10/10 జీపీఏ సాధించిన ప్రియాంకకు (శ్రీచైతన్య టెక్నో స్కూల్– కూకట్‌పల్లి) స్వీట్ తినిపిస్తున్న తల్లి పద్మ
సకల సౌకర్యాలకు, విద్యా ప్రమాణాలకు కేంద్రమైన హైదరాబాద్ జిల్లా పదో తరగతి ఫలితాల్లో వెనుకబడింది. రాష్ట్ర ఉత్తీర్ణతలో (కొత్తగాఏర్పడిన 31 జిల్లాల్లో) 25వ స్థానం, గ్రేటర్‌లో మూడో స్థానంతోసరిపెట్టుకుంది. గతేడాదితో పోలిస్తే ఈసారి గ్రేటర్ ఫలితాలు కాస్త మెరుగు పడినప్పటికీ.. ఇతర జిల్లాలకంటే ఇంకా వెనుకబడే ఉన్నాయి. మేడ్చల్ జిల్లా 87.91 శాతం ఉత్తీర్ణతతో 13వ స్థానంలో, రంగారెడ్డి 87.13 శాతంతో 16వ స్థానంలో నిలిచాయి. ఇక హైదరాబాద్ జిల్లా 75.98 శాతంతో 25వ స్థానానికి పరిమితమైంది. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే గ్రేటర్‌లో నాణ్యమైన విద్య అందుతుందని అంతా భావిస్తారు. నిజానికి ఇతర జిల్లాలకంటే ఇక్కడే ఉత్తీర్ణత శాతం అధికంగా నమోదు కావాలి. కానీ పదో తరగతి ఫలితాల్లో మారుమూల జిల్లాలతో పోలిస్తే వెనుకబడడం ఆందోళన కలిగిస్తోంది.
సాక్షి, సిటీబ్యూరో: ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో గ్రేటర్ జిల్లాలు చతికిలబడ్డాయి. రాష్ట్రంలో మేడ్చల్ జిల్లా ఉత్తీర్ణతలో 13వ స్థానంలో నిలవగా.. రంగారెడ్డి 16వ స్థానం సాధించింది. ఇక ఐటీ హబ్‌గా పేరొందిన హైదరాబాద్ జిల్లా 25వ స్థానంతో సరిపెట్టుకుంది. హైదరాబాద్ జిల్లాలో 69,386 పరీక్షకు హాజరు కాగా, 52,718 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. వీరిలో బాలురు 71.8 శాతం, బాలికలు 80.2 శాతంగా ఉన్నారు. రంగారెడ్డి జిల్లాలో 43,392 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా, 37,809 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో బాలురు 86.11శాతం, బాలికలు 88.27శాతం. ఇక మేడ్చల్ జిల్లాలో 41,131 మంది పరీక్ష రాయగా, 36,157 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో బాలురు 86.76 శాతం, బాలికలు 89.21 శాతంగా ఉన్నారు. ఇదిలా ఉంటే మలక్‌పేట్‌లోని ప్రభుత్వ అంధ, బధిర బాలికల పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణతో రికార్డు సృష్టించాయి. వీటితోపాటు అంబర్‌పేట్ గవర్నమెంట్ బాలికల పాఠశాల(జీజీహెచ్‌ఎస్), గోషామహాల్ జీహెచ్‌ఎస్ (ఉర్దూ) కూడా నూరు శాతం ఉత్తీర్ణత సాధించాయి.
పేదింట్లో సరస్వతీ బిడ్డలు
బంజారాహిల్స్: ఫిలింనగర్‌లోని రౌండ్‌టేబుల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్ష ఫలితాలు నిరుత్సాహాన్ని మిగిల్చాయి. 147 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా కేవలం 76 మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. 52 శాతం ఫలితాలు వచ్చాయని ప్రధానోపాధ్యాయుడు నారాయణ తెలిపారు. 9.7 గ్రేడ్‌తో భవాని, అజయ్ స్కూల్ టాపర్లుగా నిలిచారు. 9.2 జీపీఏతో ఏసురత్నం మూడో స్థానంలో నిలిచింది. భవాని తండ్రి మృతి చెందగా తల్లి వసంత ఇళ్లల్లో పని చేస్తూ కూతురును చదివిస్తోంది. అజయ్ తండ్రి మృతి చెందగా తల్లి అలివేలు సెల్‌ఫోన్ షాప్‌లో పని చేస్తోంది. ఏసురత్నం తండ్రి వాచ్‌మెన్ కాగా తల్లి సత్యవతి ఇళ్లల్లో పనిచేస్తూ జీవిస్తున్నారు.
సత్తాచాటిన ‘దేవనార్’..
సనత్‌నగర్: బేగంపేట మయూరి మార్గ్‌లోని దేవనార్ అంధుల పాఠశాల విద్యార్థులు పదోతరగతి ఫలితాల్లో సత్తా చాటారు. ఇక్కడి నుంచి 41 మంది విద్యార్థులు పరీక్ష రాయగా నూరు శాతం ఉత్తీర్ణత సాధించారు. వీరిలో శరత్ 9.3, ఆకాష్ 9.2, హీనా, పాషా 9.0 జీపీఏ సాధించారు.
వైష్ణవి 10/10
సికింద్రాబాద్ మైలార్‌గడ్డకు చెందిన మాణిక్య మాంటిస్సోరి స్కూలు విద్యార్థి వైష్ణవి 10/10 జీపీఏ సాధించింది. తండ్రి బాలరాజు ప్రైవేటు ఉద్యోగి కాగా, తల్లి , అనసూర్య గృహిణి.
Comments
Please login to add a commentAdd a comment