విశాఖలో టెన్త్ ఫలితాలను విడుదల చేస్తున్న మంత్రి గంటా
సాక్షి, విశాఖపట్నం/అమరావతి : ఇంటర్మీడియట్‌లో పైచేయి సాధించిన అమ్మాయిలు పదో తరగతి పరీక్ష ఫలితాల్లోనూ అగ్రస్థానంలో నిలిచారు. బాలురకంటే తామే ముందున్నామని బాలికలు మరోసారి నిరూపించారు. 2018 పదో తరగతి పరీక్షా ఫలితాలను ఆదివారం సాయంత్రం విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయం కాన్వొకేషన్ హాలులో రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది మార్చి 15 నుంచి 29 వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయని, ఈ పరీక్షలకు 6,13,378 మంది విద్యార్థినీ, విద్యార్థులు హాజరయ్యారని చెప్పారు. వీరిలో 94.48 శాతమైన 6,04,527 మంది రెగ్యులర్ విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారన్నారు.
ఇందులో 94.56 శాతం బాలికలు కాగా, 94.41 శాతం బాలురు. ఉత్తీర్ణతలో బాలురకంటే బాలికలు 0.15 శాతం ఆధిక్యం సాధించారన్నారు. అలాగే, ప్రైవేటుగా హాజరైన విద్యార్థులు 78.35 శాతం ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది 5,340 ఉన్నత పాఠశాలలు నూరు శాతం ఉత్తీర్ణత సాధించాయని.. సున్నా ఫలితాలు సాధించిన స్కూళ్లలో ప్రైవేట్‌వి 10, ఎయిడెడ్‌వి 2, జిల్లా పరిషత్ పాఠశాలలు 5 ఉన్నాయని వివరించారు. పాఠశాలల వారీగా ఉత్తీర్ణత శాతాన్ని చూస్తే.. జిల్లా పరిషత్ పాఠశాలలు 92.57, ప్రభుత్వ పాఠశాలలు 90.77, ఏపీ మోడల్ స్కూళ్లు 97.38, మున్సిపల్ స్కూళ్లు 90.40 శాతం ఉత్తీర్ణత సాధించినట్టు మంత్రి వివరించారు.
‘ప్రకాశం’ టాప్.. నెల్లూరు లాస్ట్
రాష్ట్రంలోకెల్లా ప్రకాశం జిల్లా 97.93 శాతం ఉత్తీర్ణతతో మొదటి స్థానంలో, 80.37 శాతంతో నెల్లూరు జిల్లా ఆఖరి స్థానంలోనూ నిలిచాయని ‘గంటా’ వివరించారు. 2007లో పదో తరగతి పరీక్షల్లో రాష్ట్ర వ్యాప్తంగా మొదటి స్థానంలో నిలిచిన ప్రకాశం జిల్లా మళ్లీ ఇప్పుడు ఆ స్థానం దక్కించుకుంది. సామాజికవర్గాల వారీగా చూస్తే.. ఓసీ విద్యార్థులు 96.77, ఎస్సీలు 91.12, ఎస్టీలు 91.47, బీసీలు 94.94 శాతం ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. అలాగే ద్వితీయ భాషలో అత్యధికంగా 99.98 శాతం, గణితంలో అత్యల్పంగా 96.45 శాతం మంది ఉత్తీర్ణత పొందారన్నారు. అలాగే, రాష్ట్రం మొత్తమ్మీద 29,921 మంది 10/10 జీపీఏ సాధించారని, వీరిలో అత్యధికులు (26,475 మంది) ప్రైవేటు స్కూళ్లకు చెందిన వారేనని చెప్పారు.
జూన్ 11 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు..
జూన్ 11 నుంచి 25 వరకు పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఇందుకు పరీక్ష రుసుమును సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయునికి మే 30లోగా చెల్లించాలన్నారు. విద్యార్థులకు మార్కుల మెమోలను 15 రోజుల్లో పంపిస్తామని చెప్పారు. విద్యార్థులు మార్కులు తిరిగి లెక్కింపు కోరుకుంటే రూ.500 చెల్లించి మే 14 లోగా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. సబ్జెక్టుల సమాధాన పత్రాల పునఃపరిశీలనా విధానాన్ని అన్ని జిల్లా కేంద్రాల్లో వికేంద్రీకరించినట్టు తెలిపారు. ఇలాంటి వారు మే 14లోగా తమ దరఖాస్తులు పంపుకోవాలన్నారు.
‘ప్రైవేటు’ ఫలితాలపై విచారణ
10/10 జీపీఏ సాధించిన పాఠశాలలు ప్రైవేటు స్కూళ్లే ఎక్కువగా ఉన్నాయన్న విషయాన్ని విలేకరులు మంత్రి దృష్టికి తీసుకెళ్లగా.. అలాంటి పాఠశాలలపై విచారణ జరిపిస్తామని ఆయన బదులిచ్చారు. అలాగే, ఈ ఏడాది వేసవి సెలవులు ముగియడానికి ముందే ఉపాధ్యాయుల బదిలీలుంటాయని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల విద్య కమిషనర్ సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.
ఆంగ్ల మాధ్యమంలోనే అధిక ఉత్తీర్ణత
టెన్త్ పరీక్షల్లో తెలుగు మాధ్యమం అభ్యర్థులకన్నా ఆంగ్ల మాధ్యమ అభ్యర్థులు ఎక్కువ శాతం ఉత్తీర్ణత సాధించారు. ఆంగ్ల మాధ్యమంలో 97.32 శాతం మంది ఉత్తీర్ణులు కాగా తెలుగు మాధ్యమంలో 90.12 శాతం మంది మాత్రమే పాసయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment