సదా మీ సేవలో...
2011లో కేంద్రాల ఏర్పాటు
అందుబాటులో 334 సేవలు
మొబైల్ యాప్ ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం
ఏదేని ప్రభుత్వ ధ్రువపత్రాలు పొందాలంటే సంబంధిత కార్యాలయాల చుట్టూ చెప్పులరిగేలా తిరగాలి. వారం గడిచినా సర్టిఫికెట్లు అందుతాయన్న నమ్మకం ఉండదు. ఈ సమస్యలను అధిగమించడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2011లో 'మీ సేవా' కేంద్రాలు ప్రారంభించింది. మనకు కావాల్సిన పత్రాల వివరాలు, రుసుం చెల్లిస్తే రెండు లేదా మూడు రోజుల్లో ధ్రువపత్రాలు జారీ చేస్తారు. ఏపీ ప్రభుత్వం మీ సేవా ద్వారా పోందే అన్ని సేవలను ఇక నుంచి మొబైల్ ద్వారా అందించనుంది. ఇందుకు సంబంధించిన యాప్‌ను శనివారం విడుదల చేసింది. ఈ సందర్భంగా 'మీ సేవ'విశేషాలు మీకోసం.. - స్కూల్ ఎడిషన్
కేంద్రాల పనితీరు
దరఖాస్తుదారులు 'షెడ్యూల్డ్ క్యాస్ట్ డెవలప్‌మెంట్ శాఖ' రూపొందించిన నమూనా ప్రకారం దరఖాస్తు చేసుకోవాలి. మీ సేవా సిబ్బంది దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారా తహశీల్దార్/ఆర్డీఓ కార్యాలయాలకు చేరవేస్తారు. తహశీల్దారు వాటిని రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, డిప్యూటీ తహశీల్దార్లు, ఇతర విచారణాధికారులకు పంపిస్తారు. డిజిటల్ కీ ఆధారంగా వీఆర్వో, ఆర్‌ఐ, డీటీలు విచారణ నివేదికలు తహశీల్దారుకు సమర్పిస్తారు. నివేదికలపై సంతృప్తి చెందితే వాటిని రెండు కాపీలు తీస్తారు. ఒక దానిపై సంతకం చేసి కార్యాలయ స్టాంప్ వేసి భద్రపరుస్తారు. మరో దానిని డిజిటల్ సంతకంతో దరఖాస్తుదారునికి జారీ చేస్తారు.
వ్యక్తిగతంగానూ జారీ
ఈసేవా కేంద్రాల ద్వారానే కాకుండా రెవెన్యూ కార్యాలయాల్లో నేరుగా ధ్రువపత్రాలు పొందే అవకాశాన్ని కల్పించారు. పుట్టినరోజు, నివాస తదితర ధ్రువపత్రాలతోపాటు, పెన్షన్ కోసం వ్యక్తిగత దరఖాస్తులు తీసుకోవడానికి సీసీఎల్‌ఏ ఆయోదం తెలిపింది. పత్రాలను వ్యక్తిగతంగా తనిఖీ చేసిన తరువాత సంబంధిత అధికారుల సంతకంతో జారీ చేస్తారు. అయితే అత్యవసరంగా సర్టిఫికేట్లు కావాల్సిన వారికి మాత్రమే ఈ విధానంలో జారీ చేస్తున్నారు.
అక్రమాలకు చెక్
ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఇసుక అమ్మకాలను మీ సేవా కేంద్రాలతో మిళితం చేసింది. కరీంనగర్ జిల్లాలోని ఖాజీపూర్‌లో మొదటి ఇసుక విక్రయ కేంద్రాన్ని 2015 ఫిబ్రవరిలో ప్రారంభించింది. ఇసుక కావాలనుకునేవారు మీసేవా కేంద్రాల్లో టన్నుకు రూ.375 చెల్లించాలి. రశీదు తీసుకుని ఇసుక కేంద్రాలకు వెళ్లి లోడ్ చేసుకోవచ్చు. వాహనాలు సొంతంగా సమకూర్చుకోవాలి.
ప్రారంభం
కుల, ఆదాయ, నివాస, జనన ధ్రువీకరణ, తదితర పత్రాల జారీలో చోటు చేసుకుంటున్న అవకతవకలు నియంత్రించేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త మార్గదర్శకాలు రూపొందించింది. సర్టిఫికెట్లను ఆన్‌లైన్ విధానంలో జారీచేయాలని సంకల్పించింది. ఇందులో భాగంగా 'మీ సేవా' కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వీటిని 2011 నవంబర్ 4న చిత్తూరు జిల్లాలో ప్రారంభించింది. 10 సేవలతో మొదలై, ప్రస్తుతం 34 శాఖలకు చెందిన 334 సేవలు అందుబాటులో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 7 వేలకు పైగా కేంద్రాలున్నాయి. రాష్ట్రంలోని తహశీల్దార్లు, రెవెన్యూ అధికారులు, సీనియర్ ఐఏఎస్ అధికారుల అభిప్రాయాలు క్రోడీకరించి కొత్త నిబంధనలు రూపొందించింది. సంబంధిత అధికారుల సంతకాన్ని డిజిటలైజ్ చేసింది. రాష్ర్ట విభజన అనంతరం రెండు రాష్ట్రాలు వేరుగా సేవలు అందిస్తున్నాయి.ఈ కేంద్రాలతో పాటు వ్యక్తిగతంగానూ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.
మొబైల్ అప్లికేషన్
మీ సేవలో అందిస్తున్న సేవలన్నింటినీ మొబైల్ ద్వారా పొందేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొబైల్ యాప్‌ను ప్రారంభించింది. తొలి విడతలో 19 పౌర సేవలను అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. నగదు చెల్లింపు, డాష్‌బోర్డు, చెల్లింపు స్థితి, మీ సేవ కేంద్రాలు వివరాలు తెలుసుకోనే వెసలుబాటు కల్పించారు. మీ సేవకు సంబంధించి వాట్సాఫ్ నంబరు 9100199992కు మెసేజ్ కూడా చేయవచ్చు. రాష్ట్రంలోని ప్రభుత్వ భవనాలు, బ్యాంకులు, ఏటీఎంలు, బ స్టాఫ్‌లు, ఆసుపత్రుల వివరాలు ఇందులో ఉంటాయి. క్షేత్రస్థాయిలో వయోజన విద్య సమాచారం కూడా తెలుసుకోవచ్చు. ప్రస్తుతం ధ్రువపత్రాల జారీ ఆలస్యంగా జరుగుతోంది. ఈ కారణంగా చాలా మంది విద్యార్థులు సమయానికి సర్టిఫికెట్లు పొందలేక పోతున్నారు. వీటిని పరిశీలించిన ప్రభుత్వం 'స్టేట్ సెంటర్ ఫర్ ఇన్నోవేషన్స్ ఇన్ పబ్లిక్ సిస్టం' కమిటీని నియమించింది. ఈ కమిటీకి డెరైక్టర్‌గా రిటైర్డు ఐఎఎస్ అధికారి చక్రపాణిని నియమించారు