సాక్షి, విశాఖపట్నం : పదో తరగతి పరీక్షలు గురువారం నుంచి జరగనున్నాయి. ప్రస్తుత ం ఉన్న సిలబస్ వచ్చే విద్యా సంవత్సరం నుంచి మారనుంది. పాత సిలబస్‌తో విద్యార్థులు రాసే ఆఖరు పరీక్షలు ఇవే. పరీక్షలకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే విద్యార్థులు సర్వ సన్నద్ధమయ్యారు. వారికి ఉపాధ్యాయులు ఆల్ ద బెస్ట్ చెప్పి పరీక్షలకు సిద్ధం చేశారు.
264 కేంద్రాల్లో పరీక్షలు
గురువారం నుంచి ఏప్రిల్ 15 వరకు జరగనున్న పరీక్షలకు జిల్లా నుంచి 62,265 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఇందుకు 264 పరీక్ష కేంద్రాల్లో జిల్లా విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. విశాఖ అర్బన్(గాజువాక, భీమిలి కలిపి)లో 142 కేంద్రాలు, గ్రామీణ జిల్లాలో 81, ఏజెన్సీలో 42 పరీక్షా కేంద్రాలున్నాయి. 13 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 28 సమస్యాత్మక కేంద్రాల్లో 28 సిట్టింగ్ స్క్వాడ్లును ఏర్పాటు చేశారు. 264 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, అంతే సంఖ్యలో డిపార్ట్‌మెంటల్ అధికారుల్ని నియమించారు.
సుమారు 3 వేల మంది ఇన్విజిలేటర్లను ఎంపిక చేశారు. గాజువాక ప్రాంతంలో 50 మంది ఇన్విజిలేటర్ల కొరత ఉండడంతో అనకాపల్లి నుంచి వీరిని సర్దుబాటు చేశారు. 28 మంది రూట్ ఆఫీసర్లను ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రానికి నిర్ణీత సమయానికంటే గంట ముందుగానే హాజరు కావాల్సిందిగా జిల్లా విద్యాశాఖాధికారి బి.లింగేశ్వరరెడ్డి విద్యార్థులకు సూచించారు.
బార్ కోడింగ్‌లో ప్రధాన అంశాలు
పరీక్ష ప్రారంభానికి ముందు ప్రధాన (మెయిన్) జవాబు పత్రానికి ఒక బార్‌కోడ్ కలిగిన ఒఎంఆర్ షీట్‌ను ప్రతి విద్యార్థికి ఇస్తారు.
మెయిన్ షీట్‌ను పదహారు పేజీల ఖాళీ జవాబు పత్రం ఉంటుంది. ఇది కాకుండా ఇచ్చే అదనపు పత్రానికి నాలుగు పేజీలు ఉంటాయి. (అదనపు జవాబు పత్రాన్ని విద్యార్థి అవసరార్ధం తీసుకోవాలి)
ఓఎంఆర్ పత్రం మూడు విభాగాలుగా ఉంటుంది. పార్ట్-1లో విద్యార్థి పేరు, రోల్ నెంబర్, పేపర్ కోడ్, పేపర్ పేరు, పరీక్షాకేంద్రం పేరు, కోడ్, మీడియం, పరీక్ష తేదీ ఉంటుంది. ఇవన్నీ తనవో? కాదో? వివరాలు సరిగా ఉన్నాయో? లేదో? విద్యార్థి సరిచూసుకోవాలి.
పార్ట్-1లో ప్రధాన సమాధానపత్రం(మెయిన్ బుక్‌లెట్) సీరియల్ నెంబర్, అదనపు పత్రాల సంఖ్య, రూమ్ నెంబర్‌తోపాటు, కుడివైపున ఇన్విజిలేటర్లు, విద్యార్థి పూర్తి సంతకం చేసేందుకు వీలుగా ఖాళీ గడులుంటాయి. గడిని దాటకుండా సంతకం చేయాలి. పై వివరాలు సరిగా లే కపోయినా, తప్పులతో ఉన్నా వారి కోసం ‘నాన్ స్టాండర్డ్/బ్లాంక్ బార్ కోడ్ ఓఎంఆర్ షీట్’ కేటాయిస్తారు. వీరు పూర్తి వివరాలను ఇందులో స్వదస్తూరీతో రాయాల్సి ఉంటుంది.
పార్ట్-2లో ప్రధాన సమాధానపత్రం బుక్‌లెట్ నంబర్, అదనపు సమాధాన పత్రాల సంఖ్య మాత్రమే విద్యార్థులు వేయాలి.
పార్ట్-3లో విద్యార్థి రాయడానికి ఏమీ ఉండదు.
కోడింగ్ విధానంలో నాలుగు పేజీల జవాబు పత్రాలు ఇస్తారు. అందులో సబ్జెక్టు, పేపర్ పేరు, తీసుకున్న అదనపు సమాధాన పత్రాల సంఖ్య, ఇన్విజిలేటర్ సంతకం చేయాడానికి స్థలం కేటాయిస్తారు. జవాబు పత్రం ఎడమవైపు అదనపు పత్రాలు, గ్రాఫ్, మ్యాపు, పార్ట్-బి(బిట్‌పేపర్)ను టై్వన్ దారంతో కట్టేందుకు వీలుగా రంధ్రం ఉంటుంది.
ఓఎంఆర్‌ను ప్రధాన సమాధాన పత్రంపై సూచించిన రెండు చోట్ల పిన్‌చేసి, పేపర్ సీళ్ల(ఉపాధ్యాయులు అందించిన)ను అతికించాలి. ఓఎంఆర్‌ను ప్రధాన సమాధాన పత్రానికి జతచేయడానికి పైనున్న రంధ్రాలకు దిగువన, ఓఎంఆర్ షీట్ అంచులు, ప్రత్యేకంగా పార్ట్-3 చివరి అంచులు ప్రధాన సమాధాన పత్రాన్ని దాటకుండా పిన్‌చేయాలి. పార్ట్-3 అంచు కనీసం నాలుగు నుంచి ఐదు మిల్లీ మీటర్లపైన ఉండేలా పిన్‌చేయాలి.
ప్రధాన సమాధానపత్రం, అదనపు సమాధాన పత్రాలు, గ్రాఫ్, మ్యాప్, బిట్‌పేపర్‌పై ఎక్కడా రోల్ నెంబర్ వేయరాదు. అలా వేస్తే మాల్ ప్రాక్టీస్‌గా పరిగణించి సమాధాన పత్రాన్ని మూల్యాంకనం(దిద్దడం) చేయరు.
సబ్జెక్టు పేరు, పేపర్ నంబర్‌ను ప్రధాన సమాధాన పత్రంలో సూచించిన గడుల్లోనే రాయాలి.
ప్రధాన సమాధాన పత్రంపై ఉండే నంబర్(క్రమ సంఖ్య)ను ఓఎంఆర్ పత్రంలోని పార్ట్-1, పార్ట్-1లో సూచించిన గడుల్లో రాయాలి. నంబర్‌లేని సమాధాన పత్రం చేతికి వస్తే దాన్ని ఇన్విజిలేటర్‌కు తిరిగి ఇచ్చి, క్రమసంఖ్య ఉన్న బుక్‌లెట్‌ను తీసుకోవాలి.
సమాధాన పత్రాల్లో బ్లూ, బ్లాక్ ఇంక్ పెన్నుతోనే జవాబులు రాయాలి. ఎరుపు,ఆకుపచ్చ రంగుసిరా పెన్నులను వాడటం నిషేధం.
పరీక్ష ముగిశాక తీసుకున్న అదనపు సమాధాన పత్రాల సంఖ్యను ప్రధాన సమాధానపత్రంపైన, ఓఎంఆర్ షీట్‌లోని పార్ట్-1, పార్ట్-2లో పేర్కొన్న గడుల్లో రాయాలి. అనంతరం ఓఎంఆర్ షీట్‌తో సహా ఇన్విజిలేటర్‌కు సమాధాన పత్రాలను ఇవ్వాల్సిన బాధ్యత విద్యార్థులదే.