kasturiba school
-
కుదిరితే తిరుపతి.. లేకుంటే బాసర
శంకరపట్నం(మానకొండూర్): ‘ఆరో తరగతినుంచి కలిసి చదువుకున్నాం. కొద్దిరోజులైతే పదోతరగతి పరీక్షలు ముగుస్తాయి. ఎవరి ఇంటికి వాళ్లం వెళ్తాం. తరువాత కలుసుకోవడం కుదరదని రహస్యంగా టూర్‌కు ప్లాన్ చేసుకున్నాం. మొదట తిరుపతి వెళ్దామనుకున్నాం.. సమయం అనుకూలించక బాసర వెళ్లివద్దామని హాస్టల్లోంచి వెళ్లాం’ అని శుక్రవారం అర్ధరాత్రి కేశవపట్నం కస్తూరిబా పాఠశాల నుంచి అదృశ్యమైన పదోతరగతి విద్యార్థులు దుర్గం ఐశ్వర్య, కొంకటి రేణుక, బెజ్జంకి భవాని,మాతంగి తేజశ్రీ, మంద రేవణ్య ఆదివారం సీఐ రవికుమార్‌కు వివరాలు వెల్లడించారు. మూడురోజులు మందుగానే ప్లాన్.. కేశవపట్నం కస్తూరిబా పాఠశాలలో దుర్గం ఐశ్వర్య, కొంకటి రేణుక, బెజ్జంకి భవాని, మాతంగి తేజశ్రీ, మంద రేవణ్య పదో తరగతి చదువుతున్నారు. వీరు ఆరో తరగతి నుంచి మంచి స్నేహితులు. మార్చి 16నుంచి వార్షిక పరీక్షలు ప్రారంభం అవుతున్నాయి. పరీక్షలు ముగిస్తే ఎవరింటికి వాళ్లు వెళ్లిపోతామని, ఇంతలో తిరుపతి వెళ్లొద్దామని మూడురోజుల ముందుగానే ప్లాన్ వేసుకున్నారు. ఈ నెల 22న సాయంత్రం 7గంటలకు బయటకు వెళ్లేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. హాస్టల్ భవనం ఎక్కి చుట్టుపక్కల పరిశీలించారు. రాత్రి 11.30కి నైట్‌డ్యూటీ టీచర్, వాచ్మెన్, విద్యార్థులు నిద్రపోయాక భవనంపైకి ఎక్కారు. నిచ్చెనసాయంతో ప్రహరీదూకిన ఐదుగురు విద్యార్థినులు కేశవపట్నంలోని మేయిన్ రోడ్డుకు చేరుకున్నారు. లారీలో జగిత్యాలకు.. అక్కడ ఓ బేకరీ యజమాని సెల్ తీసుకుని రేవణ్య తన బంధువైన కరీంపేటకు చెందిన అనిల్‌కు ఫోన్‌చేసి రమ్మంది. బైక్‌పై అక్కడికి చేరుకున్న అనిల్‌ను ఎలాగైనా హుజూరాబాద్‌లో విడిపెట్టాలని వారు కోరారు. దీంతో భయపడిన అనిల్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. విద్యార్థినులు కాలినడకన వంకాయగూడెం వరకు నడిచి వెళ్లారు. ఓ లారీని ఆపి అందులో జగిత్యాలకు చేరుకున్నారు. జగిత్యాల బస్టాండ్‌లో నిజామాబాద్ బస్సుఎక్కి శనివారం వేకువజామున నిజామాబాద్‌లో దిగారు. బాసర వెళ్దామని.. అందరిదగ్గర కలిపి వీడ్కోలు పార్టీకి దాచుకున్న రూ.1000తో బాసర వెళ్లొద్దామని నిశ్చయించుకున్నారు. అనుమానాస్పదంగా కనిపించిన విద్యార్థులను అక్కడే ఉన్న మహిళా కానిస్టేబుల్ గమనించింది. విషయాన్ని నిజామాబాద్ పోలీసులకు తెలిపింది. వారు అక్కడికి చేరుకుని విద్యార్థినులను సఖీ కేంద్రానికి తరలించారు. అక్కడ పూర్తి వివరాలు తెలుసుకుని, శంకరపట్నం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆదివారం వేకువజామున నిజామాబాద్ చేరుకున్న ఎస్సై సత్యనారాయణ, కానిస్టేబుల్ రమేశ్, మహిళాహోంగార్డు రజిత అక్కడి సఖీ కేంద్రం నుంచి ఐదుగురు విద్యార్థినులను కేశవపట్నం తీసుకొచ్చారు. స్థానిక కస్తూరిబా పాఠశాలలో హుజూరాబాద్ రూరల్ సీఐ రవికుమార్ విద్యార్థినులను విడివిడిగా విచారించారు. వీరిలో కొంకటి రేణుక, బెజ్జంకి భవాని, మంద రేవణ్యకు తండ్రులు లేరు. వీరి కుటుంబ సభ్యులను పిలిపించి ఆదివారం కేశవపట్నం పోలీస్‌స్టేషన్‌లో కౌన్సెలింగ్ నిర్వహించారు. పరీక్షల సమయంలో ఇబ్బంది పెట్టొద్దని తల్లిదండ్రులకు ఎస్సై సత్యనారాయణ సూచించారు. -
ఏ రోజు పాఠం.. ఆ రోజే పఠనం
నల్లగొండ : బాలికలను చదువుల్లో మేటిగా తయారుచేసి.. చదువుల తల్లులుగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో రాష్ట్ర సమగ్రశిక్షా అభియాన్ కొత్త పథకాలకు శ్రీకారం చుట్టింది. విద్యార్థినుల్లోని సృజనాత్మకత, సామర్థ్యాలను వెలికి తీసేందుకు సంకల్పించింది. ఇందులో భాగంగా కేజీబీవీల్లో విద్యార్థినులతో తరగతుల వారీగా క్లబ్‌లు ఏర్పాటు చేస్తోంది. పాఠశాలలో ఉపాధ్యాయుడు పాఠం చెప్పిన రోజునే ఈ క్లబ్లో చర్చించి.. చదువుతారు. ఇలా వారం రోజులపాటు చదివిన అంశాలపై వారాంతంలో పరీక్షలు నిర్వహించి విద్యార్థినుల్లో సామర్థ్యాన్ని పెంపొందిస్తారు. జిల్లాలో 27 కేజీబీవీలు ఉన్నాయి. వీటిలో చదివే బాలికల్లో సామర్థ్యం పెంపునకు క్లబ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. తరగతి గదిలో ఉపాధ్యాయుడు చెప్పిన పాఠాన్ని అదే రోజు చదివి సామర్థ్యాన్ని పెంచుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అందులో భాగంగానే పాఠ్యాంశాలవారీగా ఆ క్లబ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. 6 నుంచి 10వ తరగతి వరకు ప్రతి తరగతికి ఆయా పాఠ్యాంశాల వారీగా ఈ క్లబ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. క్లబ్‌ల ఏర్పాటు ఇలా.. జిల్లాలోని 27 కేజీబీవీల్లో ఆరు నుంచి పది తరగతులకు ఒక్కో క్లబ్ ఏర్పాటు చేస్తారు. ఈ క్లబ్లో బాగా చదివే, మధ్యస్థంగా చదివే, బాగా తెలివైన, చెబితే అర్థం చేసుకోగలిగే విద్యార్థినులను సభ్యులుగా ఉంచుతారు. వీరిలో ప్రతిభావంతురాలయిన విద్యార్థిని ఈ క్లబ్‌కు లీడర్‌గా వ్యవహరిస్తారు. అవసరమైతే సంబంధిత క్లాస్ టీచర్ లేదా గైడ్ టీచర్ సలహాలు తీసుకుంటారు. రోజూ పాఠశాల ముగిసిన అనంతరం 3.45 నుంచి 4.30 గంటల వరకు ఆ రోజు తరగతి గదుల్లో ఉపాధ్యాయుడు బోధించిన పాఠ్యాంశాలను ఈ సమయంలో క్లబ్‌ల్లో పఠనం చేస్తారు. క్లాస్ టీచర్‌తోపాటు గైడ్ టీచర్ కూడా ఇందులో సభ్యురాలిగా ఉంటారు. తరగతిలోని ప్రతి విద్యార్థిని ఇందులో సభ్యులుగా ఉంటారు. ఏరోజు పాఠం ఆ రోజే చదవడం, పాఠం ఎంతవరకు అర్థమైంది.. ఒక వేళ అర్థంకాకపోతే.. మొదట తరగతి గదిలో లీడర్‌తో చెప్పించుకుంటారు. అయినా అర్థం కాకపోతే ఉపాధ్యాయులను కూడా అడిగి దానిపై అవగాహన తెచ్చుకునే విధంగా క్లబ్‌లు దోహదం చేస్తాయి. దీని ద్వారా విద్యార్థుల మధ్య పాఠ్యాంశం చర్చకు వచ్చి సులభంగా అర్థమవుతుంది. ఇలా క్లబ్‌ల్లో పాఠ్యాంశాలను చర్చించడం ద్వారా విద్యార్థుల మెదళ్లలో ఆ అంశాలు అలాగే ఉండిపోతాయి. వారాంతంలో పోటీ పరీక్షలు వారాంతంలో ఆయా పాఠ్యాంశాలపై ప్రతి తరగతిలో విద్యార్థినులకు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విధంగా పరీక్షలు నిర్వహిస్తారు. అంతేగాక క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. తద్వారా విద్యార్థుల్లో దాగిఉన్న సృజనాత్మకత బయటకు రావడంతో పాటు వారి కళలను కూడా బయటికి తీసుకొచ్చేందుకు ఈ కార్యక్రమాలు ఎంతగానో దోహదపడనున్నాయి. క్లబ్‌లు బాలికల చదువుకు ఎంతోమేలు కస్తూరిబా గాంధీ పాఠశాలల్లో తరగతుల వారీగా విద్యార్థినులు క్ల బ్లుగా ఏర్పడి ఏరో జు పాఠం ఆరోజే చదవడం వల్ల వారు జ్ఞానం సంపాదించుకుంటున్నారు. అంతేకాక ఏరోజు కారోజు చదవడం వల్ల పరీక్షల సందర్భంలో ఒకేసారి చదవాల్సిన భారం ఉండదు. దాని ద్వారా విద్యార్థులు మంచి విద్యను పొందడంతో పాటు సులువుగా పరీక్షలు రాయగలుగుతారు. – అరుణశ్రీ, సెక్టోరియల్ అధికారి -
కస్తూర్బాలో కన్నీటి కష్టాలు
- విద్యాలయం ముందు బైఠాయించిన విద్యార్థులు - 20 రోజులుగా దుస్తులు ఉతుక్కోని వైనం లేపాక్షి : అనంతపురం జిల్లా లేపాక్షిలోని కస్తూర్బా బాలికల విద్యాలయంలో నీటికష్టాలు తారస్థాయికి చేరాయి. పాఠశాలలో గత జూన్ 12న తరగతులు పునఃప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి నీటి కోసం విద్యార్థినులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాలకు హాజరైనప్పటి నుంచి దుస్తులు ఉతుక్కోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం ఉదయం విద్యార్థినులు ఏకమై పాఠశాల మెయిన్ గేట్‌కు తాళం వేసి నిరసన తెలిపారు. ఉపాధ్యాయినులు, సిబ్బందిని లోపలికి రానివ్వకుండా అడ్డుకున్నారు. సుమారు గంటకు పైగా ఆందోళన నిర్వహించారు. ఉన్నతాధికారులు వచ్చి తాగునీటి సమస్య పరిష్కరించే వరకు తాళాలు తీయబోమని భీష్మించారు. చివరకు విద్యాలయం స్పెషల్ ఆఫీసర్ సుధారాణి ఎంఈఓ, తహసీల్దార్, ఎంపీడీఓలకు ఫోన్ ద్వారా సమస్యను తెలియజేశారు. ఎంఈఓ నాగరాజు, ఎంపీడీఓ నటరాజ్, తహసీల్దార్ ఆనందకుమార్ విద్యాలయం వద్దకు చేరుకుని తాళాలను తీయించి సమస్యలు వివరించాలని కోరారు. ఈ సందర్భంగా 9వ తరగతి చదువుతున్న పుష్ప, 7వ తరగతి విద్యార్థిని శ్రవంతి, 10వ తరగతి విద్యార్థినులు అనూష, జ్యోతి తదితరులు కస్తూర్బాలోని సమస్యలను వివరించారు. అధికారులు మాట్లాడుతూ సమస్యలను వీలైనంత త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. ఇదే సమయంలో పరిస్థితిని జిల్లా కేంద్రంలోని ఎస్ఎస్ఏ అధికారులకు ఫోన్ ద్వారా తెలియజేశారు. ఇవీ సమస్యలు - 20 రోజులుగా నీటి సమస్య. - ఉన్న ఒక్క బోరు కూడా ఎండిపోయింది. - రోజుకు ఒక ట్యాంకరు నీటిని మాత్రమే సరఫరా చేస్తున్నారు. - సంపులోకి నీరు సరఫరా చేస్తుండటంతో తోడుకునేందుకు అవస్థలు. - నీటి సమస్య కారణంగా అధ్వానంగా బాత్రూం, లెట్రీన్లు. - ఒంటిపై గుల్లలు, దరద. - మెనూ ప్రకారం భోజనం వడ్డించరు. - అరకొరగా కోడిగుడ్లు, చికెన్. -
ఆకతాయిలతో భయమేస్తోంది
పాఠశాలకు రావాలంటే వణిపోతున్నాం... రక్షణ కల్పించాలని ఎమ్మెల్యేకు విద్యార్థినుల వినతి హుస్నాబాద్ : ‘పాఠశాలకు రావాంటే ఆకతాయిల తీరుతో వణికిపోతున్నాం... ఉదయం, సాయంత్రం ఆడపిల్లలు, టీచర్లు పాఠశాలకు రావాలంటే భయమేస్తోంది. ఆడ పిల్లలను, తల్లిదండ్రులను బెదిరిస్తున్నారు. చివరకు పాఠశాల టీచర్‌పైనా దాడి చేశారు. మాకు భద్రత ఎక్కడుందని’ అంటూ కస్తూరిబా బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు, టీచర్లు ఎమ్మెల్యే సతీష్‌కుమార్‌కు మొరపెట్టుకున్నారు. హుస్నాబాద్ పట్టణంలో హరితహారం కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎమ్మెల్యే రాగా.. కస్తూరిబా బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థులు తమ గోడు వెల్లబోసుకున్నారు. పాఠశాలకు ప్రహరీలేదని, తాగిన మైకంలో ఇద్దరు వ్యక్తులు మాస్క్‌లు ధరించి అమ్మాయిలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని తెలిపారు. అడ్డుకునేందుకు వెళ్లిన టీచర్‌పై దాడి చేశారని, రాత్రి అయిందంటే తాగుబోతులు వచ్చి బెదిరిస్తున్నారని వివరించారు. తమకు రక్షణ కల్పించాలని వేడుకున్నారు. స్పందించిన ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ ఆకతాయిలను పట్టుకుని శిక్షించాలని ఎసై ్స ఎర్రల కిరణ్‌ను ఆదేశించారు. పాuý శాలకు వెళ్లే దారిలో గస్తీ ఏర్పాటు చేయాలన్నారు. అవసరమైతే పాఠశాల చుట్టూ, వెలుపల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మరో రోజు పాఠశాలకు వచ్చి అమ్మాయిలు, టీచర్ల సమస్యలు తెలుసుకుంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. -
కలుషితాహారం: 25 మందికి అస్వస్థత
-
కలుషితాహారం: 25 మందికి అస్వస్థత
విజయనగరం: కలుషితాహారంతో విద్యార్థినులు అస్వస్థతకు గురైన విజయనగరం జిల్లా కేంద్రంలోని బాబామెట్టలో ఉన్న కస్తూరిభా ఆశ్రమ పాఠశాలలో గురువారం ఉదయం జరిగింది. పాఠశాలలో ఉన్న 25 మంది బాలికలకు ఉదయం టిఫిన్‌గా పెరుగన్నం వడ్డించారు. అది తిన్న కొద్దిసేపటికే బాలికలంతా తీవ్ర కడుపునొప్పి, విరేచనాలతో బాధపడ్డారు. నిర్వాహకులు వారందరినీ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి 108 వాహనంలో తరలించారు. పరీక్షించిన వైద్యులు వెంటనే చికిత్స ప్రారంభించారు. ఎవరికీ ఎటువంటి ప్రమాదం వైద్యులు తెలిపారు. -
పాలు తాగి 15 మందికి అస్వస్థత
చిత్తూరు: పాలు తాగి 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటన చిత్తూరు జిల్లా ఎర్రావారిపాలెంలో బుధవారం చోటుచేసుకుంది. స్థానిక కస్తూర్బా పాఠశాలలో చదువుకుంటున్న సుమారు 70 మంది విద్యార్థులు ఈరోజు ఉదయం టిఫిన్‌లో భాగంగా పాలు తాగారు. వారిలో 15 మంది మంది విద్యార్థునులు అస్వస్థతకు గురైయ్యారు. వారిని హుటాహుటిన తిరుపతి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే నిల్వ ఉంచిన మూడు రోజుల క్రితం పాలు బుధవారం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా నాలుగు రోజుల కిందట కూడా కలుషితాహారం తిని పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఇంత జరుగుతున్న ఉన్నతాధికారులు స్పందించడంలేదని విద్యార్థుల తల్లి దండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.