బుక్కుల్లో బొక్కేశారు! | Golmaal in Sarva Shiksha Abhiyan funds | Sakshi
Sakshi News home page

బుక్కుల్లో బొక్కేశారు!

Published Fri, Aug 10 2018 2:56 AM | Last Updated on Fri, Aug 10 2018 2:56 AM

Golmaal in Sarva Shiksha Abhiyan funds - Sakshi

సాక్షి, అమరావతి: పేద విద్యార్థులకు విజ్ఞానాన్ని పంచే ప్రభుత్వ పాఠశాలల లైబ్రరీలనూ అధికార పార్టీ నేతలు వదలడం లేదు. గ్రంథాలయాలకు పుస్తకాల కొనుగోళ్ల పేరుతో రూ.4.66 కోట్ల సర్వశిక్ష అభియాన్‌ (ఎస్‌ఎస్‌ఏ) నిధులను మింగేశారు. టీడీపీ రాజ్యసభ సభ్యుడితోపాటు ఓ ఉన్నతాధికారి ఇందులో కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలున్నాయి. దీనికి సంబంధించి అవినీతి నిరోధకశాఖకు ఫిర్యాదులు అందినా అధికార పార్టీ నేతల అండదండలు ఉండటంతో విచారణ ముందుకు సాగడం లేదు. మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు దృష్టికి వచ్చినా ఈ వ్యవహారానికి అడ్డుకట్ట పడకపోవడం గమనార్హం.

అసలు రేట్లను భారీగా పెంచేసి...
బెంగళూరుకు చెందిన ‘డ్రీమ్‌వరల్డ్‌ ఇండియా’ సీడీలు, డీవీడీలతో కూడిన పుస్తకాలను ప్రభుత్వ పాఠశాలల గ్రంథాలయాలకు పంపిణీ చేస్తామని రెండేళ్ల క్రితం మంత్రి గంటా శ్రీనివాసరావుకు 16 రకాల పుస్తకాలతో ప్రతిపాదనలు అందచేసింది. పుస్తకాల వాస్తవ ధరలపై 71 శాతం వరకు డిస్కౌంట్‌ ఇస్తామనడంతో ఎస్‌ఎస్‌ఏ ద్వారా పుస్తకాల కొనుగోలుకు మంత్రి ఆదేశించారు. రాష్ట్ర విద్యాపరిశోధన శిక్షణ మండలి (ఎస్‌ఈఆర్టీ) ఆధ్వర్యంలో నిపుణుల కమిటీతో పరిశీలన తరువాత 11 రకాల పుస్తకాలు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఇక్కడే గోల్‌మాల్‌కు తెరలేచింది. ముందుగా చెప్పిన్నట్లు కాకుండా పుస్తకాల ధరను పెంచేశారు.

డిస్కౌంట్‌ను 71 శాతానికి బదులు 30 శాతానికి పరిమితం చేశారు. 
ఉదాహరణకు ప్రభుత్వానికి ముందుగా సమర్పించిన ప్రతిపాదనల ప్రకారం ‘స్పిరిట్‌ ఆఫ్‌ ఇండియా’ పుస్తకం ధర రూ.1495 ఉంటే ఎస్పీడీ ప్రతిపాదనల్లో అది రూ.2,495కి పెరిగింది. ‘ఓషన్‌ రిలీవింగ్‌ ద సీక్రెట్స్‌ ఆఫ్‌ డీప్‌’ పుస్తకం ధర రూ.1,000 నుంచి రూ.1995కి పెంచేశారు. ‘అట్లాస్‌ ఆఫ్‌ మై వరల్డ్‌’ పుస్తకం ధర రూ.695 నుంచి రూ.1,495కు పెంచేశారు. 

‘డబుల్‌’ దందా!
వాస్తవానికి తొలుత పేర్కొన్న ధరల ప్రకారం 11 పుస్తకాల సెట్టు ధర రూ.7,200 మాత్రమే. కానీ తరువాత ధరను అమాంతం రూ.13,489కి పెంచారు. రాష్ట్రంలోని 11,217 ప్రాథమికోన్నత పాఠశాలలకు పంపిణీ చేయడానికి రూ.15,13,06,113 అవుతుందని అంచనాలు రూపొందించారు. అయితే తరువాత స్కూళ్ల సంఖ్యను 7,413కి కుదించారు. ఆ ప్రకారం రూ. 9,99,93,957 అవుతుందని లెక్కగట్టారు. ఆమేరకు పుస్తకాలను పాఠశాలలకు అందించాలని జిల్లా ప్రాజెక్టు అధికారులకు ఎస్‌ఎస్‌ఏ ఎస్పీడీ ఆదేశాలు జారీచేశారు. మండల పాయింట్లకు డ్రీమ్‌వరల్డ్‌ సంస్థే పుస్తకాలను సరఫరా చేయాల్సి ఉన్నా కేవలం జిల్లా కేంద్రాలకు అందించేలా ఎస్‌ఎస్‌ఏ వెసులుబాటు కల్పించడంతోపాటు జిల్లా కార్యాలయాల నుంచి చెల్లింపులు చేయించారు. ఫైల్‌ను ముందు ముఖ్యకార్యదర్శికి పంపి ఆమోదం పొందాల్సి ఉన్నా అందుకు భిన్నంగా ఆర్డర్లు ఇచ్చిన తరువాత ఫైలును పంపడం గమనార్హం.

ఉన్నతాధికారులు మంత్రికి నివేదించినా...
డ్రీమ్‌వరల్డ్‌ తొలుత ప్రభుత్వానికి అందించిన ధరల ప్రతిపాదనల పత్రాలు ఫైల్‌లో లేకపోవడం, వాటి స్థానంలో అధిక ధరలతో వేరే పత్రాలు ఉండడాన్ని ముఖ్యకార్యదర్శి గుర్తించారు. ముందుగా ఇచ్చిన ఆఫర్‌ ప్రకారం ఒక్కో సెట్టు వాస్తవ ధర రూ.7,200 కాగా రూ.6,289 చొప్పున అదనంగా రేటు పెంచి రూ.13,489 చేశారు. 11 పుస్తకాల సెట్టు రూ.7200 చొప్పున 7,413 సెట్లకు రూ.5,33,73,600 మాత్రమే అవుతుంది. అయితే ఎస్‌ఎస్‌ఏ ఎస్పీడీ కొత్త ధరల పట్టికను చూపిస్తూ రూ.13,489 చొప్పున రూ.9,99,93,957  చెల్లింపులు చేశారు. పుస్తక ధరలను నిర్ణయించేందుకు రాష్ట్ర పుస్తక ప్రచురణ విభాగం ఉన్నా దానితో సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన మైక్రో, స్మాల్‌ అండ్‌ మీడియం ఎంటర్‌ప్రైజెస్‌ ద్వారా ధరలను ఖరారు చేయించారు. ఎస్‌ఎస్‌ఏ ఫైల్‌లో ధరలు భారీగా పెరగడంపై ఉన్నతాధికారులు మంత్రికి నివేదించినా ఫలితం లేకపోయింది.

అసలది పబ్లిషింగ్‌ సంస్థే కాదు..
డ్రీమ్‌వరల్డ్‌ సంస్థ ముందు ఇచ్చిన ఆఫర్‌ ప్రకారం చెల్లించాల్సిన మొత్తం రూ.5,33,73,600 మాత్రమే కాగా ధరలు పెంచి రూ.4,66,20,357 అదనంగా చెల్లించారు. విచిత్రమేమంటే డ్రీమ్‌వరల్డ్‌ ఇండియా సంస్థ అసలు పబ్లిషింగ్‌ సంస్థే కాదని కేవలం పంపిణీదారు మాత్రమేనని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. ఈ సంస్థ ప్యారగాన్‌ పబ్లిషింగ్‌ తదితర సంస్థల పుస్తకాలను పంపిణీ చేసి వాస్తవ ధరలను 50 శాతం వరకు పెంచిందని, అధికారులు కుమ్మక్కై ప్రభుత్వ ఖజానాకు చిల్లుపెట్టారని ముఖ్యకార్యదర్శి పరిశీలనలో తేలింది. ఆర్డర్లు రద్దు చేసి బిల్లుల చెల్లింపును నిలిపి వేయాలని, డ్రీమ్‌వరల్డ్‌ సంస్థపై చర్యలు తీసుకోవాలని, తొలుత ప్రతిపాదించిన ధరల కన్నా ఎక్కువ ఎందుకు చెల్లించాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలని ఎస్‌ఎస్‌ఏ ఎస్పీడీని ముఖ్యకార్యదర్శి ఆదేశించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement