కస్తూర్బాలో కన్నీటి కష్టాలు
- విద్యాలయం ముందు బైఠాయించిన విద్యార్థులు
- 20 రోజులుగా దుస్తులు ఉతుక్కోని వైనం
లేపాక్షి : అనంతపురం జిల్లా లేపాక్షిలోని కస్తూర్బా బాలికల విద్యాలయంలో నీటికష్టాలు తారస్థాయికి చేరాయి. పాఠశాలలో గత జూన్ 12న తరగతులు పునఃప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి నీటి కోసం విద్యార్థినులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాలకు హాజరైనప్పటి నుంచి దుస్తులు ఉతుక్కోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం ఉదయం విద్యార్థినులు ఏకమై పాఠశాల మెయిన్ గేట్‌కు తాళం వేసి నిరసన తెలిపారు. ఉపాధ్యాయినులు, సిబ్బందిని లోపలికి రానివ్వకుండా అడ్డుకున్నారు. సుమారు గంటకు పైగా ఆందోళన నిర్వహించారు.
ఉన్నతాధికారులు వచ్చి తాగునీటి సమస్య పరిష్కరించే వరకు తాళాలు తీయబోమని భీష్మించారు. చివరకు విద్యాలయం స్పెషల్ ఆఫీసర్ సుధారాణి ఎంఈఓ, తహసీల్దార్, ఎంపీడీఓలకు ఫోన్ ద్వారా సమస్యను తెలియజేశారు. ఎంఈఓ నాగరాజు, ఎంపీడీఓ నటరాజ్, తహసీల్దార్ ఆనందకుమార్ విద్యాలయం వద్దకు చేరుకుని తాళాలను తీయించి సమస్యలు వివరించాలని కోరారు. ఈ సందర్భంగా 9వ తరగతి చదువుతున్న పుష్ప, 7వ తరగతి విద్యార్థిని శ్రవంతి, 10వ తరగతి విద్యార్థినులు అనూష, జ్యోతి తదితరులు కస్తూర్బాలోని సమస్యలను వివరించారు. అధికారులు మాట్లాడుతూ సమస్యలను వీలైనంత త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. ఇదే సమయంలో పరిస్థితిని జిల్లా కేంద్రంలోని ఎస్‌ఎస్‌ఏ అధికారులకు ఫోన్ ద్వారా తెలియజేశారు.
ఇవీ సమస్యలు
- 20 రోజులుగా నీటి సమస్య.
- ఉన్న ఒక్క బోరు కూడా ఎండిపోయింది.
- రోజుకు ఒక ట్యాంకరు నీటిని మాత్రమే సరఫరా చేస్తున్నారు.
- సంపులోకి నీరు సరఫరా చేస్తుండటంతో తోడుకునేందుకు అవస్థలు.
- నీటి సమస్య కారణంగా అధ్వానంగా బాత్‌రూం, లెట్రీన్లు.
- ఒంటిపై గుల్లలు, దరద.
- మెనూ ప్రకారం భోజనం వడ్డించరు.
- అరకొరగా కోడిగుడ్లు, చికెన్.