సిలబస్ మారినా శిక్షణ కరువు
- టెన్త్‌లో మారిన సిలబస్‌పై అయోమయం
- శిక్షణ లేకుంటే బోధన కష్టమేనంటున్న టీచర్లు
- ఇప్పటి వరకు శిక్షణపై స్పష్టతనివ్వని విద్యాశాఖ
సాక్షి, విశాఖపట్నం : సిలబస్ మారిన ప్రతిసారీ ఉపాధ్యాయులకు వాటిపై శిక్షణ తప్పనిసరి. కానీ ఈ విషయాన్ని విద్యాశాఖ మూడేళ్లుగా పట్టించుకోవడం లేదు. మారిన సిలబస్‌పై శిక్షణ లేకపోవడంతో ఉపాధ్యాయుల్లో నిర్లిప్తత చోటుచేసుకుంటోందన్న వాదన వినిపిస్తోంది. తాజాగా పదో తరగతి సిలబస్ సమూలంగా మారింది. ఇప్పటికే పాఠ్యపుస్తకాలు 70 శాతానికిపైగా జిల్లాకు, అక్కడి నుంచి మండల కేంద్రాలకు చే రాయి. కానీ వీటిని బోధించే ఉపాధ్యాయులకు శిక్షణపై మాత్రం ఇప్పటి వరకు స్పష్టత లేదు.
టెన్త్ సిలబస్ కష్టమే!
పదో తరగతి మారిన సిలబస్‌పై శిక్షణ లేకుండా పాఠ్యాంశాల బోధన కష్టమేనని ఉపాధ్యాయులు చెప్తున్నారు. ఏటా ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు నిర్వహించాలని రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్(ఆర్‌ఎంఎస్‌ఏ) నిబంధనలు చెప్తున్నా అమలుకు నోచుకోవడం లేదు. సీబీఎస్‌ఈ తరహాలో సిలబస్‌ను మార్చారు. ప్రాక్టికల్స్, ప్రాజెక్ట్ వర్క్‌ల ఆధారంగా పాఠ్యాంశాలు బోధించేలా పాఠ్యపుస్తకాల్ని రూపొందించారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో ప్రయోగశాలలు, అవసరమైన పరికరాల కొరత చాలా వరకు వేధిస్తోంది. దీనికితోడు మారిన సిలబస్‌పై కనీస శిక్షణ ఇవ్వకుంటే విద్యార్థులకు మెరుగైన బోధన చేసేదెలా.. అంటూ ఉపాధ్యాయులు తలపట్టుకుంటున్నారు. గణితం, భౌతిక-రసాయన శాస్త్రాల్లోనైతే ఈ పరిస్థితి మరింత సంక్లిష్టంగా ఉన్నట్టు నిపుణులు చెప్తున్నారు.
పరీక్షా విధానంలోనూ మార్పులు?
వచ్చే విద్యాసంవత్సరం నుంచి పదో తరగతి పాఠ్యాంశాలతోపాటు, పరీక్ష విధానంలో కూడా సమూల మార్పులు చోటుచేసుకునే అవకాశాలున్నాయి. మార్పుల ప్రతిపాదనలిలా ఉన్నాయి.
ఇప్పటి వరకు ద్వితీయ భాష హిందీ మినహా మిగిలిన అన్ని సబ్టెక్టులకు రెండేసి పేపర్లుగా మొత్తం 11 పేపర్లుగా ప్రధాన పరీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
రానున్న విద్యా సంవత్సరం నుంచి రెండేసి పేపర్ల స్థానంలో సీబీఎస్‌ఈ తరహాలో ఒక్కో పేపర్‌కు మాత్రమే పరీక్షలు నిర్వహించేందుకు ప్రతిపాదనలున్నాయి.
ఫిజికల్ సైన్స్(పీఎస్), బయలాజికల్ సైన్స్(బీఎస్)కు మాత్రం 50 మార్కుల చొప్పున వేర్వేరు పేపర్లుగా పరీక్షలు నిర్వహిస్తారు. అలా అయితే ఏడు పేపర్లు మాత్రమే ఉండనున్నాయి.
ఒక్కో సబ్జెక్టుకు 80 మార్కులకే రాత పరీక్ష ఉంటుంది. నిర్మాణాత్మక మూల్యాంకనం ఆధారంగా మిగిలిన 20 మార్కులు కేటాయిస్తారు.
ఒక విద్యాసంవత్సరంలో నిర్వహించిన నాలుగు నిర్మాణాత్మక మూల్యాంకనాల సగటు ఆధారంగా ఈ 20 మార్కులు కేటాయిస్తారు.
శిక్షణ లేకుంటే బోధన కష్టం
సీబీఎస్‌ఈ తరహాలో పదో తరగతి సిలబస్‌ను మార్చారు. దీని వల్ల విద్యార్థుల్లో ప్రతి పాఠ్యాంశంపై సమగ్ర అవగాహన కల్పించేందుకు అవకాశముంటుంది. ఆ మేరకు ప్రతి సబ్జెక్టులో ముందస్తు శిక్షణ తప్పనిసరి. చాలా వరకు ప్రాక్టికల్స్‌పైనే ఆధారపడి బోధన జరగాల్సి ఉంది. శిక్షణ లేకుండా విద్యార్థులకు బోధన కష్టంతోపాటు, విద్యార్థుల ప్రగతిని నిరోధించినవారమవుతాం.
- ఇమంది పైడిరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఎస్టీయూ
శిక్షణపై ఉత్తర్వులు రాలేదు
టెన్త్ మారిన సిలబస్‌పై ఉపాధ్యాయుల శిక్షణ కోసం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ఉత్తర్వులు రాలేదు. పాఠ్యపుస్తకాలను మాత్రం వచ్చిన మేరకు వెంటనే ఆయా మండలాలకు చేరవేసే పనులు యుద్ధప్రాతిపదికన చేస్తున్నాం. పాఠశాలలు తెరిచేనాటికే ప్రతి విద్యార్థి చేతికి పాఠ్యపుస్తకాలుండేలా చర్యలు తీసుకుంటున్నాం. శిక్షణ తరగతులపై ఉత్తర్వులందిన వెంటనే ఏర్పాట్లు చేస్తాం.
- బి.లింగేశ్వరరెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి