e seva
-
పాస్‌పోర్టు ఈ సేవాకేంద్రంలో అగ్నిప్రమాదం
కామారెడ్డి టౌన్: కామారెడ్డి జిల్లాకేంద్రంలోని ప్రధాన తపాలా కార్యాలయ ఆవరణలో ఉన్న పాస్‌పోర్టు ఈ సేవాకేంద్రంలో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ వల్ల అగ్నిప్రమాదం సంభవించింది. శనివారం ఉదయం ఏడున్నర గంటల సమయంలో కార్యాలయంలో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. గమనించిన స్థానికులు పోస్టల్ అధికారులకు, ఫైర్‌స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. ఈ ప్రమాదంలో సామగ్రితోపాటు కంప్యూటర్లు, ఇన్వర్టర్లు, బ్యాట రీలు, ఫైళ్లు పూర్తిగా కాలిపోయాయి. ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. గది పక్కనే పోస్టల్ శాఖ ఉత్తరాల గది ఉండటంతో హుటాహుటిన సిబ్బంది ఆ ఉత్తరాల సంచులను బయటకు తీసుకువచ్చి ఎదురుగా ఉన్న ప్రధాన కార్యాలయంలోకి తరలించారు. పాస్‌పోర్టు ఈ సేవాకేంద్రంలో మాత్రం అంతా అగ్నికి ఆహుతైంది. పాస్‌పోర్టులకు సంబంధించి అన్ని వివరాలు ఆన్లైన్లో నమోదై ఉంటాయని, ఫైళ్లు ఎప్పటికప్పుడు తరలిస్తామని, ఎలాంటి డేటా, ముఖ్యమైన ఫైళ్లు నష్టపోలేదని, ఫరి్నచర్, కంప్యూటర్లు కాలిపోవడంతో స్వల్ప నష్టం వాటిల్లిందని పోస్టల్ శాఖ అధికారి రాజు తెలిపారు. 26 నుంచి కామారెడ్డి పీవోపీఎస్కేలో కార్యకలాపాలు నిలిపివేత రాంగోపాల్‌పేట్ (హైదరాబాద్): కామారెడ్డిలోని పోస్టాఫీస్ పాస్‌పోర్టు సేవా కేంద్రంలో నిర్వహణ కారణాలతో ఈ నెల 26 నుంచి కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి జె. స్నేహజ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. 26 నుంచి అపా యింట్మెంట్లు బుక్ చేసుకున్న దరఖాస్తుదారులు వాటిని రీ షెడ్యూల్డ్ చేసుకునే ఆప్షన్లను ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం తెలియచేస్తామన్నారు. -
Aasara Pension: 30 వరకు పింఛన్ల దరఖాస్తుకు అవకాశం
సాక్షి, హైదరాబాద్: వృద్ధాప్య పింఛన్ల దరఖాస్తుకు రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశమిచ్చింది. ఈ ఆసరా పింఛన్ల అర్హత వయసును 57 ఏళ్లకు తగ్గించిన నేపథ్యంలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆరంభించింది. గత ఆగస్టు 31 నాటికే కొత్త దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసినా, అర్హులందరికీ అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో ఈ నెల 11 నుండి 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకునే వీలు కల్పించింది. అర్హులైన లబ్ధిదారుల ఎంపిక కోసం దరఖాస్తులను స్వీకరించాలని జిల్లా కలెక్టర్లకు, జీహెచ్ఎంసీ కమీషనర్‌కు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. అర్హులైనవారు ఈ నెల 11 నుంచి ఈసేవ, మీసేవ ద్వారా నిర్ణీత నమూనా ప్రకారం దరఖాస్తు చేసుకోవాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సూచించారు. ఈనెల 30 వరకు అందిన దరఖాస్తులను రాష్ట్ర ప్రభుత్వానికి పంపాలని, సాధ్యమైనంత వేగంగా ఈ ప్రక్రియను పూర్తిచేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. పుట్టినతేదీ ధ్రువీకరణ, ఓటర్ కార్డు తదితర పత్రాలను దరఖాస్తుతోపాటు జత చేయాలన్నారు. కాగా, ఈ దరఖాస్తులకు ఈ సేవ, మీ సేవల్లో సేవల రుసుములు తీసుకోవద్దని, సంబంధిత రుసుములను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. -
‘ఈ-సేవ’ ద్వారా సహకార రిజిస్ట్రేషన్లు
♦ రాష్ర్ట సహకార శాఖ నిర్ణయం ♦ పాత రిజిస్ట్రేషన్ల సవరణలు కూడా ఆన్లైన్లోనే ♦ రెండు నెలల్లో శ్రీకారం సాక్షి, హైదరాబాద్: సహకార సంఘాల రిజిస్ట్రేషన్లను ఇక నుంచి ఈ-సేవ ద్వారానే చేపట్టాలని సహకార శాఖ నిర్ణయించింది. రెండు నెలల్లోగా దీనికి శ్రీకారం చుట్టాలని నిర్ణయించింది. రాష్ట్ర ఐటీ శాఖ కూడా ఆమోదం తెలపడంతో కసరత్తు మొదలుపెట్టింది. ఈ-సేవల్లో అన్ని రకాల సహకార సంఘాల రిజిస్ట్రేషన్ల కోసం దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా సహకార శాఖ అధికారులు పరిశీలించి సొసైటీలకు రిజిస్ట్రేషన్ చేస్తారు. సంబంధిత ధ్రువపత్రాన్ని నిర్ణీత సమయంలోగా మళ్లీ ఈ-సేవ ద్వారానే అందిస్తారు. ప్రస్తుతం సొసైటీల రిజిస్ట్రేషన్ పెద్ద ప్రహసనంగా ఉంది. పాత సొసైటీల మార్పుచేర్పులు కూడా... సహకార శాఖలో ఇప్పటికే 40 వేల వరకు అన్ని రకాల సహకార సంఘాలున్నట్లు అంచనా. ఆ సొసైటీల రిజిస్ట్రేషన్లను అన్నింటినీ సహకారశాఖే రిజిస్టర్ చేసింది. చిన్నస్థాయి సొసైటీలు మొదలు పశుసంవర్థక , వెనుకబడిన తరగతుల సంక్షేమం, ఆబ్కారీ, మత్స్య, హ్యాండ్లూమ్స్, సెరీకల్చర్, ఉద్యాన, పరిశ్రమలు, చక్కెర, వికలాంగులు, మహిళా శిశు సంక్షేమ శాఖల్లోనూ వేలాది సొసైటీలున్నాయి. ఒక్క బీసీ సంక్షేమశాఖ పరిధిలోనే వెనుకబడిన తరగతుల సంక్షేమ సహకార సంఘాలు, వృత్తి సంఘాలు కలిపి 10 వేల వరకున్నాయి. పశు సంవర్థకశాఖలో 3,500 గొర్రెల పెంపకందారుల సంఘాలున్నాయి. విజయ డెయిరీ పరిధిలో పాల ఉత్పత్తి సహకార సంఘాలు అనేక గ్రామాల్లో ఏర్పడ్డాయి. గీత కార్మిక సహకార సంఘాలున్నాయి. ఇవిగాక 11 ప్రభుత్వ శాఖల్లోనూ మరో 20 వేల సహకార సంఘాలున్నాయి. వాటిని కూడా సహకారశాఖలో కలిపే విషయంపైనా చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు వేలాదిగా ఉన్న అపార్టుమెంట్ల సొసైటీల పర్యవేక్షణ బాధ్యతను కూడా తలకెత్తుకోవాలని సహకార శాఖ నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీంతో సహకారశాఖపై భారం పెరిగింది. ఈ నేపథ్యంలో సహకార సంఘాల రిజిస్ట్రేషన్లతోపాటు దాదాపు 60 వేలున్న పాత సొసైటీల్లోని బైలాస్లలో, కార్యవర్గాల్లో ఎలాంటి సవరణలు చేయాలన్నా కూడా ఇక నుంచి ఈ-సేవనే ఆశ్రయించాల్సి ఉంటుంది. దీనివల్ల ఆలస్యానికి అడ్డుకట్ట వేయడానికి వీలుంటుందని అధికారులు చెబుతున్నారు. వచ్చే మార్చి నుంచి ఈ-సేవల ద్వారానే రిజిస్ట్రేషన్లు జరిగే అవకాశముందని అంటున్నారు. పాత రిజిస్ట్రేషన్లకు సంబంధించిన అన్ని ధ్రువపత్రాలనూ స్కానింగ్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఆ ప్రకారం లక్షలాది పేజీలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. -
సదా మీ సేవలో...
2011లో కేంద్రాల ఏర్పాటు అందుబాటులో 334 సేవలు మొబైల్ యాప్ ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం ఏదేని ప్రభుత్వ ధ్రువపత్రాలు పొందాలంటే సంబంధిత కార్యాలయాల చుట్టూ చెప్పులరిగేలా తిరగాలి. వారం గడిచినా సర్టిఫికెట్లు అందుతాయన్న నమ్మకం ఉండదు. ఈ సమస్యలను అధిగమించడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2011లో 'మీ సేవా' కేంద్రాలు ప్రారంభించింది. మనకు కావాల్సిన పత్రాల వివరాలు, రుసుం చెల్లిస్తే రెండు లేదా మూడు రోజుల్లో ధ్రువపత్రాలు జారీ చేస్తారు. ఏపీ ప్రభుత్వం మీ సేవా ద్వారా పోందే అన్ని సేవలను ఇక నుంచి మొబైల్ ద్వారా అందించనుంది. ఇందుకు సంబంధించిన యాప్‌ను శనివారం విడుదల చేసింది. ఈ సందర్భంగా 'మీ సేవ'విశేషాలు మీకోసం.. - స్కూల్ ఎడిషన్ కేంద్రాల పనితీరు దరఖాస్తుదారులు 'షెడ్యూల్డ్ క్యాస్ట్ డెవలప్మెంట్ శాఖ' రూపొందించిన నమూనా ప్రకారం దరఖాస్తు చేసుకోవాలి. మీ సేవా సిబ్బంది దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా తహశీల్దార్/ఆర్డీఓ కార్యాలయాలకు చేరవేస్తారు. తహశీల్దారు వాటిని రెవెన్యూ ఇన్స్పెక్టర్, డిప్యూటీ తహశీల్దార్లు, ఇతర విచారణాధికారులకు పంపిస్తారు. డిజిటల్ కీ ఆధారంగా వీఆర్వో, ఆర్ఐ, డీటీలు విచారణ నివేదికలు తహశీల్దారుకు సమర్పిస్తారు. నివేదికలపై సంతృప్తి చెందితే వాటిని రెండు కాపీలు తీస్తారు. ఒక దానిపై సంతకం చేసి కార్యాలయ స్టాంప్ వేసి భద్రపరుస్తారు. మరో దానిని డిజిటల్ సంతకంతో దరఖాస్తుదారునికి జారీ చేస్తారు. వ్యక్తిగతంగానూ జారీ ఈసేవా కేంద్రాల ద్వారానే కాకుండా రెవెన్యూ కార్యాలయాల్లో నేరుగా ధ్రువపత్రాలు పొందే అవకాశాన్ని కల్పించారు. పుట్టినరోజు, నివాస తదితర ధ్రువపత్రాలతోపాటు, పెన్షన్ కోసం వ్యక్తిగత దరఖాస్తులు తీసుకోవడానికి సీసీఎల్ఏ ఆయోదం తెలిపింది. పత్రాలను వ్యక్తిగతంగా తనిఖీ చేసిన తరువాత సంబంధిత అధికారుల సంతకంతో జారీ చేస్తారు. అయితే అత్యవసరంగా సర్టిఫికేట్లు కావాల్సిన వారికి మాత్రమే ఈ విధానంలో జారీ చేస్తున్నారు. అక్రమాలకు చెక్ ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఇసుక అమ్మకాలను మీ సేవా కేంద్రాలతో మిళితం చేసింది. కరీంనగర్ జిల్లాలోని ఖాజీపూర్‌లో మొదటి ఇసుక విక్రయ కేంద్రాన్ని 2015 ఫిబ్రవరిలో ప్రారంభించింది. ఇసుక కావాలనుకునేవారు మీసేవా కేంద్రాల్లో టన్నుకు రూ.375 చెల్లించాలి. రశీదు తీసుకుని ఇసుక కేంద్రాలకు వెళ్లి లోడ్ చేసుకోవచ్చు. వాహనాలు సొంతంగా సమకూర్చుకోవాలి. ప్రారంభం కుల, ఆదాయ, నివాస, జనన ధ్రువీకరణ, తదితర పత్రాల జారీలో చోటు చేసుకుంటున్న అవకతవకలు నియంత్రించేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త మార్గదర్శకాలు రూపొందించింది. సర్టిఫికెట్లను ఆన్లైన్ విధానంలో జారీచేయాలని సంకల్పించింది. ఇందులో భాగంగా 'మీ సేవా' కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వీటిని 2011 నవంబర్ 4న చిత్తూరు జిల్లాలో ప్రారంభించింది. 10 సేవలతో మొదలై, ప్రస్తుతం 34 శాఖలకు చెందిన 334 సేవలు అందుబాటులో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 7 వేలకు పైగా కేంద్రాలున్నాయి. రాష్ట్రంలోని తహశీల్దార్లు, రెవెన్యూ అధికారులు, సీనియర్ ఐఏఎస్ అధికారుల అభిప్రాయాలు క్రోడీకరించి కొత్త నిబంధనలు రూపొందించింది. సంబంధిత అధికారుల సంతకాన్ని డిజిటలైజ్ చేసింది. రాష్ర్ట విభజన అనంతరం రెండు రాష్ట్రాలు వేరుగా సేవలు అందిస్తున్నాయి.ఈ కేంద్రాలతో పాటు వ్యక్తిగతంగానూ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. మొబైల్ అప్లికేషన్ మీ సేవలో అందిస్తున్న సేవలన్నింటినీ మొబైల్ ద్వారా పొందేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొబైల్ యాప్‌ను ప్రారంభించింది. తొలి విడతలో 19 పౌర సేవలను అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. నగదు చెల్లింపు, డాష్‌బోర్డు, చెల్లింపు స్థితి, మీ సేవ కేంద్రాలు వివరాలు తెలుసుకోనే వెసలుబాటు కల్పించారు. మీ సేవకు సంబంధించి వాట్సాఫ్ నంబరు 9100199992కు మెసేజ్ కూడా చేయవచ్చు. రాష్ట్రంలోని ప్రభుత్వ భవనాలు, బ్యాంకులు, ఏటీఎంలు, బ స్టాఫ్లు, ఆసుపత్రుల వివరాలు ఇందులో ఉంటాయి. క్షేత్రస్థాయిలో వయోజన విద్య సమాచారం కూడా తెలుసుకోవచ్చు. ప్రస్తుతం ధ్రువపత్రాల జారీ ఆలస్యంగా జరుగుతోంది. ఈ కారణంగా చాలా మంది విద్యార్థులు సమయానికి సర్టిఫికెట్లు పొందలేక పోతున్నారు. వీటిని పరిశీలించిన ప్రభుత్వం 'స్టేట్ సెంటర్ ఫర్ ఇన్నోవేషన్స్ ఇన్ పబ్లిక్ సిస్టం' కమిటీని నియమించింది. ఈ కమిటీకి డెరైక్టర్‌గా రిటైర్డు ఐఎఎస్ అధికారి చక్రపాణిని నియమించారు -
పది ఫలితాల్లో సిక్స్స్!
►రాష్ట్రస్థాయిలో ఆరో ర్యాంక్ ►రెండు స్థానాల పైకి ఎగబడిన జిల్లా ►ఉత్తరాంధ్రలో ఫస్ట్ ►మళ్లీ బాలురదే హవా ►మొత్తం 92.99 శాతం ఉత్తీర్ణత ►బాలురు- 93.08% ►బాలికలు- 92.91% ►10/10 పాయింట్లు సాధించిన విద్యార్థులు 126 మంది విజయనగరం అర్బన్ : పదో తరగతి పరీక్షా ఫలితాలు జిల్లా ప్రతిష్టను పెంచాయి. నూతన రాష్ర్టం ఆవిర్భావం తరువాత తొలిసారిగా వచ్చిన ఫలితాల్లో జిల్లా విద్యార్థులు మంచి ఫలితాలను సాధించారు. జిల్లా ఉత్తరాంధ్రలో మొదటి స్థానాన్ని పొందింది . 13 జిల్లాలలో 6వ స్థానంలో నిలిచింది. పదో తరగతి పరీక్షా ఫలితాలు బుధవారం విడుదల అయ్యాయి. గత ఏడాది ఉమ్మడి రాష్ట్రంలో సాధించిన ర్యాంక్ కంటే రెండుస్థానాలు పైకి వచ్చింది. గత ఏడాది 91.82 శాతం ఉత్తీర్ణత సాధించగా, ఈ ఏడాది వచ్చిన 92.99 శాతంతో పోల్చితే 1.17 శాతం మెరుగుపడింది. గత ఏడాది ఉమ్మడి రాష్ర్టంలో 8వ స్థానంలో ఉండగా, ఈ ఏడాది 13 జిల్లాల కొత్తరాష్ర్టంలో 6వ స్థానానికి ఎదిగింది. జిల్లాలో పరీక్ష రాసిన మొత్తం 29,803 మంది విద్యార్థుల్లో 91.12 శాతంతో 27,715 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురు గత ఏడాది 91.73 శాతం ఉత్తీర్ణులవగా, ఈ ఏడాది 1.25 శాతం పెరిగి 93.08 శాతం ఉత్తీర్ణత సాధించారు. అదే విధంగా బాలికల ఉత్తీర్ణత శాతం కూడా 0.79 మేరకు మెరుగుపడింది. గత ఏడాది 91.12 శాతం సాధించిన బాలికలు ఈ ఏడాది 92.91 శాతం ఉత్తీర్ణత సాధించారు. 17,123 మంది బాలురల్లో 14,076 మంది, 14,680 మంది బాలికలలో 13,639 మంది ఉత్తీర్ణులయ్యారు. జిల్లాలో 10/10 విద్యార్థులు 126 మంది జిల్లాలో పదికి 10 పాయింట్లు సాధించిన విద్యార్థుల సంఖ్య 126 వరకూ ఉన్నట్టు డీఈఓ జి.కృష్ణారావు తెలిపారు. మారిన ఉత్తీర్ణతా విధానం మేరకు గ్రేడింగింగ్ పెర్సంటైల్ ఏవరేజ్ (జీపీఏ) పాయింట్ల పరిధిలో నమోదైన విద్యార్థుల సంఖ్య వివరాలను ఆయన ప్రకటించారు. గ్రేడింగ్ పాయింట్లపై పెరిగిన ఆసక్తి పదో తరగతి పరీక్షల ఫలితాల కోసం జిల్లాలో విద్యార్థినీ, విద్యార్థులు తల్లిదండ్రులు ఉదయం నుంచి ఉత్కంఠతో ఎదురు చూశారు. ఫలితాలు విడుదల చేశాక నెట్ పనిచేయకపోవడం, నెమ్మదిగా పనిచేయడం వంటి సమస్యలు వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. ఈ-సేవల్లో ఫలితాల రాకపోవడంతో నెట్ సెంటర్ల వద్ద రద్దీ పెరిగింది. మార్కులను ఇస్తూ గ్రేడింగ్ విధానాన్ని నాలుగేళ్ల క్రితం నుంచి అమలు చేస్తున్నారు. అయితే కేవలం గ్రేడింగ్ పాయింట్లు, గ్రేడ్లు ఇచ్చే విధానాన్ని మూడేళ్ల నుంచి అమలులోకి వచ్చింది. ఈ విధానంపై గత మూడేళ్లగా సరియైన అవగాహన లేక పలువురు విద్యార్థులు, తల్లిదండ్రులు అయోమయంలో పడ్డారు. అయితే ఈ ఏడాది అలాంటి పరిస్థితి ఎక్కడా కనిపించలేదు. -
వినియోగదారులకు చేరువలో బ్యాంకుల ఈ-సేవలు
-
‘ఓటర్ కార్డులివ్వకుంటే మీసేవ లెసైన్స్‌లు సస్పెండ్’
సాక్షి, హైదరాబాద్: హోలోగ్రాములు లేవంటూ ఓటర్ కార్డులు ఇవ్వని ఈ-సేవ, మీ-సేవ కేంద్రాల లెసైన్స్‌లను సస్పెండ్ చేస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ హెచ్చరించారు. కోటిన్నర హోలోగ్రాములు నిల్వ ఉన్నాయని, వాటిని తెప్పించుకుని ఓటర్ కార్డులు ఇవ్వాల్సిన బాధ్యత ఆ కేంద్రాలపైనే ఉందని ఆయన తెలిపారు. ఓటరు కార్డులు నిరాకరించే కేంద్రాలపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. -
స్కాలర్ తిప్పలు
పిఠాపురం, న్యూస్‌లైన్ : ప్రభుత్వం అందించే స్కాలర్షిప్పులు వస్తాయో లేదో తెలీదు కానీ దానికి దరఖాస్తు చేయడానికి అవసరమైన ధ్రువపత్రాల మంజూరులో మాత్రం విద్యార్థులకు తిప్పలు తప్పడంలేదు. ముఖ్యంగా ఆదాయ ధ్రువపత్రాలు పొందడంలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ఈసేవ, మీసేవ కేంద్రాల ద్వారా ఆన్లైన్లో ఆదాయ ధ్రువపత్రాలు జారీ చేస్తోంది. దీనికి సంబంధించిన సాఫ్ట్‌వేర్‌లో ఉన్న లోపం విద్యార్థులకు నరకం చవిచూపుతోంది. జిల్లాలో ప్రభుత్వ, ఎయిడెడ్, మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలు 3,289 ఉన్నాయి. ప్రాథమికోన్నత పాఠశాలలు 482 ఉండగా, ఉన్నత పాఠశాలలు 633 ఉన్నాయి. వాటిలో 1 నుంచి 5 వరకు చదువుతున్న విద్యార్థులు 2,40,526 మంది ఉండగా.. 6 నుంచి 10 వరకూ చదువుతున్నవారు 2,52,420 మంది ఉన్నారు. వీరిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు 2.80 లక్షల మంది ఉన్నారు. ఐదు నుంచి ఎనిమిదో తరగతి వరకూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థికి ఏడాదికి రూ.1800; తొమ్మిది, పదో తరగతుల విద్యార్థులకు రూ.2100 చొప్పున ఉపకార వేతనం ఇస్తున్నారు. గత ఏడాది జిల్లాలో సుమారు ఐదు లక్షల మంది విద్యార్థులు స్కాలర్షిప్పులు పొందారు. ఇదీ సమస్య స్కాలర్‌షిప్పుల కోసం గత ఏడాది ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు ఆదాయ, కుల, నివాస ధ్రువపత్రాలు పొందారు. వీటిల్లో ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని ఆరు నెలలకోసారి రెన్యువల్ చేయించుకోవాలి. కానీ, సాఫ్ట్వేర్ లోపంతో ఇది ఆన్లైన్లో అప్లోడ్ కాక, రెన్యువల్ కావడం లేదు. ఇలా రెన్యువల్ చేయించుకోవాల్సిన విద్యార్థులు జిల్లాలో సుమారు 4.50 లక్షల మంది ఉన్నారు. దీంతో ఆ విద్యార్థులు ఆదాయ ధ్రువపత్రం కోసం మళ్లీ కొత్తగా దరఖాస్తు చేశారు. వారికి ఈసేవ సిబ్బంది డూప్లికేట్ నంబర్‌తో ఆదాయ ధ్రువపత్రం ఇస్తున్నారు. కానీ రెన్యువల్ కాని విద్యార్థుల పేరిట గత ఏడాది జారీ చేసిన ఆదాయ ధ్రువపత్రం అప్పటికే ఆన్లైన్లో ఉంటోంది. అది రెన్యువల్ కాకపోగా, సాఫ్ట్వేర్ లోపంతో కొత్తగా జారీ చేసిన డూప్లికేట్ పత్రం ఆన్లైన్లో అప్లోడ్ కావడం లేదు. అయితే ఈ ఏడాది కొత్తగా దరఖాస్తు చేసుకున్న 50 వేల మందికి మాత్రం కొత్త యూనిక్ నంబర్లతో ఒరిజనల్ ధ్రువపత్రం ఇస్తున్నారు. అవి ఆన్లైన్లో అప్లోడ్ అవడంతో, కొత్తవారికి ఆదాయ ధ్రువపత్రాలు ఇవ్వడం సాధ్యమవుతోందని ఈసేవ సిబ్బంది చెబుతున్నారు. కేవలం పాతవారి ధ్రువపత్రాలను మాత్రమే సాఫ్ట్వేర్ తీసుకోవడం లేదని వారంటున్నారు. పాఠశాలలతో పాటు కళాశాలల విద్యార్థులు కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే రోజుల తరబడి ఈసేవ కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేశామని, ఇప్పుడు వారిచ్చిన డూప్లికేట్ ధ్రువపత్రాలు నిరుపయోగంగా మారాయని, కొత్తగా దరఖాస్తు చేసినా ఫలితం ఉండడం లేదని విద్యార్థులు గగ్గోలు పెడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి తమ సమస్య పరిష్కరించాలని వారు కోరుతున్నారు.