‘ఈ-సేవ’ ద్వారా సహకార రిజిస్ట్రేషన్లు
♦ రాష్ర్ట సహకార శాఖ నిర్ణయం
♦ పాత రిజిస్ట్రేషన్ల సవరణలు కూడా ఆన్‌లైన్‌లోనే
♦ రెండు నెలల్లో శ్రీకారం
సాక్షి, హైదరాబాద్: సహకార సంఘాల రిజిస్ట్రేషన్లను ఇక నుంచి ఈ-సేవ ద్వారానే చేపట్టాలని సహకార శాఖ నిర్ణయించింది. రెండు నెలల్లోగా దీనికి శ్రీకారం చుట్టాలని నిర్ణయించింది. రాష్ట్ర ఐటీ శాఖ కూడా ఆమోదం తెలపడంతో కసరత్తు మొదలుపెట్టింది. ఈ-సేవల్లో అన్ని రకాల సహకార సంఘాల రిజిస్ట్రేషన్ల కోసం దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారా సహకార శాఖ అధికారులు పరిశీలించి సొసైటీలకు రిజిస్ట్రేషన్ చేస్తారు. సంబంధిత ధ్రువపత్రాన్ని నిర్ణీత సమయంలోగా మళ్లీ ఈ-సేవ ద్వారానే అందిస్తారు. ప్రస్తుతం సొసైటీల రిజిస్ట్రేషన్ పెద్ద ప్రహసనంగా ఉంది.
పాత సొసైటీల మార్పుచేర్పులు కూడా...
సహకార శాఖలో ఇప్పటికే 40 వేల వరకు అన్ని రకాల సహకార సంఘాలున్నట్లు అంచనా. ఆ సొసైటీల రిజిస్ట్రేషన్లను అన్నింటినీ సహకారశాఖే రిజిస్టర్ చేసింది. చిన్నస్థాయి సొసైటీలు మొదలు పశుసంవర్థక , వెనుకబడిన తరగతుల సంక్షేమం, ఆబ్కారీ, మత్స్య, హ్యాండ్‌లూమ్స్, సెరీకల్చర్, ఉద్యాన, పరిశ్రమలు, చక్కెర, వికలాంగులు, మహిళా శిశు సంక్షేమ శాఖల్లోనూ వేలాది సొసైటీలున్నాయి. ఒక్క బీసీ సంక్షేమశాఖ పరిధిలోనే వెనుకబడిన తరగతుల సంక్షేమ సహకార సంఘాలు, వృత్తి సంఘాలు కలిపి 10 వేల వరకున్నాయి. పశు సంవర్థకశాఖలో 3,500 గొర్రెల పెంపకందారుల సంఘాలున్నాయి.
విజయ డెయిరీ పరిధిలో పాల ఉత్పత్తి సహకార సంఘాలు అనేక గ్రామాల్లో ఏర్పడ్డాయి. గీత కార్మిక సహకార సంఘాలున్నాయి. ఇవిగాక 11 ప్రభుత్వ శాఖల్లోనూ మరో 20 వేల సహకార సంఘాలున్నాయి. వాటిని కూడా సహకారశాఖలో కలిపే విషయంపైనా చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు వేలాదిగా ఉన్న అపార్టుమెంట్ల సొసైటీల పర్యవేక్షణ బాధ్యతను కూడా తలకెత్తుకోవాలని సహకార శాఖ నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీంతో సహకారశాఖపై భారం పెరిగింది.
ఈ నేపథ్యంలో సహకార సంఘాల రిజిస్ట్రేషన్లతోపాటు దాదాపు 60 వేలున్న పాత సొసైటీల్లోని బైలాస్‌లలో, కార్యవర్గాల్లో ఎలాంటి సవరణలు చేయాలన్నా కూడా ఇక నుంచి ఈ-సేవనే ఆశ్రయించాల్సి ఉంటుంది. దీనివల్ల ఆలస్యానికి అడ్డుకట్ట వేయడానికి వీలుంటుందని అధికారులు చెబుతున్నారు. వచ్చే మార్చి నుంచి ఈ-సేవల ద్వారానే రిజిస్ట్రేషన్లు జరిగే అవకాశముందని అంటున్నారు. పాత రిజిస్ట్రేషన్లకు సంబంధించిన అన్ని ధ్రువపత్రాలనూ స్కానింగ్ చేసి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఆ ప్రకారం లక్షలాది పేజీలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.