాటు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌ 
ఫలితాలు విడుదలైన 15 రోజుల్లోగా విద్యార్థులు రీకౌంటింగ్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని పాఠశాల విద్య డైరెక్టర్‌ దేవసేన తెలిపారు. ఒక్కో సబ్జెక్టుకు రూ.500 చొప్పున స్టేట్‌ బ్యాంకు ద్వారా రుసుము చెల్లించాలని.. దరఖాస్తులను పోస్టు ద్వారా తమ కార్యాలయానికి పంపాలని సూచించారు.

రీవెరిఫికేషన్‌ కోరుకునే విద్యార్థులు సంబంధిత పాఠశాల ద్వారా జిల్లా విద్యాశాఖాధికారికి దరఖాస్తు పంపాలని చెప్పారు. దరఖాస్తు నమూనా bse.telangana.gov.in వెబ్‌సైట్‌లో లభిస్తుందని తెలిపారు. రీ వెరిఫికేషన్‌ జిల్లా స్థాయిలో జరుగుతుందని, దీనికోసం ఒక్కో సబ్జెక్టుకు రూ.వెయ్యి రుసుము చెల్లించాలని స్పష్టం చేశారు. 



జూన్‌ 14 నుంచి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ 
టెన్త్‌ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు జూన్‌ 14 నుంచి 22వ తేదీ వరకు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు.  ఈ మేరకు పరీక్షల టైం టేబుల్‌ను ఎస్సెస్సీ పరీక్షల విభాగం డైరెక్టర్‌ కృష్ణారావు బుధవారం విడుదల చేశారు. విద్యార్థులు ఈ నెల 11 నుంచి 26వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. మూడు సబ్జెక్టుల వరకు రూ.110 ఫీజు, అంతకన్నా ఎక్కువ సబ్జెక్టులకు అయితే రూ.125 ఫీజు చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. నిర్ణీత తేదీల్లో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. సైన్స్‌ సబ్జెక్టుకు అదనంగా 20 నిమిషాలు సమయం ఉంటుందన్నారు. 

2,793 స్కూళ్లలో అందరూ పాస్‌ 
పదో తరగతిలో రాష్ట్రవ్యాప్తంగా 2,793 పాఠశాలల్లో నూటికి నూరు శాతం ఉత్తీర్ణత నమోదైంది. 25 స్కూళ్లలో ఒక్క విద్యార్థి కూడా పాస్‌ కాలేదు. ఇందులో ప్రైవేటు స్కూళ్లు 13 ఉంటే.. ప్రభుత్వ జిల్లా పరిషత్‌ స్కూళ్లు 9, ఎయిడెడ్‌ స్కూళ్లు 3 ఉన్నాయి. జీరో ఉత్తీర్ణత వచ్చిన పాఠశాలల్లో పనితీరుపై సమీక్ష చేపడతామని మంత్రి సబిత తెలిపారు.  


ఇంగ్లిష్‌ మీడియంలో ఎక్కువ పాస్‌ 
పదో తరగతి పరీక్షల్లో మాధ్యమం (మీడియం) వారీగా  చూస్తే.. ఆంగ్ల మాధ్యమం వారిలో ఉత్తీర్ణత ఎక్కువగా ఉంది. ఆంగ్ల మాధ్యమంలో పరీక్షలు రాసినవారిలో 90.50 శాతం ఉత్తీర్ణులుకాగా.. ఉర్దూ మీడియంలో 73.45, తెలుగు మీడియంలో 72.58 శాతం పాస్‌ అయ్యారు. ఇక ప్రధాన సబ్జెక్టుల్లో సాంఘిక శాస్త్రంలో, భాషా సబ్జెక్టుల్లో హిందీ (సెకండ్‌ లాంగ్వేజ్‌)లో ఎక్కువ శాతం పాస్‌ అయ్యారు. మొత్తంగా అన్ని భాషల్లోనూ 90శాతంపైనే ఉత్తీర్ణత కనిపించింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement