►రాష్ట్రస్థాయిలో ఆరో ర్యాంక్
►రెండు స్థానాల పైకి ఎగబడిన జిల్లా
►ఉత్తరాంధ్రలో ఫస్ట్
►మళ్లీ బాలురదే హవా
►మొత్తం 92.99 శాతం ఉత్తీర్ణత
►బాలురు- 93.08%
►బాలికలు- 92.91%
►10/10 పాయింట్లు సాధించిన విద్యార్థులు 126 మంది
విజయనగరం అర్బన్ : పదో తరగతి పరీక్షా ఫలితాలు జిల్లా ప్రతిష్టను పెంచాయి. నూతన రాష్ర్టం ఆవిర్భావం తరువాత తొలిసారిగా వచ్చిన ఫలితాల్లో జిల్లా విద్యార్థులు మంచి ఫలితాలను సాధించారు. జిల్లా ఉత్తరాంధ్రలో మొదటి స్థానాన్ని పొందింది . 13 జిల్లాలలో 6వ స్థానంలో నిలిచింది. పదో తరగతి పరీక్షా ఫలితాలు బుధవారం విడుదల అయ్యాయి. గత ఏడాది ఉమ్మడి రాష్ట్రంలో సాధించిన ర్యాంక్ కంటే రెండుస్థానాలు పైకి వచ్చింది.
గత ఏడాది 91.82 శాతం ఉత్తీర్ణత సాధించగా, ఈ ఏడాది వచ్చిన 92.99 శాతంతో పోల్చితే 1.17 శాతం మెరుగుపడింది. గత ఏడాది ఉమ్మడి రాష్ర్టంలో 8వ స్థానంలో ఉండగా, ఈ ఏడాది 13 జిల్లాల కొత్తరాష్ర్టంలో 6వ స్థానానికి ఎదిగింది. జిల్లాలో పరీక్ష రాసిన మొత్తం 29,803 మంది విద్యార్థుల్లో 91.12 శాతంతో 27,715 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురు గత ఏడాది 91.73 శాతం ఉత్తీర్ణులవగా, ఈ ఏడాది 1.25 శాతం పెరిగి 93.08 శాతం ఉత్తీర్ణత సాధించారు. అదే విధంగా బాలికల ఉత్తీర్ణత శాతం కూడా 0.79 మేరకు మెరుగుపడింది.
గత ఏడాది 91.12 శాతం సాధించిన బాలికలు ఈ ఏడాది 92.91 శాతం ఉత్తీర్ణత సాధించారు. 17,123 మంది బాలురల్లో 14,076 మంది, 14,680 మంది బాలికలలో 13,639 మంది ఉత్తీర్ణులయ్యారు. జిల్లాలో 10/10 విద్యార్థులు 126 మంది జిల్లాలో పదికి 10 పాయింట్లు సాధించిన విద్యార్థుల సంఖ్య 126 వరకూ ఉన్నట్టు డీఈఓ జి.కృష్ణారావు తెలిపారు. మారిన ఉత్తీర్ణతా విధానం మేరకు గ్రేడింగింగ్ పెర్సంటైల్ ఏవరేజ్ (జీపీఏ) పాయింట్ల పరిధిలో నమోదైన విద్యార్థుల సంఖ్య వివరాలను ఆయన ప్రకటించారు.
గ్రేడింగ్ పాయింట్లపై పెరిగిన ఆసక్తి
పదో తరగతి పరీక్షల ఫలితాల కోసం జిల్లాలో విద్యార్థినీ, విద్యార్థులు తల్లిదండ్రులు ఉదయం నుంచి ఉత్కంఠతో ఎదురు చూశారు. ఫలితాలు విడుదల చేశాక నెట్ పనిచేయకపోవడం, నెమ్మదిగా పనిచేయడం వంటి సమస్యలు వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. ఈ-సేవల్లో ఫలితాల రాకపోవడంతో నెట్ సెంటర్ల వద్ద రద్దీ పెరిగింది. మార్కులను ఇస్తూ గ్రేడింగ్ విధానాన్ని నాలుగేళ్ల క్రితం నుంచి అమలు చేస్తున్నారు. అయితే కేవలం గ్రేడింగ్ పాయింట్‌లు, గ్రేడ్లు ఇచ్చే విధానాన్ని మూడేళ్ల నుంచి అమలులోకి వచ్చింది. ఈ విధానంపై గత మూడేళ్లగా సరియైన అవగాహన లేక పలువురు విద్యార్థులు, తల్లిదండ్రులు అయోమయంలో పడ్డారు. అయితే ఈ ఏడాది అలాంటి పరిస్థితి ఎక్కడా కనిపించలేదు.
పది ఫలితాల్లో సిక్స్‌స్!
Published Thu, May 21 2015 1:40 AM | Last Updated on Sun, Sep 3 2017 2:23 AM
Advertisement