టెన్త్‌లో బాలికల హవా | Girls dominant in Tenth | Sakshi
Sakshi News home page

టెన్త్‌లో బాలికల హవా

Published Thu, May 12 2016 2:53 AM | Last Updated on Sun, Sep 3 2017 11:53 PM

Girls dominant in Tenth

బాలుర ఉత్తీర్ణత 84.70%.. బాలికల ఉత్తీర్ణత 86.57%  పదో తరగతిలో మొత్తంగా 85.63% ఉత్తీర్ణత
 
 సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ఎప్పట్లాగే ఈసారి కూడా బాలికలే ముందంజలో నిలిచారు. బాలుర కంటే అధిక ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ పరీక్షలకు 2,62,187 మంది బాలురు హాజరు కాగా 2,22,071 మంది (84.70 శాతం) ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 2,57,307 మంది హాజరు కాగా 2,22,757 మంది (86.57 శాతం) ఉత్తీర్ణులయ్యారు. మార్చి 21 నుంచి ఏప్రిల్ 7వ తేదీ వరకు నిర్వహించిన పదో తరగతి పరీక్షల ఫలితాలను బుధవారం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి విడుదల చేశారు. జిల్లాలవారీగా చూస్తే 95.13 శాతం ఉత్తీర్ణతతో వరంగల్ ప్రథమ స్థానంలో నిలువగా.. 76.23 శాతం ఉత్తీర్ణతతో హైదరాబాద్ చివరి స్థానంలో నిలిచింది. 2,379 పాఠశాలలు వంద శాతం ఉత్తీర్ణత సాధించగా.. 10 పాఠశాలల్లో సున్నా ఫలితాలు వచ్చాయి.

 పరీక్షలకు 99.71 శాతం హాజరు
 ఈసారి పదో తరగతి పరీక్షలు రాసేందుకు రెగ్యులర్, ప్రైవేటు విద్యార్థులు కలిపి 5,56,885 మంది దరఖాస్తు చేసుకోగా పరీక్షలకు 5,55,265 మంది (99.71 శాతం) హాజరయ్యారు. ఇందులో 4,58,964 మంది ఉత్తీర్ణులు కాగా 95,301 మంది ఫెయిల్ అయ్యారు. పరీక్షలకు హాజరైన 5,19,494 మంది రెగ్యులర్ విద్యార్థుల్లో 4,44,828 మంది (85.63 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ప్రైవేటు విద్యార్థులు 35,771 మంది హాజరు కాగా 14,136 మంది (39.52 శాతం) ఉత్తీర్ణులయ్యారు. తెలంగాణ ప్రభుత్వ బీసీ సంక్షేమ గురుకులాలు 96.84 శాతం ఉత్తీర్ణత సాధించగా ప్రభుత్వ పాఠశాలలు 77.80 శాతం ఉత్తీర్ణత సాధించాయి. జిల్లా పరిషత్, గిరిజన సంక్షేమ గురుకులాలు, ఎయిడెడ్ పాఠశాలలు రాష్ట్ర సరాసరి ఉత్తీర్ణత 85.63 శాతం కంటే తక్కువ ఉత్తీర్ణత సాధించాయి. ఇక కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు, తెలంగాణ రాష్ట్ర గురుకులాలు, సాంఘిక సంక్షేమ గురుకులాలు రాష్ట్ర సరాసరి ఉత్తీర్ణత శాతం కంటే ఎక్కువ ఉత్తీర్ణతను సాధించాయి.

 గతేడాది కంటే పెరిగిన ఉత్తీర్ణత
 పదో తరగతి పరీక్షల్లో గతేడాది కంటే ఈసారి ఉత్తీర్ణత శాతం పెరిగింది. గతేడాది పరీక్షలకు రెగ్యులర్ విద్యార్థులు 5,13,473 మంది హాజరు కాగా 3,98,267 మంది (77.56 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఈసారి 85.63 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. అంటే 8.07 శాతం ఉత్తీర్ణత పెరిగింది. బాలికల ఉత్తీర్ణత శాతం కూడా ఈసారి పెరిగింది. గత ఏడాది 2,55,035 పరీక్షలకు హాజరు కాగా 2,01,582 మంది (79.04 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. అదే ఈసారి 86.57 శాతం మంది ఉత్తీర్ణులు కావడం విశేషం.

 ఈసారి పెరిగిన 10 జీపీఏ
 ఈసారి 3,419 మంది విద్యార్థులు అన్ని సబ్జెక్టుల్లో ఏ1 గ్రేడ్‌తో పదికి 10 గ్రేడ్ పాయింట్ యావరేజ్ (జీపీఏ) సాధించారు. గతేడాది 10 జీపీఏ కేవలం 1,387 మందికే రాగా.. ఈసారి 3,419 మందికి రావడం విశేషం. అయితే ఇందులో ప్రైవేటు పాఠశాలల విద్యార్థులే అత్యధికంగా (3,311 మంది) ఉన్నారు. ఇక 98,027 మందికి ఏ గ్రేడ్  రాలేదు.

 ఈ స్కూళ్లలో వంద శాతం ఉత్తీర్ణత
 రాష్ట్రంలో మేనేజ్‌మెంట్ల వారీగా చూస్తే 2,379 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. అందులో 121 ప్రభుత్వ పాఠశాలలు, 644 జిల్లా పరిషత్, 22 ఎయిడెడ్ పాఠశాలలు ఉండగా, 13 తెలంగాణ గురుకులాలు, 22 సాంఘిక సంక్షేమ గురుకులాలు, 17 గిరిజన సంక్షేమ గురుకులాలు ఉన్నాయి. మరో 6 బీసీ వెల్ఫేర్ గురుకులాలు, 30 కేజీబీవీ స్కూళ్లు, 43 మోడల్ స్కూళ్లు ఉండగా.. 1,461 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. 10 జీపీఏ సాధించిన ప్రభుత్వ పాఠశాలల సంఖ్య గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి పెరిగింది.

 8 ప్రైవేటు స్కూళ్లలో సున్నా..
 టెన్త్ ఫలితాల్లో 8 ప్రైవేటు పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాలేదు. మొత్తంగా 10 స్కూళ్లలో సున్నా ఫలితాలు రాగా అందులో 8 ప్రైవేటు పాఠశాలలే ఉన్నాయి. మిగతా రెండింటిలో ఒకటి ప్రభుత్వ పాఠశాల కాగా మరొకటి ఎయిడెడ్ పాఠశాల.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement