టెన్త్‌ ఫలితాల్లో బాలికలదే పైచేయి | School education department released tenth exam results | Sakshi
Sakshi News home page

టెన్త్‌ ఫలితాల్లో బాలికలదే పైచేయి

Published Wed, May 15 2019 4:10 AM | Last Updated on Wed, May 15 2019 8:00 AM

School education department released tenth exam results - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాల్లో బాలికలు అగ్రస్థానంలో నిలిచారు. మొత్తం 94.88 శాతం మంది ఉత్తీర్ణులవ్వగా అందులో బాలికలు 95.09 శాతం మంది, బాలురు 94.68 శాతం మంది ఉన్నారు. గత ఏడాదికన్నా ఈసారి 0.40% ఉత్తీర్ణత పెరిగింది. మంగళవారం విజయవాడ ఇబ్రహీంపట్నంలోని పాఠశాల విద్యాశాఖ కార్యాలయంలో కమిషనర్‌ సంధ్యారాణి ఫలితాలను విడుదల చేశారు.  మొత్తం 6,30,082 మంది పరీక్ష రాశారు. 2,816 మంది పరీక్షకు హాజరుకాలేదు. పరీక్ష రాసిన వారిలో రెగ్యులర్‌ విద్యార్థులు 6,19,494 మంది, ప్రైవేటు విద్యార్థులు (ఒకసారి రాసి ఫెయిలై మళ్లీ పరీక్ష రాసిన వారు) 10,588 మంది ఉన్నారు.

రెగ్యులర్‌ విద్యార్థుల్లో 5,87,765 (94.88) మంది ఉత్తీర్ణులవ్వగా పరీక్ష రాసిన బాలురలో 94.68 శాతం (3,00,548) మంది, బాలికల్లో  95.09 శాతం (2,87,217) మంది పాస్‌ అయ్యారు. ప్రైవేటు విద్యార్థుల్లో 6,228 మంది ఉత్తీర్ణులయ్యారు. ఈ ఏడాది 11,690 పాఠశాలల నుంచి టెన్త్‌ పరీక్షలకు విద్యార్థులు హాజరుకాగా వీటిలో 5,464 (46.74 శాతం) స్కూళ్లు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. మూడు స్కూళ్లలో ఒక్క విద్యార్థి కూడా పాసవ్వలేదు. వీటిలో రెండు ప్రైవేటు స్కూళ్లు, ఒకటి ఎయిడెడ్‌ స్కూల్‌ ఉంది. ఫలితాల్లో తెలుగు మాధ్యమ విద్యార్థుల కన్నా ఆంగ్ల మాధ్యమ విద్యార్థులు ముందంజలో ఉన్నారు. ఆంగ్ల మాధ్యమ విద్యార్థులు 97.54 శాతం మంది, తెలుగు మాధ్యమ విద్యార్థులు 90.46 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.


తూర్పుగోదావరి ఫస్టు
టెన్త్‌ ఫలితాల్లో ఈఏడాది 98.19 శాతంతో తూర్పుగోదావరి జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. చివరి స్థానంలో 83.19 శాతంతో నెల్లూరు జిల్లా ఉంది. ఎయిడెడ్‌ స్కూళ్ల విద్యార్థులు 87.16 శాతంతో ఉత్తీర్ణతలో చివరి స్థానంలో నిలిచారు.10 జీపీఏలో కూడా తూర్పుగోదావరి జిల్లానే ముందువరసలో ఉంది. అత్యధికంగా తూర్పుగోదావరిలో 5,456 మందికి 10 జీపీఏరాగా నెల్లూరు జిల్లాలో అత్యల్పంగా 1,271 మందికి 10 జీపీఏ లభించింది. కాగా, ఫలితాల విడుదల కార్యక్రమంలో ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్‌ ఎ.సుబ్బారెడ్డి, రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్‌ డైరెక్టర్‌ ప్రభాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
ప్రైవేటుకే ఎక్కువగా 10 జీపీఏ పాయింట్లు
అత్యధిక శాతం 10 జీపీఏ పాయింట్లను ప్రైవేటు పాఠశాలలే సాధించాయి. ఇంటర్నల్‌ మార్కులను ఇష్టానుసారం ప్రైవేటు పాఠశాలలు వేసుకుంటున్నాయని, అందుకే 10 జీపీఏ పాయింట్లు ఆ పాఠశాలలే సాధిస్తున్నాయని ఆరోపణలున్నాయి. ఈ ఏడాది ఫలితాల్లో అదే తీరు కనిపించింది. టెన్‌ జీపీఏ సాధించిన విద్యార్థులు 33,972 ఉంటే.. ఇందులో 29,016 మంది ప్రైవేటు పాఠశాలల విద్యార్థులే కావడం గమనార్హం. 

10 జీపీఏ సాధించిన యాజమాన్యాలు, విద్యార్థుల వివరాలు.. 

సబ్జెక్టుల వారీగా ఏ1 గ్రేడ్లు సాధించిన విద్యార్థులు..
ఇంగ్లీషు:        2,04,746
సోషల్‌ స్టడీస్‌:    1,70,587
ఫస్టు లాంగ్వేజ్‌:     1,68,193
మేథమెటిక్స్‌:     1,41,417
సెకండ్‌ లాంగ్వేజ్‌:     1,03,086
జనరల్‌ సైన్సు:     90,025

జూన్‌ 17 నుంచి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ 
ఫెయిలైన విద్యార్థుల కోసం అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీని జూన్‌ 17 నుంచి 29 వరకు నిర్వహించనున్నట్లు కమిషనర్‌ సంధ్యారాణి తెలిపారు. అభ్యర్థులు రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్‌ ఫలితాల కోసం ఎదురు చూడకుండా అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ పరీక్షలకు జూన్‌ 6వ తేదీలోగా దరఖాస్తు చేయాలన్నారు. పరీక్ష ఫీజును ఆన్‌లైన్లో చెల్లించవచ్చని తెలిపారు. ప్రస్తుతం విద్యార్థుల మార్కుల మెమోలను రెండు రోజుల్లో  ఠీఠీఠీ. bట్ఛ్చp. ౌటజ వెబ్‌సైట్‌లో పొందుపర్చనున్నామని వివరించారు. వీటి ఆధారంగా ఇంటర్మీడియెట్‌ కాలేజీల్లో చేరవచ్చని చెప్పారు. 

రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌ గడువు మే 30
రీకౌంటింగ్‌ కోసం విద్యార్థులు సబ్జెక్టుకు రూ. 500 చొప్పున ఈనెల 30వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చని సంధ్యారాణి తెలిపారు. ఫీజును సీఎఫ్‌ఎంఎస్‌ చలానా ద్వారా చెల్లించాలన్నారు. రీవెరిఫికేషన్‌ కోసం అభ్యర్థులు దరఖాస్తును సంబంధిత ప్రధానోపాధ్యాయుని ద్వారా ధ్రువీకరణ సంతకం చేయించి హాల్‌ టికెట్‌ జిరాక్సు కాపీతో పాటు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఈనెల 30 లోగా సమర్పించాలని పేర్కొన్నారు. దరఖాస్తు నమూనాను www. bseap. org వెబ్‌సైట్‌ నుంచి, లేదా డీఈవో కార్యాలయం నుంచి పొందవచ్చన్నారు. రీవెరిఫికేషన్‌ కోరే అభ్యర్థులు ఒక్కో సబ్జెక్టుకు రూ. 1,000 చొప్పున చెల్లించాలన్నారు. రీవెరిఫికేషన్లో మార్కులను లెక్కించడం, అన్ని సమాధానాలకు మార్కులు ఇచ్చారా? లేదా? అన్న అంశాలను పరిశీలించడం, మూల్యాంకనం చేయని సమాధానాలను తిరిగి మూల్యాంకనం చేయించడం ఉంటుందన్నారు. 

‘గురుకులాల్లో 95.40శాతం ఉత్తీర్ణత’
పదో తరగతి ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్‌ సాంఘిక సంక్షేమ గురుకులాల విద్యార్థులు 95.40శాతం ఉత్తీర్ణత సాధించి సరికొత్త రికార్డును నెలకొల్పారని సాంఘిక సంక్షేమ గురుకుల సంస్థ కార్యదర్శి కల్నల్‌ వి.రాములు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 175 గురుకుల పాఠశాలల్లో 13,064 మంది పరీక్షలకు హాజరు కాగా, 12,463 మంది ఉత్తీర్ణులయ్యారని చెప్పారు. చిత్తూరు జిల్లా 99.05 శాతం ఉత్తీర్ణత సాధించి ఫలితాల్లో ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. మొత్తం 71 గురుకులాల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించడం విశేషమని తెలిపారు. ఇక ఏపీటీవీఆర్‌ఐ సొసైటీకి చెందిన విద్యార్థులు 94.35 శాతం ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 52 రెసిడెన్షియల్‌ స్కూళ్లలో 23 స్కూల్స్‌ నూరు శాతం ఉత్తీర్ణత సాధించాయి. 

వచ్చే ఏడాది నుంచి టెన్త్‌ ఇంటర్నల్‌ మార్కులు రద్దు!
రాష్ట్రంలో వచ్చే ఏడాది నుంచి టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షల్లో ఇంటర్నల్‌ మార్కుల కేటాయింపు రద్దు చేయనున్నామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సంధ్యారాణి మంగళవారం తెలిపారు. నిరంతర సమగ్ర మూల్యాంకన విధానం యథాతథంగానే కొనసాగిస్తూనే పబ్లిక్‌ పరీక్షల్లో ఇంటర్నల్‌ మార్కులు లేకుండా 100 మార్కులకే పరీక్షలు నిర్వహిస్తారు. ఇంటర్నల్‌ మార్కులు కేటాయింపు విధానంలో లోపాలు ఉన్నాయి. పాఠశాలల్లో అవకతవకలు జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో వీటిని రద్దు చేయాలని పలువర్గాల నుంచి డిమాండ్లు వచ్చాయి. వీటిని పరిశీలించిన పాఠశాల విద్యాశాఖ ఈ ఇంటర్నల్‌ మార్కులను రద్దు చేసేందుకు ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపింది.

వీటికి ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ఇంటర్నల్‌ మార్కుల రద్దు అమల్లోకి వస్తుందని కమిషనర్‌ వివరించారు. మంగళవారం ఎస్సెస్సీ ఫలితాల విడుదల సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. వచ్చే ఏడాది నుంచి టెన్త్‌  ప్రశ్నపత్రం మోడల్‌లో కూడా మార్పులు ఉంటాయని, దీనిపై నిపుణుల అభిప్రాయాలు తీసుకుంటున్నామని తెలిపారు. టెన్త్‌ మార్కుల్లో స్పోర్ట్సు కోటాకు కూడా కొన్ని మార్కులు కేటాయించాలని భావిస్తున్నామన్నారు. టెన్త్‌ ఫలితాల విడుదలలో పలు జాగ్రత్తలు తీసుకోవడంతో ఎలాంటి లోపాలు లేకుండా ధ్రువపత్రాలు జారీ కానున్నాయని చెప్పారు. వచ్చే ఏడాది నుంచి జూన్‌ నుంచే నామినల్‌ రోల్స్‌ను స్కూళ్ల నుంచి తీసుకుంటామని తెలిపారు. ముందుగానే తప్పులను సవరించి ధ్రువపత్రాలు ఇవ్వడానికి వీలవుతుందన్నారు. 

జూన్‌ ఆఖరుకు డీఎస్సీ నియామకాలు
డీఎస్సీ నియామకాలను జూన్‌ ఆఖరుకు పూర్తిచేసే అవకాశాలున్నాయని కమిషనర్‌ పేర్కొన్నారు. డీఎస్సీ ఫలితాలు ఇంతకు ముందే ప్రకటించినా.. ఎన్నికల కోడ్‌ వల్ల జిల్లాల వారీగా ఎంపిక జాబితాల ప్రకటన చేయలేదన్నారు. కొత్త ప్రభుత్వ ఆదేశాల ప్రకారం డీఎస్సీ నియామకాలపై చర్యలు తీసుకుంటామన్నారు. కొత్త టీచర్ల నియామకానికి ముందే బదిలీల ప్రక్రియ ఉంటుందన్నారు. ఇదివరకటి దరఖాస్తులను అనుసరించి వీటిని చేస్తారన్నారు. సాధారణ బదిలీలు ఉండవని తెలిపారు. పాఠశాలల రేషనలైజేషన్‌ ప్రక్రియ కూడా ఉంటుందని చెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement