ఒంగోలు వన్‌టౌన్, అద్దంకి: పదో తరగతి పరీక్షల విషయంలో విద్యార్థులు అయోమయంలో ఉన్నారు. ఉపాధ్యాయులకు సైతం పరీక్ష పత్రాల నమూనాపై స్పష్టత లేదు. పాఠశాలలు పునఃప్రారంభమై రెండు నెలలు కావస్తున్నా పబ్లిక్ పరీక్షలకు సంబంధించి ప్రశ్నపత్రాల నమూనా ఎలా ఉంటుందో ఇప్పటి వరకు తెలియకపోవడంతో అటు ఉపాధ్యాయులకు, ఇటు విద్యార్థులకు అందరికీ ఇబ్బందిగా మారింది.
కొత్త సిలబస్...
ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి పదో తరగతికి కొత్త సిలబస్, కొత్త పాఠ్యపుస్తకాలు అమల్లోకి వచ్చాయి. 2015 మార్చిలో జరగనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల విధానాన్ని కూడా మార్చారు. నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ) విధానంలో పరీక్షలు నిర్వహించేందుకు వీలుగా ప్రభుత్వం తొలుత ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం ప్రతి సబ్జెక్టులో 80 మార్కులకు పరీక్షలు, 20 మార్కులు ఇంటర్నల్‌కు కేటాయించారు. ఇప్పటి వరకు అమలులో ఉన్న 11 పేపర్ల స్థానంలో 9 పేపర్లు ఉంటాయని నిర్ణయించారు.
తెలుగు, ఇంగ్లిష్ సబ్జెక్టులకు ఇప్పటి వరకు రెండేసి పేపర్లుండగా..కొత్త విధానంలో ఒక్కో పేపర్ మాత్రమే ఉంటాయి. కొత్త విధానంలో ప్రశ్నపత్రాలు ఎలా ఉంటాయో నమూనా కూడా ప్రకటించారు. అయితే వివిధ వర్గాల నుంచి వచ్చిన విన తుల నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి ప్రస్తుత విద్యా సంవత్సరానికి పాత పద్ధతిలోనే పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించారు. ఈమేరకు విద్యాశాఖ కమిషనర్ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. దీంతో పాత పద్ధతిలోనే 11 పరీక్షలు జరుగుతాయి.
కొత్త సీసాలో..పాత సారా:
పదో తరగతి పరీక్షల వ్యవహారం కొత్తసీసాలో పాతసారా చందంగా ఉంది. కొత్త సిలబస్, కొత్త పాఠ్యపుస్తకాలు..పాత పద్ధతిలో పరీక్షలు ఇదీ..ప్రస్తుత పరిస్థితి. కొత్త సిలబస్‌లోని పాఠ్యాంశాలన్నీ సీసీఈ పరీక్ష విధానానికి అనుగుణంగా రూపొందించారు. పాత బట్టీ విధానానికి స్వస్తి చెబుతూ విద్యార్థులు సొంతంగా ఆలోచించి సమాధానాలు రాసేలా పాఠ్యాంశాలున్నాయి. ప్రాజెక్టు పని, ఇతరత్రా అన్నీ కొత్త విధానానికి అనుగుణంగా ఇచ్చారు.
కొత్త ప్రశ్నపత్రాలకు అనుగుణంగా మొత్తం సిలబస్ ఉంది. అయితే అందుకు భిన్నంగా పాత పద్ధతిలో పరీక్షలు నిర్వహిస్తామనడంతో అసలు ప్రశ్నపత్రాలు ఎలా ఉంటాయో తెలియక ఉపాధ్యాయులు, విద్యార్థులు తికమకపడుతున్నారు. పాత సిలబస్‌లో భాషా సబ్జెక్టుల్లో (తెలుగు, హిందీ, ఇంగ్లిష్) పేపర్-1, పేపర్-2లకు వేర్వేరు సిలబస్‌లిచ్చి స్పష్టత ఉండేది.
పాత సిలబస్‌లో పాఠ్యపుస్తకంతో పాటు సప్లిమెంటరీ రీడర్లు కూడా ఉండేవి. ప్రస్తుతం సప్లిమెంటరీ రీడర్లు లేవు. దీంతో ఏఏ అంశాలు పేపర్-1లో వస్తాయో..ఏఏ అంశాలు పేపర్-2లో వస్తాయో స్పష్టత లేదు.
సబ్జెక్టులు కూడా రెండు పేపర్లు, పేపర్లకు ఏ సిలబస్‌లో ప్రశ్నలిస్తారో స్పష్టత లేదు. దీంతో అందరిలో ప్రశ్నపత్రాల విధానంపై స్పష్టత లేకుండా పోయింది.
కొత్త సిలబస్‌ను పాత పద్ధతిలో పరీక్షలు నిర్వహిస్తామంటే ఏ పేపర్‌కు ఏ సిలబస్, ప్రశ్నలు ఏవిధంగా ఉంటాయో వెంటనే స్పష్టం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎస్‌సీఈఆర్‌టీ పాఠశాల విద్యాశాఖలో సమన్వయంతో వ్యవహరించి వెంటనే ప్రశ్నపత్రాల నమూనాలు ప్రకటించాలని ఉపాధ్యాయులు, విద్యార్థులు కోరుతున్నారు.
‘పది’ పరీక్షే..
Published Sat, Aug 9 2014 4:37 AM | Last Updated on Sat, Sep 2 2017 11:35 AM
Advertisement
Advertisement