సాక్షి, చెన్నై: పదో తరగతి పరీక్ష ఫలితాలు శుక్రవారం వెలువడనున్నాయి. ఈ మేరకు పరీక్షల విభాగం సర్వం సిద్ధం చేసింది. మరికొన్ని గంటల్లో ఎలాంటి ఫలితాలు వస్తాయోనన్న ఉత్కంఠతో విద్యార్థులు ఎదురుచూపుల్లో ఉన్నారు. మార్చి, ఏప్రిల్ నెలల్లో ప్లస్‌టూ, పదో తరగతి పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ప్లస్‌టూ పరీక్ష ఫలితాలు ఇటీవల విడుదలయ్యాయి. ఇందులో విద్యార్థినులు హవా కొనసాగించారు. ప్లస్‌టూ పరీక్షలు ముగియగానే మార్చి 26 నుంచి ఏప్రిల్ తొమ్మిది వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. ఈ ఏడాది సరికొత్త పద్ధతిలో పరీక్షల్ని నిర్వహించారు. విద్యార్థులకు 30 పేజీలతో కూడిన సమాధాన పత్రాన్ని పుస్తక రూపంలో అందజేశారు. అలాగే తొలి పేజీలో విద్యార్థి వివరాలు, ఫొటోలు పొందుపరిచారు.
ఈ పరీక్షలకు 11,552 పాఠశాలల నుంచి 10,38,876 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 5,30,462 మంది బాలురు, 5,08,414 మంది బాలికలు ఉన్నారు. అలాగే 74,647 మంది ప్రైవేటుగా పరీక్షలకు హాజరయ్యారు. రాష్ట్రంలో పరీక్షలు విజయవంతంగా ముగియడంతో ఏప్రిల్ పదో తేదీ నుంచి మూల్యాంకనం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో మూల్యాంకనం ముగియడంతో ఫలితాల వెల్లడికి పరీక్షల విభాగం సర్వం సిద్ధం చేసింది. శుక్రవారం ఉదయం పది గంటలకు ఫలితాల్ని పరీక్షల విభాగం డెరైక్టర్ దేవరాజన్ విడుదల చేయనున్నారు. విద్యార్థులు ఫలి తాల్ని తెలుసుకునేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేశారు. అలాగే సబ్జెక్టుల వారీగా మార్కుల్ని తెలుసుకునే అవకాశం కల్పించారు. రీటోటలింగ్‌కు ఈ నెల 26 నుంచి 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ముందుగానే ప్రకటించారు. రెండు సబ్జెక్టులకు రూ.305, ఒక సబ్జెక్టుకు రూ.205 చొప్పున రీ టోటలింగ్ చార్జి చెల్లించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లోను రీ టోటలింగ్ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.
వెబ్ సైట్లు
ఫలితాల్ని విద్యార్థులు ఉదయం పది గంటల నుంచి తెలుసుకునే వీలు కల్పిస్తూ ఆయా పాఠశాలల్లో ఏర్పాట్లు చేశారు. అలాగే ఆన్‌లైన్‌లో ఫలితాల్ని తెలుసుకునేందుకు పరీక్షల విభాగం కొన్ని వెబ్‌సైట్లను ప్రకటించింది.
www.tnresults.nic.in
www.dge1.tn.nic.in
www.dge2.tn.nic.in
www.dge3.tn.nic.in
నేడు పది ఫలితాలు
Published Fri, May 23 2014 12:07 AM | Last Updated on Sat, Sep 2 2017 7:42 AM
Advertisement
Advertisement