టెన్త్‌లో 91.92 % పాస్
- తూర్పుగోదావరి ఫస్ట్, చిత్తూరు లాస్ట్
- 100% ఫలితాలు సాధించిన పాఠశాలలు 4,102
- 10 జీపీఏ సాధించిన విద్యార్థుల సంఖ్య 18,255
- మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడి
ఏయూక్యాంపస్(విశాఖ): పదో తరగతి పరీక్ష ఫలితాల్లో 91.92 శాతం ఉత్తీర్ణత నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా 6,22,538 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవగా 5,68,515 మంది ఉత్తీర్ణత సాధించారు. హాజరైన వారిలో 13,036 మంది ప్రైవేటు విద్యార్థులు కాగా 6,09,502 మంది రెగ్యులర్ విద్యార్థులు. గతేడాదితో పోల్చితే ఈ విద్యా సంవత్సరంలో ఉత్తీర్ణత శాతం 2.6 శాతం తక్కువగా నమోదయింది. పరీక్షకు 3,14,471 మంది బాలురు హాజరవగా 2,88,909(91.87 శాతం)మంది, 2,95,031 మంది బాలికలు హాజరవగా 2,71,344(91.97 శాతం)మంది ఉత్తీర్ణత సాధించారు.
పరీక్షకు హాజరైన 13,036 మం ది ప్రైవేటు విద్యార్థుల్లో 8,262(63.38 శాతం) ఉత్తీర్ణత సాధించారు. పదో తరగతి పరీక్ష ఫలితాలను శనివారం సాయంత్రం ఏయూలోని వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసుల నాయుడు, పాఠశాల విద్యా కమిషనర్ సంధ్యారాణి, పాఠశాల విద్యా డైరెక్టర్ భార్గవ్, ఏయూ వీసీ జి.నాగేశ్వరరావు, రిజిస్ట్రార్ వి.ఉమామహేశ్వరరావు, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ పీఎస్ అవధాని, విశాఖ డీఈవో నాగమణి తదితరులు పాల్గొన్నారు.
తూర్పుగోదావరి ఫస్ట్, చిత్తూరు లాస్ట్..
ఫలితాలలో తూర్పుగోదావరి జిల్లా 97.97 శాతంతో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలవగా, చిత్తూరు 80.55 శాతంతో అట్టడుగున నిలిచింది. గత మూడు సంవత్సరాలుగా చిత్తూరు జిల్లా అట్టడు గున నిలుస్తోందని మంత్రి తెలిపారు. అత్యధిక, అత్యల్ప ఉత్తీర్ణత కలిగిన జిల్లాల మధ్య వ్యత్యాసం 17 శాతం వరకు ఉందన్నారు. అలాగే 11,143 పాఠశాలల్లో 4,102 పాఠశాలలు 100 శాతం ఫలితాలు సాధించాయని వివరించారు. గతేడాదితో పోల్చితే 115 పాఠశాలలు తగ్గాయన్నారు. ప్రైవేటు యాజమాన్యంలో నిర్వహిస్తున్న రెండు పాఠశాలల్లో సున్నా శాతం ఉత్తీర్ణత నమోదయిందన్నారు. ఈ పాఠశాలల్లో చదువుతున్న ఏకైక విద్యార్థి పరీక్షకు హాజరై ఉత్తీర్ణత సాధించకపోవడంతో ఈ ఫలితాలు వచ్చాయన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో 97.26 శాతం ఉత్తీర్ణత, ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలల్లో 82.02, జెడ్పీ పాఠశాలల్లో 89.23, ప్రభుత్వ పాఠశాలల్లో 84.29, ఏపీ మోడల్ స్కూల్స్‌లో 94.32, మున్సిపల్ పాఠశాలల్లో 86.67, ఏపీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 96.37, సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో 93.45 శాతం ఉత్తీర్ణత నమోదయింది.
జీపీఏ పెరిగింది..
ఫలితాలలో పదికి పది జీపీఏ సాధించిన విద్యార్థుల సంఖ్య ఈ సంవత్సరం గణనీయంగా పెరిగింది. 18,255 మంది విద్యార్థులు పది జీపీఏ సాధించారని మంత్రి తెలిపారు. గతేడాది కేవలం 6,444 మంది విద్యార్థులు మాత్రమే పది జీపీఏ సాధించారని, ఇప్పుడది దాదాపుగా మూడు రెట్లు పెరిగిందన్నారు. జిల్లాల వారీగా జీపీఏలో తూర్పు గోదావరి 2,826 విద్యార్థులతో ప్రథమంలో నిలవగా, 525 మందితో విజయనగరం అట్టడుగున నిలిచింది. రాష్ట్రవ్యాప్తంగా 17,209 మంది ప్రైవేటు పాఠశాలల విద్యార్థులే పది జీపీఏ సాధించారని పేర్కొన్నారు. మిగిలిన 1,046 విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులని, వీరి సంఖ్య పెరగాల్సిన అవసరం ఉందని మంత్రి అన్నారు.