Tenth class exam results
-
టెన్త్‌లో 86.60% పాస్.. రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ ప్రక్రియ వివరాలివే..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల్లో 86.60 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్మీడియట్ తరహాలోనే టెన్త్ ఫలితాల్లోనూ బాలికలే పైచేయి సాధించారు. విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి బుధవారం హైదరాబాద్‌లో పాఠశాల విద్య డైరెక్టర్ దేవసేన, పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావులతో కలసి టెన్త్ ఫలితాలను విడుదల చేశారు. మొత్తంగా 4,94,504 మంది దరఖాస్తు చేసుకోగా.. 4,91,862 మంది పరీక్షలు రాశారని, ఇందులో 4,22,795 మంది (86.60 శాతం) ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 2,793 పాఠశాలల్లో వందశాతం ఉత్తీర్ణత నమోదైందని... 25 స్కూళ్లలో సున్నా ఫలితాలు వచ్చాయని వెల్లడించారు. రాష్ట్రంలో నిర్మల్ జిల్లా 99శాతం ఉత్తీర్ణతతో ముందు వరుసలో ఉండగా.. వికారాబాద్ జిల్లా 59.46 శాతంతో చివరన నిలిచినట్టు తెలిపారు. ప్రభుత్వ గురుకులాలు 98.25 శాతంతో టాప్‌లో నిలిచాయని.. రెసిడెన్షియల్, సోషల్, బీసీ, మైనార్టీ, ట్రైబల్ వెల్ఫేర్, మోడల్ స్కూళ్లు కూడా సగటుకుపైగా ఉత్తీర్ణత శాతాన్ని సాధించాయని వివరించారు. ఫెయిలైన వారు ఆందోళనకు గురికావొద్దని.. ఆత్మస్థైర్యంతో మళ్లీ పరీక్షలు రాసి విజయం సాధించాలని సూచించారు. ఇంటర్ విద్యార్థులు క్షణికావేశంతో బలవన్మరణాలకు పాల్పడిన ఘటనలపై ఆమె విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో తల్లిదండ్రుల ఆవేదనను గుర్తు చేసుకోవాలన్నారు. 15 రోజుల పాటు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఫలితాలు విడుదలైన 15 రోజుల్లోగా విద్యార్థులు రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని పాఠశాల విద్య డైరెక్టర్ దేవసేన తెలిపారు. ఒక్కో సబ్జెక్టుకు రూ.500 చొప్పున స్టేట్ బ్యాంకు ద్వారా రుసుము చెల్లించాలని.. దరఖాస్తులను పోస్టు ద్వారా తమ కార్యాలయానికి పంపాలని సూచించారు. రీవెరిఫికేషన్ కోరుకునే విద్యార్థులు సంబంధిత పాఠశాల ద్వారా జిల్లా విద్యాశాఖాధికారికి దరఖాస్తు పంపాలని చెప్పారు. దరఖాస్తు నమూనా bse.telangana.gov.in వెబ్సైట్లో లభిస్తుందని తెలిపారు. రీ వెరిఫికేషన్ జిల్లా స్థాయిలో జరుగుతుందని, దీనికోసం ఒక్కో సబ్జెక్టుకు రూ.వెయ్యి రుసుము చెల్లించాలని స్పష్టం చేశారు. జూన్ 14 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ టెన్త్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు జూన్ 14 నుంచి 22వ తేదీ వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు పరీక్షల టైం టేబుల్‌ను ఎస్సెస్సీ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు బుధవారం విడుదల చేశారు. విద్యార్థులు ఈ నెల 11 నుంచి 26వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. మూడు సబ్జెక్టుల వరకు రూ.110 ఫీజు, అంతకన్నా ఎక్కువ సబ్జెక్టులకు అయితే రూ.125 ఫీజు చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. నిర్ణీత తేదీల్లో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. సైన్స్ సబ్జెక్టుకు అదనంగా 20 నిమిషాలు సమయం ఉంటుందన్నారు. 2,793 స్కూళ్లలో అందరూ పాస్ పదో తరగతిలో రాష్ట్రవ్యాప్తంగా 2,793 పాఠశాలల్లో నూటికి నూరు శాతం ఉత్తీర్ణత నమోదైంది. 25 స్కూళ్లలో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాలేదు. ఇందులో ప్రైవేటు స్కూళ్లు 13 ఉంటే.. ప్రభుత్వ జిల్లా పరిషత్ స్కూళ్లు 9, ఎయిడెడ్ స్కూళ్లు 3 ఉన్నాయి. జీరో ఉత్తీర్ణత వచ్చిన పాఠశాలల్లో పనితీరుపై సమీక్ష చేపడతామని మంత్రి సబిత తెలిపారు. ఇంగ్లిష్ మీడియంలో ఎక్కువ పాస్ పదో తరగతి పరీక్షల్లో మాధ్యమం (మీడియం) వారీగా చూస్తే.. ఆంగ్ల మాధ్యమం వారిలో ఉత్తీర్ణత ఎక్కువగా ఉంది. ఆంగ్ల మాధ్యమంలో పరీక్షలు రాసినవారిలో 90.50 శాతం ఉత్తీర్ణులుకాగా.. ఉర్దూ మీడియంలో 73.45, తెలుగు మీడియంలో 72.58 శాతం పాస్ అయ్యారు. ఇక ప్రధాన సబ్జెక్టుల్లో సాంఘిక శాస్త్రంలో, భాషా సబ్జెక్టుల్లో హిందీ (సెకండ్ లాంగ్వేజ్)లో ఎక్కువ శాతం పాస్ అయ్యారు. మొత్తంగా అన్ని భాషల్లోనూ 90శాతంపైనే ఉత్తీర్ణత కనిపించింది. -
పదిలో 25
సకల సౌకర్యాలకు, విద్యా ప్రమాణాలకు కేంద్రమైన హైదరాబాద్ జిల్లా పదో తరగతి ఫలితాల్లో వెనుకబడింది. రాష్ట్ర ఉత్తీర్ణతలో (కొత్తగాఏర్పడిన 31 జిల్లాల్లో) 25వ స్థానం, గ్రేటర్లో మూడో స్థానంతోసరిపెట్టుకుంది. గతేడాదితో పోలిస్తే ఈసారి గ్రేటర్ ఫలితాలు కాస్త మెరుగు పడినప్పటికీ.. ఇతర జిల్లాలకంటే ఇంకా వెనుకబడే ఉన్నాయి. మేడ్చల్ జిల్లా 87.91 శాతం ఉత్తీర్ణతతో 13వ స్థానంలో, రంగారెడ్డి 87.13 శాతంతో 16వ స్థానంలో నిలిచాయి. ఇక హైదరాబాద్ జిల్లా 75.98 శాతంతో 25వ స్థానానికి పరిమితమైంది. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే గ్రేటర్లో నాణ్యమైన విద్య అందుతుందని అంతా భావిస్తారు. నిజానికి ఇతర జిల్లాలకంటే ఇక్కడే ఉత్తీర్ణత శాతం అధికంగా నమోదు కావాలి. కానీ పదో తరగతి ఫలితాల్లో మారుమూల జిల్లాలతో పోలిస్తే వెనుకబడడం ఆందోళన కలిగిస్తోంది. సాక్షి, సిటీబ్యూరో: ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో గ్రేటర్ జిల్లాలు చతికిలబడ్డాయి. రాష్ట్రంలో మేడ్చల్ జిల్లా ఉత్తీర్ణతలో 13వ స్థానంలో నిలవగా.. రంగారెడ్డి 16వ స్థానం సాధించింది. ఇక ఐటీ హబ్‌గా పేరొందిన హైదరాబాద్ జిల్లా 25వ స్థానంతో సరిపెట్టుకుంది. హైదరాబాద్ జిల్లాలో 69,386 పరీక్షకు హాజరు కాగా, 52,718 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. వీరిలో బాలురు 71.8 శాతం, బాలికలు 80.2 శాతంగా ఉన్నారు. రంగారెడ్డి జిల్లాలో 43,392 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా, 37,809 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో బాలురు 86.11శాతం, బాలికలు 88.27శాతం. ఇక మేడ్చల్ జిల్లాలో 41,131 మంది పరీక్ష రాయగా, 36,157 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో బాలురు 86.76 శాతం, బాలికలు 89.21 శాతంగా ఉన్నారు. ఇదిలా ఉంటే మలక్‌పేట్‌లోని ప్రభుత్వ అంధ, బధిర బాలికల పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణతో రికార్డు సృష్టించాయి. వీటితోపాటు అంబర్పేట్ గవర్నమెంట్ బాలికల పాఠశాల(జీజీహెచ్ఎస్), గోషామహాల్ జీహెచ్ఎస్ (ఉర్దూ) కూడా నూరు శాతం ఉత్తీర్ణత సాధించాయి. పేదింట్లో సరస్వతీ బిడ్డలు బంజారాహిల్స్: ఫిలింనగర్‌లోని రౌండ్‌టేబుల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్ష ఫలితాలు నిరుత్సాహాన్ని మిగిల్చాయి. 147 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా కేవలం 76 మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. 52 శాతం ఫలితాలు వచ్చాయని ప్రధానోపాధ్యాయుడు నారాయణ తెలిపారు. 9.7 గ్రేడ్‌తో భవాని, అజయ్ స్కూల్ టాపర్లుగా నిలిచారు. 9.2 జీపీఏతో ఏసురత్నం మూడో స్థానంలో నిలిచింది. భవాని తండ్రి మృతి చెందగా తల్లి వసంత ఇళ్లల్లో పని చేస్తూ కూతురును చదివిస్తోంది. అజయ్ తండ్రి మృతి చెందగా తల్లి అలివేలు సెల్‌ఫోన్ షాప్‌లో పని చేస్తోంది. ఏసురత్నం తండ్రి వాచ్మెన్ కాగా తల్లి సత్యవతి ఇళ్లల్లో పనిచేస్తూ జీవిస్తున్నారు. సత్తాచాటిన ‘దేవనార్’.. సనత్‌నగర్: బేగంపేట మయూరి మార్గ్‌లోని దేవనార్ అంధుల పాఠశాల విద్యార్థులు పదోతరగతి ఫలితాల్లో సత్తా చాటారు. ఇక్కడి నుంచి 41 మంది విద్యార్థులు పరీక్ష రాయగా నూరు శాతం ఉత్తీర్ణత సాధించారు. వీరిలో శరత్ 9.3, ఆకాష్ 9.2, హీనా, పాషా 9.0 జీపీఏ సాధించారు. వైష్ణవి 10/10 సికింద్రాబాద్ మైలార్‌గడ్డకు చెందిన మాణిక్య మాంటిస్సోరి స్కూలు విద్యార్థి వైష్ణవి 10/10 జీపీఏ సాధించింది. తండ్రి బాలరాజు ప్రైవేటు ఉద్యోగి కాగా, తల్లి , అనసూర్య గృహిణి. -
టెన్త్‌లో 91.92 % పాస్
- తూర్పుగోదావరి ఫస్ట్, చిత్తూరు లాస్ట్ - 100% ఫలితాలు సాధించిన పాఠశాలలు 4,102 - 10 జీపీఏ సాధించిన విద్యార్థుల సంఖ్య 18,255 - మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడి ఏయూక్యాంపస్(విశాఖ): పదో తరగతి పరీక్ష ఫలితాల్లో 91.92 శాతం ఉత్తీర్ణత నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా 6,22,538 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవగా 5,68,515 మంది ఉత్తీర్ణత సాధించారు. హాజరైన వారిలో 13,036 మంది ప్రైవేటు విద్యార్థులు కాగా 6,09,502 మంది రెగ్యులర్ విద్యార్థులు. గతేడాదితో పోల్చితే ఈ విద్యా సంవత్సరంలో ఉత్తీర్ణత శాతం 2.6 శాతం తక్కువగా నమోదయింది. పరీక్షకు 3,14,471 మంది బాలురు హాజరవగా 2,88,909(91.87 శాతం)మంది, 2,95,031 మంది బాలికలు హాజరవగా 2,71,344(91.97 శాతం)మంది ఉత్తీర్ణత సాధించారు. పరీక్షకు హాజరైన 13,036 మం ది ప్రైవేటు విద్యార్థుల్లో 8,262(63.38 శాతం) ఉత్తీర్ణత సాధించారు. పదో తరగతి పరీక్ష ఫలితాలను శనివారం సాయంత్రం ఏయూలోని వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసుల నాయుడు, పాఠశాల విద్యా కమిషనర్ సంధ్యారాణి, పాఠశాల విద్యా డైరెక్టర్ భార్గవ్, ఏయూ వీసీ జి.నాగేశ్వరరావు, రిజిస్ట్రార్ వి.ఉమామహేశ్వరరావు, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ పీఎస్ అవధాని, విశాఖ డీఈవో నాగమణి తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి ఫస్ట్, చిత్తూరు లాస్ట్.. ఫలితాలలో తూర్పుగోదావరి జిల్లా 97.97 శాతంతో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలవగా, చిత్తూరు 80.55 శాతంతో అట్టడుగున నిలిచింది. గత మూడు సంవత్సరాలుగా చిత్తూరు జిల్లా అట్టడు గున నిలుస్తోందని మంత్రి తెలిపారు. అత్యధిక, అత్యల్ప ఉత్తీర్ణత కలిగిన జిల్లాల మధ్య వ్యత్యాసం 17 శాతం వరకు ఉందన్నారు. అలాగే 11,143 పాఠశాలల్లో 4,102 పాఠశాలలు 100 శాతం ఫలితాలు సాధించాయని వివరించారు. గతేడాదితో పోల్చితే 115 పాఠశాలలు తగ్గాయన్నారు. ప్రైవేటు యాజమాన్యంలో నిర్వహిస్తున్న రెండు పాఠశాలల్లో సున్నా శాతం ఉత్తీర్ణత నమోదయిందన్నారు. ఈ పాఠశాలల్లో చదువుతున్న ఏకైక విద్యార్థి పరీక్షకు హాజరై ఉత్తీర్ణత సాధించకపోవడంతో ఈ ఫలితాలు వచ్చాయన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో 97.26 శాతం ఉత్తీర్ణత, ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలల్లో 82.02, జెడ్పీ పాఠశాలల్లో 89.23, ప్రభుత్వ పాఠశాలల్లో 84.29, ఏపీ మోడల్ స్కూల్స్‌లో 94.32, మున్సిపల్ పాఠశాలల్లో 86.67, ఏపీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 96.37, సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో 93.45 శాతం ఉత్తీర్ణత నమోదయింది. జీపీఏ పెరిగింది.. ఫలితాలలో పదికి పది జీపీఏ సాధించిన విద్యార్థుల సంఖ్య ఈ సంవత్సరం గణనీయంగా పెరిగింది. 18,255 మంది విద్యార్థులు పది జీపీఏ సాధించారని మంత్రి తెలిపారు. గతేడాది కేవలం 6,444 మంది విద్యార్థులు మాత్రమే పది జీపీఏ సాధించారని, ఇప్పుడది దాదాపుగా మూడు రెట్లు పెరిగిందన్నారు. జిల్లాల వారీగా జీపీఏలో తూర్పు గోదావరి 2,826 విద్యార్థులతో ప్రథమంలో నిలవగా, 525 మందితో విజయనగరం అట్టడుగున నిలిచింది. రాష్ట్రవ్యాప్తంగా 17,209 మంది ప్రైవేటు పాఠశాలల విద్యార్థులే పది జీపీఏ సాధించారని పేర్కొన్నారు. మిగిలిన 1,046 విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులని, వీరి సంఖ్య పెరగాల్సిన అవసరం ఉందని మంత్రి అన్నారు. -
టెన్త్‌లో బాలికల హవా
బాలుర ఉత్తీర్ణత 84.70%.. బాలికల ఉత్తీర్ణత 86.57% పదో తరగతిలో మొత్తంగా 85.63% ఉత్తీర్ణత సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ఎప్పట్లాగే ఈసారి కూడా బాలికలే ముందంజలో నిలిచారు. బాలుర కంటే అధిక ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ పరీక్షలకు 2,62,187 మంది బాలురు హాజరు కాగా 2,22,071 మంది (84.70 శాతం) ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 2,57,307 మంది హాజరు కాగా 2,22,757 మంది (86.57 శాతం) ఉత్తీర్ణులయ్యారు. మార్చి 21 నుంచి ఏప్రిల్ 7వ తేదీ వరకు నిర్వహించిన పదో తరగతి పరీక్షల ఫలితాలను బుధవారం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి విడుదల చేశారు. జిల్లాలవారీగా చూస్తే 95.13 శాతం ఉత్తీర్ణతతో వరంగల్ ప్రథమ స్థానంలో నిలువగా.. 76.23 శాతం ఉత్తీర్ణతతో హైదరాబాద్ చివరి స్థానంలో నిలిచింది. 2,379 పాఠశాలలు వంద శాతం ఉత్తీర్ణత సాధించగా.. 10 పాఠశాలల్లో సున్నా ఫలితాలు వచ్చాయి. పరీక్షలకు 99.71 శాతం హాజరు ఈసారి పదో తరగతి పరీక్షలు రాసేందుకు రెగ్యులర్, ప్రైవేటు విద్యార్థులు కలిపి 5,56,885 మంది దరఖాస్తు చేసుకోగా పరీక్షలకు 5,55,265 మంది (99.71 శాతం) హాజరయ్యారు. ఇందులో 4,58,964 మంది ఉత్తీర్ణులు కాగా 95,301 మంది ఫెయిల్ అయ్యారు. పరీక్షలకు హాజరైన 5,19,494 మంది రెగ్యులర్ విద్యార్థుల్లో 4,44,828 మంది (85.63 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ప్రైవేటు విద్యార్థులు 35,771 మంది హాజరు కాగా 14,136 మంది (39.52 శాతం) ఉత్తీర్ణులయ్యారు. తెలంగాణ ప్రభుత్వ బీసీ సంక్షేమ గురుకులాలు 96.84 శాతం ఉత్తీర్ణత సాధించగా ప్రభుత్వ పాఠశాలలు 77.80 శాతం ఉత్తీర్ణత సాధించాయి. జిల్లా పరిషత్, గిరిజన సంక్షేమ గురుకులాలు, ఎయిడెడ్ పాఠశాలలు రాష్ట్ర సరాసరి ఉత్తీర్ణత 85.63 శాతం కంటే తక్కువ ఉత్తీర్ణత సాధించాయి. ఇక కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు, తెలంగాణ రాష్ట్ర గురుకులాలు, సాంఘిక సంక్షేమ గురుకులాలు రాష్ట్ర సరాసరి ఉత్తీర్ణత శాతం కంటే ఎక్కువ ఉత్తీర్ణతను సాధించాయి. గతేడాది కంటే పెరిగిన ఉత్తీర్ణత పదో తరగతి పరీక్షల్లో గతేడాది కంటే ఈసారి ఉత్తీర్ణత శాతం పెరిగింది. గతేడాది పరీక్షలకు రెగ్యులర్ విద్యార్థులు 5,13,473 మంది హాజరు కాగా 3,98,267 మంది (77.56 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఈసారి 85.63 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. అంటే 8.07 శాతం ఉత్తీర్ణత పెరిగింది. బాలికల ఉత్తీర్ణత శాతం కూడా ఈసారి పెరిగింది. గత ఏడాది 2,55,035 పరీక్షలకు హాజరు కాగా 2,01,582 మంది (79.04 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. అదే ఈసారి 86.57 శాతం మంది ఉత్తీర్ణులు కావడం విశేషం. ఈసారి పెరిగిన 10 జీపీఏ ఈసారి 3,419 మంది విద్యార్థులు అన్ని సబ్జెక్టుల్లో ఏ1 గ్రేడ్‌తో పదికి 10 గ్రేడ్ పాయింట్ యావరేజ్ (జీపీఏ) సాధించారు. గతేడాది 10 జీపీఏ కేవలం 1,387 మందికే రాగా.. ఈసారి 3,419 మందికి రావడం విశేషం. అయితే ఇందులో ప్రైవేటు పాఠశాలల విద్యార్థులే అత్యధికంగా (3,311 మంది) ఉన్నారు. ఇక 98,027 మందికి ఏ గ్రేడ్ రాలేదు. ఈ స్కూళ్లలో వంద శాతం ఉత్తీర్ణత రాష్ట్రంలో మేనేజ్మెంట్ల వారీగా చూస్తే 2,379 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. అందులో 121 ప్రభుత్వ పాఠశాలలు, 644 జిల్లా పరిషత్, 22 ఎయిడెడ్ పాఠశాలలు ఉండగా, 13 తెలంగాణ గురుకులాలు, 22 సాంఘిక సంక్షేమ గురుకులాలు, 17 గిరిజన సంక్షేమ గురుకులాలు ఉన్నాయి. మరో 6 బీసీ వెల్ఫేర్ గురుకులాలు, 30 కేజీబీవీ స్కూళ్లు, 43 మోడల్ స్కూళ్లు ఉండగా.. 1,461 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. 10 జీపీఏ సాధించిన ప్రభుత్వ పాఠశాలల సంఖ్య గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి పెరిగింది. 8 ప్రైవేటు స్కూళ్లలో సున్నా.. టెన్త్ ఫలితాల్లో 8 ప్రైవేటు పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాలేదు. మొత్తంగా 10 స్కూళ్లలో సున్నా ఫలితాలు రాగా అందులో 8 ప్రైవేటు పాఠశాలలే ఉన్నాయి. మిగతా రెండింటిలో ఒకటి ప్రభుత్వ పాఠశాల కాగా మరొకటి ఎయిడెడ్ పాఠశాల. -
పది ఫలితాల్లో సిక్స్స్!
►రాష్ట్రస్థాయిలో ఆరో ర్యాంక్ ►రెండు స్థానాల పైకి ఎగబడిన జిల్లా ►ఉత్తరాంధ్రలో ఫస్ట్ ►మళ్లీ బాలురదే హవా ►మొత్తం 92.99 శాతం ఉత్తీర్ణత ►బాలురు- 93.08% ►బాలికలు- 92.91% ►10/10 పాయింట్లు సాధించిన విద్యార్థులు 126 మంది విజయనగరం అర్బన్ : పదో తరగతి పరీక్షా ఫలితాలు జిల్లా ప్రతిష్టను పెంచాయి. నూతన రాష్ర్టం ఆవిర్భావం తరువాత తొలిసారిగా వచ్చిన ఫలితాల్లో జిల్లా విద్యార్థులు మంచి ఫలితాలను సాధించారు. జిల్లా ఉత్తరాంధ్రలో మొదటి స్థానాన్ని పొందింది . 13 జిల్లాలలో 6వ స్థానంలో నిలిచింది. పదో తరగతి పరీక్షా ఫలితాలు బుధవారం విడుదల అయ్యాయి. గత ఏడాది ఉమ్మడి రాష్ట్రంలో సాధించిన ర్యాంక్ కంటే రెండుస్థానాలు పైకి వచ్చింది. గత ఏడాది 91.82 శాతం ఉత్తీర్ణత సాధించగా, ఈ ఏడాది వచ్చిన 92.99 శాతంతో పోల్చితే 1.17 శాతం మెరుగుపడింది. గత ఏడాది ఉమ్మడి రాష్ర్టంలో 8వ స్థానంలో ఉండగా, ఈ ఏడాది 13 జిల్లాల కొత్తరాష్ర్టంలో 6వ స్థానానికి ఎదిగింది. జిల్లాలో పరీక్ష రాసిన మొత్తం 29,803 మంది విద్యార్థుల్లో 91.12 శాతంతో 27,715 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురు గత ఏడాది 91.73 శాతం ఉత్తీర్ణులవగా, ఈ ఏడాది 1.25 శాతం పెరిగి 93.08 శాతం ఉత్తీర్ణత సాధించారు. అదే విధంగా బాలికల ఉత్తీర్ణత శాతం కూడా 0.79 మేరకు మెరుగుపడింది. గత ఏడాది 91.12 శాతం సాధించిన బాలికలు ఈ ఏడాది 92.91 శాతం ఉత్తీర్ణత సాధించారు. 17,123 మంది బాలురల్లో 14,076 మంది, 14,680 మంది బాలికలలో 13,639 మంది ఉత్తీర్ణులయ్యారు. జిల్లాలో 10/10 విద్యార్థులు 126 మంది జిల్లాలో పదికి 10 పాయింట్లు సాధించిన విద్యార్థుల సంఖ్య 126 వరకూ ఉన్నట్టు డీఈఓ జి.కృష్ణారావు తెలిపారు. మారిన ఉత్తీర్ణతా విధానం మేరకు గ్రేడింగింగ్ పెర్సంటైల్ ఏవరేజ్ (జీపీఏ) పాయింట్ల పరిధిలో నమోదైన విద్యార్థుల సంఖ్య వివరాలను ఆయన ప్రకటించారు. గ్రేడింగ్ పాయింట్లపై పెరిగిన ఆసక్తి పదో తరగతి పరీక్షల ఫలితాల కోసం జిల్లాలో విద్యార్థినీ, విద్యార్థులు తల్లిదండ్రులు ఉదయం నుంచి ఉత్కంఠతో ఎదురు చూశారు. ఫలితాలు విడుదల చేశాక నెట్ పనిచేయకపోవడం, నెమ్మదిగా పనిచేయడం వంటి సమస్యలు వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. ఈ-సేవల్లో ఫలితాల రాకపోవడంతో నెట్ సెంటర్ల వద్ద రద్దీ పెరిగింది. మార్కులను ఇస్తూ గ్రేడింగ్ విధానాన్ని నాలుగేళ్ల క్రితం నుంచి అమలు చేస్తున్నారు. అయితే కేవలం గ్రేడింగ్ పాయింట్లు, గ్రేడ్లు ఇచ్చే విధానాన్ని మూడేళ్ల నుంచి అమలులోకి వచ్చింది. ఈ విధానంపై గత మూడేళ్లగా సరియైన అవగాహన లేక పలువురు విద్యార్థులు, తల్లిదండ్రులు అయోమయంలో పడ్డారు. అయితే ఈ ఏడాది అలాంటి పరిస్థితి ఎక్కడా కనిపించలేదు. -
పదో తరగతి పరీక్ష ఫలితాల్లో బాలికలదే పైచేయి
ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్ : పదో తరగతి పరీక్ష ఫలితాల్లో జిల్లా వ్యాప్తంగా బాలికలే పైచేయి సాధించారు. బాలుర కంటే అదనపు ఉత్తీర్ణత సాధించి తమ సత్తా చాటారు. పరీక్ష ఫలితాల వివరాలను జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ రాజేశ్వరరావు గురువారం విలేకరులకు వివరించారు. జిల్లా విద్యార్థులు 87.56 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్ర స్థాయిలో 18వ స్థానంలో నిలిచారు. గత ఏడాది ఫలితాలతో పోలిస్తే ఒక శాతం అదనపు ఉత్తీర్ణత సాధించినా రాష్ట్రస్థాయిలో జిల్లా 17 నుంచి 18వ స్థానానికి దిగజారింది. ఐదేళ్ల పరీక్ష ఫలితాలను పరిశీలిస్తే ఏటా ఉత్తీర్ణత శాతం పెరుగుతున్నా రాష్ట్రస్థాయి ర్యాంకు మాత్రం దిగజారుతూ రావడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో మొత్తం 34,907 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 30,566 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో 18,022 మంది బాలురు పరీక్షకు హాజరు కాగా 15,769 మంది పాసయ్యారు. జిల్లా సగటు కంటే 0.5 శాతం తక్కువగా 87.02 శాతం ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్ర సగటు కంటే 0.94 శాతం తక్కువగా ఉత్తీర్ణులయ్యారు. అదేవిధంగా 16,725 మంది బాలికలు పరీక్షకు హాజరు కాగా 14,797 మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 88.16 శాతం ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్ర సగటు కంటే 1.17 శాతం తక్కువ మంది ఉత్తీర్ణులయ్యారు. గ్రేడ్లే..గ్రేడ్లు ఈ ఏడాది గరిష్టంగా 72 మంది విద్యార్థులు 10/10 గ్రేడ్ పాయింట్లు సాధించారు. గత ఏడాది కేవలం 30 మందికి మాత్రమే 10/10 గ్రేడ్ పాయింట్లురాగా ఈ ఏడాది అదనంగా 42 మంది సాధించారు. స్థానిక మాంటిస్సోరి హైస్కూల్ విద్యార్థులు 10/10 గ్రేడ్ పాయింట్ల సాధనలో జిల్లాలోనే అగ్రగాములుగా నిలిచారు. ఈ పాఠశాలలో ఐదుగురు విద్యార్థులు 10/10 గ్రేడ్ సాధించి సత్తా చాటారు. రాష్ట్రస్థాయిలో ఒకే క్యాంపస్‌లో ఐదుగురికి 10 గ్రేడ్ పాయింట్లు రావడం రికార్డని కరస్పాండెంట్ పి.ప్రకాష్‌బాబు తెలిపారు. ఎం.అనంత, పి.విష్ణుప్రియ, బి.పవన్‌కళ్యాణ్, ఏవీ భారవి, ఎన్.సుష్మాంజలిలు 10 గ్రేడ్ పాయింట్లు సాధించిన వారిలో ఉన్నారు. పలు ప్రైవేటు పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కూడా ప్రతిభ కనబరిచారు. అడ్డంకులెదురైనా.. జిల్లాలో ప్రతికూల పరిస్థితిని సైతం అధిగమించి పదో తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధించారు. 2013లో సమైక్యాంధ్ర ఉద్యమంతో సుమారు రెండు నెలల పాటు పాఠశాలలు మూతబడ్డాయి. ఆందోళన కార్యక్రమాల్లో విద్యార్థులు కూడా భాగస్వాములు కావడంతో సుమారు మూడు నెలలపాటు పాఠశాలల్లో తరగతులు అంతంత మాత్రంగానే జరిగాయి. మిగిలిన కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం వల్లే మంచి ఫలితాలు సాధించగలిగామని డీఈవో రాజేశ్వరరావు సంతృప్తి వ్యక్తం చేశారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించి పరీక్షలకు సంసిద్ధులను చేశారు. డీసీఈబీ (జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు) ఆధ్వర్యంలో పాఠశాలలకు స్టడీ మెటీరియల్ సరఫరా చేశారు. సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులకు ప్రత్యేకంగా స్టడీ మెటీరియల్ సరఫరా చేయడంతో పాటు కలెక్టర్ సూచనల మేరకు వారికి నిర్వహించిన ప్రత్యేక కౌన్సెలింగ్ కూడా ఉత్తమ ఫలితాల సాధనకు దోహదపడిందని డీఈవో వివరించారు. -
20వ తేదీ తరువాత టెన్త్ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పరీక్ష ఫలితాలను ఈ నెల 20వ తేదీ తరువాత విడుదల చేసే అవకాశం ఉంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో... వీలైతే ఈ నెల 24వ తేదీ కంటే ముందుగానే ఫలితాలను విడుదల చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.