ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్‌ పరీక్షలు  | Inter exams from February 28 to March 19 | Sakshi
Sakshi News home page

ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్‌ పరీక్షలు 

Published Thu, Nov 9 2017 4:32 AM | Last Updated on Thu, Nov 9 2017 5:25 AM

Inter exams from February 28 to March 19 - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంటర్మీడియెట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల వార్షిక పరీక్షలను వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు నిర్వహించనున్నారు. బుధవారం విజయవాడలో రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించారు. నిర్దేశిత తేదీల్లో రోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ప్రథమ సంవత్సర పరీక్షలు ఫిబ్రవరి 28 నుంచి మార్చి 17 వరకు, ద్వితీయ సంవత్సర పరీక్షలు మార్చి 1 నుంచి 19 వరకు జరుగుతాయి. జనవరి 27న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎథిక్స్‌ అండ్‌ హ్యూమన్‌ వ్యాల్యూస్‌ పరీక్ష ఉంటుంది. అదే నెల 29న అదే సమయంలో ఎన్విరాన్‌మెంటల్‌ ఎడ్యుకేషన్‌ పరీక్షను నిర్వహిస్తారు. ప్రాక్టికల్‌ పరీక్షలు ఫిబ్రవరి 1 నుంచి 21 వరకు ఉంటాయి.

జనరల్‌తోపాటు వొకేషనల్‌ విద్యార్థులకు ఇవే పరీక్ష తేదీలు వర్తిస్తాయి. కాగా తెలంగాణ ఇంటర్మీడియెట్‌ పరీక్షలు మార్చి 1న మొదలవుతాయి. ఈ సందర్భంగా మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ వచ్చే ఏడాది నుంచి ఇంటర్‌లో గ్రేడింగ్‌ విధానం అమలు చేయనున్నట్టు తెలిపారు. ఇంటర్‌ ఫస్టియర్‌ విద్యార్థులకు మార్కుల స్థానంలో గ్రేడింగులు ఇస్తామన్నారు. మొత్తం ఏడు గ్రేడ్‌లు ఉంటాయని పేర్కొన్నారు. ఇంటర్‌ పరీక్షలకు 10,48,688 మంది విద్యార్థులు హాజరవుతున్నారని చెప్పారు.

వీరిలో ఇంటర్‌ ఫస్టియర్‌ విద్యార్థులు 4,96,660 మంది, సెకండియర్‌ విద్యార్థులు 4,82,235 మంది ఉన్నారని తెలిపారు. ఇంటర్‌ థియరీ పరీక్షలకు 1600 కేంద్రాలు, ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ పరీక్షలకు 1077 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. జంబ్లింగ్‌ విధానంలోనే పరీక్షలు నిర్వహించనున్నామన్నారు. కాగా నిర్దిష్ట సమయానికి మించి స్టడీ అవర్లు నిర్వహిస్తున్న 205 కళాశాలలకు నోటీసులు జారీ చేస్తున్నట్లు తెలిపారు. కళాశాలల్లో సమస్యలపై టోల్‌ ఫ్రీ నెంబర్‌కు 41 ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. 811 అనుమతులు లేని హాస్టళ్లు, కళాశాలలు నడుస్తున్నాయని, ఇవి అనుమతులు తీసుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. టీచర్‌ పోస్టుల భర్తీకి సంబంధించి త్వరలోనే నిర్ణయాన్ని తీసుకుంటామని పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement