కుదిరితే తిరుపతి.. లేకుంటే బాసర | Kasturba School Tenth Class Girls Missing Case Karimnagar | Sakshi
Sakshi News home page

కుదిరితే తిరుపతి.. లేకుంటే బాసర

Published Mon, Feb 25 2019 8:11 AM | Last Updated on Mon, Feb 25 2019 8:11 AM

Kasturba School Tenth Class Girls Missing Case Karimnagar - Sakshi

విద్యార్థినులతో మాట్లాడుతున్న సీఐ రవికుమార్‌

శంకరపట్నం(మానకొండూర్‌): ‘ఆరో తరగతినుంచి కలిసి చదువుకున్నాం. కొద్దిరోజులైతే పదోతరగతి పరీక్షలు ముగుస్తాయి. ఎవరి ఇంటికి వాళ్లం వెళ్తాం. తరువాత కలుసుకోవడం కుదరదని రహస్యంగా టూర్‌కు ప్లాన్‌ చేసుకున్నాం. మొదట తిరుపతి వెళ్దామనుకున్నాం.. సమయం అనుకూలించక బాసర వెళ్లివద్దామని హాస్టల్లోంచి వెళ్లాం’ అని శుక్రవారం అర్ధరాత్రి కేశవపట్నం కస్తూరిబా పాఠశాల నుంచి అదృశ్యమైన పదోతరగతి విద్యార్థులు దుర్గం ఐశ్వర్య, కొంకటి రేణుక, బెజ్జంకి భవాని,మాతంగి తేజశ్రీ, మంద రేవణ్య ఆదివారం సీఐ రవికుమార్‌కు వివరాలు వెల్లడించారు.

మూడురోజులు మందుగానే ప్లాన్‌.. 
కేశవపట్నం కస్తూరిబా పాఠశాలలో దుర్గం ఐశ్వర్య, కొంకటి రేణుక, బెజ్జంకి భవాని, మాతంగి తేజశ్రీ, మంద రేవణ్య పదో తరగతి చదువుతున్నారు. వీరు ఆరో తరగతి నుంచి మంచి స్నేహితులు. మార్చి 16నుంచి వార్షిక పరీక్షలు ప్రారంభం అవుతున్నాయి. పరీక్షలు ముగిస్తే ఎవరింటికి వాళ్లు వెళ్లిపోతామని, ఇంతలో తిరుపతి వెళ్లొద్దామని మూడురోజుల ముందుగానే ప్లాన్‌ వేసుకున్నారు. ఈ నెల 22న సాయంత్రం 7గంటలకు బయటకు వెళ్లేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. హాస్టల్‌ భవనం ఎక్కి చుట్టుపక్కల పరిశీలించారు. రాత్రి 11.30కి నైట్‌డ్యూటీ టీచర్, వాచ్‌మెన్, విద్యార్థులు నిద్రపోయాక భవనంపైకి ఎక్కారు. నిచ్చెనసాయంతో ప్రహరీదూకిన ఐదుగురు విద్యార్థినులు కేశవపట్నంలోని మేయిన్‌ రోడ్డుకు చేరుకున్నారు.

లారీలో జగిత్యాలకు.. 
అక్కడ ఓ బేకరీ యజమాని సెల్‌ తీసుకుని రేవణ్య తన బంధువైన కరీంపేటకు చెందిన అనిల్‌కు ఫోన్‌చేసి రమ్మంది. బైక్‌పై అక్కడికి చేరుకున్న అనిల్‌ను ఎలాగైనా హుజూరాబాద్‌లో విడిపెట్టాలని వారు కోరారు. దీంతో భయపడిన అనిల్‌ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. విద్యార్థినులు కాలినడకన వంకాయగూడెం వరకు నడిచి వెళ్లారు. ఓ లారీని ఆపి అందులో జగిత్యాలకు చేరుకున్నారు. జగిత్యాల బస్టాండ్‌లో నిజామాబాద్‌ బస్సుఎక్కి శనివారం వేకువజామున నిజామాబాద్‌లో దిగారు. 

బాసర వెళ్దామని.. 
అందరిదగ్గర కలిపి వీడ్కోలు పార్టీకి దాచుకున్న రూ.1000తో బాసర వెళ్లొద్దామని నిశ్చయించుకున్నారు. అనుమానాస్పదంగా కనిపించిన విద్యార్థులను అక్కడే ఉన్న మహిళా కానిస్టేబుల్‌ గమనించింది. విషయాన్ని నిజామాబాద్‌ పోలీసులకు తెలిపింది. వారు అక్కడికి చేరుకుని విద్యార్థినులను సఖీ కేంద్రానికి తరలించారు. అక్కడ పూర్తి వివరాలు తెలుసుకుని, శంకరపట్నం పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఆదివారం వేకువజామున నిజామాబాద్‌ చేరుకున్న ఎస్సై సత్యనారాయణ, కానిస్టేబుల్‌ రమేశ్, మహిళాహోంగార్డు రజిత అక్కడి సఖీ కేంద్రం నుంచి ఐదుగురు విద్యార్థినులను కేశవపట్నం తీసుకొచ్చారు. స్థానిక కస్తూరిబా పాఠశాలలో హుజూరాబాద్‌ రూరల్‌ సీఐ రవికుమార్‌ విద్యార్థినులను విడివిడిగా విచారించారు. వీరిలో కొంకటి రేణుక, బెజ్జంకి భవాని, మంద రేవణ్యకు తండ్రులు లేరు. వీరి కుటుంబ సభ్యులను పిలిపించి ఆదివారం కేశవపట్నం పోలీస్‌స్టేషన్‌లో కౌన్సెలింగ్‌ నిర్వహించారు. పరీక్షల సమయంలో ఇబ్బంది పెట్టొద్దని తల్లిదండ్రులకు ఎస్సై సత్యనారాయణ సూచించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement