ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్ : పదో తరగతి పరీక్ష ఫలితాల్లో జిల్లా వ్యాప్తంగా బాలికలే పైచేయి సాధించారు. బాలుర కంటే అదనపు ఉత్తీర్ణత సాధించి తమ సత్తా చాటారు. పరీక్ష ఫలితాల వివరాలను జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ రాజేశ్వరరావు గురువారం విలేకరులకు వివరించారు. జిల్లా విద్యార్థులు 87.56 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్ర స్థాయిలో 18వ స్థానంలో నిలిచారు. గత ఏడాది ఫలితాలతో పోలిస్తే ఒక శాతం అదనపు ఉత్తీర్ణత సాధించినా రాష్ట్రస్థాయిలో జిల్లా 17 నుంచి 18వ స్థానానికి దిగజారింది. ఐదేళ్ల పరీక్ష ఫలితాలను పరిశీలిస్తే ఏటా ఉత్తీర్ణత శాతం పెరుగుతున్నా రాష్ట్రస్థాయి ర్యాంకు మాత్రం దిగజారుతూ రావడం ఆందోళన కలిగిస్తోంది.
జిల్లాలో మొత్తం 34,907 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 30,566 మంది ఉత్తీర్ణులయ్యారు.
వీరిలో 18,022 మంది బాలురు పరీక్షకు హాజరు కాగా 15,769 మంది పాసయ్యారు. జిల్లా సగటు కంటే 0.5 శాతం తక్కువగా 87.02 శాతం ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్ర సగటు కంటే 0.94 శాతం తక్కువగా ఉత్తీర్ణులయ్యారు.
అదేవిధంగా 16,725 మంది బాలికలు పరీక్షకు హాజరు కాగా 14,797 మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 88.16 శాతం ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్ర సగటు కంటే 1.17 శాతం తక్కువ మంది ఉత్తీర్ణులయ్యారు.
గ్రేడ్లే..గ్రేడ్లు
ఈ ఏడాది గరిష్టంగా 72 మంది విద్యార్థులు 10/10 గ్రేడ్ పాయింట్లు సాధించారు. గత ఏడాది కేవలం 30 మందికి మాత్రమే 10/10 గ్రేడ్ పాయింట్లురాగా ఈ ఏడాది అదనంగా 42 మంది సాధించారు.
స్థానిక మాంటిస్సోరి హైస్కూల్ విద్యార్థులు 10/10 గ్రేడ్ పాయింట్ల సాధనలో జిల్లాలోనే అగ్రగాములుగా నిలిచారు. ఈ పాఠశాలలో ఐదుగురు విద్యార్థులు 10/10 గ్రేడ్ సాధించి సత్తా చాటారు.
రాష్ట్రస్థాయిలో ఒకే క్యాంపస్‌లో ఐదుగురికి 10 గ్రేడ్ పాయింట్లు రావడం రికార్డని కరస్పాండెంట్ పి.ప్రకాష్‌బాబు తెలిపారు.
ఎం.అనంత, పి.విష్ణుప్రియ, బి.పవన్‌కళ్యాణ్, ఏవీ భారవి, ఎన్.సుష్మాంజలిలు 10 గ్రేడ్ పాయింట్లు సాధించిన వారిలో ఉన్నారు.
పలు ప్రైవేటు పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కూడా ప్రతిభ కనబరిచారు.
అడ్డంకులెదురైనా..
జిల్లాలో ప్రతికూల పరిస్థితిని సైతం అధిగమించి పదో తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధించారు.
2013లో సమైక్యాంధ్ర ఉద్యమంతో సుమారు రెండు నెలల పాటు పాఠశాలలు మూతబడ్డాయి. ఆందోళన కార్యక్రమాల్లో విద్యార్థులు కూడా భాగస్వాములు కావడంతో సుమారు మూడు నెలలపాటు పాఠశాలల్లో తరగతులు అంతంత మాత్రంగానే జరిగాయి.
మిగిలిన కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం వల్లే మంచి ఫలితాలు సాధించగలిగామని డీఈవో రాజేశ్వరరావు సంతృప్తి వ్యక్తం చేశారు.
అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించి పరీక్షలకు సంసిద్ధులను చేశారు.
డీసీఈబీ (జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు) ఆధ్వర్యంలో పాఠశాలలకు స్టడీ మెటీరియల్ సరఫరా చేశారు.
సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులకు ప్రత్యేకంగా స్టడీ మెటీరియల్ సరఫరా చేయడంతో పాటు కలెక్టర్ సూచనల మేరకు వారికి నిర్వహించిన ప్రత్యేక కౌన్సెలింగ్ కూడా ఉత్తమ ఫలితాల సాధనకు దోహదపడిందని డీఈవో వివరించారు.
పదో తరగతి పరీక్ష ఫలితాల్లో బాలికలదే పైచేయి
Published Fri, May 16 2014 2:17 AM | Last Updated on Sat, Sep 2 2017 7:23 AM
Advertisement
Advertisement